Previous Page Next Page 

తీరం చేరిన నావ పేజి 2


    సరిగా నాలుగ్గంటలయ్యేసరికి శుభ పెళ్ళివారు దిగారు-పెళ్ళికొడుకు, తల్లి, పెళ్ళికొడుకు స్నేహితుడు వచ్చారు. ఫలహారాలు కాఫీలు పూర్తయ్యాయి- పెళ్ళికూతుర్ని తీసుకొచ్చి కూచోపెట్టారు - చూపులు, ప్రశ్నలు, జవాబులు అయ్యాక "అమ్మాయి పాడుతుంది- వీణ వాయిస్తుంది" అంటూ పెళ్ళివారు పాడించమని అడగకుండానే "ఏదమ్మా శుభా పాటపాడి విన్పించు" అన్నాడు ఆదిశేషయ్య- అంతవరకు జరుగుతున్నదంతా కుతూహలంగా కిటికీ దగ్గిర నిలబడి చూస్తూంది వాణి- పెళ్ళికొడుకు పెద్ద బాగులేకపోయినా డబ్బున్నవాడట- చదువూ వుంది, ఉద్యోగమూ వుంది.
    అది లేనివాడ్ని- ఆదిశేషయ్యగారు అసలెలా వప్పుకుంటారు తమ ఏకైక కుమార్తెను యివ్వడానికి.
    శుభ అందగత్తే-నచ్చకేం చేస్తుంది అనుకుంది వాణి-తల్లి ముసలావిడ-కాబోయే కోడల్ని శల్యపరీక్షలు చేస్తూంది-ఆ స్నేహితుడు మాత్రం మంచి ఆజానుబాహువు- చాలా గంభీరంగా వున్నాడు-35, నలభై వుండవచ్చు వయసు-తీక్షణమైన వాడిచూపులతో చుట్టూ అంతా గమనిస్తున్నాడు. "వాణమ్మా- వీణ తీసుకొస్తావూ" ఆదిశేషయ్యగారి పిలుపు విని వాణి చటుక్కున వీణ తీసుకొచ్చి శృతి చేయసాగింది.
    "ఈ అమ్మాయెవరు?" ముసలావిడ ఆరాతీసింది "మా శుభ సంగీతం మేష్టరమ్మ- పాట పాడిస్తుందని రమ్మన్నాను-" అన్నారు ఆదిశేషయ్య-వాణి, శుభ కల్సి పాడుతూంటే పెళ్ళికొడుకు శ్రద్దగానే విన్నాడు- తల్లి బాగా పాడావమ్మాయీ' అంటూ శుభని కాక వాణిని మెచ్చుకుంది- ఆ స్నేహితుడు వాణిని పట్టిపట్టి వాడిచూపులు చూశాడు- వీణ కిందపెడ్తూ తలెత్తిన వాణి చూపులు అతని చూపులతోకల్సి తడబడి చూపు మరల్చుకుంది- తన పనిపూర్తయినట్టు వాణిలేచి లోపలికి వెళ్ళింది- ఆమెవెడ్తూంటే అతని కళ్ళు ఆమెనే పరీక్షగా చూడడం గమనించి వాణి మొహం చిట్లించింది.
    
                                   *    *    *    *
    
    పదిహేనురోజుల తర్వాత ఉదయం పదిగంటలకి రెండు సంగీత పాఠాలు చెప్పి యింటికొచ్చింది వాణి-"ఒసే వాణీ-ఆదిశేషయ్య గారెందుకో నిన్ను అర్జంటుగా రమ్మని రెండుసార్లు మనిషిని పంపారే" అంది సత్యవతమ్మ- నీవు లేవంటే రాగానే పంపమని కబురు చేశారు- అన్నంతిని వెళ్ళు" వాణి మళ్ళీ చెప్పులు తొడుక్కుని "వచ్చి తింటాలే, ఏమిటో ఆ అర్జంటు పని చూసి రానీ" అంది.
    డ్రాయింగు రూములో గుమ్మానికి ఎదురుగా కూర్చున్న ఆదిశేషయ్యగారు వాణిని చూసి "రా అమ్మాయీ నీకోసం రెండుసార్లు కబురుచేశాను" అన్నారు- వినయంగా నమస్కారంచేసి లోపలికి వచ్చింది. ఆయనతో పాటు ఆ గదిలో ఆనాడు పెళ్ళిచూపులలో చూసిన అతని స్నేహితుడిని చూసి కాస్త ఆశ్చర్యపోయింది- అతని చూపులో తీక్షణతకి తనని పట్టి పట్టి చూడడం గమనించి తడబడ్తూ- "ఎందుకండీ రమ్మన్నారుట" అడిగింది.
    "ఏం లేదు యీయన్ని చూశావుగా ఆరోజు మా శుభపెళ్ళి చూపులలో, యీయన పేరు రాజారావుగారు, ఆయన నీతో ఏదోమాట్లాడుతారుట" వాణి అర్ధంకానట్టు రాజారావు వంక ఆశ్చర్యంగా చూసింది. రాజారావు గొంతు సవరించుకొంటూ చిన్న గాదగ్గ మొహం కాస్త ప్రసన్నంగా మార్చి "మీకు అభ్యంతరం లేకపోతే మీతో ఒక సంగతి చెప్పాలని వచ్చాను. ఓఅరగంట అలా నాతో కారులో వస్తారా" అన్నాడు. వాణి తెల్లపోతూ చూసింది.
    "వెళ్ళమ్మాయీ-అతను మాకాబోయే అల్లుడికి స్నేహితుడు. నీ వదృష్టవంతురాలివి. సందేహించకుండా వెళ్ళు" న్నారు ఆదిశేషయ్య నవ్వుతూ.
    ఆదిశేషయ్యగారి ముసిముసి నవ్వు చూడగానే వాణికి కోపంతో పాటు సిగ్గూ కలిగింది. మొహం ఎర్రబడింది.
    వెళ్ళమ్మా ఫరవాలేదు" ఆదిశేషయ్య లేచి నుంచున్నాడు. వాణి యింకేం చెప్పలేక గుమ్మంవైపు అడుగువేసింది అప్పటికే కారు డోరు తెరచిపట్టుకుని వాణి కోసం అసహనంగా ఎదురుచూస్తున్న అతను వాణి దగ్గిరికి రాగానే "ఊ-ఎక్కండి" అన్నాడు ముందు సీటు చూపి-వాణి బిగించి పడ్తూనే ఎక్కింది. అతను అటుతిరిగి డ్రైవింగ్ సీటులో కూర్చుని కారు పోనిచ్చాడు. కారెక్కడం వాణికి అదే ప్రథమం-అందులో అంత పెద్దకారు-మెత్తని కుషన్స్, రాజారావు డ్రైవుచేస్తూ రెండు నిమిషాలు ఏం మాట్లాడలేదు. తరువాత ఒకసారి మెడతిప్పి వాణి వంక చూశాడు. "చూడు-నిన్ను ఆ రోజు పెళ్ళిచూపుల్లో చూశాక నిన్ను నేను వివాహం ఆడాలనిపించింది నీ కిష్టమయితే అభ్యంతరం లేకపోతే పెళ్ళి చేసుకుంటాను" సూటిగా ఒక్కమాటలో చెప్పేశాడు. వాణి దిమ్మెర పోయింది. ఆ మాటలు అర్ధం కానట్టు వెర్రిదానిలా అతనివంక చూసింది. అతను అది గమనించి కాస్తనవ్వాడు. ఇంత నిర్మొహమాటంగా నిన్నే యిలా అడిగానని ఏమీ అనుకోకు నాకు నాన్పుడు గిట్టదు. వ్యవహారం యిటోఅటో వెంటనే తేల్చుకోవాలని వుంటుంది. నీకు అంగీకారం అంటే అప్పుడు మీ అమ్మగారికి చెప్పచ్చు" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS