సినిమాలో విలన్ హీరోయిన్ ని మానభంగం చేయటానికి విశ్వప్రయత్నం చేస్తుంటే దర్శకుడు భీభత్స రసాన్ని యథాశక్తి చిత్రీకరించాడు. హీరోయిన్ కేకలు రేఖ గళంలో కొట్టుకుంటున్నాయి.
తన వంటిమీద పాకే వికాస్ చేతుల్ని నెట్టేయటానికి ఆమె చేసే ప్రయత్నం విఫలమౌతున్నది. ఇంటర్వెల్ కాబోలు... హఠాత్తుగా లైట్లు వెలిగాయి. అతను ఉలిక్కిపడి చేతులు వెనక్కి లాగేసుకున్నాడు... నిటారుగా అయ్యాడు. అప్పుడు ఎవరైనా అతడ్ని చూస్తే అలాంటివాడని నమ్మరు. తన తల్లి కూడా నమ్మదు.
చాటుగా కళ్ళు తుడుచుకుని కొంత రిలీఫ్ ఫీలయింది. ఇంటికొచ్చేదాకా రేఖ ఆ హింసను మానసికంగా, శారీరకంగా అనుభవిస్తూనే ఉంది.
వికాస్ తనకి అన్నస్థానంలో ఉన్నాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అవినాష్ చిన్నన్న అయితే వికాస్ పెద్దన్నయ్య కాలేడా! ఎవ్వరూ లేనప్పుడు అసహజంగా, కాముకంగా వుండే అతని చేష్టలు ఇతరులముందు కృత్రికమైన రంగుల్ని పులుముకొని సోదర ప్రేమగా కృతకంగా వ్యక్తంచేయటం చూస్తే రేఖకి అసహ్యంగా ఉంది.
ఈ మధ్య ఏ చప్పుడైనా బెదిరిపోతోంది. తెలీని బెంగగా ఉంది. రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. వికాస్ గొంతు వినబడితేనే ఎలర్జీగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలనిపిస్తుంది.
* * *
రోజూ వికాస్ ఇంటికి వచ్చే టైము దాటిపోయింది. ఆ వేళకు ఆ ఇంటికి వచ్చిన వార్తకు సులభకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు. కుమార్ కుప్పకూలి పోయాడు. స్కూటర్ మీద వస్తున్న వికాస్ కి యాక్సిడెంటయింది. కాళ్లు విరిగిపోయాయి. ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.
"కష్టం వచ్చినప్పుడే మనిషి ఆత్మస్థైర్యం పెంచుకోవాలి. మీరలా బెంబేలు పడితే ఎలా? పదండి హాస్పిటల్ కి పోదాం! వికాస్ ఏం బాధపడుతున్నాడో!" భర్తకి ధైర్యం చెప్పి సులభ తన మనసును కూడదీసుకుంది. దడదడలాడుతూ హాస్పిటల్ కు బయలుదేరారు అంతా.
అతను వికాసా! చూడటానికే రేఖకి భయమేసింది. ఒళ్లంతా రక్తసిక్తంగా గాయాలతో కదలలేకుండా పడివున్నాడు. కళ్ళు మూసుకొని మూలుగుతున్నాడు. రేఖ ఇంక చూడలేక తల తిప్పుకుంది.
డాక్టర్లు...నర్సులు...స్ట్రెచర్స్... అంతా హడావుడి. నాలుగురోజులు వళ్లు తెలీకుండా వున్నాడు వికాస్.
ఐదవరోజు వికాస్ కి స్పృహ తెలుస్తోంది. మెల్లగా మాటలు వినిపిస్తున్నాయి. కళ్ళు మాత్రం తెరిపిళ్ళు పడటం లేదు. ఆ గొంతు... రేఖది.
"ప్లీజ్...మమ్మీ! పెద్దన్నయ్యకి ఏంకాకూడదు. నాకు భయమేస్తుంది" రేఖ ఏడుస్తోంది. ఆ పసి హృదయంలో వికాస్ తనపట్ల ప్రవర్తించిన క్రూరత్వం గురించిన పగ ఇసుమంతైనా లేదు... వికాస్ కోలుకోవాలనీ, అతనికేం కాకూడదనీ నిర్మలమైన మనసుతో కోరుకుంటోంది.
వళ్లంతా కట్లతో మూలిగే వికాస్ ని చూడలేకపోతోంది రేఖ. అవినాష్ పరిస్థితి కూడా దాదాపు అంతే! ఆ నాలుగురోజులూ అతని బెడ్ దగ్గర్నుంచి వాళ్ళు కదలలేదని వాళ్ళ మాటల్ని బట్టి వికాస్ కి అర్ధమయింది. చిన్నగా మూలిగాడు...
ఆదుర్దాగా రేఖ, సులభలు వికాస్ బెడ్ దగ్గరికి వచ్చారు.
"వికాస్..." సులభ పిలిచింది.
"అన్నయ్యా..." రేఖ ఏడుస్తోంది.
వీళ్ళు తననెందుకు ఇంత ప్రేమిస్తున్నారు? తను చచ్చిపోతే వాళ్ళకు ఎన్నో రకాలుగా లాభం! ఆస్తి అంతా వాళ్ళ స్వంతం అయ్యేదికదా! ఈ ప్రేమకు... ఇంత ప్రేమకు... తను అర్హుడు కాడు. రేఖను తను ఎంతగా బాధపెట్టాడు? ఆప్యాయంగా చూసుకోవాల్సిన చెల్లెల్ని వికృతచేష్టలతో హింసించాడు. తనని చెడు మార్గంలో నడిపించిన స్నేహితులు తను ప్రాణాపాయ స్థితిలో వుంటే ఒక్కరూ బెడ్ పక్కన లేరే..?
కుటుంబ సంబంధాలలో ప్రేమకింత విలువుందా! ఆ విలువే తనని ఇవాళ కాపాడుతోందా! రేఖనలా హింసించినందుకు తనకీ శాస్తి జరగాల్సిందే! కాళ్లు కదలటం లేదు... బహుశా విరిగిపోయి ఉంటాయి. అంతా బ్యాండేజ్ వేసేశారు... తనకీ శిక్ష కావాల్సిందే! అతని చెక్కిళ్ళు కన్నీటితో తడిసిపోతున్నాయి.
వికాస్ కన్నీటిని తుడిచింది సులభ. "ఎలా వుంది నాన్నా!" కుమార్ కొడుకుని పలకరించాడు. వికాస్ చేతిపై ఓదార్పుగా చేతిని వుంచింది రేఖ. ఆ స్పర్శ ఇప్పుడు అమ్మ మనసులా చల్లగా వుంది.
"బాధపడకు బాబూ! నీకేం కాలేదు. కొద్దిరోజుల విశ్రాంతి తర్వాత మామూలుగా నడుస్తావు" సులభ అతని తలపై చేయివేసి నిమిరింది.
"అవునన్నయ్యా! నీకేం కాలేదు. నిజం" అమాయకంగా అంటున్న రేఖ చేయి పట్టుకొని "నన్ను క్షమించు రేఖా! నేను ఇలా మీచేత సేవలు చేయించుకుంటూ... అవిటివాడిలా" అతని నోటి మీద మృదువుగా చేయి వుంచి వారించింది రేఖ.
"అలా అనకు అన్నయ్యా! ఒక నెల రోజులు ఓపికపడితే... నీ నడక నీదే" రేఖ మాటలకు బలహీనంగా నవ్వాడు వికాస్.
"ఈ నడక నాది కాదమ్మా! ఇకనుంచి మీదే!" వికాస్ గొంతు నిండా చెల్లెలి పట్ల కొండంత అభిమానం.
"మంచిది బాబూ! నువ్వింక విశ్రాంతి తీసుకో!" దుప్పటి సరిచేసింది సులభ.
"ఇంక పడుకో అన్నయ్యా" అంటూ అవినాష్ వచ్చి వికాస్ బెడ్ దగ్గర స్టూల్ పై కూర్చుని ప్రేమగా చేయి పట్టుకున్నాడు. ఆ స్పర్శలో స్నేహం ఉంది.
వికాస్ కిప్పుడు నిజంగానే ప్రశాంతంగా ఉంది. సులభ అరచేతిని కళ్ళపై ఉంచుకుని కళ్ళు మూసుకున్నాడు. వెన్నెలంత చల్లగా వుంది అతని మనస్సు. ఆ మనస్సులో జీవితం పట్ల ఏవేవో కొత్త ఆశలు ఊపిరిపోసుకుంటున్నాయి.
('చెలిమి' వారపత్రిక, 11-9-1999) * * *
