Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 12

    మేమిద్దరం  టాక్సీలోనే  వెళ్ళాం. మేము టాక్సీలో నుండి  దిగేసరికి  ఆవిడకి అరికాలి మంట నెత్తికెక్కింది. ఆవిడ మండిపడుతోందని  శ్రీశ్రీగారు గ్రహించేరు. ఆవిడేదో  మాట్లాడబోయారు. ఆయన కళ్ళెర్ర జేశారు.

    "ఇక్కడెవ్వరూ  నోరెత్తటానికి  వీల్లేదు. అనవసరంగా  నాకు కోపం తెప్పించటానికి  ప్రయత్నించకండ" ని వార్నింగిచ్చారు.

    శ్రీశ్రీగారి స్వభావం  చాలా గమ్మత్తుగా  వుంటుంది. కొంపలంటుకుపోతున్నా  చాలా కూల్ గా వుంటారు. ఏమీ పట్టించుకోరు.
ఊరుకున్నంతసేపూ  ఊరుకుంటారు. కానీ  కోపం వస్తే మాత్రం  చంపేస్తారన్న  భయం మా ఇద్దరికీ వుంది. అందుకే  కడుపులో  అగ్నిపర్వతాలు  రగులుతున్నా పైకి  మాత్రం ఏమీ మాటాడలేదు.

    కారు రావడానికి అరగంట  పట్టింది. అన్నీ చెక్ చేసి డ్రైవింగ్ సీట్లో సుబ్బారావు కూర్చున్నాడు. శ్రీశ్రీగారు ముందు సీట్లో కూర్చున్నారు. ఆవిడ వెనక సీట్లో  కూర్చున్నారు.

    నన్ను చూసి "కారు ఎక్కు సరోజా" అన్నారు శ్రీశ్రీగారు. నేను ఎక్కాను.

    ఆవిడ వెంటనే దిగిపోయి...."నేను టాక్సీలో  వస్తాను. మీరు వెళ్ళండి" అంది.

    అప్పుడు శ్రీశ్రీగారి కళ్ళు కోపంతో చింతనిప్పుల్లా  అయిపోయాయి. నిజంగానే నాకు భయం వేసింది. వీళ్ళిద్దరి  మధ్య నేనెందుకు వున్నానా అని బాధపడ్డాను.

    వారు కోపం వచ్చి అరిస్తే  వచ్చే ధ్వని మనం నెమ్మదిగా, మామూలుగా మాట్లాడితే వచ్చే ధ్వనిలా వుంటుంది. దాన్నిబట్టి ఎంత  నెమ్మదిగా, సున్నితంగా మాట్లాడ్తారో ఆలోచించండి.

    "ఏయ్! ముందు కారెక్కు! నీకే చెప్తున్నా" అన్నారు.

    "నేను ముందు సీట్లో మీ దగ్గర కూర్చుంటా" అన్నారావిడ.

    "ఇక్కడ జాగా లేదు. వెనక సీట్లో కూర్చో" అన్నారు.

    ఆవిడ కారెక్కారు. వెనకసీట్లో ఇద్దరం  చెరోవైపూ  కూర్చున్నాం.

    స్టాండర్డ్ కంపెనీ  గేటు దాటి కారు రోడ్డుమీద కొచ్చింది. ఆవిడ ఆవేశం కట్టలు తెంచుకొని  వచ్చేసింది. ఇక ఇదీ అదీ అనిలేదు 'ఓ__' అని అరుపులు ప్రారంభించారావిడ.

    "నోరు మూస్తావా లేదా" అన్నారు.

    "దాన్నిక్కడ  దింపి  టాక్సీలో  పొమ్మనండి" అన్నారావిడ.

    'దాని బరువు నువ్వేం మోస్తున్నావు? నిన్ను మోస్తున్నట్టే  దాన్ని కూడా కారే మోస్తోంది. సరోజ దిగదు. దిగడానికి వీల్లేదు..."

    "ఏమండీ..." అని నేను ఏదో అనబోయేను.

    "నోర్ముయ్యి" అన్నారాయన.

    భగవంతుడా ఈ రోజు  ఏం జరగాలని రాసివుందో  అనుకున్నా.

    ఇక ఆవిడ తిట్ల ప్రవాహానికి అడ్డులేదు. పది మాటలకి  ఒకమాట  నేను జవాబిస్తున్నాను. శ్రీశ్రీగారు నోరెత్తలేదు. మా ఇద్దరి మాటలమధ్య బేక్ గ్రౌండ్ మ్యూజిక్ లా  సిగరెట్టు దమ్ములాగే ధ్వని మాత్రం వస్తోంది. ఆవిడ మాటలతో నన్ను పిచ్చిగా రెచ్చగొడుతున్నారు. నాలా ఓర్మి నశిస్తోంది.

    "వారి దగ్గరకి  ఇలా  ఎంతమంది రాలేదు. పోలేదు. కానీ ఇలా పట్టుకుని ఎవరూ వేలాడలేదు. ఈ మంతనాలు ఎంతకాలమో  నేనూ చూస్తాను. ఈ ఆటలు నా దగ్గర సాగవు. వారికి ఉంపుడు కత్తెగా  జీవితాంతం వుండాల్సిందేకానీ, పెళ్ళి చేసుకోడానికి  వీల్లేదు. నా కంఠంలో  ప్రాణం వుండగా నాకు సవతిగా రాలేవు. వారికి రెండవ భార్యవి కాలేవు. నన్ను ఎదిరించి  మీరిద్దరూ ఎంత దూరం వెళతారో  చూస్తాను.

    శ్రీశ్రీ వుంచుకున్నదన్న  పేరేగాని, పెళ్ళానివని  ఎవరూ  చెప్పుకోరు" అంటూ మాటలు తిరగేస్తోందావిడ.

    ఇక నాలో  సహనం  నశించింది. ఈవిడతో ఇక లాభం లేదనుకుంటూ_"చూడండి. దయచేసి  నన్ను రెచ్చగొట్టకండి. నా సంగతి మీకు తెలీదు. గౌరవ మర్యాదలకి పాకులాడే  మనిషిని. మీ మాటలతో నాలో మార్పులు కలుగుతున్నాయి. వాటితో వచ్చే మంచి చెడ్డలకి  మీరే బాధ్యులు  అవుతారు. ఈ క్షణం దాకా  నేనింకా మంచి అభిప్రాయంతోనే వుంటున్నాను. దయచేసి  మరేమీ మాట్లాడకండి" అన్నాను.

    "నేనూ ఆఖరిసారిగా  చెప్తున్నాను. ఒక్కటి మాత్రం  జ్ఞాపకం  పెట్టుకో. శ్రీశ్రీకి ఒక్కర్తే పెళ్ళాం. మళ్ళీ మరొకర్తి  పెళ్ళాం అనిపించుకోలేదు. నా ఖర్మకాలి నువ్వు వార్ని  వదలకుంటే  ఉంపుడుకత్తెవుగా  చచ్చేదాకా పడివుండాల్సిందే" అన్నారావిడ.

    అంతే! నా ఒళ్ళు భగ్గున  మండింది. ఆవిడ్నిచూసి "చూడండీ! మీ అహంభావం, మీ మాటల కోసమైనా  నేను మీతో పందెం కట్టాలి. మీరింక విచారించి లాభంలేదు. నేనూ మీకు చెప్తున్నా! ఇన్నాళ్ళూ తీరని సమస్యతో సతమతమౌతూ, మంచికిపోయి  మాటలుకాచేను. నన్ను రెచ్చగొట్టి నా సమస్యను మీరే పరిష్కరించారు. నా ఆఖరి నిర్ణయానికి మీరేకారకులు.

    నేను శ్రీశ్రీగారిని పెళ్ళి చేసుకుంటాను. శ్రీశ్రీ పెళ్ళాన్ననిపించుకుంటాను. మీకు సవతిగా రాకపోతే నా పేరు మార్చుకుంటాను. నేనన్నమాట  నిలబెట్టుకోకపోతే  ఉపద్రష్ట సూర్యనారాయణ కూతుర్ని కాను. ఎవరడ్డుతారో చూస్తాను" అని వళ్ళు  తెలియని కోపం, అవమానంతో  అనేశాను. నాలో ఆవరించిన ఆవేశానికి నేనే ఆశ్చర్యపోయాను.

    శ్రీశ్రీగారు  ఒక్కసారి చురుగ్గా  నా కళ్ళలోకి  చూశారు. అంతే_ఇక ఆవిడ మాటలేవీ  నా చెవికి ఎక్కలేదు. ప్రళయం వచ్చినా పట్టించుకొనేస్థితిలో  లేను. ఈ లోకాన్ని  విడిచి  నా ఆలోచనలకు హద్దూపద్దూ లేకుండా పోతున్నాయి.

    శ్రీశ్రీగారితో  నా జీవితం  ముడిపడబోతోంది. ఇక నా నిర్ణయాన్నెవరూ మార్చలేరు. ఆవేశంలో అకస్మాత్తుగా  తీసుకున్న నిర్ణయం అయినా మంచిదే. శ్రీశ్రీగార్ని కాదని వేరొకర్ని  పెళ్ళిచేసుకున్నా, జీవితం నరకమే అవుతుంది కానీ సుఖం వుండదు.

    వచ్చేవాడు ఎలాంటివాడో, అతనికి శ్రీశ్రీగారి గురించి, వారి మంచితనం గురించి, గొప్పతనం గురించి కాని ఏం తెలుస్తుంది. 'ఈ అమ్మాయి శ్రీశ్రీ దగ్గర మూడేళ్ళుగా పనిచేస్తోంది, ఊరికే  వదిలివుంటాడా' అని అనుకోవడమే కాకుండా_జీవితాంతం నన్ను దెప్పుతూనే వుంటాడు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS