"ఇప్పుడు బాధపడుతున్నావా ?"
"ఏం పడి ఏం లాభం?" అన్నా నవ్వుతూ.
ఈ లోగా బైట నుంచి 'టెలిగ్రామ్' అని వినిపించింది.
వెళ్ళి సంతకం చేసి తీసుకొని వారి చేతికిచ్చాను.
"మా ఇంకో మావగారూ, అత్తగారూ రేపు మెయిల్ లో వస్తున్నారుట" అని నవ్వారు.
వైరిచ్చిన ప్రకారం నా పెంపుడు తల్లిదండ్రులు వచ్చేశారు. మా ఇల్లు ఇద్దరమ్మలూ, నాన్నలతో కళకళలాడి పోతోంది.
అందరం సావధానంగా కూర్చొని మాటల్లో పడ్డాం. పది గంటలు కావస్తోంది.
"పెళ్ళి అన్నది పదికాలాల పంట అమ్మా! టాటా నగరం సంబంధం చేసుకో అమ్మా" అని నా పెంపుడు తల్లిదండ్రులు కూడా అన్నారు.
వాళ్ళకింకా ఇక్కడ జరిగిన వ్యవహారాలన్నీ తెలియవు. ఎటూ జెడ్ అన్నీ వివరంగా చెప్పేను.
"అంటే నీ ఉద్దేశం" అని అమ్మ అడిగింది.
"ఉద్దేశానికేముందమ్మా. ఇంత దూరం వచ్చాక ఇక వెనక్కి వెళ్ళడం, లేక మరొకరిని వివాహం చేసుకోవడం అన్నది జరగనిపని. నేను శ్రీశ్రీగారిని చేసుకుంటాను" అని ఖచ్చితంగా చెప్పాను.
ఇద్దరు నాన్నలూ, అమ్మలూ ఒకటైపోయారు.
"ఇదేం అన్యాయమే. శ్రీశ్రీగారికి ఏం తక్కువనికానీ వారు మామూలు మనిషని అనటం కానీ కాదు. ఆయన జగమెరిగిన బ్రాహ్మణుడు. ఆయన్నొక అవతార పురుషుడిగానే మేం అనుకుంటున్నాం. అన్నిటికీ అతీతులాయన. అటువంటి మహానుభావుడి సంబంధం కలుపుకోవటానికి మించిన అదృష్టం వేరే ఏముంటుందమ్మా. కాని ఆయన వయసేమిటి. నీ వయసేమిటి. పైగా మొదటి భార్య వుంది. ఆవిడకీ నీకూ మధ్య పరిస్థితులుకూడా బాగులేవని అంటున్నావు. ఇంతకాలం పడిందిచాలు. శ్రీశ్రీగారిని చేసుకున్నావంటే జీవితాంతం సవితి పోరుతో చావవలసిందే. ఎందుక్కోరి తెచ్చుకుంటావు" అని ప్రారంభించారు.
"నిన్నటివరకూ నాకూ ఆ ఉద్దేశంలేదు. ఆయన్ని చూడకుండా నేను వుండగలనా అన్న అనుమానం వచ్చి చాలా రోజులైంది. అయినా పెళ్ళి చేసుకుందామనే తలపు రాలేదు. దీనికి కారణం ఆయన భార్యే. అన్నీ ఆలోచించి ఈ నిర్ణయానికొచ్చాను.
నేను శ్రీశ్రీగారి దగ్గర ఇంతకాలం పనిచేసిన తర్వాత రేపు ఇంకొకర్ని పెళ్ళి చేసుకున్నా సుఖపడేదేంలేదు. అతని దగ్గర కూడా నా కేరక్టర్ కి సంబంధించిన తగవులూ, అనుమానాలూ, మాటలూ ఎలాగూ తప్పవు. అంతకన్నా వయస్సు తేడా వున్నా వారి దగ్గర పనిచేసినదాన్ని కనుక వారి దగ్గరే సెటిలయి పోవటం మంచిది.
మేం ఇద్దరం ఒకర్నొకరు కోరుకుంటున్నాం. ఒకళ్ళను విడిచి ఇంకొకళ్ళం వుండలేని స్థితికి వచ్చాం. ఇద్దరం ఒకర్నొకరం ప్రేమించుకున్నాం కూడా. నేను శ్రీశ్రీగారిని ప్రేమిస్తున్నట్టు ఈ మధ్యే తెలుసుకున్నాను. ఇక మరెవ్వరూ కాదనకండి. కాదన్నా లాభంలేదు. రేపో ఎల్లుండో పెళ్ళి కాదు. దానికి కూడా కొంత టైము పడుతుంది.
శ్రీశ్రీగారు కూడా వచ్చే వేళయింది. వారితో కూడా మాట్లాడితే మీకు కొంత అయిడియా ఉంటుంది" అని నా పెంపుడు తల్లిదండ్రులకి చెప్పాను.
"నువ్వంతగా పట్టుపడితే మేం ఇంక చేసేదేముంది? నువ్వు బాగుండటమే మాకు కావాలి. బాగా వయస్సు తేడా వుందన్న విషయం ఒక్కటే ఆలోచించాలి. కానీ మిగిలిన విషయంలో శ్రీశ్రీలాంటి భర్త దొరకటం పూర్వజన్మ సుకృతమే" అంటూండగా__
"మీరు కూడా ఇప్పుడున్న జన్మని వదిలేసి తెలీని జన్మ చూరు పట్టుకొని ఎందుకండీ వేలాడటం" అంటూ శ్రీశ్రీగారు వచ్చారు. ఎందుకో తెలీదుగాని పెళ్ళి అనే మాట వచ్చిన దగ్గర్నుండి వారిదగ్గర మునపటంత స్వేచ్ఛగా వుండలేకపోయేదాన్ని. ఏదో తెలీని భయం. సిగ్గు. మరిన్నాళ్ళూ ఇవన్నీ ఏమయినట్టు? అసలు క్రమేపీ నాలో ఈ మార్పు లేమిటి? అనే ఆలోచనతో వారిని పలకరించలేదు.
వారి ముఖం చూస్తున్నాను. మాటలు వింటున్నాను. కానీ "రండి కూర్చోండి" అని అనలేదు.
"ఏమిటా పరధ్యానం? ఎక్కడుంది నీ మనసు" అని అడిగేరు.
అప్పుడు "రండి కూర్చోండి" అన్నాను.
నా పెంపుడు తల్లిదండ్రులు శ్రీశ్రీగార్ని చూడటం అదే మొదటిసారి. వారు ఉభయులూ శ్రీశ్రీగారికి నమస్కారం చేస్తూ "మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా వుందండి. అంతా భగవంతుడి దయ" అని అన్నారు.
"డబ్బు ఖర్చుపెట్టి, ఖండెక్కి బరంపురం నుండి రెండు రోజులు వళ్ళు హూనం చేసుకొని వచ్చారు మీరు. ఇందులో భగవంతుడి దయ ఏం వుందండీ? నేనిలా అంటున్నందుకు మీకు కష్టం అనిపించొచ్చు.
"మీకు రెండు కోవెలలు కూడా ఉన్నాయనీ సరోజ చెప్పింది. నేను ఎవర్నీ కించపరచను. ఎవరి నమ్మకాలు వారివి. దేవుడా అంటూ నేలమీద దొర్లుకుంటూ పోతామన్నా నాకేమీ అభ్యంతరం లేదు. నాకు మాత్రం దేవుడు లేడు. నేను పరమ నాస్తికుడ్ని.
దేవుళ్ళ గొడవ ఎత్తితేనే నాకు పరమ అసహ్యం. పూర్వజన్మ, వచ్చే జన్మ ఇవన్నీ ఉత్తమాటలు. నాకు నమ్మకంలేదు" అన్నారు.
దేవుడి గురించి మావాళ్ళ దగ్గర ఇలా మాట్లాడుతున్నారే అన్న బాధతో దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి?" అని నేను అడిగాను.
"నాస్తికత్వం అన్నది బానిస మనస్తత్వాన్ని నిర్మూలనం చేసేది. ఎలాగయినా సరే బానిసలుగా వుండటం బానిస మనస్తత్వం. నాస్తికత్వం అంటే మనిషిలో స్వతంత్ర భావాన్ని పెంపొందించడం. చివరికదే ఇంకొకళ్ళ మీద ఆధారపడటమన్నది పోగొట్టి స్వశక్తిమీద ఆధారపడే విధంగా తోడ్పడుతుంది. అంచేత పూజలూ, పునస్కారాలకని కాల్చేటైము, డబ్బూ కూడా స్వయంకృషికి చేస్తే ప్రయోజనం వుంటుంది" అన్నారు. "మరి నాకుదేవుడూ, పూజలూ, పునస్కారాలూ ఎక్కువకదా ఎలాగా?" అన్నాను.
