Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 13

    మరొకర్ని పెళ్ళిచేసుకోవడం  మనసుకి రాని మనువే అవుతుంది.

    నేను నిజంగానే శ్రీశ్రీగార్ని  ప్రేమిస్తున్నానన్నమాట  అని నికరంగా  తేల్చుకున్నాను. ఈ పాడు ప్రేమ ఇంతకాలం  ఎక్కడ  దాగిందో. శ్రీశ్రీ భార్యనవటం  నిజంగా  నా అదృష్టమే. వారిచరిత్రలో నాకూ వారి భార్యగా ఏ మూలో సూది మోపినంత  జాగా  వుంటుంది. అంతకుమించి ఏం కావాలి. చావో రేవో_మంచో చెడో తేల్చుకుందామనేకదా మొదట్లో  వారి దగ్గర  ప్రవేశించాను. దాని పరిణామం  ఇదే కాబోలు _ అని ఆలోచిస్తున్నాను.

    ఇంటికొచ్చేం. "దిగు సరోజా" అని శ్రీశ్రీగారన్న మాట పరధ్యానంగా  వున్న  నాకు వినిపించలేదు. "సరోజా నిన్నే" అని కళ్ళ గుర్తుగా ఆనటంతో.

    "ఏమిటండీ?" అన్నా.

    "ఏవిటాలోచిస్తున్నావు. ఇల్లు వచ్చింది దిగు" అన్నారు.

    గతుక్కుమన్నాను. చటుక్కున కారుదిగి "వస్తానండి. నమస్కారం" అన్నాను.

    కారు తిన్నగా మా ఇంటికే  వచ్చిందన్నమాట.

    "నేను గంటలో  వస్తాను సరోజా"_అని శ్రీశ్రీగారు వెళ్ళిపోయారు.

    ఇంట్లోకి  అడుగుపెడుతూనే  చెంబుడు మంచినీళ్ళు  గడ గడ తాగేశాను. "అలాగున్నావేమి"టని  అమ్మ అడిగింది. "ఏం లేదమ్మా" అన్నాను.

    "ఏమీ లేకపోవటం  ఏమిటి నీ ముఖం. కార్లో  నీతో కూడా  వచ్చినావిడెవరు?" అని అడిగింది.

    "శ్రీశ్రీగారి భార్యమ్మా" అన్నాను.

    "ఎవరూ? రవణమ్మగారా?"

    "ఆఁ! సాక్షాత్తూ  రవణమ్మగారే" అన్నా.

    "ఆవిడెలాగొచ్చేరు? ఆశ్చర్యంగా వుందే" అంది అమ్మ.

    "అదే గమ్మత్తమ్మా!" అన్నాను.

    "అందరూ  కల్సి  ఒక్కసారిగా  ఎలాగొచ్చారే" అని మళ్ళీ అడిగింది.

    "చెప్తాలే అమ్మా! నన్ను కాస్త సర్దుకోనీ" అన్నాను.

    ఇక ఏమ్మాట్లాడకుండా  "కాఫీ తాగుతావా" అంది అమ్మ.

    "ప్లీజ్ అమ్మా! స్ట్రాంగ్ కాఫీ" అన్నాను.

    అమ్మ లోనికివెళ్ళింది. బెడ్ పరిచేశాను. లైట్లు  ఆర్పేశాను. అంతే_పక్కమీద వాలాను.

    జరిగిందేమిటి? నిజమేనా! నేనేమిటి మాట్లాడాను. అలా మాట్లాడటం తప్పు కాదా? ప్చ్! తప్పేమిటి_ గాడిదగుడ్డు. దగ్గర దగ్గర మూడు ఏళ్ళుగా  మడి కట్టుకొని  కూర్చున్నాను. మంచిపేరు లేదు. రంపపు కోత  అనుభవిస్తున్నాను. మంచిమాటే. ఇక నేను శ్రీశ్రీకే స్వంతం. ఆత్మాభిమానం వెన్నుచరుస్తోంది. ఇక మీదొచ్చే  పరిస్థితుల్ని  ఎదుర్కొని  నిలవాలని  అనుకుంటూ వుండగా_

    "చీకట్లో  ఏం చేస్తున్నావే" అని అమ్మ వచ్చింది.

    "ఏమీ లేదమ్మా, తలకాయ నొప్పిగా వుంది" అన్నాను.

    "ఏదో జరిగింది. చెప్పకుండా  దాస్తున్నావు" అంది అమ్మ.

    "నీ దగ్గర దాపరికం  ఏం వుందమ్మా" అనేశాను.

    అమ్మ వెళ్ళిపోయింది. మళ్ళీ కళ్ళు  మూసుకున్నాను.


                                  పెద్దల నిర్ణయం


    నాకు రవణమ్మగారే కళ్ళముందు  మెదలసాగారు.

    నన్నెంత  అభిమానించి ప్రేమగా  చూసేవారు. దగ్గర కూర్చోపెట్టుకుని వెండి గిన్నెలో  అన్నం పెట్టేవారు. ఇద్దరం అన్ని కోవిళ్ళకి, ఎన్ని స్థలాలకి వెళ్ళేం. మహాబలిపురం, కంచి, తిరుపతి. తిరుకోళికుండ్రం_ ఒకటేమిటి ఇద్దరం పాతపొత్తుగా వుండేవాళ్ళం. ఆవిడకి  శ్రీశ్రీగారంటే పంచప్రాణాలు. పండులేకుండా  ఒక్కనాడు కూడా శ్రీశ్రీగారికి అన్నం పెట్టలేదావిడ, భోజనం కాగానే_ఏపిల్, బత్తాయో, ద్రాక్షో, అరటిపండో ఏదో ఒక రకం పండు. అన్నంలో  గడ్డపెరుగు, ఆవకాయ, ఇవన్నీ చూసేనుకదా. కళ్ళముందు రీలుగా తిరగడం ప్రారంభించింది.

    ఇప్పుడేఁవయింది. పోట్లాడుకున్నాం. ఆ కుటుంబంలో  మనిషిని కాబోతున్నాను. దీనికింత  ఆలోచనా, అంత బాధ ఎందుకు? అనుకొంటూ  వుండగా_

    "శ్రీశ్రీగారొచ్చారక్కయ్యా" అని  మా రామం  చెప్పి  లైటు వేసింది.

    "చీకట్లో  ఏం చేస్తున్నావు సరోజా"

    "వెలుగుని వెతుక్కుంటున్నాను"

    "అబ్బబ్బో  కవిత్వం  చెప్పేస్తున్నావేవిటి"

    "మీరేమిటి ఉషారుగా  ఉన్నారు?"

    "ఉషారుకాక  మరేఁవిటి! నా వరకూ పెద్ద భారం తగ్గించావు. మీ ఇద్దరి పోట్లాటలో  అసలు విషయం తేలిపోయింది."
    "మరి ఆవిడ  మిమ్మల్నేవీ అనకుండా  వూరుకున్నారా?"

    "నేనింట్లోకి  వెళితేగా. దాన్ని దింపేసి  అలాగే  అన్నపూర్ణాకి వెళ్ళాను. వస్తూ పార్క్ లేండ్స్ కి వెళ్ళి స్వీటుతోసహా  రవ్వదోసె  తిని కాఫీ తాగి వస్తున్నాను."

    "అయితే ఈ రాత్రి జాగారమేనా?"

    "అబ్బా ఆ సంగతి  ఇంటికి వెళ్ళాక  తెలుస్తుంది. కానీ నువ్వేమిటి అంత ధైర్యంగా దానితో  మాట్లాడి పందెం కట్టేశావు." 
   
    "ఏవండోయ్ ! ఆవిడంటే  నాకు భయం అనుకున్నారా? ఎంతమాత్రంలేదు. ఆవిడ్ని  అర్ధం చేసుకోవడం  కష్టం కానీ  ఎంత మంచి ఆవిడో  నాకు తెలుసు. మరి నా విషయంలో  అంటే  న్యాయమే కదండి. ఏ ఆడది_తన  భర్తని  ఇంకొక  స్త్రీకి  వదులుతుందండీ. నేను చచ్చినా ఆవిడ తప్పంటే  ఒప్పుకోను. పోతే ఆవిడే నన్ను రెచ్చగొట్టి  అనవసరంగా  నా చేత  మాట్లాడించారు. ఇక అంతే! నేనూ ఒళ్ళూ  పై తెలీకుండా  ఆ ఆవేశంలో  మాట్లాడేశాను" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS