Previous Page Next Page 

ప్రతీకారం పేజి 3


    ఈ జగన్నాధానికి ఏమైంది? పిచ్చి పట్టలేదు కదా? లేడిని వెంబడించాడు. అది అందలేదు. దానికే ఇంత ఉద్రేకపడుతున్నాడా? కాదు ఏదో జరిగి వుంటుంది! ఏం జరుగుతుంది. ఆ అరణ్యంలో? నిజంగానే మతి భ్రమించిందేమో? మూర్తి ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు.
    శర్మకు ఆలోచించే శక్తికూడా లేదు. భార్యా పిల్లలు కళ్ళలో మెదులుతున్నారు.
    "పిచ్చిగానీ ఎక్కలేదుకదా?" అన్నట్టు మూర్తి తల దగ్గిర వేలుతిప్పి సైగచేశాడు. శర్మకు ఏమీ కన్పించడం లేదు.
    జీప్ ఘాట్ రోడ్డు దిగింది. మూర్తీ, శర్మ రిలీఫ్ గా నిట్టూర్చారు.
    జీప్ జగన్నాథం ఇంటిముందు ఆగింది. జగన్నాథం ఇంటిముందు జనం గుమిగూడి వున్నారు. జనాన్ని చూసి ప్రశ్నార్ధకంగా ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు. జగన్నాథం ముఖం వెలవెల బోతూంది.
    జగన్నాథం ఆత్రంగా జీపు దూకి ఉసిగా ఇంట్లోకి నడిచాడు. వరండాలో ఎదురైన ఫ్యామిలీ డాక్టర్ని అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు.
    "జగన్నాథంగారూ..." ఏదో చెప్పబోయి ఆగి, జగన్నాథం భుజం తట్టి, తలవంచుకుని ముందుకు సాగిపోయాడు డాక్టరు.
    జగన్నాథం గుండెలు దడదడలాడాయి. ఏమయింది? డాక్టరు ఎందుకు అలా వెళ్ళిపోయాడు? తన పాపానికి ప్రాయశ్చితం ఏ రూపంలో ఎదురు కాబోతుంది? స్థాణువులా రెక్క పట్టుకొని మూర్తి లోపలకు నడిపించుకుపోయాడు.
    జగన్నాథం భార్య లక్ష్మి శవం చాప మీద ఉంది. ఐదేళ్ళ రవి తల్లి శవంమీద పడి ఏడుస్తున్నాడు. పక్కగా వున్న స్త్రీలు పిల్లవాడ్ని తల్లి మీదనుంచి లాగి ఊరడించటానికి ప్రయత్నిస్తున్నారు. జగన్నాథం చూస్తూ నిల్చున్నాడు. శరీరం పట్టుతప్పుతూంది. కళ్ళు తిరిగి తూలిపోతున్న జగన్నాధాన్ని మూర్తీ, శర్మ పట్టుకున్నారు.
    "ఇక్కడ ఇంత దారుణం జరగటం వల్లనే జగన్నాథం అలా ఉద్రేకంగా, పిచ్చి పట్టిన వాడిలా అయిపోయాడు. ఇన్ ట్యూషన్ అంటారు దీన్నే" అన్నాడు శర్మ. మూర్తి మాట్లాడలేదు.
    "పాపం! భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా వుండేవారు" అన్నది ఓ ఇల్లాలు కళ్ళు ఒత్తుకుంటూ.
    "ఏమైంది?" మూర్తి పక్కగా నిలబడ్డ స్త్రీని ప్రశ్నించాడు.
    "ఏమో బాబు! నిన్న సాయంత్రం వాకిట్లో నిలబడి వుంది. నాతో మాట్లాడింది కూడా. ఇంతలోనే ఇంత ముంచుకొస్తుందని ఎవరనుకుంటారు?" ఎదురింటావిడ ముక్కు చీదేస్తూ అన్నది.
    "రాత్రి పొద్దుపోయిన తర్వాత గుండెలో నొప్పిగా వుందన్నదట అప్పన్నతో. అప్పన్నే డాక్టరుకి ఫోన్ చేశాడట. పాపం డాక్టరుగారు కూడా రాత్రంగా ఇక్కడే ఉన్నారు."
    "భర్త రాత్రంతా ఇంట్లో లేడటగా?"
    "ఆయనకు వేట పిచ్చి, నెలకు సగంరోజులు అడవుల్లోనే ఉంటాడు. కానీ పాపం ఆవిడ పల్లెత్తుమాట అనేది కాదు."
    చుట్టూ స్త్రీల కంఠాలు వినిపిస్తున్నాయి.
    జగన్నాథం భార్య ముఖంలోకి చూస్తూ తల దగ్గర కూర్చున్నాడు. "నన్ను క్షమించు లక్ష్మీ!" తనలో తనే అనుకున్నాడు.
    కళ్ళ ముందు రాధాదేవి కనిపించింది. ఆమె ధీనంగా భర్తకు ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటున్నట్టు వినిపించింది.
    తను పాపి! ఒక నిండు ప్రాణం కళ్ళముందు పోతూ వుంటే రక్షించగలిగి వుండికూడా చూస్తూ ఊరుకున్నాడు. కౄరంగా నవ్వాడు. పిశాచిలా ఆనందించాడు. రాధ భర్తను తను చంపాడు. తన పాపం తనను వెంటనే శిక్షించింది. తన భార్యను చంపి, పసివాడ్ని తల్లిలేని వాడ్నిగా చేసి, భగవంతుడు తను చేసిన పాపానికి వడ్డీతో సహా శిక్ష విధించాడు. రాధ తనలో జీవం పోసుకుంటున్న బిడ్డకోసమయినా తండ్రిని రక్షించమని ప్రాధేయపడింది. కానీ తనేం చేశాడు, వికటంగా నవ్వాడు. అందుకే తన బిడ్డకు తల్లి దూరమైంది.
    జగన్నాథం కుమిలి కుమిలి ఏడ్వసాగాడు. మూర్తీ, శర్మా జగన్నాధానికి చెరోపక్క కూర్చుని ఓదార్చసాగారు.

                                              3

    జగన్నాథం భార్య పోయిన దుఃఖంతో క్రుంగిపోతున్నాడు. ముఖం పీక్కుపోయి, కళ్ళు లోతుకుపోయి ఒక్కసారిగా పదేళ్ళు పెద్దవాడై పోయినట్టు కన్పిస్తున్నాడు. ఒకవైపు తల్లి లేని రవిని చూస్తూ తను చేసిన పాపాన్ని పదేపదే వల్లించుకుంటూ కుమిలిపోతున్నాడు.
    తను పాపం చేశాడు. చాలా కౄరంగా ప్రవర్తించాడు. రాధ ఒకప్పుడు తన ప్రాణంకంటే మిన్నగా ప్రేమించిన రాధ, తన కాళ్ళమీద పడి పసుపు కుంకుమ నిలబెట్టమని ప్రాధేయపడింది. కానీ తనేం చేశాడు. తను మనిషిలా ప్రవర్తించాడా? నిజమయిన ప్రేమ ద్వేషంగా పరిణమిస్తుందా? ప్రేమించడం తెలిసిన హృదయానికి ద్వేషించడం తెలియదంటారే? తన రక్తంలో ఇంత ద్వేషం దాగి ఉందా?
    "నాన్నా ! అమ్మ ! అమ్మ కావాలి" ఏడుస్తూ కాళ్ళకు చుట్టుకున్నాడు రవి.
    జగన్నాథం గుండె చెరువయింది. వంగి రవిని ఎత్తుకుని వెంకటేశ్వరస్వామి ఫొటో ముందుకెళ్ళి నిలబడ్డాడు.
    "స్వామీ! నేను చేసిన పాపానికి ఈ నోరులేని పసివాడ్ని శిక్షిస్తున్నావా? నేను దుర్మార్గుడ్ని, పాపిని. కానీ నాకంటే కూడా నువ్వు దుర్మార్గుడివి. పసివాడ్ని తల్లికి దూరం చేశావు. నీకిదేం సరదా ! మంచివాళ్ళను శిక్షిస్తావు. అమాయకుల్ని ఏడిపిస్తావు?
    మూర్తి జగన్నాథం భుజంమీద చేయి వేశాడు. ఆ స్పర్శలోని ఆత్మీయతకు జగన్నాథం చలించిపోయాడు. మౌనంగా, అసహాయంగా అతని ముఖంలోకి చూశాడు.
    "ఏమిటి జగన్నాథం! ఈ రూపం ఏమిటి? మరీ నువ్వు ఇంతగా క్రుంగిపోతే ఎలా? ఆ పసివాడి ముఖం చూసినా ధైర్యం తెచ్చుకోవాలి" మందలింపుగా అన్నాడు మూర్తి.

 Previous Page Next Page