Previous Page Next Page 

రామాయణము పేజి 2

    వైదేహి భూమికకు వన్నెలు దిద్దిన వాల్మీకియే 'మంధర శూర్పనఖల పాత్రలను సృష్టించినాడు. రామాయణ కధావాహినికి మలుపులు తెచ్చిన ఈ స్త్రీ పాత్రలు రెండునూ - దుష్టపాత్రలను కారణమున పాఠకుల ప్రశంసలకు పాత్రములు కాకపోవు. తల్లి తన సంతానమును పోషించునపుడు శిష్టులనియూ దుష్టులనియూ భేదభావముతో నుండక వారినందరినీ ఒకేరీతిని సాకును. అట్లే మహాకవి తన కావ్యములోని పాత్రలను పోషించుటలో సమానమగు శ్రద్దనే చూపును. చిన భూమిక యందునూ పెద్దదానియందునూ, నీచ పాత్రయందునూ ఉదాత్తమైన దాని యందునూ తన అసమాన శిల్పచాతురిని ప్రదర్సించును. రామాయణమును శ్రద్దాసక్తులతో పరిశీలించిన వారికి ఈ సత్యము వెల్లడియగును. ఇది ఆది కావ్యమైననూ మహాకావ్యము. కాళిదాది మహాకవులు ప్రశంసించిన కావ్యము. ఆదికవి వాల్మీకి, పిదప కాలపు కవులకు స్తవనీయుడై వంద్యుడయ్యెను.   
    'వాల్మీకి' యన్నది మారుపేరు; తల్లిదండ్రులు ఉద్దేశించిన నామము కాదు. అతని నామధేయమేదియో తెలియదు కాని 'ప్రచేతసుడు' అను మునీంద్రుని పుత్రుడైన ఆతడు 'ప్రాచేతసుడు' అని కూడా పిలువబడెను....అతడు తండ్రి వద్ద నేర్వదగిన విద్యనభ్యసించి పై చదువులకై వేరొక గురుకులమునకు పోయినాడు. కొన్నేండ్లపాటు అక్కడ వసించి అధ్యయనమును ముగించుకొని ప్రతిభావంతుడై తిరిగివచ్చుచూ మార్గమధ్యమందలి అడవిని చొరబడి పోవుచుండగా సూర్యాస్తమయమగు చుండెను. అతడు సంధ్యవార్చుటకై ప్రక్కనున్న నదిని ప్రవేశించెను. అందున్న మొసలి యొకటి ఆతని పాదమునుపట్టుకొని లోనికీడ్చుకొని పోవుచుండ ఆ యువకుని ఆక్రందనమును ఆ అరణ్యాధిపతియైన నిషాదుని కుమార్తె విన్నది. ఆమె పరుగెత్తి వచ్చి తన బాణముతో మకరమును కొట్టి చంపి ముని కుమారుని ఒడ్డునకు చేర్చెను. చీకటులలుముకొన్నవి. తీవ్రముగా గాయపడిన వానినచ్చట ఒంటరిగా వదలిపోయినచో వాడు క్రూరమృగముల వాతబడుట తధ్యమన్న యోచన వచ్చి ఆ దయార్ద్ర హృదయ వాని గాయమునకు చికిత్స చేసి ఆ రాత్రి యంతయు వానికి రక్షణగా అచటనే ఉండిపోయినది.   
    మరునాటి ఉదయమున సపరివారుడై కుమార్తెనన్వేషించుచూ వచ్చిన నిషాద నాయకుడు పరపురుషుని సాన్నిధ్యమున నున్న ఆమెను చూచెను. ఒక యువతి ఒక రాత్రి యంతయూ ఒక పరాయి వాని వద్ద నున్నచో ఆమె శీలము శంకించబడును. వాడామెను భార్యగా గ్రహించుట కొప్పుకొన్నచో కులము వారామెను కలుపుకొందురు. కాని వాడందుల కంగీకరించని పక్షమున వారామె నేరమునకు మరణశిక్ష విధింతురు! ఆ నిషాద నాయకుడు తన కుమార్తె చెప్పినది విని విశ్వసించెను కాని ఆమె నిరపరాధియని తాను తీర్పు చెప్పినచో, కులములోని తన వ్యతిరేకులు కులపెద్ద తన పుత్రికయన్న పక్షపాతబుద్దితో ప్రవర్తించినాడని అభాండము వేయుదురు! సంకటస్థితిలో చిక్కుకొనిన ఆ నాయకుడు రాజుగా తన విధిని నిర్వహించుటకే నిశ్చయించుకొన్నాడు. ప్రాచేతసునకు తమ సాంప్రదాయమును విశదీకరించి "ఈమెను పెండ్లిచేసికొన్న సరేసరి. లేకున్నచో ఈమెకు మరణదండన విధించెను" అన్నాడు.
   
    ప్రాచేతనుడు "నాకు మేలుతలపెట్టిన ఈ కరుణామయికి మరణశిక్షయూ!" అని తల్లడిల్లుచూ "ఈమెను నేను వివాహమాడెదను" అన్నాడు. నిషాదపుత్రి నిర్ఘాంతపోయినది... "అయ్యా, నీవు బ్రాహ్మణుడవు. నేను బోయదానిని. ఆచార వ్యవహారములలో, ఆహార విహారములలో భేదము గల మనకు పరిణయమా? ఈ మనువు వలన మనకిరువురకును ఇబ్బందియే. నేను ప్రాణముల గోల్పోవనున్నానన్న జాలి మూలమున ఈ అకార్యమునకు సిద్దపడవలదు. నేను నీకొనర్చగలిగిన మేలు వలన నా జన్మము ధన్యమైనది. ఇంక నేను మరణించిన మాత్రమేమి? ఇప్పుడు కానున్న ఎప్పటికైననూ చావు తప్పనిదే కదా. నీవు వృథా త్యాగమున కొడిగట్టకుము" అని వారించబోయినది. ప్రాచేతసుడు "ఇందు త్యాగమేమున్నది? నేను హృదయపూర్వకముగానే స్వీకరించుచున్నాను" అని చెప్పి ఆమె పాణిగ్రహణము చేసినాడు....తన భార్యయగుట వలన ఆమెకే ఇబ్బందియు కలుగకుండా అతడామెఅలవాట్లను అభ్యసించి వేటగాడై ప్రతి దినమును ఆమెకు మాంసమును లభ్యపరిచినాడు.   
    ఏండ్లు గడిచినవి. ఒకనాడు నారద మహర్షి ఆ యడవిని బడిపోవుచూ ప్రాచేతసుని జూచి గుర్తుపట్టుట తటస్థించినది. "ఏ మైతివో తెలియక నీ తండ్రి ప్రచేతసుడు నీకై కలవరించుచు చనిపోయినాడు. నీకీ ఆటవిక వేషముల వచ్చినది?" అని నారదుడడుగగా ప్రాచేతసుడు జరిగినదంతయూ వివరించినాడు. నారదుడు "ఐనదేదో ఐనది సన్యాసమును స్వీకరించుటకు నీ భార్య అనుమతిని పొందిరమ్ము. నీకు దీక్ష నొసగి తారక మంత్రముపదేశించెదను. తపస్సు చేయుదువుగాని" అన్నాడు.   
    ప్రాచేతసుడు నారదుడు చెప్పిన ప్రకారము అమోఘమగు తపస్సును చేసినాడు. స్థాణువు వలె నిశ్చలుడై పెక్కు వత్సరములు భగవద్ద్యాన నిమగ్నుడై ఉండిపోయి ఆతని తొడలు నిండ చీమలు మట్టిచేర్చి పుట్టలు పెట్టినవి. ఆవల్మీకములతో మరుగుపడిన దేహము కల ఆ మహనీయునకు 'వాల్మీకి' యన్న పేరు వచ్చినది. తపస్సు వలన ఆతని బుద్ది వికసించినది. చిననాడు నేర్చిన విద్యలన్నియు మెదడున మెలగినవి. అంతకుముందాతడు బోయవృత్తి నవలంబించి తెచ్చిపెట్టుకున్న కాఠిన్యము పోయి ఆ సత్వగుణ సంపన్నుని హృదయము తిరిగి కరుణారసపూరితమైనది. ఆ మునిసింహుడు తమసా నదీ తీరమున ఆశ్రమమును నిర్మించుకొని, శిష్యులైన భరద్వాజాది ఋషి కుమారులకు విద్యల గరపుచుండెను.   
    ఆ దశయందా మహర్షికి వేదోక్తమగు ధర్మమును వివరించుటకొక కావ్యమును రచించవలెనన్న సంకల్పము కలిగెను. తన కావ్య నాయకునకు తగిన సుగుణములకు నిర్ణయించుకొని, ఆ గుణములు కల వాడెవ్వడైన నున్నాడాయని నారద మునీంద్రునడిగెను. నారదుడు దశరథాత్మజుడగు రాములు సకల సద్గుణ  సంపన్నుడనియూ, ఆతడు లోక కంటకుడూ, కామ మోహితుడూ, పరదారాసక్తుడూ ఐన రావణుని వధించుటకై భూమి నవతరించిన నారాయణుడనియూ, సీత లక్ష్మీదేవియే యనియూ "పౌలస్త్య వధానంతరమిప్పుడు రాముడు సీతతో గూడి అయోధ్య నిలుచున్నాడనియూ తెలిపి అంతవరకునూ జరిగిన రామ కథను వాల్మీకికి వివరించినాడు. అనంతరమొకనాడు వాల్మీకికి రాముని అనంతకాల గుణములనూ, దివ్యచరిత్రమునూ మననము చేసికొనుచూ- భరద్వాజుడు వెంట రాగా- స్నానార్ధము తమసానదికి పోవుచుండెను. వేటగాడొకడు చెట్టు కొమ్మపై నున్న క్రౌంచ మిథునములోని మగపిట్టను కొట్టి నేలకు రాల్చినాడు. ఆ దృశ్యమూ, ఆడుపిట్ట ఆక్రందనమూ వాల్మీకి హృదయమును కలచివేసినవి. అతడు "కిరాతుడా, కామ మోహితమైయున్న క్రౌంచ మిథునములోని మగపక్షిని చంపివేసితిని! నీవింక ఎంతో కాలము బ్రతుకరాదు!" అని శపించెను. శోకము ప్రేరేపించిన ఆ శాపవాక్యము పాదబద్దమై అక్షర సమమై తంత్రీలయ సమన్వితమై శ్లోకమైనది!   
    "మానిషాద ప్రతిష్టాంత్వ మగమ శ్శాశ్వతీః సమ
    యత్క్రౌంచ మిథునా దేకమవధీః కామమోహి"   
    అను నా శ్లోకమును ఏకసంథాగ్రాహితుడైన భరద్వాజుడు విని గానము చేసెను. అప్పుడు వాల్మీకికా శ్లోకమున వేరొక యర్ధము స్పురించినది. 'మానిషాదౌ' అను సంబోధన మా+నిషాదః = లక్ష్మీ నిలయముగా కలవాడా (శ్రీనివాసా) అన్న పిలుపుగా తోచినది. 'క్రౌంచి' అనగా వక్రగతి కలది, విశ్రవశుని భార్య కైకసి; ఆమె కుమారుడు క్రౌంచుడు; రావణుడు 'కామ మోహితం' అనుటలో పరదారాసక్తుడగు రావణుని స్వభావము వ్యంగ్యమైనది. 'రావణుని సంహరించిన శ్రీమన్నారాయణా, నీవు శాశ్వతముగా నుందువు కాక!'....కిరాతునకు శాపమైన ఆ శ్లోకమే మంగళ శాసనమై వాల్మీకిని కావ్యరచనకు ప్రేరేపించినది!
           ఇచ్చట ఆశ్రమమున కావ్యరచన ప్రారంభము కాగా అయోధ్యా నగరమున పామరుడుడొకడు తన భార్య శీలమును శకించి ఆమెను వదలివేసెను. ఆమె నేలుకొమ్మని చెప్పవచ్చిన కుల పెద్దలతో వాడు "నేను దానినొల్లను; పరుని యింటనున్న సీతను తెచ్చుకొన్న మన రాజు రాముని వంటి వెఱ్ఱివాడను కాను నేను!"  అనెను. ఆ వార్తను చారుల వలన విన్న రాఘవుడు "జానికి లంకాపురిలో అగ్నిపరీక్షకు లోనై తన సచ్చీలమును రుజువు చేసిననూ ఇచ్చటి ప్రజలా సంగతి తెలియక ఆమెను తోడైచ్చిన నన్ను నీతిపథమునకు విరుద్ధముగా ప్రవర్తించితి ననుకొనుచున్నారు. రాజు నీతి ననుసరించిన చాలదు; వజ్రలాతని నీతిని శకించుకుండునట్లు ప్రవర్తించవలెను" అని తలపోసినవాడు. గర్భవతియైన వైదేహి అంతకు తొలిరోజుననే నాథునితో "అడవి యందలి మునివత్నులతో మరల కొంతకాలము గడిపి రావలెని యున్నద" ను కోర్కెను వెలిబుచ్చిన రాముడా వ్యాజమున ఆమెను అడవిలో విడిచి రమ్మని లక్ష్మణుని ఆజ్ఞాపించెను.

      ఆమె రథములో పోవుచూ భర్త తన ముద్దును చెల్లించినాదనుకొన్నదే కాని రాజధర్మము నెరవేర్చుటకాతడు తన్ను పరిజ్యజించెనన్న విషయము నామె గ్రహించలేకపోయినది! ఆమెను విడిచి శోకార్తుడై రథముతో అయోధ్యకు తిరిగిపోవుచున్న సౌమిత్ర వలన సంగతి తెలుసుకుని  ఆమె పరితపించినది. నిస్పృహతో ప్రాణత్యాగము చేయబోయిన ఆ చూలాలు : వాల్మీకి మహర్షి కంటబడుట తటస్థించి, ఆ దయార్ధ్ర హృదయుడామె ప్రయత్నమును వారించి ఆమెను తన యాశ్రమమునకు తీసికొనిపోయెను. శోకమూర్తియైన మైథిలి సాన్నిధ్యము కావ్యరచన చేయుచున్న ముని హృదయుమున కారుణ్యము పొంగిపోరలుతున్నట్లు చేసినది; అతడు ముగించిన రామయణము నవరస భరితమును కరుణరస ప్రదానమై వన్నెకెక్కినది.
      జానకి ప్రసవించిన కవలలు కుశలవులు వాల్మీకి ఆశ్రమమున దినదిన ప్రవర్ధమానులై పెరిగినారు. ఆ మహా మేధావులు ఈ ఋషి పుంగవుని వద్ద అన్ని విద్యలను నేర్చినారు; గానశాస్ర రహస్యములను తెలిసికొన్నారు.; రామాయణమును కంఠస్థము చేసి, గంధర్వుల వలె పాడుచు నాడుచు వాడవాడలకు పోయి  వినిపించినారు. వాల్మీకి కృషి ఫలించినది. రామాయణము మనోహర కావ్యముగా ప్రసిద్ధికెక్కినది.   
    వాల్మీకి యను కోకిల కవితయను శాఖనారోహించి ఆలపించిన గానము రామాయణ కావ్యము. ఇందలి  కవనము ద్రాక్షా పాకమును నంతరించుకొని మధురుముగా నుండును. ఇందలి ఇతివృత్తము రామలక్ష్మణ భరత హనుమద్విభీషణ విశ్వామిత్రాది మహపురుషుల చరిత్రములతో నిండియుండి పితృభక్తీ, పితృవాక్య పరిపాలనమూ, స్వామికార్య నిర్వహణ తత్పరత్వమూ, పరమార్దాన్వేషణ పరాయణత్వమూ మున్నగు సద్గుణములను వివరించుచు పాఠక లోకమునకు నన్మార్గము చూపును కణ ఈ కావ్యమెల్లరకును పఠనీయము.   
    రామాయణము ప్రాచ్య పాశ్చాత్య దేశీయుల ప్రధాన బాషలన్నింటిలోనూ యథాతథముగనో సంక్ష్లిప్తముగనో తిరిగి చేప్పబడినది. అంధ్రమున నే కావ్యమును  గోపినాథుని వెంకట కవియూ, వావిలికొలను సుబ్బరాయ కవియూ యథాతథముగనూ, భాస్కర కవి సంక్ష్పిప్తముగనూ రచించిరి. మొల్ల యను కవియిత్ర రామాయణమున తెనుగున ప్రపంధ రూపమున అందించినది. రంగనాథ రామాయణము తెనుగున వెలసిన ద్విదిద రచన. ఇంకనూ ఎందరో మహానుభావులు రామాయణమును వద్యకావ్యముగను గద్యరూపముగను తెనిగించినారు.   
    రామాయణ కథాసారమును అందరకునూ అర్ధమగు రీతిలో సంగ్రహముగా అందజేయవలెనన్న లక్ష్యముతో నేనీ పుస్తకమును శిష్టవ్యావహారికభాషలో రచించినాను. ఇరువది నాలుగువేల శ్లోకములు గల రామాయణ మహాకావ్యము నందలి సోగసులను ఈ చిన్న పుస్తకమున వివరించుట సాధ్యము కాదు.  కావ్యముతో పరిచయమును కలిగించుటకీ పుస్తకము తోడ్పడగలదని విశ్వసించుచున్నాను.
                                                                                    -   పాలంకి వెంకట రామచంద్రమూర్తి.

 Previous Page Next Page