Previous Page Next Page 

ప్రియా.....ప్రియతమా పేజి 2


    సరిగ్గా అప్పుడు ప్రనూష చూపు అతనిమీద పడింది. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. ఇద్దరిలో ఎవరికీ కళ్ళకలక లేదు కాబట్టి నోప్రాబ్లం.
    ఏమనుకున్నాడోగానీ, శ్రీచరణ్ ప్రనూష దగ్గరికి వచ్చి "ఎక్స్ క్యూజ్ మీ మిసెస్.... అన్నాడు.
    "నేను మిస్ నో, మిసెస్ నో మీకు తెలుసా...." కస్సుమని చూస్తూ అంది ప్రనూష.
    'సారీ మిస్ ఆర్ మిసెస్" మీరే మిస్సయినా నాకే ఇబ్బంది లేదు. బస్సుకోసం వెయిట్ చేస్తున్నారనుకుంటా. ఇఫ్ యూ డోంట్ మైండ్. మీ కభ్యంతరం లేకపోతే లిఫ్ట్ ఇస్తాను..." అన్నాడు శ్రీచరణ్.
    'నో థాంక్స్....నాకు కాళ్ళున్నాయి. వెళ్ళడానికి....ఆర్టీసీ బస్సులున్నాయ్" అంది విసురుగా ప్రనూష. ఓసారి ఆమె కాళ్ళవంక చూసి తాపీగా "సారీ మిస్ ఆర్ మిసెస్... మీరు కుంటి వాళ్ళనుకుని పొరపాటు పడ్డాను...." అంటూ మరో అమ్మాయి దగ్గరికి వెళ్ళి....
    "ఎక్స్ క్యూజ్ మీ మీరు మిస్సా...మిస్సెస్సా" అని అడిగాడు. శ్రీచరణ్ లో సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. దానికి తోడు స్పోర్టివ్ నెస్ నేచర్.
    "ఎందుకు?" అని అడగబోయేంతలో శ్రీచరణే...
    "మీకు అభ్యంతరం లేకపోతే...నేను మీకు లిస్ట్ ఇస్తాను. అదీ...యిఫ్ యూ డోంట్ మైండ్...అయితేనే. మీరు కూడా నాక్కాళ్ళున్నాయి. వాటికి హై హీల్స్ ఉన్నాయి.  బస్సులున్నాయి. అంటే సారీ." 'థాంక్స్...' అంటూ ఆ అమ్మాయి ముందుకు నడవబోయింది.
    ఇదంతా ఓరకంటతో గమనిస్తోన్న ప్రనూష కోపంగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి....
    "ఎవరు పిలిస్తే వారి వెంట...ఎగేసుకుని వెళ్ళడమేనా?" అంటూనే శ్రీచరణ్ స్కూటర్ వెనక ఎక్కింది.
    శ్రీచరణ్ భుజాలు ప్రెస్ చేసి ఆ అమ్మాయి వంక చూసి "బాధపడకండి మిస్....మీకు ఓపిక వుంటే మరో పావుగంట వెయిట్ చేయండి. ఈ అమ్మాయిని దించేసి, వెనక్కి వచ్చి, మీకు లిఫ్ట్ ఇచ్చే ఓపికా, నా స్కూటర్లో పెట్రోలూ....నిండుగా వున్నాయి" అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు శ్రీచరణ్ నవ్వుకుంటూ....
    
                                                                 * * *
    
    స్కూటర్ వేగంగా వెళ్తోంది. ప్రనూష అతనికి అంటి అంటనట్టుగా కూర్చుంది. అప్పుడప్పుడు జర్కులు వచ్చినప్పుడు ఆమె ఎత్తయిన గుండెలు అతనికి తాకుతున్నాయి. అలా తాకిన ప్రతీసారి అతను థ్యాంక్స్" అంటూనే వున్నాడు.
    ఆమె కోపంగా చూస్తూ కూడా ఏమీ చేయలేకపోతోంది. అవసరం తనది.
    టైం చూసుకుంది. తొమ్మిదీ యాభై అయిదు.
    'ఏయ్ మిస్టర్. యింతకన్నా స్పీడ్ గా వెళ్ళదా మీ డొక్కు స్కూటర్....కసిగా అడిగింది ప్రనూష.
    'టెక్కు మనుషులు వెనక కూచుంటే వెళ్ళదు" రిటార్టిచ్చాడు శ్రీచరణ్. బలవంతంగా కోపాన్ని దిగమింగుకుంది. సరిగ్గా తొమ్మిదీ యాభై తొమ్మిది నిమిషాలకు ప్రనూష ఆఫీసు ముందు ఆగింది స్కూటర్.
    స్కూటర్ దిగి ఆఫీసులోకి పరుగెత్తింది ప్రనూష.
    "హలో....మిస్ ఆర్ మిసెస్ గారూ...కనీసం లిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్ అయినా చెప్పాలనిపించలేదా?" వెనుకనుంచి శ్రీచరణ్ అరిచాడు.
    ఎంతలా అరిచాడంటే....
    ఆఫీసుగదిలో అటెండెన్స్ రిజిస్టర్లో బరబరా తన సంతకం గీకేస్తున్న ప్రనూషకు వినిపించేంత... ఆ మాటలు క్లర్క్ కామాక్షి అకౌంటెంట్ మిడిలేజ్ వయసున్న ప్రసూనాంబలకు కూడా వినిపించాయి.
    ఆసక్తిగా బయటకు చూశారు. ఆఫీసు గదిలో అందరికీ కనిపించేలా చేతులూపుతున్నాడు శ్రీచరణ్.
    'బుద్దిలేకపోతే సరి..." కసిగా, కోపంగా, ఉక్రోషంగా అనుకుంది ప్రనూష.
    "ఎవరే....బోయ్ ఫ్రెండా? బావున్నాడే" అంది కామాక్షి.
    "ప్చ్....నేను ఏజ్లో ఉండగా ఇలాంటి హ్యాండ్ సమ్ కనిపించివుంటే బావుండేది..." అంది ప్రసూనాంబ.
    ఆవిడకింకా పెళ్ళి కాలేదు. ఆరడుగుల అందగాడు, ఆజానుబాహుడు. పెద్ద  ఆఫీసర్, కారున్నవాడు, తనని స్టార్ హోటల్స్ కి వీకెండ్స్ లో తీసుకెళ్ళేవాడు తనకు భర్తగా దొరకాలని అనుకునేది ప్రసూనాంబ. అది పదిహేనేళ్ళ కిందటి సంగతి. అప్పట్లో అందంగానే వుండేది.
    అయితే ఆ అందం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి బదులు, అతిశయాన్ని కలిగించింది. తనలాంటి వాళ్ళని చేసుకోవడం మగవాళ్ళకు "ప్రివిలేజ్" అనుకుంది.
    ఒక్కో పెళ్ళికొడుక్కి, ఒక్కో వంక పెట్టింది. కొందరికి హైట్ లేదని, మరికొందరికి హెయిర్ స్టయిల్ బాగాలేదని, ఇంకొందరికి కారు లేదని, యిలా రకరకాల కారణాలతో తిప్పికొట్టింది.
    రోజులు, సంవత్సరాలు గడిచాయి. ఆమెను చూడ్డానికి వచ్చే పెళ్ళికొడుకుల సంఖ్య తగ్గింది. మండు వేసవిలో కరెంటు కోతలా!
    సంవత్సరాలు గడిచేకొద్దీ, ప్రసూనాంబలో ధైర్యం దిగజారి, అతిశయం సన్నగిల్లింది.
    అప్పటికే ఆలస్యమైంది. ఇప్పుడు ఆమెను చూడ్డానికి వచ్చేవాళ్ళ...వయసు ఎక్కువైందని కొందరు, అక్కడక్కడ ఆమె జుట్టు నెరసిందని ఇంకొందరు, నాజూగ్గా లేదని మరికొందరు... ఇలా రకరకాల కారణాలతో తప్పించుకు తిరుగుతున్నారు.
    అది ఆవిడ కథయితే.... కామాక్షి కథ వేరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS