Next Page 

జీవాత్మ పేజి 1

           
                                               జీవాత్మ
    
                                                                   ----సూర్యదేవర రామ్ మోహనరావు

    
                                               
                                   

 

                                                          పూర్వరంగం
    
  
 'పదార్ధము' అంటే నిరంతరం మార్పు చెందుతూ వుండే కుదించబడ్డ శక్తే తప్ప, వేరొకటి కాదని మనిషి మరచిపోతున్నాడు. అంతులేని భౌతిక వాంఛల నుండి పుట్టుకొచ్చిన వివిధ ఉద్రేకాలతోనూ, విభిన్న ప్రేరేపణలు తోనూ తన ఇంద్రియలను సంతుష్టిపరచడానికై అతడు తన జీవశక్తిని వృధా చేస్తూ వుంటాడు.
    
    తను ఒక పదార్ధమేనని (మనిషి) ఎంత ఎక్కువగా భావిస్తూ వుంటే, జీవించి వుండటానికి అతనికి అంత ఎక్కువ (మాంస) పుష్టిగల ఆహరం అవసరమవుతుంది.
    
    అతడు ఎంత ఎక్కువగా ప్రాణవాయువును వినియోగిస్తే, అంత తక్కువ ప్రాణశక్తులు తనలో ఉన్నట్లుగా అతనికి అనిపిస్తుంది. ఈ పరిస్థితి వలన అతడు పూర్తిగా పదార్ధభావంలోనే మునిగిపోయి, చివరికి ప్రాణశక్తి లేనివాడవుతాడు. జీవశక్తిని పోగొట్టుకున్న వాడవుతాడు.
    
    బ్రహ్మ నేలమట్టితో మనిషిని నిర్మించి, అతని నాసికారంధ్రాలలో జీవాన్ని ఊదగా, మనిషి జీవాత్మగా రూపాంతరం చెందుతాడని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. చాలావరకూ మనం పీల్చే గాలి ద్వారానే మనకు ప్రాణధారమగు "ప్రాణశక్తి' లేదా 'కి'ని పొందుతున్నాం.
    
    ప్రతి జీవి ఈ శ్వాసపైనే ప్రధానంగా ఆధారపడి వుంది. ఈ శ్వాసనే బ్రహ్మప్రాణుల నాసికారంధ్రాల ద్వారా లోపలకు పంపిస్తాడని అధర్వణ వేదంలో ఎంతో వివరంగా చెప్పబడింది.
    
    శ్వాస ఆగితే ప్రాణం పోయినట్లే. పురిటికందు మొదటిసారిగా ఏడ్చే ఏడుపు మొదలు, మనిషి చివరి శ్వాసకీ మధ్యన వుండేది ఉచ్చ్వాస-నిశ్వాసాల పరంపర మాత్రమే తప్ప, వేరొకటి కాదు.    
    
    మన ఆలోచనల వలనా, ఇష్టపూర్వకంగా చేసే ప్రతి పని వలనా, లేదా కండరాలను కదిలించడం వలనా మనం నిరంతరం మన 'ప్రాణశక్తి' లేదా 'కి'ని పోగొట్టుకుంటున్నాము.
    
    దానిఫలితంగా, దానిని ఎప్పటికప్పుడు భర్తీ చేయవలసిన అవసరం ఎంతైనా వుంది. ఊపిరి పీల్చుకోవడం మరియు ఇతర ఆరోగ్యానికి సంబంధించైనా అభ్యాసాల ద్వారా అది సాధ్యపడుతుంది.

    
    మానవుని భౌతిక శరీరమంతా రెండు భాగాల కలయికతో ఏర్పడింది. అందులో ఒకటి మనకు ప్రత్యక్షంగా కంటికి కనిపించే భౌతిక శరీరం.
    
    రెండవది మన కంటికి కనిపించని శక్తి శరీరం. INVISIBLE ENERGY BODY దీనినే జీవధాతు శరీరమంటారు. BIOPLAS MIC BODY.
    
    మనం చూసేది, స్పర్శించేది మనకు బాగా పరిచయమైన మన శరీర భాగమే భౌతిక శరీరం.
    
    ఈ భౌతిక శరీరంలోనికి చొచ్చుకొనిపోయి, శరీరం లోపలా, బయటా, నాలుగు లేదా అయిదు అంగుళాల వరకు విస్తరించే, కంటికి కనిపించని కాంతివంతమైన శరీరమే జీవధాతు శరీరం. దివ్యదృష్టి కలవారు యీ శక్తి శరీరాన్నే జీవాత్మ శరీరం (ETHERIC BODY) లేదా రెండు కాంతి మండలాల శరీరం అని పిలుస్తారు.
    
    ETHERIC DOUBLE.
    
    ఆధునిక వైద్యశాస్త్రం భౌతిక శరీరానికే చికిత్స చేస్తోంది. భౌతిక శరీరాన్ని నడిపిస్తూ, జీవం వుండేలా చేస్తూ, నిరంతరం కంటికి కనిపించకుండా శ్రమించే సూక్ష్మ శరీరానికి, నేటి అత్యాధునిక వైద్యశాస్త్రం ఏ చికిత్సా చేయలేక పోతోంది. చేయలేదు కూడా.
    
    అందుకే ఎన్నో రుగ్మతలూ, ఏ ఆధునిక వైద్య పరిశోధనలకు లొంగకుండా మానవజాతిని హింసిస్తున్నాయి. కనిపించేదే నిజమని, కనిపించనిది నిజం కాదనే మూఢనమ్మకంలో కూరుకుపోయిన నేటి శాస్త్రవేత్తలు ముందు నుంచి ముందుకే వెళుతున్నారు కానీ, వెనకటి ప్రపంచంలో పూర్వులు శోధించి, సాధించిన ప్రాణహిత సూత్రాలని, విధానాలనూ పట్టించుకోవడం లేదు.
    
    మనిషికి వుండవలసింది ముందుచూపు ఒక్కటే కాదు- వెనక చూపూ వుండాలి.
    
    వివేకవంతుడు సంకుచిత మనస్కుడు కాకూడదు.
    
    సరికొత్త అభిప్రాయాలను, అభిరుచుల్ని, అభివృద్దిని అనుకరిస్తేనే సమాజంలో గౌరవించాబడతామనే ఆలోచనలనుంచి బయటపడనంత వరకూ మనకు సరికొత్త మార్గాలు కనిపించవు. తలల్ని ఇసుకలో పూడ్చిపెట్టుకునే నిప్పుకోళ్ళలా ప్రసరిస్తున్న నేటి కొందరు శాస్త్రజ్ఞులు ప్రజల్ని పరిష్కారం లేని సమస్యలవైపు, నయంకాని జబ్బులవైపు తోసివేస్తున్నారు.
    
    ఈ తరహా శాస్త్రజ్ఞుల్ని, వీరు శోధించే పరిశోధనా సంస్థల్ని పోషించటానికి అమాయక ప్రజల కష్టాల్ని దుర్వినియోగపరచటం ఎంతవరకు సబబు?
    
    గత సంస్కృతిని, వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిన విజ్ఞానాన్ని, వేదాల్ని, ఇతిహాసాలను విస్మరించి, నిన్నటిరోజు చెల్లని చెక్కు అని, రేపటి రోజు ప్రామిసరీ నోటని, నేడు కరెన్సీ అని మూర్ఖపు భాష్యాలు చెప్పుకుని ప్రాచీన విజ్ఞానాన్ని విస్మరిస్తున్న నేటి మూడో శాస్త్రజ్ఞుల్ని, వ్యాపారమే జీవితమనుకునే, డబ్బు సంపాదనే జీవిత ధ్యేయమనుకొనే నేటి మేధావుల్ని చూసి జాలిపడటం తప్ప మరేం చేయలేం.
    
    తెలివైనవాడు, వివేకవంతుడు గతంలో కనుగొన్న వాటిని క్షుణ్ణంగా తెలిసికొనేందుకే, తాళపత్ర గ్రంథాల్ని మన పూర్వీకులు భద్రపరిచింది. ప్రాచీన విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకి అందించాలానే చైనావాళ్ళు పేపర్ ని కనిపెట్టింది. ముందుగా వున్నదేమిటో, కనుగొన్నదేమిటో చదివాకే తనేం చేయాలన్నది, తనేం కనుగొనాలన్నది నిర్ణయించుకున్నవాడే నిజమైన సృష్టికర్త.
    
    శరీరం, మనసు, ఆత్మలను సమన్వయపరచకుండా ఏ వైద్యం చేసినా అది అనుకున్న ఫలితాన్ని సాధించదు. నిజమైన వైద్యమంటే శరీరానికి మాత్రమే చేసేది కాదు. అన్నింతిని సమన్వయపరిచి వైద్యంచేసే పద్దతులు నేటి వైద్యశాస్త్రంలో చోటు చేసుకుంటే తప్ప నేటి మానవజాతి సరియైన మనుగడ సాధించలేదు.


Next Page 

WRITERS
PUBLICATIONS