"అవును బాబూ! నీకు తెలీదా?" ఈసారి నివ్వెరపోవడం ఆయన వంతయింది.
"మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు?" మేనల్లుడి గొంతులో తీవ్రతకు తెల్లబోయాడాయన.
"నేను చెప్పేది కాస్త సావధానంగా విను మనోజ్. పద్నాలుగేళ్ళ వయసప్పుడు రోగ రూపంలో గొంతుకు వెనక్కి తీసుకున్నాడు దేవుడు. అదృష్టమో... దురదృష్టమో... చెవులు మాత్రం సరిగ్గానే పనిచేస్తాయి. కమ్మని కంఠస్వరంతో ఎన్నెన్ని పాటలు పాడేది చిట్టి తల్లి! అయినా అమ్మకి అన్నీ తెలుసు... నీకు చెప్పేవుంటుందనుకున్నాను" అనునయించబోయాడు.
"అనుకుంటే సరా! తండ్రిగా ఈ విషయాన్ని నాతో ముందుగానే చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? మూగదాన్ని నా మెడకు తగిలించి నా గొంతు కోస్తారా?" ఆగ్రహంగా అంగలు వేస్తూ వెళ్ళిపోయిన అల్లుణ్ణి ఆపలేక చతికిలపడ్డాడాయన.
పాంజేబుల సవ్వడి తడబడుతోంది. ఇప్పుడు ఆ సవ్వడి కర్ణకఠోరంగా అన్పిస్తుంటే వినలేక గేటు దాటాడు మనోజ్.
ఇంటికి వచ్చేశాడు. తల్లితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
కిటికీలోంచి బయటికి చూస్తే పుచ్చపువ్వు లాంటి వెన్నెల. మల్లెలు ఒళ్ళు విరుచుకుంటున్నాయి. మనసు మండిపోతోంది.
ఎంత మోసం! అనురాధ మాత్రం ఎంత నంగనాచి... తాను మూగదాన్నని సైగలతోనైనా చెప్పొచ్చుగదా! దెయ్యంలా మిడిగుడ్లేకుని చూడకపోతే... పిడికిలి బిగించి గోడకు కొట్టాడు... షిట్!
రిజర్వేషన్ కాన్సిల్ చేసుకుని మర్నాడే వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్న కొడుక్కి ఎన్నో విధాల నచ్చజెప్పింది అన్నపూర్ణ.
"అనూ... చాలా మంచిపిల్లరా! నువ్వంటే ఎంత ప్రేమో! ఎన్ని జన్మలెత్తినా అలాంటి భార్య దొరకదురా.. పెళ్ళికి ముందు అది మూగదని తెలిస్తే... ఈ పెళ్ళికి ఒప్పుకోవని నేనే అసలు విషయాన్ని దాచాను.. దానికంత శిక్ష వేయకురా... కావాలంటే నాకు వెయ్యి ఏ శిక్షయినా.." కన్నీళ్ళతో ప్రాధేయపడిందా తల్లి.
"అమ్మా! అయ్యిందేదో అయ్యింది. ఆ మూగ మొద్దును అంగీకరించలేను. ఇంక నన్ను మాటలతో వేధించకు" అంటూ గది తలుపులేసుకున్న కొడుకు ప్రవర్తనకు కుమిలిపోయింది అన్నపూర్ణ.
తెల్లవారుఝామున జీతగాడు తెచ్చిన వార్తకు తల్లీ కొడుకులిద్దరూ కొయ్యబారిపోయారు.
అనురాధ నిద్రమాత్రలు మింగేసింది. ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య వుంది.
ఎర్రని ముఖమల్ గుడ్డలో చుట్టిన నాలుగైదు డైరీలు, ఓ లేఖ ప్యాకెట్ గా అతని చేతికొచ్చాయి.
ఆ వార్త ఇచ్చిన జీతగాడు కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
చిరాకుగా ఆ ప్యాకింగు విప్పాడు మనోజ్. ఏం రాసిందో మహాతల్లి. ఆత్మకథేమో! మూగది కదూ. రాతలెక్కువ.
ఆలోచనల్ని విదిలించి లేఖలోని అక్షరాలు చదవసాగాడు గుండ్రని అక్షరాలు అందంగా... పొందికగా... అనూలా...
నా బావా!
ధైర్యంగా ఇలా అన్నందుకు క్షమించు... నీ హృదయంలో నాకు చోటులేదని తెల్సినా ఇలా అంటున్నానంటే చిన్నతనం నుంచీ నువ్వు నావాడివనే భావనతో పెరిగినందుకే. నా వూపిరి నీ పేరుగా ఆరాధించాను. జీవితం మూగబోయినా మనసు వీణమీద నీ పేరే పాడుకుంటూ, నీ భార్యనైనందుకు నా అంత అదృష్టవంతురాలు లేదని ఆనందించాను. నా మూగతనం ఇంత శాపాన్ని తెచ్చిపెట్టింది. నీకు తెలుసనుకున్నాను గానీ, నిన్ను మోసం చేయాలనుకోలేదు... ప్రేమించటం కన్నా ప్రేమించబడటంలోనే ఆనందం, అదృష్టం వుంది. నీకోసం పరచిన నా ఊహల, ఊసుల పల్లకీలు ఈ డైరీలు. నీకు నా చివరి కానుకలివి.
నీదాన్ని కాలేని
- అనూ
ఉత్తరం తర్వాత ఆ డైరీల్లోని పేజీలు తిరగేస్తుంటే అతని మనసు పిండినట్టవుతోంది. అనూ మనసులో బాల్యం నుంచి తన కోసం అల్లుకున్న ప్రేమలతలు ఎలా చిగురించి పూలు పూచి ఫలించాయో... ఎంత పిచ్చి ప్రేమను గుడిలా చేసి తన రూపాన్ని అందులో ప్రతిష్ఠించిందో...
ఇంత ప్రేమకు తాను అర్హుడా! కేవలం పైపై మెరుగుల కోసం, మూగ మువ్వలాంటి అనూని కాలదన్ని వెళ్ళిపోతున్న తనకి ఈ డైరీలు నిజమైన చూపును ప్రసాదించాయి. ఆమెవి రాలిన స్వప్నాలా?... కావు...కావటానికి వీల్లేదు. ఇతరుల చేత గాఢంగా ప్రేమించబడటానికి ఎంత అదృష్టం ఉండాలి. అవును తాను నిజంగానే అదృష్టవంతుడు. హాస్పిటల్ కి పరుగెత్తుతున్న కొడుకుకేసి విభ్రమంగా చూసింది తల్లి.
ఆ రాత్రి... మరోసారి కలలరాత్రిలా వచ్చింది.
తెల్లచీరలో మల్లెపూవులా కన్పిస్తున్న అనూని చూస్తుంటే మనోజ్ కి గర్వంగా వుంది. 'తనకోసం ప్రాణాలైనా ఇచ్చే భార్య...!' నిజంగా అందరికీ లభించే అదృష్టం కాదు.
వికసిస్తున్న ప్రేమసుమాల పరిమళాలు గది అంతా వ్యాపిస్తున్నాయి.
ప్రేమగా ఆమె ముంగురులు సవరిస్తోంటే చిన్నగా నవ్వి పాల గ్లాసు అందించింది. ఆమె చేయి అందుకొని మంచం మీద కూర్చోబెట్టాడు. పాలగ్లాసు టేబుల్ పై వుంచి... "నన్ను క్షమించు అనూ!" అని చెప్పబోతున్న అతని పెదవులపై చేతిని వుంచి మృదువుగా ఆపి కళ్ళతో వద్దని వారించింది.
ఆ చేతిని అలాగే పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. గాజుల గలగలలు ఆమె మనోవీణలా రాగాలు పలికాయి. కాళ్ళ పాంజేబులు వలపు సందడులు చేశాయి.
కిటికీలోంచి తొంగి చూస్తున్న ముద్దబంతి పువ్వు మీద వెన్నెల కిరణాలు వెల్లువలా కమ్ముకున్నాయి. తన్మయంగా ఆ పువ్వు వెన్నెల అందాల్లో మొహం దాచుకొని సరికొత్త వేణుగానాన్ని వినిపించింది. దూరంగా ఎక్కడో ఘంటసాల గళం విన్పిస్తోంది సుతిమెత్తగా!
"ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే"
(ఆంధ్రజ్యోతి, వారపత్రిక 5-3-1999)
* * *
