Next Page 

మనసా....ప్రేమించకే నువ్విలా పేజి 1


               మనసా... ప్రేమించకే నువ్విలా!
                                                                -శ్రీ లత.


    "స్నేహం సృష్టి ధర్మం. జీవితో జీవి, నిర్జీవితో కూడా జీవి; పూవుతో పరిమళం, పరిమళంతో గాలి; గాలితో చిగురాకులు, చిగురాకులతో కోయిళ్లు; కోయిళ్ళతో రాగాలు, రాగాలతో హృదయాలు; హృదయాలతో మనుషులు... సర్వకాల, సర్వావస్థలయందూ ఆదినుండీ అంతం వరకూ స్నేహిస్తూనే పయనం చెందుతారు. లేనిదే కాలధర్మం కొనసాగదు. విశ్వాంతరాళంలో ప్రతి గ్రహగమనమూ స్నేహపూరితం. ఆ స్నేహసూత్రంలో లిప్తపాటు తప్పిదం జరిగినా విస్పోటనమే. సృష్టి ఆద్యంతమూ మారని నియమం... స్నేహమే!
    అందుకే స్నేహించండి. తల్లి నుండి తండ్రి, సోదరులు, ఇరుగుపొరుగు, సహవిద్యార్థులు, జీవితప్రయాణంలో చేరుతూ,  విడిపోతూ ఉండే మానవపాత్రలూ, వివాహభాగస్వామి, బిడ్డలూ అందరితోనూ స్నేహించండి.
    పుట్టిన ఊరినీ, మెట్టిన పట్టణాలనీ, పేరు పెట్టిన దేశాన్నీ, దేశానికి  స్నేహమయిన పరదేశాల్నీ... ఇంతెందుకు- అసలు మొత్తంగా ప్రపంచాన్ని స్నేహించండి.
    కానీ, వీటిలో వేటినీ వీసమెత్తు కూడా ప్రేమించకండి. స్పష్టంగా చెబుతున్నాను- ప్రేమించకండి. ప్రేమ స్నేహమంత  విశాలమయింది కాదు. ప్రేమ స్వార్థపూరితనం. ప్రేమ ఓ ఇరుకు దారిలో చీకటికమ్ములో ముక్కుబిగించి చేసుకునే ఆత్మహత్య. ఒక్కసారి ఈ ప్రేమ వ్యసనంలో పడితే ఆ బలహీనతను జయించలేం. ఆ రోగం నుంచీ విముక్తి పొందలేం.
    ప్రేమనేది తీవ్రంగా, త్వరితంగా వ్యాపించే అమ్తువ్యాది. ఇది ఆరోగ్యకరమైన స్నేహకణాలను నిర్జీవం చేసి శరీరాన్ని జీవశ్చవం చేస్తుంది. మెదడును నిస్పృహలోకి నెట్టేస్తుంది.
    అందుకే స్నేహించండి. కానీ, ప్రేమించకండి."
    షిట్! వాటే బోర్ ఆర్గ్యుమెంట్..!!    బుక్ మూసి విసిరేసి ఇంకో పుస్తకం తెరిచీ తెరవగానే అక్షరాలు పరిమళాలు విరజిమ్మినట్లు వింత సువాసన. దాంతో -  ముత్యాలపేరు తెగిపడ్డట్లు అల్లిబిల్లి వాక్యాలు.
    'అమ్మా నాన్నా' రెండు అందమైన పూలయితే.... వాళ్ళిద్దరి కలయికలో వెలువడిన సౌరభం నేను' - నాయని కృష్ణకుమారి.
    "వావ్ఁ... వాటె కొటేషన్..!"
    అమ్మానాన్నా ఇద్దరూ ఉన్నవాళ్ళు ఇంత గర్వంగా ఉంటారా? వాళ్ళమీద వాళ్ళకు ఓ అద్భుతమైన భావన ఉంటుందా? మరి, నాలాగా అమ్మో- నాన్నో ఒక్కరే ఉన్నవాళ్ళు? నాలాగ కొంచెం ఆనందం, కొంచెం దిగులూ, కొంచెం గంభీరం, కొంచెం ఎమోషనల్ గా ఉంటారా?
    నాన్న పక్కన అమ్మ వుంటే ఎంత బావుండేదో! తొలిఝామూ, మలఝామూ మధ్యలో, ఆకాశంలో సూర్యచంద్రులిద్దరూ ఉన్నప్పుడు నాన్నలోని కాంతి - అమ్మను వెలిగించి అమ్మలోని శాంతి - నాన్నను నవ్వించి, రెండింటి కలయికలోంచి వచ్చే కొత్త వెలుగయ్యేది తను.
    అమ్మనూ, నాన్ననూ అటూఇటూ కూర్చోబెట్టుకున్న ఫోటోస్ ఫ్రెండ్సెవరయినా చూపిస్తే ఎంత జెలసీ తనకు? వాటిని చూసీచూడనట్లు చూసి, ఏదో పనున్నట్లు వెళ్లిపోయి గోడకు బోర్లాగా ఆనుకుని ఏడ్చేయలేదూ... ఎన్నోసార్లు! తన కుళ్ళెక్కడ బయటపడుతుందోనని చటుక్కున కళ్ళు తుడుచుకుంటూ వచ్చేస్తుంటే...
    "దొంగా..!" అని పట్టేసి గుండెకు హత్తుకోలేదా నాన్న.. ఎన్నోసార్లు!
    "ఇప్పుడు నేను నాన్న!" అని, వెంటనే గదిలోకి వెళ్లి లుంగీ, షర్టు మీద అడ్డదిడ్డంగా తెల్లటి చిన్నిచిన్ని పూవులున్న చీర కట్టుకుని నుదుటి మీద టికిలీ పెట్టుకుని వయ్యారంగా నడుస్తూ వచ్చి- "ఇప్పుడు నేను అమ్మ!" అంటూ అమ్మలా యాక్షన్ చేస్తూ ఒకేసారి రెండు పాత్రలు పోషిస్తూ తన కళ్ళలో తడి ఆరిపోయేదాకా నవ్వించి రెండుచేతుల మధ్య తనను పోదువుకుని లాలించి తను కన్నీరయ్యేవాడు కదూ నాన్న... తను నిద్రపోయాననుకుని.
    బొద్దుగా కాదు! లావుగా, నవ్వితే ఒళ్ళంతా కదిలేలా పెద్దపెద్ద కళ్ళతో, ముఖమంతా పారాడే నవ్వుతో, చేతులు చాచి రమ్మని సైగచేసే నాన్నంటే ఎంతిష్టమో! హత్తుకు పోవాలనిపిస్తుంది. తన గుండెల్లో మొహం దాచుకుని లోకాన్నే మర్చిపోవాలనిపిస్తుంది.
    నాన్న మీద తనకున్న  ఇష్టాన్ని ఫ్రెండ్స్ కు చెబితే- నేనేదో ఎక్ట్స్రీమ్ గా మాట్లాడుతున్నట్లు వాళ్ళు చూస్తూంటే కోపం, కినుక  వచ్చేస్తాయి- ఎంత ఆపుకుందామనుకున్నా ఆగకుండా!
`    ఎగ్జాట్లీ..! అలాంటప్పుడే ఒంటరిగా నిలబడి ఆకాశానికి చేతులు చాచి, "ఐ లవ్ యూ డాడ్! ఐ లవ్ యూ... ఐ లవ్ యూ మచ్ మోర్!" అని అరవాలనిపిస్తుంది. ఎన్నిసార్లు అరవలేదూ... తను అలా!
    "జ్ఞాపీ! లేవ్వే! నీ లవ్ మండిపోనూ... తెల్లార్లూ నీ కలవరింతల్తో చంపుతావు కదే! అయినా నీదేం పిదప బుద్దే తల్లీ..! బాయ్ ఫ్రెండ్స్ తో కలర్ పుల్  డ్రీమ్స్ కనాల్సిన వయసులో 'ఐ లవ్ యూ డాడ్' అని కలవరిస్తావేమిటే?!" అని ఉరుములూ, వాటితోపాటు ముఖంమీద విసిరికొట్టిన నీళ్లూ... ఉలిక్కిపడి లేచేలా చేశాయి జ్ఞాపికను.
    "ఓఁ.. ఇది హాస్టల్!
    ఇక్కడ చేరి మూణ్ణెల్లయింది. తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుని ఎవరినీ డిస్టర్బ్ చేయకుండా, హర్ట్ చేయకుండా మంచి ఫ్రెండ్స్ ను పొందాలనీ, మంచి నాలెడ్జ్ తో తిరిగి రావాలనీ... డాడీ చెప్పలా?
    "జీవితానికి బేస్ మెంట్ వేసుకోస్తా డాడ్! మీకూ, నాకూ మరిచిపోలేని అనుభవాల్ని మోసుకొస్తా డాడ్!" అంటూ తను ప్రామిస్చెయ్యలా?... అన్నీ మర్చిపోతుంది తను - నాన్న గుర్తొస్తే.
    "స్సారీ... స్సారీ... సారీవే! ఈరోజు కూడా కలవరించి అందర్నీ డిస్టర్బ్ చేశానా?" అంది.
    అప్పటికి ఎవరి కాట్ మీద వాళ్ళు లేచికూర్చుని తనవైపే చంపేసేలా చూసే చూపుల్తో ఉన్న  రూమ్మేట్స్ స్పూర్తీ, రేవతీ, మగ్ లో నీళ్లు పట్టుకుని నిలబడ్డ కామినీ గుర్రుగా చూస్తుంటే-
    "డిస్టర్బ్చేసేంత మైల్డ్ నెస్ లేదమ్మా నీ  వాయిస్ లో! అర్థరాత్రి  దెయ్యం మాటల్లా అతి భయంకరంగా ఉండి అదరగొడ్తున్నావ్ తల్లీ!" వెక్కిరింతగా అంది స్పూర్తి.
    "పగలల్లా బుర్రలు తినే ప్రొఫెసర్స్, సాయంత్రమయితే సి.ఐ.డి. క్యారెక్టర్ తో వార్డెన్, తెల్లార్లూ చదివినా పూర్తికాని సబ్జెక్ట్స్ పెట్టే కష్టాలు చాలక నీ బోడి కలవరింతల్తో మేం బతకలేం! జీవితమ్మీద ఎన్నో ఆశల్తో ఎం.సి.ఎ.లో చేరాం. అవన్నీ నాశనం కాకముందే మమ్ల్ని నీ అరుపుల్నుంచి రక్షించుకోవాలి. అప్పో, సప్పో చేసి చదివిస్తున్న మా అమ్మానాన్నల ఆశలు తీర్చాలంటే దయచేసి నీ రూమ్ మార్చుకో!" దండం పెట్టేసింది స్పూర్తి.
    రేవతి కూడా సౌండ్ చేస్తూ చేతులు జోడించింది.
    "ముందు ఎత్తి వరండాలో పడుకోబెట్టి వద్దాం... పదండే! లేకపోతే రేపు టెస్ట్ రాయలేం సరికదా... టైంకి క్లాస్ క్కూడా అందుకోలేం!" అంది కామిని.
    సీరియస్ గా రెడీ అయిపోయారు మిగతా ఇద్దరూ.
    "ప్లీజ్.. రేపు నా  బర్త్ డే! అందుకే ఈరాత్రికి మాత్రం కన్సెషన్ ఇవ్వండే. రేపు ఇలాగే చేస్తే వరండాలో పడేద్దురుగానీ!" అంది జ్ఞాపిక- ఆమాత్రం సెంటిమెంటల్ గా కొట్టకపోతే  వదలరని!
    ముగ్గురూ కాస్త తగ్గారు. ఉరిమిఉరిమి చూస్తూ- "ఒఫ్ఁ..!" అని తలవిదిల్చి, ఆ అమాయకపు ఎక్స్ ప్రెషన్ కు కరిగిపోయి ఓ రాజీకొచ్చారు.
    "అయితే... నోట్లో చున్నీ కుక్కుకుని పడుకో - బయటకు సౌండ్ రాకుండా!" అని  కండిషన్ పెట్టింది స్ఫూర్తి.
    'కరెక్ట్!' అన్నట్లుగా చూశారిద్దరూ... ఇక ఎంత కలవరించినా మాకభ్యంతరం లేదన్నట్లుగా.
    "అదికాదు... ఇప్పుడు 12 : 20  అయింది. మా డాడ్ టెన్ మినిట్స్ లో ఫోన్ చేసి విషెస్ చెప్తారు. ప్రతి బర్త్ డేకి అంతే.. 12:30 కి నన్ను లేపి విషెస్ చెప్పిగానీ పడుకోరు. మా  డాడీ ఫోన్ వచ్చాక నోట్లో చున్నీ కుక్కేయండే! అంతవరకూ కాస్త... వదిలేయండే నన్ను!" మళ్లీ సెంటిమెంటల్ బీట్.
    "నిన్ను... మీ డాడీ... 12:30 కి... విష్ చేస్తారు. మేం దద్దమ్మల్లా కనబడుతున్నామా? హాస్టల్లో జాయినయిన త్రీ మంత్స్ నుంచీ మరీ  ఓవర్ కాన్ఫిడెన్స్ తో స్టడీ చేసినట్లున్నావ్ మమ్మల్ని?!" స్ఫూర్తి వెక్కిరింతగా అడిగింది.
    "మగకాకిని కూడా పట్టపగలు కూడా  'కాకా' అననీయదు వార్డెన్. అలాంటిది- అర్థరాత్రి 12:30 కి మీ డాడీ ఫోన్ కు పర్మిషన్ ఇస్తుందా?"
    "లేదు... ప్రామిస్! మా డాడీ 12:30 కి ఫోన్ లో నన్ను విష్ చేస్తారు. ఏదోలా మేనేజ్ చేసి చేస్తారు చూడండే... ప్రామిస్!" అంది ఎదురుగా ఉన్న కామిని తలమీద చెయ్యి పెట్టి ఒట్టులా!
    ముగ్గురూ మాట్లాడకుండా లేచి చుట్టూ చేరి-
    "హిస్టీరిక్ వాగుడూ, చేష్టలూ మాని నిద్రపో! లేదా... తెల్లార్లూ మమ్మల్ని చంపుతావ్!" అని బెడ్ మీదకు తోసి, నిండా దుప్పటి కప్పి తలమీద దిండు విసిరేసి లైట్లాపి-
    "కదిలావో... బర్త్ టయానికే డెత్ కూడా అయిపోతుంది- జాగ్రత్త!" అని వార్నింగిచ్చి పడుకున్నారు మిగతా ముగ్గురూ
    "పుట్టుకతోనే హిస్టీరియా ఉన్నట్లుంది. ఏ వయస్సులో ఎలా ఉండాలో తెలిసి చావట్లేదు!" గొనుక్కుంది కామిని.
    వీళ్ళ వెక్కిరింతల్ని  వమ్ము చేస్తూ... ఎగ్జాట్లీ 12:30కి డోర్ నాక్ చేశారెవరో!
    గర్ల్స్ తుళ్ళిపడ్డారు. డోర్ తీసి అడిగింది స్ఫూర్తి- "వాట్ హ్యపెండ్?" అని.
    "జ్ఞాపిక వాళ్ళ డాడ్ ఫోన్ చేశారు... మాట్లాడాలట!"
    నిద్రపోతున్న  జ్ఞాపిక లేవకుండానే అమాంతంగా బెడ్ మీంచి దూకింది. విరబోసుకున్న జుట్టు వీపంతా అలుముకుంది!
    నైటీమీద చున్నీ వేసుకుని తలుపు దగ్గర ఆయాను అమాంతం నెట్టేసి ఫోన్ దగ్గరకు పరుగెత్తింది.
    ఫోన్ రిసీవర్ లో జ్ఞాపిక ఊపిరి ఆయాసం వినబడ్డాయి అటువైపు!
    తన తొందర ఊహించుకుని మెత్తగా నవ్వినట్లయింది అటువైపు నుండి!
    "హాయ్ డాడ్..!" దూకుతున్న జలపాతంలా.
    "హాయ్ హనీ! హ్యాపీ బర్త్ డ్...!"
    "థాంక్యూ! థాంక్యూ డాడ్! నాకు తెలుసు మీరు ఫోన్ చేస్తారని... విష్ చేస్తారని! మీరు విష్ చెయ్యకపోతే ఈరోజు నిద్ర  లేచేదాన్నే కాదు! ఎంతసేపయినా అలాగే పడుకునేదాన్ని!"
    "మై డియర్ స్వీట్ హార్ట్! నిన్ను విష్ చేయకుండా నేనుండగలనా?" చిలిపిగా నవ్వు.
    అప్పుడు పసిగట్టింది గొంతులో తేడాను.
    "ఏయ్! హు ఆర్ యు..?" గద్దించింది.
    "యార్! యువర్స్ యార్..." మెలోడియన్ గా చెప్పాడతడు అవతల్నుంచి.
    "షటప్! ఐ హేట్ యు...!" అని విసురుగా ఫోన్ పెట్టేసింది. పెట్టేటపుడు ఫోసుకూ, రిసీవర్ కు మధ్య ఉన్న గాప్ లోంచి వినిపించింది "థాంక్యూ!" అని.
    మెల్లగా నడుచుకుంటూ  వస్తున్న జ్ఞాపికను చూసి అడిగింది స్ఫూర్తి- "వాట్ హ్యాపెండ్ యార్! అశ్వినీ లెవల్లో  పరుగెత్తుకెళ్లావ్! అమ్మమ్మ లెవల్లో నడిచోస్తున్నావ్?"
    "మా డాడీ కాదు."
    "మరెవరే... ఇంత మిడ్ నైట్ ఫోన్ చేసి నిన్ను విష్ చేసేది?!"
    "రోమియో! బ్లడీ రోమియో!!" దుప్పటి నిండా కప్పుకుని ముడుచుకుంది. 'డాడీ ఫోన్ ఎందుకు చెయ్యలేదు?' అనుకుంటూ! నిద్ర పట్టలేదు. మెలకువగానే ఉంది.... డాడీ ఫోన్ ఎప్పుడైనా రావచ్చని!
    తెల్లవారుఝామునే ఫ్రెండ్స్ లేచి  చదువుకుంటున్నా జ్ఞాపిక  లేవలేదు. లేస్తే వాళ్ళు 'హ్యాపీ బర్త్ డే' అంటూ విష్ స్ చెప్పేస్తారని... ఫస్ట్ ఛాన్స్  డాడీ మిస్సవుతారని!
    కాసేపటికి వార్డెన్ కబురు చేసింది.... జ్ఞాపిక కోసం ఎవరో వచ్చారనీ, విజిటర్స్ రూమ్ లో ఉన్నారని!

Next Page