Previous Page Next Page 

గీతోపదేశం కథలు పేజి 3


    చతుర వేళాకోళంగా నవ్వి "అమ్మమ్మ కాలం మాటల్లోనే వున్నావు యింకా..."
    "అమ్మమ్మల కాలంలో కంటే అమ్మాయిల మీద దౌర్జన్యాలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, సెల్ ఫోన్ లలో ప్రేమాయణాలతో బ్లాక్ మెయిలింగులూ చేసి అమ్మాయిల బతుకులు నాశనం చేసేవారు ఇప్పుడే ఎక్కువయ్యాయన్నది తెలుసుకో. ఇలా అందరితో తిరిగి నచ్చలేదని వదిలేస్తే అబ్బాయిలు కక్ష సాధింపుతో ఎంత దురాగతాలకి పాల్పడుతున్నారో వింటున్నాం, చూస్తున్నాం కనకే తల్లితండ్రులుగా భయపడతాము.
    "అంటే, మీరెవరినో తెచ్చి చేసుకో, చేసుకో అంటే చేసేసుకోవాలా?"
    "అలా అనడం లేదు. ఇలా నెలల తరబడి, ఏళ్ల తరబడి పదిమందితో క్లోజ్ గా తిరిగి నచ్చినవాడిని చేసుకుంటాం అంటే ఎవరూ అంగీకరించరు. చూడు ఆడపిల్ల కాస్త స్మార్ట్ గా, చదువు, ఉద్యోగం వుంటే అబ్బాయిలు ఆకర్షితులవుతారు. దానికితోడు మీరిచ్చే చనువుతో మరింత దగ్గరవుతారు. అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవారే ఎక్కువ. నిజంగా మనసారా ప్రేమించి, ఆ ప్రేమ పెళ్లివరకూ తెచ్చేవారు తక్కువ. ఆడపిల్ల అలా మోసపోకూడదని, పెళ్లయ్యేవరకు అమ్మాయి బాధ్యత తల్లిదండ్రులది కనక ఇంతగా ఆరాటపడతారు. నీకెలా చెపితే అర్థం అవుతుంది? చూడు, ఇలారా..." అంటూ కూతురిని చెయ్యి పట్టి లాగి లేపి "నాతో రా. నీకోటి చూపిస్తే అర్థం చేసుకొంటావేమో! ఈ బెడ్ రూమ్ బాల్కనీలోంచి చూడు ఎదురుగా ఏం వుంది?"
    "ఏం వుంది అక్కడ? ఖాళీస్థలం, గేటు, తాళం... ఏం వుందక్కడ?"
    "అవునా! మూడు నెలల క్రితం అక్కడేం వుండేవి? చూసి గుర్తుతెచ్చుకో."
    "ఏంటమ్మా, నీ గోల? ఏం వుండేది? ఆ... ఒక టీ బడ్డీ, ఓ చాకలాడు, ఆ వెనకాతల నాలుగైదు గేదెలు కట్టేసి వుండేవి" ఆశ్చర్యంగా అంది తల్లివంక చూస్తూ.
    "అవును గదా! ఆ స్థలం ఒక ఎన్.ఆర్.ఐ. ది. ఎప్పుడో కొని పడేశాడు. ఆ స్థలం ఖాళీగా, ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు ఆక్రమించి కొట్లు, గేదెలు... ఎవరికి దక్కిన స్థలం వాళ్లు ఉపయోగించుకున్నారు. మూడు నెలల క్రితం ఆ స్థలం యజమాని వచ్చి స్థలం ఆక్రమణకి గురయిపోతుందన్న భయంతో ప్రహరీగోడ కట్టి, గేటు పెట్టి, తాళం వేసి, ఆ స్థలం తనదన్న బోర్డు పెట్టాక లోపలికెళ్లే సాహసం ఎవరూ చేయలేదు."
    "అంటే, దీనికీ అమ్మాయిలు, అబ్బాయిలు తిరగడానికి ఏం సంబంధం? గోయింగ్ క్రేజీ అమ్మా!"
    "ఉండు చెప్పనీ. నీవు మీ నాన్నతోగాని, నాతోగాని వెళ్తుంటే మగపిల్లలు కామెంట్స్, ఈలలు, చౌకబారు నవ్వులు చేసే సాహసం చేస్తారా? పెళ్లయి నీ మొగుడితో వెళుతుంటే పిచ్చివేషాలు వేసే సాహసం చెయ్యరు. అంటే, ఒంటరి అమ్మాయిలనే టార్గెట్ చేసి పిచ్చివేషాలు వేసి దరిచేరే ప్రయత్నం చేస్తారు. ఆ స్థలం ఎవరిది కాదనుకొని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఆక్రమించారు. ఇటుచూడు పక్కింట్లో గులాబీచెట్టు గోడ అవతలకి ఎత్తుగా ఎదిగి విరగబూస్తే రోడ్డు మీదనుంచి ఎవరికందిన పూలు వాళ్లు కోసుకుపోతున్నారు. గేటు తీసి లోపలికి వచ్చి కోసే సాహసం ఎవరోగానీ చెయ్యరు.
    అంటే అర్థం ఏమిటి? స్త్రీ 'క్షేత్రం' లాంటిది. అంటే భూమి, పొలం, నేల ఏదన్నా అర్థం... మన భూమి మనం పరిరక్షించుకోవాలంటే ఓ కంచె, ఓ గోడ వుంటేనే ఆ నేలకి భద్రత. లేకపోతే ప్రతివాడు తనదే అన్నట్టు చొరపడతాడు. పెళ్లయ్యేవరకూ తండ్రి, ఆ తరువాత భర్త ఆ భూమికి కాపు వుంటారు. ఆ క్షేత్రం భర్త అనబడేవాడికి అప్పచెప్పేవరకూ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటే ఆ తరువాత తమ బాధ్యత తీరుతుందనుకుంటారు."
    "ఓ గాడ్, ఆడవాళ్లకి భూమితో పోలిక..."
    "అవును, ధరిత్రి, నేలతల్లి, క్షమయా ధరిత్రీ... ఇవన్నీ స్త్రీకి పర్యాయ పదాలు. భూమిని, తల్లినీ, స్త్రీని 'క్షేత్రం' అంటారందుకే."
    "అయితే మగాడేమిటి? అతనికేం పేర్లు లేవా?" ఎకసెక్కంగా అడిగింది.
    "మగాడు 'బీజం'. అంటే... ఇప్పుడే నెలలో ఏ బీజం అంటే ఏ విత్తు వేస్తే ఆ చెట్టు మామిడి, జామ, సపోటా, వరి, గోధుమ... ఇలా విత్తువలన పేరు వస్తుంది. భూమి వలన పేరు రాదు. అంటే స్త్రీ క్షేత్రం, పురుషుడు బీజం. నీ నేల అయినంత మాత్రాన ఆ చెట్టుని నీ పేరుతో పిలవరు గదా! విత్తు బట్టి పేరు. అందుకే సంతానానికి తండ్రి ఇంటిపేరు వస్తుంది, కాని తల్లి ఇంటిపేరు రాదుగదా! సృష్టిలో స్త్రీ, పురుషులు సమానం అనుకున్నా స్త్రీ కంటే పురుషాధిక్యత వుండడానికి కారణం బీజం వల్ల. అర్థమైందా? ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువులు, ఉద్యోగంతో వంటరిగా వుండే పరిస్థితిలో ఆడ మగ స్నేహాలు ఎక్కువయి, పరిచయాలు ఎటో దారితీసి, ప్రేమలతో మోసపోయే ఆడపిల్లలు ఇప్పుడింకా ఎక్కువయ్యారు. అప్పుడయినా, ఇప్పుడయినా నష్టపోయేది ఆడపిల్ల అన్న నిజం మర్చిపోకూడదు. అందుకే తల్లిదండ్రులకింత ఆరాటం."
    "అంటే ఎన్ని వంద ఏళ్లు గడిచినా స్త్రీ ఎంత ఎదిగినా పురుషుడితో సమానమవలేదా?"
    "స్త్రీ పురుష శరీర నిర్మాణాలు వేరు. శారీరక ధర్మాలు వేరు. అరిటాకు ముల్లు సామెత ఎప్పటికీ మారదు. సృష్టి మారి శారీరక నిర్మాణాలు మారిస్తే తప్ప మగపిల్లలంత స్వేచ్చగా ఆడపిల్లలు ప్రవర్తించలేరు. వాళ్లు తాగుతారు, సిగరెట్లు కాలుస్తారు, ఆడపిల్ల చేస్తే తప్పు తప్పు అంటారు. ఎందుకు? ప్రకృతి ఆడపిల్లకి ప్రత్యేక నిషేధాలు విధించింది. స్త్రీ పురుష హార్మోన్లు వేరు. అవన్నీ స్త్రీ సహజ ప్రకృతికి సరిపడవు. మాతృత్వానికి, పిల్లలని కని పెంచడానికి అలాంటి అలవాట్లు హాని చేస్తాయి. స్త్రీకి వివాహం రక్షణనిస్తుంది, ఏం జరిగినా చట్టం స్త్రీకి న్యాయం చేస్తుంది. సమాజం, చట్టం స్త్రీకి రక్షణ ఇస్తుందన్నది స్త్రీలు మర్చిపోకూడదు. నేను మేజర్ ని, సంపాదిస్తున్నా, నా యిష్టం అంటే ఆ విచ్చలవిడితనానికి సమాజం, చట్టం తోడు రావు. అప్పుడు ఎవరి బాధ్యత, బాధ వారిదే! యువతరం అది గుర్తించాలి." కూతురి మొహంలో మారుతున్న రంగులు చూసి, తన మాటలు కొంత అర్థం చేసుకుందని, ఆలోచిస్తుందన్నది అర్థం అయి అంతటితో ఆపేసింది.

                                                                                      *  *  *

    నెల రోజుల తర్వాత పొద్దుట కాఫీ తాగుతుంటే "డాడీ! పవన్, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీరొకసారి పవన్ పేరెంట్స్ ని కలిసి మాట్లాడండి. ఈ రోజు సాయంత్రం పవన్ వస్తాడు. ఏం మాట్లాడుతారో మాట్లాడండి."
    చాలా క్యాజువల్ గా కూతురు అంటుంటే నమ్మలేనట్టు చూశారు సత్యమూర్తి, జయలక్ష్మి.
    "నీ 'గీతోపదేశాలు' అమ్మాయిగారి మీద ప్రభావం చూపాయి అనిపిస్తుంది" సత్యమూర్తి నవ్వుతూ అన్నాడు.
    'గీతోపదేశం వింటే బాగుపడేవారేగాని చెడిపోయేవారుండరులెండి" జయలక్ష్మి నవ్వుతూ అంది.
                    
                                                                                             (రంజని కథానికలు, 2017)

                                                *  *  *  *

 Previous Page Next Page