Previous Page Next Page 

రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 2

 

    "పెద్ద దైర్యం గల మగాడివి. నన్ను చాలెంజ్ చేస్తున్నావా? అంటూ లేచి నిలుచుంది ఇందుమతి.
    గబగబా మెట్లు ఎక్కుతూ ఉంటె రవి ఆశ్చర్యంగానూ, సుందరామయ్య ప్రశంశపూర్వకంగానూ చూశారు.
    మెట్లెక్కి రవి గది ముందు నిల్చుంది. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. ఆ తలుపులు నెట్టడానికి చెయ్యి వేసిన ఇందుమతి చెయ్యి తలుపుల మీదే ఉండిపోయింది.
    గుండె వేగం హెచ్చింది. తలుపుల మీద ఉన్న చెయ్యి కొద్దిగా వణుకుతున్నట్టుగా అనిపించింది.
    "ఇదేమిటి? తను భయపడుతుందా?
    అంటే తను స్పిరిట్సు ను నమ్ముతోందా?
    నో! నో! తను నమ్మదు - నమ్మడం లేదు. కాని.....కానీ అర్ధరాత్రి ఇలాంటి మాటలు వినడం వల్ల కలిగిన బలహీనత .....అదే - అదే -ఏదో అస్పష్టమైన భయం.
    తన విజ్ఞానం - తన చదవూ తన నమ్మకాలూ- స్పష్టమైన అభిప్రాయాలు - అది మానవుడిలో ఉన్న భయాలు ఆ భయాల వల్ల ఏర్పడ్డ మూడ నమ్మకాలూ ఇంకా తనలో - అదే తనలాంటి వారిలో- కూడా నిగూడంగా ఉన్నాయా? ఆ భయాలనూ, నమ్మకాలనూ తనలోని హేతువాద బలం తొలగించలేక పోతున్నాదా?
    తను కేవలం అర్ధరాత్రే ఒక హిస్టీరియా పేషెంటు లాంటి వృద్దుడు. చెప్తున్న మాటలకే ఒంటరిగా గదిలోకి వెళ్ళడానికి భయపడుతూ ఉంటే దయ్యాల సాహిత్యం చదవే మాములు పాఠకుల గతి ఏమిటి? సైకియాట్రిస్టులు మొరపేడ్తూనే ఉన్నారు దయ్యాల సాహిత్యం వల్ల అమాయకులూ , ఎదిగి ఎదగని మనస్కులూ పిచ్చివాళ్లై పోతున్నారని.
    ప్రజల అజ్ఞానాన్ని ఈవిధంగా ఉపయోగించుకోవడం దారుణం క్షమించరాని అపరాధం. కొందరైతే తాము శ్మశానాల్లో స్వయంగా చూసిన విషయాల్నే రాస్తున్నామని అమాయకుల్ని నమ్మిస్తున్నారు. అలాంటి రచయితలకూ , స్మగ్లర్లకూ బేధం లేదనిపిస్తుంది తనకు.
    ఆ మధ్య తనో నవల చదివింది. అది చదివినంత సేపూ తనకు కోపం వచ్చింది. ఎన్నోసార్లు ఆ పుస్తకాన్ని దూరంగా విసిరి గిరాటు వేసింది. ఎందరో పాఠకులు ఆవురావురు మంటూ భయపడుతూనే చదివారు. అది ఒక రచయిత్రి రాసింది. ఆమెకు తనచుట్టూ ఉన్న జనం కంటే పిశాచాలమీదే ఎక్కువ సానుభూతి ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది. ఆ నవల చదివిన వారికి. అంతేకాదు, బ్రతికుండి ఎలాంటి స్వభావం ఉన్న వారు అలాంటి స్వభావం గల దయ్యాలుగానే మర్తారట - ఆవిడ గారి థియరీ."
     "ఏమిటి ఇక్కడే నిలబదిపోయావు? భయం వేసిందా?"
    ఇందుమతి తుళ్ళిపడి వెనక్కు చూసింది.
    రవి నిలుచుని ఉన్నాడు.
    "నాకా? భయమా? నాకేం భయం?" అంటూ తలుపు నెట్టింది.
    గబగబ లోపలి కెళ్ళి కాలెండరు తీసుకొని బయటకు వచ్చింది.
    సుందర్రామయ్య కాలెండర్ వెనుక వైపు ఒక గ్లాసు తెప్పించి, బోర్లించి సున్నాలు చుడుతుంటే కుతూహలంగా చూస్తూ కూర్చుంది.
    వంటావిడా, పని కుర్రాడు కూడా వచ్చి కూర్చున్నారు.
    "వాళ్ళకూ భయంతో నిద్ర పట్టలేదు కాబోలు" అనుకుంది ఇందుమతి.
    సుందర్రామయ్య ఆ సున్నాల మధ్యలో ఎబిసిడి లు రాశాడు. చివర్లో అంకెలు కూడా వేశాడు. మధ్యలో ఒక సున్నాలో, స్టాప్ అవి రాసి , దానికి రెండు వైపులా 'నో' అనీ, 'ఎస్' అనీ రాశాడు. స్టాప్ లో గ్లాసు పెట్టాడు. రవిని ఆ గ్లాసు అంచుమీద చూపుడు వేలును ఉంచమన్నాడు. రెండో వైపు తన వేలు ఉంచాడు.
    "హోలీ స్పిరిట్! కమాన్ ....కమిన్" అంటూ కళ్ళు మూసుకుని పదే పదే పిలిచాడు. కొన్ని నిముషాలు తర్వాత ఆ గ్లాసులో ఏదో ప్రవేశించినట్టుగా ఒక్కసారిగా గ్లాసును బోర్లించాడు. బోర్లించిన గ్లాసు మీద మొదటిలాగే ఇద్దరూ చెరో వైపు చూపుడు వేళ్ళను ఉంచారు.
    "నీ పేరేమిటి?" అడిగాడు సుందర్రామయ్య.
    గ్లాసు కదల్లేదు.
    అలా పదిసార్లయినా అడిగి ఉంటాడు. ఉన్నట్టుండి గ్లాసు కదలడం మొదలు పెట్టింది.
    "కదుల్తోంది. చూడమ్మా ఏయే అక్షరాల మీదకు గ్లాసు వెళ్తుందో చదువుతూ పో!" ఉత్సాహంగా అన్నాడు సుందర్రామయ్య.
    "చెప్పు - నీ పేరేమిటి?"
    అక్షరాలన్నీ కలిపి చదివింది ఇందుమతి. "గౌతమ్" అని చదువుకుంది మనసులోనే. ఆమెకు కోపం వచ్చింది. అయినా, తమాయించుకుంది. గ్లాసు ఇక తన పని అయిపోయినట్టుగా స్టాప్ గడిలోకి వెళ్ళి ఆగిపోయింది.
    రవి ముఖం వెలాతెలా పోతోంది. నుదుటి మీద స్వేద బిందువులు మెరుస్తున్నాయి.
    సుందర్రామయ్య క్షణం చింతాక్రాంతుడై ఉండిపోయాడు.
    "నాయనా, నువ్వేనా?"
    "ఎస్!' మీద కెళ్ళి గిర్రున స్టాప్ గడిలోకి వచ్చి ఆగిపోయింది గ్లాసు.
    "రాత్రి ఇందుమతికి కనిపించిందెవరు? మళ్ళీ ప్రశ్న.
    "నేను" అని మళ్ళీ సమాధానం.
    "నువ్వెక్కడకి పోయావు? ఎలా పోయావు?"
    "ఆక్సిడెంటు లో - బెంగుళూరు - మైసూర్ మార్గంలో ...."
    రవి చెయ్యి వణకడం మొదలైంది.
    ఇందుమతి ఒకటే ఆలోచిస్తున్నది. ఆ గ్లాసు అంత స్పష్టంగా అక్షరాల మీదకు అంత స్పీడుతో ఎలా తిరుగుతున్నదన్నదే ఆమె సంశయం.
    "రవీ! నువ్వు లే! నేను పట్టుకుంటాను!" అని రవిని లేపి అతడి స్థానంలో ఆమె కూర్చుంది.
    గ్లాసు చాలా సేపు కదల్లేదు. కాని, క్రమంగా కదిలినట్టు ఆమెకు తోచింది గాని, సమాధానాలు సరిగా రావడం లేదు. అది ఊ. జా. బోర్డంతా తిరుగుతోంది.
    ఇందుమతి వదిలేసి సుందర్రామయ్య ముఖంలోకి తిన్నగా చూసింది.
    సుందర్రామయ్య అదోలా నవ్వి - "ఎందుకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదో కూడా ఇప్పుడే చెప్తాను . రవీ , నువ్వు పట్టుకో" అన్నాడు.
    గ్లాసు మళ్ళీ స్పీడుగా కదలసాగింది.
    "ఇందుమతి పట్టుకుంటే ఎందుకు సమాధానాలు ఇవ్వలేదు" అని అడిగాడు సుందర్రామయ్య.
    "ఆమెకు నమ్మకం లేదు." గిరగిర తిరిగింది గ్లాసు.
    "అంతా ట్రాప్ మీరే కదిలిస్తున్నారు" అని అరిచింది ఇందుమతి.
    "కాదు" ఆమెకు సమాధానం గ్లాసు చెప్పింది.
    "చూశావా?" అన్నట్టు సుందర్రామయ్య గర్వంగా చూశాడు.
    "నమ్మకం ఉన్నవాళ్ళు పట్టుకుంటే సమాధానం ఇస్తావా?" ఇందుమతి ప్రశ్నకు గ్లాసు "ఎస్' మీదకు వెళ్ళి తిరిగి యధాస్థానంలో ఆగిపోయింది.
    "ఆపండి ఓ క్షణం " అన్నది ఇందుమతి.
    ఇద్దరూ తమ వేళ్ళను గ్లాసు మీద నుంచి తీశారు.
    వంటమనిషిని , పని కుర్రవాడిని "మీకు వీటి మీద నమ్మకమేనా?" అని అడిగింది.
    "నేను ముందే ఇది గాలి చేష్ట అనుకున్నాను."
    "నీ మొహం! నేను అడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి?" అనాలనిపించింది ఇందుమతికి.
    "మీరిద్దరూ ఆ గ్లాసు మీద వెళ్లుంచండి. కదులుతుందేమో చూస్తాను."
    "ఎందుకు కదలదమ్మా!" అన్నాడు పని కుర్రవాడు మల్లేష్ ఉషారుగా.
    ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని గ్లాసు మీద చేతులుంచారు.
    ప్రశ్న వెయ్యకుండానే గ్లాసు గిర్రున తిరగసాగింది.
    "తోస్తున్నారా?"
    "లేదమ్మా! అదే పరిగెత్తుతోంది." అన్నది పనిమనిషి. రంగమ్మ.
    "నీ పేరేమిటి? ఇందుమతి ప్రశ్నించింది.
    గ్లాసు తిరుగుతోంది. అర్ధం పర్ధం లేకుండా అక్షరాల మీద కదులుతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS