Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 15

      "దేనిదారి  దానిదే సరోజా. నేను ముందే చెప్పాను. ఎవరిష్టం వారిది. నేను ఎవర్నీ  దేనికీ ఫోర్స్ చెయ్యను. ఈ ఒక్క విషయంలోనే  మనిద్దరం  తూర్పు పడమరలం అనుకుంటాను. నీ దైవభక్తికి నేను అడ్డురాను. నా నాస్తికత్వం జోలికి  నువ్వు రాకు. దీనికిమాత్రం  మనిద్దరం  కాంప్రమైజ్ అయిపోవాలి. వేరే దారిలేదు" అన్నారు.

    "రక్షించేరు. మీ మాటల ప్రవాహంలో  నా సందేహం  ఒక్కటి తీరిపోయింది."

    "ఏమిటది?"

    "ఇంకేం వుంది.దేవుని సమస్యే. అదొక  ప్రాబ్లమ్ సాల్వ్ అయింది" అన్నాను.

    "ఇంకా ఆ బుర్రలో ఎన్ని సందేహాలున్నాయి? సందేహం  వుండకూడదు సరోజా. సందేహం మనిషిని చెదపురుగులా దొలిచేస్తుంది. అనుమానం, సందేహం  ఈ రెండూ  ఏ మనిషికీ  వుండకూడదు. ఈ రెండూ వున్న వాళ్ళ జీవితం నరకం  అవుతుంది. వాళ్ళు సుఖపడలేరు  సరికదా  ఎదుటివాళ్ళని కూడా సుఖపెట్టలేరు.

    అదే విధంగా  ఈ దైవభక్తి  వున్నవాళ్ళు కూడా  సోమరిపోతులై  నానా అగచాట్లు పడడమే కానీ జీవితంలో వాళ్ళు సాధించేదంటూ  ఏమీవుండదు .దైవభక్తి ,దారిద్ర్యం  ఈ రెండూ ఒకే నాణానికి  బొమ్మా బొరుసు లాంటిది. మన దేశంలో  వున్నంత దైవభక్తి,దారిద్ర్యం  మరే దేశంలోనూ లేదు" అన్నారు.

    ఈయన ధోరణి  ఏడిసినట్టే  వుందనుకున్నాను. కారణం వారి ధోరణి నచ్చక కాదు. మా అమ్మా నాన్నగారూ  బరంపురం  నుండి వచ్చారు. మొట్టమొట్టసారిగా  వారిని చూస్తున్నారు. ఈ ధోరణి యిలాగుంటే  వాళ్ళు  ఏమనుకుంటారో? పెళ్ళికి ఏమయినా  అభ్యంతరం  చెప్తారేమోనని  బాధ.

    అయినా ఏం చేస్తాను. కానీ ఇది ఒకందుకు  మంచిదే. వారి సంగతి ముందే తెలుసుకుంటే  మేలు అనుకున్నా.

    కాఫీలు  వచ్చాయి. అందరం  తాగాం.

    "ఇవాళ  ఆఫీసుకు వెళ్ళొద్దా" అని అడిగారు.

    "మధ్యాహ్నం  వెళదామండీ" అన్నాను.

    "మా సరోజమ్మ  ఉత్తరం రాసింది. (నన్ను నా పెంపుడు తండ్రి సరోజమ్మ  అంటారు) అన్ని విషయాలు మాట్లాడి, మిమ్మల్ని కూడా చూసి వెళదామని  భార్యాభర్తలిద్దరం  వచ్చాం బాబూ" అని నాన్నగారన్నారు.

    శ్రీశ్రీగారేమీ  మాట్లాడలేదు.

    "మా సరోజమ్మకి  మంచి సంబంధం  వచ్చిందని...." యింకా ఏదో అనబోతూ  వుంటే_

    "ఇక అవన్నీ  ఎందుకులెండి. మీ సరోజమ్మని  నేనే చేసుకుంటున్నాను.

    ఎప్పుడన్నది  త్వరలోనే  నిర్ణయించి  చెప్తాను" అని లేచిపోయారు.

    "అదేమిటండీ  వెళ్ళిపోతున్నారా"

    "అవును సరోజా. కంపెనీకి వెళ్ళి వస్తాను"

    "మళ్ళీ  ఎప్పుడొస్తారు?"

    "మధ్యాహ్నం  మూడు గంటలకి వస్తాను"

    అందరూ లేచి కారుదాకా  వెళ్ళాం. శ్రీశ్రీగారు ఎంత విసుక్కున్నారంటే_

    "ఇవేం  మర్యాదలు  సరోజా! ఇంట్లో  ఇంతసేపు  మాట్లాడుకున్నాంగా. వెళ్ళొస్తానని చెప్పిం తర్వాత  కూడా గుమ్మం దగ్గర గంట, గేటు దగ్గర గంట, కార్లో కూర్చున్నాక గంట మాట్లాడి  నడిరోడ్డుదాకా  వచ్చి సాగనంపాలా .ఏవిటీ అలవాట్లు" అన్నారు.

    నేను కొంచెం  చిన్నపుచ్చుకున్నా_వెంటనే  సర్దుకున్నా. ఎందుకంటే  వారికిలాటి  పనులు ఇష్టం వుండవు.

    మళ్ళీ అందరం  కూర్చున్నాం. నా పెంపుడు తల్లి దండ్రులు  నిర్ఘాంతపోయారు. శ్రీశ్రీగారి మాటలు వాళ్ళకి కొంచెం నిరుత్సాహం  కలిగించినా, వారి గురించి  ముందుగానే తెలిసినవాళ్ళు కనుక సర్దుకున్నారు.


                                                      మా పెళ్ళి


    తెలివితేటలకి  మా పెంపుడు అమ్మా, నాన్నగారు పోటీలు పడతారు. అంత తెలివైనవాళ్ళు. ఆ రెండు తలకాయలూ లక్షలమీదున్న  వాళ్ళ ఆస్తిని కాపాడడానికి  జడ్జీలతో  వాదించి ,కోర్టులతో  పండిపోయినవి.

    శ్రీశ్రీగారి విషయం  అట్టే  గ్రహించేశారు. ఇటూ అనలేక, అటూ అనలేక తికమకల్లో పడ్డారు. జీవితంలో నేనేం బాధలు  పడతానో  అని వాళ్ళ బాధ. అంతకన్నా  మరేంకాదు.

    "ఆదిలోనే  హంసపాదు అన్నట్టు మన కుటుంబంలో  అందరం దైవభక్తులం. దానికీ జస్ట్ ఆపోజిట్ శ్రీశ్రీగారు. మిగిలిన విషయాల్లో ఆయన దేవుడేనమ్మా" అన్నారు.

    "అదిగో మళ్ళీ  దేవుడంటున్నారు .శ్రీశ్రీగారిక్కడ  లేరు కాబట్టి  సరిపోయింది. లేకుంటే...." అన్నా.

    అందరూ నవ్వేరు.

    "ఇక పదే పదే దాన్ని వేధించవద్దు .దాని ఇష్టానికి వదిలేద్దాం" అనేశారు. 'రక్షించార'నుకున్నాను  మనసులో.

    మధ్యాహ్నం  మూడు గంటలకి  శ్రీశ్రీగారొచ్చారు. ఆఫీసుకి  వెళ్ళి  కూర్చున్నాం. పనిచేసే మూడ్ లో లేం. ఇద్దరి బుర్రలూ  పనిచేస్తున్నాయి.
    "ఏవిటండీ  ఆలోచిస్తున్నారు" అన్నాను. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS