Previous Page Next Page 

కావేరి పేజి 2

    కావేరీలోని తృష్ణను గమనించి ప్రోత్సహించి మరీ నటింపచేశారు. డ్రాయింగ్ మాస్టారు. ఆయనకీ ఓ చిన్న కెమెరా వున్నది. కావేరీని అనేక భంగిమలలో ఫోటోలు తీశాడు.

    "నా ఫోటోలు తీశారుకదా! ఎప్పుడిస్తారు మాస్టారూ?" అనడిగింది ఒక రోజున.

    "నువ్వు మా యింటికి ఎప్పుడువస్తే అప్పుడు యిస్తాను!" అనేవాడు.

    అది జరిగి రెండు నెలలు అయ్యింది. యింటికివెళ్ళి ఫోటోలు తెచ్చుకోవాలని వున్నా వీలుపడటంలేదు. తాను ఎక్కడికయినా వెళితే సుబ్బులు చెప్పుతుందేమోనన్న భయం.

    తాను యిప్పుడు స్కూలు మానివేస్తే తన ఫోటోలు రావేమోనన్న భయం! ముందు చూపుగా ఏడ్చిమొత్తుకుని సత్యాగ్రహం చేసి తిండి మానితే అప్పటికీ లొంగిరాలేదు.

    ఆఖరికి వినాయకరావుకి ఈ విషయం తెలిసి మేనమామకి అత్తకీ నచ్చచెప్పే ప్రయత్నంలో వచ్చాడు.

    వయస్సుకి చిన్నవాడయినా వినాయకరావంటే పరంధామయ్యకి సుభద్రమ్మకి ఎంతో యిష్టం?.....తనకి అవసరంలేని వాటి విషయాలలో జోక్యం చేసుకునేవాడు కాదు! కష్టపడి వ్యవసాయం చేయటమే కాక మనిషి పొందికా, మాట పొందికాకల మనిషి. పరంధామయ్యకి మేనల్లుడే కాదు; కాబోయే అల్లుడు. కావేరీకి భర్తగా కావేరీ పుట్టిన రోజునే నిర్ణయించేశారు.....వినాయకరావు కంటే పెద్దబ్బాయి వున్నాడు. అతగాడు యింకా చదువుతున్నాడు. అతని చదువు అయినా తరువాత పెళ్ళి. అతని పెళ్ళి అయితేగానీ కావేరీకి, వినాయకరావుకీ పెళ్ళి చేయరు. పెద్దమనిషి అయింది యిప్పుడే కాబట్టి రెండు సంవత్సరాలయినా ఆగవచ్చు! అని కూడా అనుకున్నారు. కేవలం చదువుమీద వున్న భ్రాంతివలననే కావేరి యింతగా పట్టుబడుతున్నదని అనుకున్నాడు గాని కావేరి మనసులో యిన్ని విషయాలు వున్నాయని తెలియవు. అందుకే మేనమామని వప్పించాలని వచ్చాడు.

    "కావేరిని చదువుకోనివ్వండి మామయ్యా!....నాకెలాగూ అంతగా చదవటానికి అవకాశం లేకపోయింది. తనయినా చదువుకుంటే ఉత్తరం వ్రాయాలన్నా చిట్టా ఆవర్జాలు వ్రాయటానికయినా ఉపయోగ పడుతుందిగా?...." అన్నాడు.

    "నువ్వు కూడా కావేరిని వెనుకవేసుకు వస్తున్నావట్రా??" అనడిగాడు పరంధామయ్య.

    "కావేరీ చదువుకుంటే యింట్లో విషయాలన్నీ నా ప్రమేయం లేకుండా చూసుకోగలదు!" అన్నాడు.

    వినాయకరావు అలా అంటుంటే కావేరీ ఎంతో సంతోషపడింది. ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు.

    తనలాంటి అందగత్తె పేరుకి తగ్గట్లుగా పొట్టిగా లావు అనిపించేటట్టుగాను; ఛామనఛాయతో వుండేవాడు
వ్యవసాయం జేయటంతో మరింత నల్లగా వున్నట్టు అనిపించేది కావేరికి! యిలాంటి వాడినా తను చేసుకునేది??....తాను కాబోయే సినిమా హీరోయిన్! తాను చేసుకో బోయిందా ఏమిటి? సినిమా ఛాన్సు కలిగితే తాను మద్రాసు వెళ్ళి పోతుంది! ఎంతో అందగాడిని వలచి వలపించుకొని మరీ పెళ్ళి చేసుకుంటుంది.....అంతేగాని ఈ మోటు మనిషిని చేసుకుంటుందా?? ఛీ! ఛీ!...అయినా తల్లిదండ్రులను వప్పించుతున్నాడు కాబట్టి ప్రస్తుతానికి కాబోయే భార్తగానే అంగీకరించాల్సిందే తాను! బస్తీకి వెళ్ళినప్పుడంతా తనకి సినిమా పుస్తకాలు తెచ్చి పెట్టమంటే తెచ్చిపెడతాడు. పోనీ అందుకయినా పనికివస్తాడు లెమ్మనుకుంది కావేరి తన మనసులోనే!

    వినాయకరావు చెప్పింది ఒక విధంగా ఆలోచించితే సబబుగానే అనిపించింది సుభద్రమ్మకి, యిప్పుడు కాదంటే రేపు తన కూతురిని ఎక్కడ పెళ్ళి చేసుకోనంటాడేమోనని భయం.

    "అలాగే బాబూ!" అంది సుభద్రమ్మ.

    "నువ్వు చెప్పినట్టే చేస్తాను వినాయకం!" అన్నాడు పరంధామయ్య.

    కావేరీకి అమాంతంగా ఎగిరి తాటిచెట్టు మొవ్వలో కూర్చున్నట్టు అనిపించింది.

    బావ ఎంత మంచివాడు! అని కూడా అనుకుంది.

    వినాయకం వెళ్ళిన తరువాత కావేరీకి కొన్ని షరతులు విధించారు తల్లితండ్రులు! అవి కూడా వివరించారు.

    "మగ పిల్లలతో మాట్లాడకూడదు!"

    "అలాగే!..."

    "సినిమాకి వెళ్దామని పీడించవద్దు!"

    "తప్పదుగా??....

    "స్కూలు ఫీజులు తక్కువయితే ఎక్కువచెప్పి తీసుకువెళ్ళి సినిమా పుస్తకాలు కొనకూడదు!..."

    "కొనను!"

    "స్కూలులో వేసే నాటకాలలో నువ్వు వేషం వేయకూడదు! ఎంత బలవంతం చేసినాను!..."

    "వెయ్యను!..."

    అలా అన్నింటికీ అంగీకరించింది కావేరి! అప్పుడు వప్పుకోకపోతే తనను స్కూలుకు పంపరు.

    తను యింకా యింకా ప్రాక్టీస్ చేస్తేను, అదృష్టం కలిసివస్తే తను సినిమా హీరోయిన్ కాగలదు...సినిమాహీరోయిన్ కావాలంటే ఈ పల్లెటూరిలో వుంటే ఏం సాధ్యమవుతుంది? మద్రాసు వెళ్ళి ప్రయత్నించితె తప్పకుండా ఏదో ఒక సినిమాలో హీరోయిన్ ఛాన్సు తగలగలదు. అప్పుడు జయప్రదలా తను ఓ పెద్దమేడ కట్టుకుని వుండవచ్చును. విదేశాలనుంచి రోడ్డంత వెడల్పున్న పెద్ద కారుకొని తెప్పించుకుంటుంది. కారుకి యూనిఫారంలో వుండే డ్రైవర్ ని నియమించుతుంది. ఈ మధ్య సినిమా తారలు తెల్లబొచ్చు కుక్కపిల్లలను పెంచుతూ వాటిని తమతోపాటు కారులో తీసుకుని షూటింగ్ కి రావటం! దానికి అందమయిన పేరు....ఆ...పప్పి....అయితే బాగుంటుంది. ఆ పప్పీని తనతోపాటే వుంచుకుంటుంది....అన్నట్లు  తనకొక సెక్రటరీ కావాలి! మేకప్ మెన్ కావాలి! డ్రస్సులు వెరైటీగా తయారుచేసే టైలర్ కావాలి! ముఖ్యంగా సెక్రటరీ అనవసరపడతాడు. నమ్మకమయిన వ్యక్తిని పెట్టుకోవాలి!....ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది??....ఓ!.....ఎవరో ఎందుకు? వినాయకం బావ లేడూ?....చదువు తక్కువయినా అందరితోనూ ఎంతో మర్యాదగా మాట్లాడతాడు....అంతమాత్రానికే సరిపోతుందా? వినాయకం బావని సెక్రటరీగా వుంచుకోకూడదు....పేరుకు తగ్గట్లుగానే వినాయకుడు గానే వుంటాడు. సెక్రటరీ అంటే ఎంతో అందంగా వుండాలి! కనీసం బి.ఏ. అయినా చదివి వుండాలి!

    వ్యవసాయం తప్ప మరొకటి తెలియదు వినాయకం బావకి! సినిమా పుస్తకాలు అస్సలు చదవడు!

    ఏమీ తెలియనివాడిని పెట్టుకుని ఏం లాభం??....సెక్రటరీ అంటే అన్ని విషయాలు తెలిసి వుండాలి! అందంగా వుండాలి! స్పురద్రూపి కావాలి! కనీసం నాలుగు భాషలయినా తెలిసి వుండాలి!....అలాంటి వ్యక్తిని చూసిపెట్టుకోవల్సిందే! బాధవల్ల ఏమీ అవదు!

    పోనీ తండ్రి వున్నాడూ అంటే ఆయనకీ సంతకం చేయటం కూడా రాదు! ఆరు అంగుళాల చుట్టనొకదాన్ని వెలిగించుకుని ఆ మంచం నడాన కూర్చుని కాల్చుకుంటూ వుంటే చాలు! యింక ఈ లోకంతో పనేమీ వుండదు.

    అక్కా బావా వున్నారంటే వాళ్ళ లోకమేదో వాళ్ళదే! అక్క కంటే బావ చాలా మెరుగు! పండుగకి అత్తవారింటికి వచ్చినప్పుడంతా తనకి ఎన్నెన్నో సినిమా పుస్తకాలు తెచ్చిపెట్టేవాడు.

    "నువ్వు సినిమా హీరోయిన్ వి అయితే నాకేమీ యిస్తావుకావేరీ??" అనడిగేవాడు నవ్వుతూ త్రివిక్రమరావు.

    "ఏది కావాలంటే అదే యిస్తుంది మా చెల్లెలు!....కారు కావాలా? వ్యవసాయం చేసుకునేటందుకు ట్రాక్టర్ కొనివ్వాలా??" తనను చెప్పనివ్వకుండా ముందు పార్వతి అనేసేది!

    "ఛా....ఛా!...నాకు అవెందుకు పారూ!....సినిమా హీరోయిన్ బావగారినయిన ఈ త్రివిక్రమరావుకి సినిమా హీరోయినే కావాలి తెలిసిందా??" అని కొంటెగా కావేరి ముఖంలోకి చూసేవాడు.

    అప్పుడు ఆ మాటలకి అర్ధం తెలిసేదికాదు కావేరీకి! అదేదో పెద్ద జోకు వేసినట్లుగా భావించి మురిసిపోయేది.

    "మా చెల్లెలు హీరోయిన్ అయితే మనం మద్రాసు వెళ్ళి తన దగ్గిరే వుందాం. దాని మంచిచెడులు చూసుకునే బాధ్యత మనదే కదండీ? అప్పుడు ఈ హీరోయిన్ మనది కాక యింకెవరిది అవుతుంది??" అనేది అక్క ఎంతో ఉత్సాహంగా.

    "అవునవును! కనిపెట్టుకునే వుండాలి! లేకపోతే కావేరీని వదిలి వేస్తామా ఏమిటి??..." అని కావేరీ వైపుకి గుచ్చి గుచ్చి చూచేవాడు.

    బావగారు అలా చూస్తుంటే కావేరి ఎంతో సిగ్గుపడిపోయేది! పండుగకు వచ్చినప్పుడు అలా తనను హాస్యమాడటంతో కావేరి తనువు యింత ఎత్తున పొంగిపోయేది. తను సినిమా హీరోయిన్ అయిపోయినట్లుగానే ఊహించుకుని ఎంతో సంతృప్తిగా వాళ్ళున్నన్ని రోజులు గడిపేది.

    తను కూడా శోభన్ బాబు, కృష్ణలాంటి గొప్ప హీరోల సరసన ఒక్కసారి నటించితే చాలు! తన జన్మ ధన్యమయినట్లే భావించుకుంటుంది.

    జయప్రద, జయసుధ, శోభన్ బాబు అని ఆ చిత్రం జీవితనౌక అని తెలిసినప్పటినుంచీ ఆ సినిమా తప్పకుండా చూడాలన్న కోరిక కలిగింది. తల్లిని బ్రతిమాలి వప్పించేసరికి తలప్రాణం తోకకి వచ్చింది.....ఎలాగయితేనేమి తల్లిని బయలుదేరతీసింది.
           

 Previous Page Next Page