Previous Page Next Page 

ది సెల్ పేజి 4


                                 ఆశయాల అంచుల్లో
    
    అర్దరాత్రి ఒంటిగంట అవుతూంది. అప్పుడే షో వదిలేరు.
    మెయిన్ రోడ్డు జనంతో యిరుకుగా వుంది. చూస్తూంటే అది రాత్రి లాగా లేదు. వెన్నెల రోజు కావటాన వీధి లైట్స్ లేక పోయినా పట్టపగలులాగా వుంది. కాలం దొర్లుతున్నకొద్ది జనం పలచబడుతున్నారు. అలసి గూటికి గువ్వలు చేరుకుంటున్నట్లు జనం నిద్రమత్తులో వాళ్ళ వాళ్ళ యిండ్లకు చేరుకుంటున్నారు. అంతా నిర్మానుష్యం అయ్యింది. చివరికి ఆ రోడ్డు మీద నేనే మిగిలేను.
    'సార్' అన్న పిలుపుకి తల త్రిప్పి చూసేను. రోడ్డుకు మధ్యగా ఒక ఖాళీ రిక్షా ఆగి వుంది. రిక్షావాడు నా దగ్గరకు వచ్చి 'పిట్టకావాలా సార్?' అని అడిగాడు.
    అతని ప్రశ్న అర్ధం కాక అయోమయంగా చూసాను.
    'కన్నెపిల్ల వుంది సార్?' అతను రెట్టించి అడిగేడు.
    వాడి భాష కొద్దిగా అర్ధమయింది. పూర్తిగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాను.
    'డబ్బు గురించి తమరేమీ ఆలోచించకండి. అసలు డబ్బుకోసమే కాదు. ఏదో ఆమె సర్ధా కోసం. తమరు ఎంత యిచ్చినా అడగదు' ఆమె కేవలం తన తృప్తి కోసమే ఆ పని చేస్తున్నట్లు ధ్వనించేయి అతని మాటలు.
    నా సరదా ఆవిడి సరదాకైతే ఈతని కెందుకు ఈ సర్ధా అన్న సంశయంతో నా తలలో ఏదో మెరుపు మెరిసినట్లయింది. అతను తొందర పెట్టటం వలన అంగీకారం తెలిపి రిక్షా ఎక్కాను.
    ఆ వీధి నిర్మానుష్యంగా ఉంది. అందరూ గాఢనిద్రలో ఉన్నట్లు, తెలియచేస్తూ పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. పరిసరాలను గమనించిన నాకు క్షణం భయం ఆవహించింది.
    తమరు లోనికి దయచేయండి అంటూ రిక్షావాడు ఇంట్లోకి వెళ్ళేడు. కొన్ని క్షణాలు లోపల నుంచి గుసగుసలు వినబడ్డాయి. తిరిగి వస్తున్న రిక్షావాడి వెనకే వచ్చిన స్త్రీ రండి అనగానే లోపలికి బయలుదేరాను.
    నాకు ఐదు ఇవ్వండి సార్ రిక్షా అతను ధీమాగా అడిగాడు. ఇదివరకు లేని కరుకుతనం యిప్పుడు వాడి మాటల్లో కనిపించింది.
    వాడికి నోటు అందించి మెట్లని సమీపించాను. చేస్తుంది తప్పేమో ననిపించింది. కాని పట్టుదల, ఎనలేని తెగింపు కలగ చేసింది. ఆమె వెంటే లోపలికి వెళ్ళాను.
    బెడ్ లైట్ వెలుతురులో అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ గదిలో సింగల్ కాట్, టీపాయి, ఒక గాడ్రేజ్ చైర్ వున్నాయి. బెడ్ లైట్ కాంతిలో గోడలన్నీ నీలంగా కనిపిస్తున్నాయి.
    ఆమె కూర్చోమనటంతో పరిసరాలను పరీక్షించటం ఆపి టీపాయి దగ్గరున్న కుర్చీలో కూర్చున్నాను. ఆమె మంచం మీద ఒక మూలగా కూర్చుంది. తెల్లచీర కట్టుకుందేమో బెడ్ లైట్ కాంతిలో, లేత నీలం చీరలాగా కనిపించింది.
    కథలో వ్రాసినట్లు, సినిమాల్లో చూపినట్లుగా కిళ్ళీ నములుతూ ఏమీలేదు. ఎదుటి వారిని మత్తెక్కిస్తానని వాలు జడనిండా మల్లెపూవు లేమీ పెట్టుకోలేదు. నన్ను చూసి కన్నేమీ కొట్టలేదు. అంతకు మించి కంగారు పడాల్సిన పనేమీ చెయ్యలేదు. ఆమెలో ఉన్న ఏ అలంకరణా కావాలని చేసుకున్నట్లు లేదు. అసలామెను వేశ్యగా ఊహించటమే కష్టం.
    'పెళ్ళిచేసుకోవచ్చుగా యిలా ఎందుకు చేస్తున్నావు?....'
    ఊహించని ప్రశ్నకు క్షణం అవాక్కయింది. వెంటనే నిర్లిప్తంగా నవ్వింది. నేను మరలా అదే ప్రశ్న అడగటం వల్లనేమో ఆమె జవాబు చెప్పక తప్పలేదు.
    "తండ్రి ఎవరో తెలియని వాళ్ళం మాకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి?....."
    ఆమె మాటల్లో విషాదం గూడుకట్టుకునుంది.
    ఆమె పలికిన నిప్పులాంటి సత్యానికి మనసంతా భారమయ్యింది. కూటి కొరకు కోటివిద్యలన్న సామెత గుర్తుకొచ్చింది. బ్రతుకు తెరువు కోసం రిక్షావాడు కన్నెపిల్ల సర్ధా పడుతుందని తన సంసారాన్ని పోషించుకోవటానికి అబద్దం ఆడాడు.
    తలుపు కొడుతున్న శబ్దంతో పరిస్థితి గుర్తు వచ్చింది. ఆమె తలుపు తియ్యటానికి వెడుతుంటే ఆ వచ్చిందెవరో ఊహించటానికే వణుకు పుట్టింది.
    ఆమె తలుపు తీసింది. ఎదురుగా కనిపిస్తున్న భారీ శరీరాన్ని చూస్తూనే హడలిపోయాను. ఏ పరిస్థితిలో చిక్కుకున్నానో అర్ధమయ్యింది. అతన్ని చూడలేక తల తిప్పుకున్నాను.
    అప్పటికే ఆమె, పది నోటు అతని చేతిలో పెట్టింది. అతను వచ్చిన దారే పట్టాడు.
    వాన కురిసి వెలిసినట్లయింది. నా గుండె యధా ప్రకారం కొట్టుకోవటం మొదలు పెట్టింది. కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని స్టేషన్ కి తీసుకువెళ్ళే సీన్, నా ఊహ నుండి దూరం అవ్వగానే, పెద్ద గండం గడిచిందని శ్వాస తీసాను. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండటం మంచిది కాదని జేబులోంచి ఏభై నోటు తీసి ఆమె చేతిలో పెట్టి లేచాను.
    'క్షమించండి' అంటూ...
    ఆమె నోటు తిరిగి నా చేతిలో పెట్టింది. ఆమె నోటెందుకు తిరిగిచ్చిందో నాకర్ధమవ్వలేదు. ఒక వేళ తక్కువయ్యిందేమోననుకొని ఎంతో చెప్పండి అన్నాను.
    'స్త్రీతో కాసేపు మంచి చెడు మాట్లాడి దానికే రేటు కడితే యిక ఈ వృత్తి ఎందుకు? వూరికే తీసుకోలేను. మీ సుఖం తీర్చుకుని ఇవ్వండి లేదా మీ డబ్బు తీసుకు వెళ్ళండి' అంది.
    ఆమె మాటలు విన్న తరువాత మాటలే కరువైనట్లు 'మరి కానిస్టేబుల్ కి....నా గురించి పది' అస్పష్టంగా నా పెదవులు కదిలేయి.
    'ఆ వచ్చింది కానిస్టేబుల్ కాదు. ఈ వీధి రౌడి. వాడి మామూలు. అది వాడికి రోజు యిచ్చే మామూలే. రౌడీ రాక, మీకు చాలా ఆందోళన కలిగించినట్టుంది.' అని ఆమె ప్రక్కనే వున్న మంచి నీళ్ళ గ్లాసు అందించటంతో, నా నాలుక ఎండిపోయిందని గుర్తు వచ్చిన వెంటనే నీళ్ళు త్రాగి బయటపడ్డాను.
    బరువైన జేబుకన్నా మరింత బరువైన హృదయవేదనతో రూమ్ లో అడుగు పెట్టిన నాకు, టేబిల్ మీద పెట్టిన వైట్ పేపర్స్ గాలికి రెపరెపలాడుతూ కనిపించాయి. నేనో రచయితనని అవి గుర్తు చేశాయి.
    దైన్యంతో కూడి వున్న ఆమె కళ్ళలోని నిజాయితీ నిశ్చలత ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. వేశ్యలకు నీతి నిజాయితీ ఉంటుందని అప్పుడే తెలుసుకోగలిగేను. నాకు సహజంగా వేశ్యలంటే ఏహ్యభావం ఉండేది. కాని దానిచోట జాతి చోటు చేసుకుంది. యిప్పుడువాళ్ళ స్థితికి నాలో రచయిత ఆవేశం చెందాడు. కాని....!!!
    'వేశ్యలమీద కధలు రాసి రచయితగా పేరు ప్రతిష్టలు సంపాదించగలవు. వాళ్ళ దైన్యస్థితికి జాలి కురిపించి, పాఠకులకు వేదనని పంచి పెట్టగలవు. కాని......కాని......నువ్వు
    సంఘ సంస్కర్తవి కాలేవు'...
    వెంటనే ఏదో చెయ్యాలనే తపనతో లేచి, ఆమెను వివాహ మాడితే! నేను బ్రహ్మచారిని, యువ రచయితను, అభ్యుదయ భావాలు కలవాడిని!!! ఏం వివాహ మాడితే? అంతలో అంతరాత్మ---
    'నువ్వేమీ చెయ్యలేవు. అడుగు ముందుకు వేసేవో నీకీ సమాజంలో స్థానముండదు' అవి సమాజం హెచ్చరించినట్లు అనిపించి కుర్చీలో కూలబడ్డాను నిస్సహాయంగా.
    ఆ రోజు నుండి నేను రచయితనని చెప్పుకోవడానికి సిగ్గు పడ్డాను, పడుతున్నాను.
    
                              * * *


 Previous Page Next Page