Previous Page Next Page 

నిర్భయ్ నగర్ కాలనీ పేజి 3


    "పోతే పోనీండి సార్! గవర్నర్ ప్రారంభోత్సవం కంటే ఎక్కువా ఒక ఆర్డినరీ సిటిజన్ ప్రాణం?"
    అప్పుడే చంద్రకాంత్ భార్య మళ్ళీ బాధగా అరవడం మొదలుపెట్టింది ఆటోలోంచి.
    "బాబ్బాబు మమ్మల్ని రోడ్డు దాటనీయండి సార్! హాస్పిటల్ వరకూ చేరుకున్నాక ఇక్కడిలా ఆపేయడం భావ్యం కాదు" బ్రతిమాలాడు శాయిరామ్.
    "అరె! చెపుతూంటే నీక్కాదయ్యా! మిమ్మల్ని వదిలానంటే నా ఉద్యోగం పోతుంది?"
    "చూడండి! ఆపదలో ఉన్న గర్భవతి ప్రాణం ముఖ్యమా, మీ ఉద్యోగం ముఖ్యమా మీకు?"
    అతను ఓ క్షణం ఆలోచించాడు.
    "నా ఉద్యోగమే ముఖ్యం" అన్నాడు వెంటనే. "రెండు లక్షలు పెట్టి కొనుక్కున్నానిది" అందరం ఉలిక్కిపడ్డాం.
    యాదగిరి మోపెడ్ దిగి దగ్గరకు వచ్చాడు.
    "పోనీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్దాం భాయ్! పాపం ఆమెకు నొప్పులు బడాయించి పోయినయ్" అన్నాడు ఆదుర్దాగా.
    "ఇక్కడెక్కడుంది నర్సింగ్ హోమ్?" అడిగాను నేను.
    "ఆ రెండో స్ట్రీట్ లో ఉంది. వెనక్కుపోదాం పదండ్రి ఈ గవర్నర్ ఎప్పటికొచ్చేనో ఏమో?"
    అందరం ఆటో తీసుకుని వెనక్కు తిరిగాం.
    చంద్రకాంత్ వాళ్ళావిడ బాధ చూడలేక తనూ ఏడ్చేస్తున్నాడు.
    తీరా నర్సింగ్ హోమ్ ఇవతల చౌరస్తా దగ్గరకొచ్చేసరికి మళ్ళీ పోలీసులు చాలామంది రోడ్డుకి అడ్డంగా నిలబడి కనిపించారు.
    "ఏయ్! ఆటో! రోకో- ఉధర్ రాస్తా బంద్ హై" అరిచాడు ఓ కానిస్టేబుల్.
    మా గుండెల్లో రాళ్ళు పడినయ్.
    "రాస్తా ఎందుకు బంద్ వుంది?"
    "గణేష్ నిమజ్జనం ప్రొసెషన్ వెళుతోంది- డైవర్షన్ లెఫ్ట్ కి వెళ్ళిపోండి" అరిచాడు ఓ ఇన్ స్పెక్టర్.
    "కానీ మేము రైట్ కి తిరిగి ఆ నర్సింగ్ హోమ్ కెళ్ళాల్సార్. చాలా అర్జెంట్! డెలివరీ కేస్" ఆత్రుతగా చెప్పాడు రంగారెడ్డి.
    "లెఫ్ట్ కెళ్ళి తిరిగిరండి! కమాన్! ఛలో" మామాట వినిపించుకోకుండా అరిచాడు.
    "కానీ లెఫ్ట్ కెళితే ఎక్కడికెళతాం సార్? మళ్ళీ కాచిగూడా అంతా తిరిగిరావాలి కదా?"
    "ఏయ్! పోతారా లేదా?" లాఠీ తీసుకొస్తూ అరిచాడు ఇంకో కానిస్టేబుల్. చేసేదిలేక అందరం లెఫ్ట్ తిరిగిపోయాం.
    ఆ సందు ఎక్కడికెళుతుందో ఎవరికీ తెలీదు.
    చాలాసేపు ఆ సందులో వెళ్ళాక ఆటో కాచిగూడా చేరుకుంది.
    అక్కడినుంచీ ఎక్కడికెళ్ళాలో ఎవరికీ అర్థంకాలేదు.
    "పోనీ కింగ్ కోఠీలో ఇంకో హాస్పిటల్ వుంది అక్కడికెళదాం" అన్నాడు గోపాల్రావ్.
    "దానికెలా వెళ్ళాలి?"
    "తిన్నగా వెళ్ళడానికి వీల్లేదు వన్ వే!" అన్నాడు ఆటో డ్రైవర్.
    "అయితే నారాయణ్ గూడా మీదుగా వెళదాం" అన్నాడు జనార్ధన్.
    ఊరేగింపు మళ్ళీ నారాయణ్ గూడావేపు మళ్ళింది.
    హఠాత్తుగా అక్కడ మళ్ళీ పోలీసులు అడ్డం నిలబడి కనిపించారు. మాకు కోపం ఆగడం లేదు.
    "బహుశా ఇలా భార్యను డెలివరీ కోసం హాస్పిటల్ కి తీసుకెళడానికి ప్రయత్నించినవాళ్ళే నగ్జలైట్స్ గా మారిపోయి వుంటారు" అన్నాడు రంగారెడ్డి కసిగా.
    "ఇటు వెళ్ళడానికి వీల్లేదు!" అరిచాడు కానిస్టేబుల్.
    "ఏం? ఎందుకని?"
    "వెస్టిండీస్- ఇండియా క్రికెట్ మాచ్ కదయ్యా! ఆ మాత్రం తెలీదా? ట్రాఫిక్ డైవర్షన్"
    "అవతల ఆడమనిషి పురిటినొప్పులతో బాధపడుతోందయ్యా! అర్జంటుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. మీకేమాత్రం మానవత్వం లేదా? ఇటు వెళ్ళనివ్వండి మమ్మల్ని" కోపంగా అన్నాడు గోపాల్రావ్.
    కానిస్టేబుల్ వినిపించుకోకుండా లాఠీతో మా ఆటో మీద కొట్టాడు.
    "ఛల్ జల్దీ ఛలో" అంటూ అరిచేసరికి ఆటో డ్రైవర్ గాబరాపడి ఆటోని యూనివర్సిటీ రోడ్డువేపు తిప్పేశాడు.
    "పోనీ తార్నాకా మీద నుంచీ సికింద్రాబాద్ వెళ్ళి గాంధీ హాస్పిటల్లో చేర్పిద్దాం" అన్నాడు చంద్రకాంత్.
    అప్పటికే అతని భార్య బాధతో స్పృహతప్పేట్లు కనబడుతోంది. ఆయాసంతో ఒగరుస్తూ అరవడానికి కూడా శక్తి చాలనట్లు వుంది.
    తీరా తార్నాక వెళ్ళేసరికి మళ్ళీ పోలీసులు.
    "ఆగండి! రోకో! ఠైరో" అంటూ అరుపులు, విజిల్స్.
    "ఏమిటి మళ్ళీ? మీరున్నది జనాన్ని నరకయాతన పెట్టడానికా? ట్రాఫిక్ ఆగకుండా స్మూత్ గా నడిచేట్లు చూడ్డానికా? మీకేమయినా బుద్ధుందా అసలు? అవతల ఆడకూతురు పురిటి నొప్పులతో బాధపడుతోందయ్యా అంటే ఒక్కనాకొడుకూ వినిపించుకోరేం?" అంటూ ఎలుగెత్తి అరిచాడు రంగారెడ్డి.
    ఆ కేకలతో ఆగిపోయిన జనం మావేపు తిరిగారు. చంద్రకాంత్ భార్య అప్పటికే స్పృహతప్పింది.
    "సార్! నా భార్య ప్రాణం పోయేట్లుంది సార్! ఇంక జన్మలో అంధ్రప్రదేశ్ లో పిల్లల్ని కననని ప్రామిస్ చేస్తున్నాను సార్! ఈ ఒక్కసారికి క్షమించి మా ఆవిడను రక్షించండి సార్!" అంటూ ఏడ్చేస్తూ పోలీస్ ఇన్ స్పెక్టర్ కాళ్ళమీదపడ్డాడతను.
    ఇన్ స్పెక్టర్ కి మా అందరినీ చూసి జాలివేసినట్టుంది "ఇదిగో చూడండి బ్రదర్! మేమేమీ చేయలేని నిస్సహాయస్థితిలో వున్నాం! రోజూ ఈ టైమ్ కి మన ముఖ్యమంత్రిగారు 'విశ్వామిత్ర' షూటింగ్ కి వెళతారని తెలుసుకదా! తెలిసి కూడా ఈ రోడ్డుకెందుకొచ్చారు? ఆయన స్టూడియో కెళ్ళేవరకూ ట్రాఫిక్ ని వదలడం కుదరదు."
    "పోనీ ఈ ఆటో ఒక్కటి వదిలేయండి సార్- ప్రమాద స్థితిలో ఉన్నారంటున్నారు కదా?" పక్కనున్నతను సలహా ఇవ్వబోయాడు.
    "ఏయ్! నీ సంగతి నువ్వు చూసుకో! అర్ధమయిందా? ఈ ఆటోని వదిలామంటే అంతా ప్రమాదస్థితి అంటూ వెళ్ళిపోతారు. మొన్నిట్లనే ఓ యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకు దెబ్బలు తగిలినయ్యని వాడెక్కిన ఆటోని హాస్పిటల్ కి విడిస్తే ఏమయింది? ఆటో వీల్ విరిగి రోడ్డు మధ్యలో పడిపోయింది. ఆటోవాడూ, యాక్సిడెంట్ కి గురయి దెబ్బలు తగిలినవాడూ ఇద్దరూ చచ్చారు. దాంతో 'విశ్వామిత్ర' షూటింగ్ అరనిమిషం లేటయిపోయింది. ఎంత దారుణమో చూడండి."
    చంద్రకాంత్ కి పిచ్చెక్కిపోయినట్టయింది.
    హఠాత్తుగా కానిస్టేబుల్ చేతిలోని లాఠీ లాక్కుని పెద్దగా అరుస్తూ పోలీసుల మీదకు దూకాడు.
    "అరేయ్- నా భార్య చావు బ్రతుకుల్లో వుందిరా! నీయమ్మ- ప్రారంభోత్సవాలూ, క్రికెట్లూ, దేవుడి ఊరేగింపులూ, సినిమా షూటింగ్ లూ- కొడకల్లారా- ముందు మనిషిని బ్రతికించండ్రా బాడ్ కవ్ సాలే!"
    పోలీసులందరూ కలసి చంద్రకాంత్ ని పట్టుకుని వానులో వేసేవారు. ఇద్దరు కానిస్టేబుల్స్ చంద్రకాంత్ ని కదలకుండా మీదెక్కి కూర్చున్నారు.
    మరో అయిదు నిమిషాల తర్వాత పోలీస్ సైరనుతో జీపూ, దాని వెనక మేనక కారూ, దాని వెనక విశ్వామిత్ర కారూ, దాని వెనక తెలుగుదేశం పార్టీకారూ అన్నీ వెళ్ళిపోయినయ్.
    మేము ఆటో తీసుకుని గాంధీ హాస్పిటల్ వేపు బయలుదేరాం. ఆటో డ్రైవర్ చాలా వేగంగా నడపసాగాడు.
    ఆటో కొద్దిదూరం వెళ్ళిందో, లేదో హఠాత్తుగా స్పీడ్ బ్రేకర్ అడ్డువచ్చింది. దాంతో బ్రేకింగ్ డిస్టెన్స్ చాలకపోవడం వల్ల ఆటో ఎగిరిపడింది.
    మరుక్షణంలో "కేర్" మంటూ పాపాయి ఏడుపు వినిపించింది.
    ఆటో డ్రైవర్ ఆటో ఆపి ఆనందంగా మా దగ్గరకొచ్చాడు.
    "నాకు తెల్సుసార్! ఇదే స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎనిమిది మంది ఆటోలోనే డెలివరీ అయ్యారు. ఇది స్పెషల్ స్పీడ్ బ్రేకర్ సార్! ఎంత నెమ్మదిగా వెళ్ళినా నాలుగడుగులు పైకెగిరి పడేట్లు డిజైన్ చేయించింది మన స్టేట్ గవర్నమెంట్!"
    మా ఆవిడ ఆటోలోనుంచి తొంగి చూసింది.
    "ఏవండోయ్- ఆడపిల్ల" అంది నవ్వుతూ! "ఆటో వెనక్కు తిప్పమనండి! ఇంటికెళ్ళిపోదాం!"
    ఆటో వెనక్కు పంపించి నేనూ, రంగారెడ్డి, యాదగిరి పోలీస్ స్టేషన్ కి బయలుదేరాం- చంద్రకాంత్ ని విడిపించి తీసుకురావడానికి.

                              *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS