Previous Page Next Page 

కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 3


    అంచు నీహారగిరికి జోహారు సేసె
    మోడ్పుగన్నులఁ గెందమ్మి మొగ్గవంటి
    యంజలి ఘటించి దేవి; స్నేహార్ధ్రమధుర
    మతి ప్రజావతి పలికె సమ్రాజ్ఞితోడ.
    
    "అక్క! ఈ కొండకాల్వ యా ప్రక్కనుండి
    పరుగులిడి వచ్చె నొక పల్లెపడుచువోలె;
    మనలఁ గనుఁగొని యల్లంత మరలి మరలి
    మలకలగు చూడు మా కుతూహలసమీక్ష!!
    
    సరససౌవర్ణవర్ణ, సస్యప్రపూర్ణ
    నేత్రపర్వమ్మొనర్చు నీ క్షేత్రలక్ష్మి
    పంటకంకులతో వంగి; పాలుగారు
    బాలు నాడించు బాలెంతరాలువోలె.
    
    హృదయతాపము దీర సౌహృదము మీర        
    శ్రీఘనశ్యామమూర్తి వర్షించినాఁడు;
    తొలకరింపుల భూదేవి పులకరించి
    రాజనము లెత్తె ప్రణయనీరాజనములు.
    
    నిండువేసంగిలో మండుటెండలందు
    కష్టపడి కర్షకులు రాల్చు ఘర్మజలము
    ఫలముగా మారె నేఁటి కీ పొలములందు
    బలము ప్రజలకు మన కృషీవలుని హలము.
    
    పొట్టకోసము కట్టెలు కొట్టుచున్న
    కటికి నిరుపేద మీఁది యక్కటిక మెంతొ
    ఆర్ద్రనయనాల ఆణిముత్యాలమాల
    స్నిగ్ధహృదయానుభూతి నందించినావు.
    
    పొంగి పొరలెడి భావతరంగతతుల
    చల్ల చల్లఁగ పన్నీరు చల్లుకొనుచు
    నిన్ను బంపింప మన రోహిణీస్రవంతి
    యెంతదూరము వచ్చినదే శుభాంగి!    
    
    అక్క! కనుగొ మ్మశోకమ్ము చక్కదనము
    గుమ్మటముమాడ్కి ముద్దులుగులుకుచుండె;
    శీతలచ్చాయలను బ్రదర్శించి మనలఁ
    బిలుచుచున్నది కిసలయాంగుళులతోడ.
    
    ఎవ్వరో పంపినట్లు పర్వెత్తివచ్చె
    చెంగుచెంగుణ బాలకురంగ మదిగొ!!
    ఎంత బాగున్నదే! యింతలేసి నీలి
    నీలి కన్నుల చక్కదనాల మోము."
    
    అనుచు నన్యోన్యమును మాటలాడుకొనెడి
    యక్క సెల్లెండ్ర మధురరమ్యావలోక
    తన్మయత్వములో దేవదహమువైపు
    స్యందనము మెల్ల మెల్లఁగా సాగిపోయె.
    
    లలితలాస్య మయూర విలాసగతుల
    సరస కోమల కిసలయాంజలి పుటాల
    కోకిలా కాకలీ 'కుహూ కుహు' రవాల
    నిలిచి స్వాగతమిడె లుంబినీవనమ్ము.
    
    అంబర చుంబి కదంబ క
    దంబ హరితవర్ణ పూర్ణతా కల్పిత కా
    దంబిని, శ్రిత పశుపక్షి కు
    టుంబిని, లుంబినిని నృపకుటుంబిను లెదుటన్-
    
    కనుగొని తద్వన వైభవ
    మునకు మనమ్ములఁ బ్రమోదముం బొంది సభీ
    జనముల కాజ్ఞాపించిరి
    వినోదముగఁ గొంతతడవు విశ్రాంతిగొనన్.
    
                                       శుభోదయము
    
    సంజాత కౌతుకాయత
    కంజాత విలోచనములఁ గమనీయ లతా
    కుంజమ్ముల, సుందర సుమ
    పుంజమ్ములఁ గనిరి శాక్యభూపాలసతుల్.
    
    ఆయా దృశ్యమ్ముల గమ
    నాయాస మ్ముపశమింప నారయుచు మహా
    మాయాసుందరి సాంద్ర
    చ్చాయావృత మొక రసాలసాలము క్రిందన్-
    
    స్యందన మాపించి, సఖీ
    బృందము కైదండ లిడఁగ ప్రియసోదరితో
    క్రిందకు దిగి, కరుణామయ
    మందస్మితభాసమానమధురాననయై.
    
    కమ్మని పరీమళమ్ములు
    చిమ్మెడి క్రొమ్మావికొమ్మ స్నిగ్దారుణ హ
    స్తమ్ములతో హాయిగ వ
    క్షమ్మున కద్దుకొనె; తీయఁగా ముద్దుగొనెన్.
    
    "ఇంతటి దయార్ద్రమతివి! ఇంకెంతవాఁడొ
    కడుపులోనున్న చిట్టి బంగారుతండ్రి!"
    అని యనుఁగుచెల్లి నవ్వెడి నంతలోన
    రాజపత్నికి నొప్పు లారంభమయ్యె.
    
    పావనమ్మైన ఆ లుంబినీవనాన
    బాలసహకారమంటప ప్రాంగణమున
    రచిత రమణీయ పటకుటీరమ్ములోన
    కనియెఁ జక్కని బాలు నొక్కని సవిత్రి.
    
    సహజ సముదాట్ట భావనాశక్తి నుండి
    అమృతమయకావ్య ముత్పన్నమైనయట్లు
    పరమకల్యాణి రాణి గర్భమ్మునుండి
    విశ్వమోహనమూర్తి యావిర్భవించె.
    
    పుడమి పులకించె; రవి శుచిస్ఫూర్తిఁ గాంచె;
    నింగి నిర్మలమయ్యె; నుప్పొంగఁ గడలి;
    మెల్లమెల్లగ వీచె సమీర; మఖిల
    భూతకల్యాణకరు సముద్భూతివేళ.
    
    నందనామోద లహరికా స్పందనములు
    మాతృమానస మానందమయ మొనర్చె;
    దివికి భువికి నవీనబాంధవ మదేదొ
    సమయగుద్భుద్ద మయ్యె నా క్షణమునందు.
    
    జివ్వుమని వంగె సవిధసంస్థిత పలాశ
    పాదప మొకండు చిన్నారి పాప మీఁద;
    ఏ యదృశ్యదేవతలో వహించినట్టి
    పట్టుకుచ్చుల ధవళాతపత్ర మనఁగ.
    
    ఉపనిషత్తుల నుయ్యాలలూఁగు హంస
    వచ్చివ్రాలెను లుంబినీవనములోన;
    వేద సౌధాంగణాలలో వెలుఁగు వెలుఁగు
    ప్రకటితం బయ్యె తల్లి పొత్తికలలోన.
    
    మంద మందానిల స్పర్శలందు కదలి
    వికచ తరుశాఖికలు పుష్పవృష్టి కురిసె;
    మధుర మకరంద రసపాన మత్త మధుప
    గాన ముప్పొంగె లుంబినీ కాననమున.
    
    బుసబుస పొంగి ముద్దుగొనిపోయె నదే సెలయేటికన్నె సా
    రస రస రామణీయక తరంగితముల్ పసిపాప పాదముల్;
    మిసమిసలాడుచున్న సుతిమెత్తని బుగ్గలు చూచి యేమిటో
    గుసగుసలాడుకొన్నయవి గువ్వలజంటలు కొమ్మచాటునన్.
    
    బాలుని జూచె తల్లి తన ప్రాణము స్నిగ్ధపయోధరమ్ములం
    బాలాయి జాలువార, తన భావము ముగ్ధవిలోచనమ్ములం
    గాలువలై స్రవింప, తన కౌతుకముల్ తను వెల్ల పుల్కలై
    గీలుకొనన్, సుధామధురగీతులు మేలుకొనన్ మనమ్మునన్.
    
    నోఁచిన నోముపంటయొ! అనూనమనోరథ మాలతీలతల్
    పూఁచిన పూఁతయో! కనుల ముందర లేచిన స్వర్గమో! హృదిం
    దాఁచిన పెన్నిధానమొ! సుధానిధిఁ దోఁచిన కల్పకంబొ! కే
    ల్సాఁచిన భాగ్యమో యన చెలంగె నిసుంగు సవిత్రిసన్నిధిన్.

 Previous Page Next Page