Next Page 

రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 1


    
                    రాంభరోసా అపార్ట్ మెంట్స్
                                  (అపార్ట్ మెంటాలజీ)    
                                                                          ---యర్రంశెట్టి శాయి


                      

               
    
    మాఅపార్ట్ మెంట్స్ కి రామ్ భరోసా అపార్ట్ మెంట్స్ అనే పేరెలా వచ్చెను? దీనికో పెద్ద కథుంది!
    మా అపార్ట్ మెంట్స్ చాలా పాతవి. 1980లో కట్టినవి. అప్పట్లో సిటీకి బయట అంటే ఊరి చివర ఏరియా అనుకుని మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకోసం కట్టాడు రామేశ్వర్ యాదవ్ అనే దాదా! తీరా అందరం లోన్లు తీసుకుని అపార్ట్ మెంట్స్ కి డబ్బు కట్టాక గానీ మాకు తెలీలేదు.
    వాటికి ఉన్న అనుమతులన్నీ చార్మినార్ ఏరియాలో చాంద్ ఫైల్వాన్ అనే అతను తను కబ్జా చేసిన ఫ్లాట్లో ఓ రేకుల షెడ్ వేసి అందులో ఒక ప్రింటింగ్ మిషన్ పెట్టి-ఆ మిషన్లో, ప్రింట్ చేసి ఇచ్చాడని!- ఈ సంగత్తెల్సి కొత్తగా వచ్చిన మునిసిపల్ కమీషనర్ అన్నీ పడగొట్టేస్తాం అంటూ గడ్డపారలూ, హతోడీలూ వేసుకుని కూలీలతో రావటం, మా అపార్ట్ మెంట్స్ వాళ్ళందరం తలో వందో, రెండొందలో వేసుకుని వాళ్ళకి లంచాలిచ్చి వెనక్కుపంపటం మామూలైపోయింది మాకు. ఇలా ఎంత కాలం కడతాం? కట్టలేం కదా! అందుకని మేము రెండొందలమంది అపార్ట్ మెంట్స్ వాళ్ళందరం కలసి మమ్మల్ని మోసగించిన రామేశ్వర్ యాదవ్ ఇంటిముందు ధర్నా చేశాం. పొద్దున్నే హాంగోవర్ పోడానికని ఫ్రెష్ గా విస్కీ తాగుతోన్న రామేశ్వర్ మా అరుపులూ, కేకలూ విని బాల్కనీలోకి గ్లాసుతో సహా వచ్చాడు.
    "ఏందిరా భయ్ మీ లొల్లి?" అనడిగాడు చిరాగ్గా.
    "నువ్ మమ్మల్నందర్నీ మోసం చేసినయ్- ఫోర్జరీ పర్మిషన్ లెటర్స్ తో అపార్ట్ మెంట్స్ కట్టినయ్-" అంటూ అరచాడు మా అపార్ట్ మెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హమీద్ మియా!
    "అవ్! డాక్యుమెంట్లు ఫోర్జరీవి కాకుంటే ఒరిజినల్ ఏడకెళ్ళొస్తయ్ రా? హైద్రాబాద్ ల-ఎవళ్ళయిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో బిల్డింగులు కడతారుబే? అరే పాగల్! నేను మంచోడ్ని కాబట్టి ఒక్కొక్క అపార్ట్ మెంట్ ఒక్కొక్కడికే అమ్మినా! మిగతా జగాల్ల ఒక్కొక్క అపార్ట్ మెంట్ నీ నాలుగయిదు మందికి రిజిష్టర్ జేసిన్రు! ఎరుకనా?"
    "ఆ కొశ్చెన్ తో మా వాళ్ళంతా కొంచెం భయపడ్డారు.
    వాడికా అయిడియా ఉందంటే- ఏదొక రోజు మళ్ళీ మా అపార్ట్ మెంట్స్ ఇంకో నలుగురయిదుగురికి అమ్మాడంటే కొంపలు మునిగిపోతయ్.
    "మరి ఆ ఆరో బ్లాకులో ఫ్లాట్ నెంబర్ త్రీత్రీత్రీని నువ్ కూడా ముగ్గురి కమ్మినావ్ కదా?" అంటూ అరచాడు అపార్ట్ మెంట్స్ సెక్రటరీ మొహిందర్ సింగ్!
    "అవ్- గప్పుడు పైసలు తక్కువబడి అమ్మినా! అయినాగానీ ఆళ్ళు ముగ్గుర్నీ ఆ అపార్ట్ మెంట్ లోనే అడ్జస్ట్ జేసినా గదా! ఒకోడికీ ఒకో రూమిచ్చినా.....ఇంకేం గావాల?"
    అతన్తో ఇంకా మాట్లాడాలంటేనే మాకు భయంగా ఉంది.
    ఇంకేం మాట్లాడితే ఇంకేం కాంప్లికేషన్స్ సృష్టిస్తాడోనని-
    "ఇగో- మొహిందర్ సింగ్! వాడితో ఎక్కువ తక్కువ మాట్లాడకు. వాడికి కొత్త కొత్త అయిడియాలొచ్చాయంటే మనం లోపటయిపోతాం!" అన్నాడు క్రిస్టోఫర్.
    దాంతో మొహిందర్ సింగ్ సడెన్ గా రిట్రీట్ మొదలెట్టాడు.
    "గిప్పుడు మేమేం జేయాలో జెప్పు మళ్ళా! ఆ మున్సిపల్ కార్పొరేషనోళ్ళకి నెలనెలా పైసలేడకెళ్ళివ్వాలి?" అన్నాడు రాజీధోరణిలో.
    "దాన్దేముంది? ఆళ్ళతో నేను మాట్లాడతాన్లే! ఇంకోసారి ఆ మున్సిపలోళ్ళు మీ తానకు రాకుండా నేను జేస్తా-"
    సిబ్లాక్ లో ఉంటున్న కాల్ సెంటర్ ఉద్యోగిని షైనీ అందర్నీ తోసుకుంటూ ముందుకొచ్చింది.
    "ఈ అపార్ట్ మెంట్స్ కట్టిన స్థలమంతా గవర్నమెంట్ లాండనీ అందుకని అందర్నీ బయటగ్గెంటి ఇది కూల్చిపారేసే హక్కు మాకుందని ఆ కలెక్టర్ లెటర్ రాశాడు కదా! దాని సంగతేంటి?" అడిగింది షైనీ.
    ఈ ప్రశ్నతో రామేశ్వర్ యాదవ్ కి కోపం వచ్చింది.
    "నీకేం దమాక్ గిట్టా ఖరాబయిందా? గవర్నమెంట్ లాండ్ కబ్జా చేయకుంటే ప్రైవేట్ లాండ్ జేస్తరా? సిటీలో మూడొంతుల భూమి కబ్జా లాండే- అంతా గవర్నమెంట్ దే! పైసలు పడేస్తాం- రెగ్యులరైజేషన్ చేసుకుంటాం. ఇదేమయినా కొంపలు మునిగే మేటరా? థూ-నీయవ్వ- నా ఇజ్జత్ దీస్తున్రు! మీకేపాసిటీ ఏంది? నా లెవలేంది? ఇగో- ఒక్కమాట చెప్తున్న. ఇప్పటికైనా గాని పోయిందేమీలేదు. ఆ అపార్ట్ మెంట్ కి మీరు గట్టిన పైసలన్నీ మిత్తితోని వాపస్ జేస్తా! ఈ కిరికిరిలు లేని లాండ్ ఏదున్నదో జూస్కోని ఆడే అపార్ట్ మెంట్ కొనుక్కోండ్రి! సమజైందా?"
    ఆ డైలాగ్ తో మొత్తం మా వాళ్ళంతా సైలెంటయిపోయారు. ఎందుకంటే-ఒకప్పుడు ఊరి బయట ప్రాంతమయినా, ప్రస్తుతం సిటీ పెరిగిపోయి మంచి గిరాకీ ఉన్న సెంటరయిపోయింది.
    అది అమ్ముకుపోతే మాకే లాస్! రామేశ్వర్ యాదవ్ మళ్ళీ లక్షలు ప్రాఫిట్ కొడతాడు.
    -పోనీ అతనికి తెలీకుండా మేమూ అపార్ట్ మెంట్స్ అమ్ముకోడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మా బ్లాక్స్ మెయింటెనెన్స్ అతనిదే కాబట్టి అతని శిష్యులు మా అపార్ట్ మెంట్స్ ఆఫీస్ లోనే ఉండి- మా వ్యవహారాలన్ని అబ్జర్వ్ చేస్తుంటారు.
    "ఇగో-మీకేం ప్రాబ్లెమొచ్చినా నాకు ఫోన్ కొట్టండి- నేను జూస్కుంటానని భరోసా ఇచ్చినాక ఇంక బుగులు పడతారేందిరా భాయ్- ఫోండ్రి ఇంక"
    ఆ విధంగా అతను భరోసా ఇచ్చాడు. కాబట్టి ఆ రోజు నుంచి మా అపార్ట్ మెంట్స్ కి 'రామ్ భరోసా' అపార్ట్ మెంట్స్ అన్న పేరొచ్చింది.
    మా అపార్ట్ మెంట్స్ కి మెంటల్ అపార్ట్ మెంట్స్ అని మరో పేరు కూడా ఉంది. అదెలా వచ్చిందంటే- మా అపార్ట్ మెంట్స్ లోని ఆరో బ్లాక్ లో ఒక మెంటల్ డాక్టరున్నాడు. (డాక్టరు మెంటల్ కాదు! మెంటల్ కేసుల్ని చూసే డాక్టర్)
    ఆయన వ్యాపారం ఈ రెండు మూడేళ్ళల్లోనే మూడు ఫ్లాట్లు, ఆరు ఫ్లాట్లుగా పెరిగిపోయింది.
    ఎందుకంటే మన దేశాన్ని ఎలాంటి బఫూన్లు పరిపాలిస్తున్నారో మనందరికీ తెలుసు. అసలే మనదేశంలో ఉన్నది ప్రపంచంలో ఎక్కడా కనిపించని నికృష్టమయిన డెమోక్రసీ- దానికితోడు బఫూన్లరాజ్యం-
    ప్రజలకు మెంటల్ రాకేమవుతుంది?


Next Page 

WRITERS
PUBLICATIONS