Previous Page Next Page 

కాదేదీ కథకనర్హం పేజి 2

 

            సబ్బుబిళ్ళ
    
    పెద్దోళ్ళ ఆశలు, కోరికలు ఆకాశాన్నంటే వయినా
    ఇట్టే తీరుతాయి - తీర్చుకుంటారు!
    చిన్నోళ్ళవి చిరు కోరికలయినా - వాటిని
    పరిస్థితులు తారుమారు చేస్తాయి -
    దేవుడూ గారడీ చేసేస్తాడు!
             ఇదే సబ్బుబిళ్ళ గారడీ కధ!
    సబ్బుబిళ్ళ! ఘుమఘుమ లాడ్తూ కోవాబిళ్ళ రంగులో , కోడిగుడ్డు ఆకారంలో వుండే సబ్బుబిళ్ళ అంటే పదమూడేళ్ళ రత్తికి ఎంతో ఇష్టం! అమ్మగారు స్నానం చేసి వచ్చాక, బట్టలు తీసుకొచ్చేనెపంతో వెంటనే బాత్ రూంలో దూరి ఆ వాసన ఆఘ్రాణించడం రత్తి దినచర్యలో ఒక ఘట్టం - 'స్నానం చేశాక బాత్ రూమంతా ఎంతలా ఘుమఘుమ లాడ్తుంది! తెల్లటి అమ్మగారు మల్లెపూవులా, తెల్లబియ్యం అన్నంలా మరింత మెరిసిపోతారు ఆ సబ్బు తోము కున్నాక' అనుకుంటుంది రత్తి.  దగ్గర నించి వెడుతుంటేనే ఘుమఘుమ లాడిపోతారు . దేముడి గదిలో కర్పూరం, గంధం అగరవత్తులు కలిసిన ఏదో సువాసనలా ఆ సబ్బు వాసన రత్తిని ఏదో మత్తులో ముంచుతుంది. అలాంటి సబ్బుతో ఒకసారి ఒళ్ళు తోముకుని స్నానం చేయాలని రత్తి కున్న ఏకైక కోరిక! ఆశ! కొనాలంటే రెండు రూపాయల పైనుంటదని అమ్మగారు చెప్పింది.'గంజికేనేదు , రెండు రూపాయ లెట్టి సబ్బు కొనాలంటే గుంటనంజా' అంటూ తల్లి తిట్టింది, రత్తి ఏకైక కోరిక వినగానే, తరువాత చాలా రోజులు రత్తి అలిగి, సాధించి, ఏడ్చి, ఆఖరికి తల్లిని సబ్బు కొనడానికి వప్పించింది. కానీ తీరా తల్లి కొని తీసుకొచ్చిన సబ్బు చూసే సరికి మరింత ఏడుపు ముంచుకు వచ్చింది రత్తికి. ఎర్రగా, మందువాసన వేస్తూ కంపు కొట్టిన సబ్బు చూసి విసిరేసింది. "నీ అమ్మ కడుపుడక, సబ్బుబిళ్ళ అని గీ పెట్టి నావుకదా అని తెస్తే ఏం మాయదారి రాగమే!' తిట్టింది తల్లి. "ఛీ పాడువాసన , ఇదేటి నే నడిగినాను' కయ్యిమంది రత్తి. 'సబ్బంటే అదొకటే నేంటి, అదేందో అమ్మగారి నడిగి సోప్పక నా మీద ఇరుసుకు పడతావు. సావునంజా ' తిట్టింది తల్లి. వ్రతం చెడ్డా ఫలం దక్కనందుకు రత్తి మనసులో బాధ సబ్బు కొనాలనే కోరికని మరింత పెంచింది.
    బాత్ రూంలో ఆ సబ్బుబిళ్ళ రత్తి మనసుని చెదరగోడ్తుంది. నీలి రంగు సబ్బు పెట్టిలో ఆ సగం అరిగిన సబ్బు బిళ్ళ తీసుకోవాలన్న కోరికని రత్తి అదుపులో పెట్టుకోలేకపోతోంది. అటు ఇటు చూసింది. 'అమ్మగారు బెడ్ రూంలో ఉంది. పిల్లలు స్కూలుకి , అయ్యగారు ఆఫీసుకి వెళ్ళారు. యింకెవరు చూస్తారు? సబ్బేదంటే ఏమయిందని అమ్మగారు కేకేస్తే ఏం చెప్పాలి? ముందుకి వెళ్ళబోయిన చెయ్యి వెనక్కి లాక్కుంది రత్తాలు. అమ్మగారికి తెలిస్తే బతకనియ్యదు. తన్ని తగిలేస్తుంది! హాయిగా కడుపునిండా తినే అవకాశముండదు. తల్లికి దొంగతనం చేసినట్టు తెలిస్తే బతకనియ్యదు. 'దొంగతనం చెయ్యలేదు అమ్మగారిచ్చింది' అని అడిగితె చెప్పొచ్చు తల్లికి - వచ్చిన చిక్కల్లా అమ్మగారే ఖరాఖండి మనిషి. ఏమాత్రం తప్పున్నా క్షమించదు. అయ్యగారు దేవుడు గాని, అమ్మగారు అమ్మో అనుకుంది రత్తి. అమ్మగారినడిగితే ఇస్తుందా? సగం అరిగిపోయిందని చెపితే? ఎలుకలు ఎత్తుకు పోయాయంటే? ఆ ఆలోచనకు రత్తి మనసు గెంతింది. ఆ... అలా చెబితే సరి. అమ్మగారికి ఎలుకలు ఎత్తుకు పోయాయన్న నమ్మకం కలిగించాలి. అటు ఇటు చూసి రత్తి ఆ సబ్బుబిళ్ళ తూము కాడ పడేసింది. సాయంత్రం ముఖం కడుక్కోడానికి వెళ్ళిన అమ్మగారు రత్తి నడిగింది. రత్తి, అటు, ఇటు వెతికి 'ఇదోనండమ్మా తూము కాడ పడింది. ఎలకలు ఈడ్చి పడేసినాయి గామోలు....." అంది అమాయకంగా, 'పాడు ఎలకలు పట్టపగలే ఈడ్చుకు వెళ్ళాయి, క్రింద వదిలెయకుండా పైన పెట్టు ' అంటూ ఆర్డరిచ్చింది . రత్తికి ఉపాయం దొరికిపోయింది.
    ఒకరోజు టైమిచ్చి మూడో రోజు ప్లానును అమల్లో పెట్టింది రత్తి. అమ్మగారు తలంటుకుంది - బాత్ రూములో కూడా తుడవడానికి యింకాస్త సేపు పడ్తుంది - యిదే మంచి అవకాశం - వణుకుతున్న చేతుల్తో చటుక్కున సబ్బు తీసి రోంటిని దోపుకుని వోణీ సరింగా వేసుకుంది ఏం ఎరగనట్టు బట్టలుతకసాగింది బయట -
    సాయంత్రానికి గాని ఉరమదనుకున్న ఆకాశం ఉరుమేలేదు! ఏకంగా పిడుగులు కురిపించింది - 'రత్తీ!' బాత్ రూంలోంచి అమ్మగారు రంకె వేసినట్టు అరిచింది. కొంప మునిగిపోయినట్టుగా. రత్తి గుండాగిపోయింది. అమ్మగారు ఇప్పుడెందుకు బాత్ రూంకి వెళ్ళినట్టు .....అదురుతున్న గుండెలతో , వణుకుతున్న కాళ్ళతో వెళ్ళింది రత్తి." 'ఇక్కడ నా ముక్కు పుడక పెట్టాను ఏదే?!' అని కలకర పడుతూ అరిచింది. 'ముక్కు పుడకా?' రత్తి తెల్ల మొఖం వేసింది. సబ్బు బిళ్ళీది అన్న ప్రశ్నకి బదులు, ఎదురు చూడని ఆ ప్రశ్నకి జవాబు , రత్తి అలోచించనే లేదు. వెర్రి ముఖంతో 'నాను సూడలేదమ్మ గారూ ' అంది బితుకు బితుకు చూస్తూ. 'చూడక పోవడం ఏమిటి? తలంటి పోసుకుంటూ తీసి ఈ గూట్లోనే పెట్టాను. చీర కట్టుకొచ్చే సరికి లేదు! గది కదిగావు , నీవు తప్ప ఇంకెవరు వచ్చారు' ఈ రెండు నిమిషాలలో అనుమానంగా చూస్తూ తీక్షణంగా నిలేసింది. రత్తి కాళ్ళలో వణుకు ఎక్కువైంది. భయంతో వళ్ళు చెమట పట్టింది- 'నిజంగా నాను సూడనే లేదమ్మా-' ఏడుపు గొంతుతో అంది.
    'మళ్ళీ అదేమాట - యీ రెండు నిమిషాలలో ఏ దొంగలువచ్చి పట్టుకు పోయారు? నిజం చెప్పు తీసావా - దొంగతనం కూడా నేర్చుకుంటూన్నావా - అదేం మామూలు ముక్కు పుడక అనుకుంటున్నావా/ రవ్వలరాయి ముక్కుపుడక, రాయే ఐదువందలు తెలుసా - చెప్పు / తీసావా ఎక్కడ పెట్టావు తీయి' అంది హుంకరిస్తూ.
    'సత్తే పమాణకంగా నాను సూడనేదు, తియ్యలేదు.....ఇక్కడేక్కడో పడి పోయుంటుంది ....'బిక్క మొహం వేసింది.
    "గూట్లో పెట్టింది కిందకి ఎలా వస్తుంది? పోనీ వెతుకు . ఊ....వెతికి తీయి ....అన్నట్టు యిక్కడ సబ్బేది?' ఏదయితే అడగకూడదని దేముడ్ని ప్రార్ధించిందో ఆ ప్రశ్న రానే వచ్చింది. రత్తి తడబడ్తో "తెలీదమ్మా..... ఎలకయీడ్చుకు పోయుంటుంది' పాలిపోయిన మొహం, ఆ కళ్ళలో బెదురు అమ్మగారికి పట్టించేసాయి. అనుమానంగా చూస్తూ 'తెలీదూ ....నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. దొంగముండా, ఈ దొంగతనాలు ఎప్పటి నించి అరంభించావు? తీయి! ఆ పరికిణీ దులుపు - ఆ జాకట్టు విప్పు ' అంటూ, పరికిణీ కుచ్చేళ్ళు పట్టుకు లాగిందావిడ.
    ఆనాడు ద్రౌపది వస్త్రాపహరణం నాడు నిండు సభలో నిస్సహాయంగా సిగ్గు, అవమానాలతో కుంచించుకు పోయి నిలబడి నట్టు రత్తి వణుకుతూ నిల్చుంది. దొడ్డున దోపిన సబ్బుబిళ్ళ కింద పడగానే నిండు సభలో మానభంగం జరిగిపోయినట్టు అయిపొయింది రత్తి పని. నల్లబడ్డ మొహంతో, సిగ్గుతో , అవమానంతో భయంతో అమ్మగారి మొహం చూడలేక తల దించుకుంది రత్తి.
    అమ్మగారి ముఖం చూసుంటే - సబ్బుబిళ్ళ వంక ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె చూపులతో రత్తి చూపులు కలిస్తే - రత్తి అంతకంటే ఆశ్చర్యపడేది! ఆ సబ్బుకి అంటుకొని వుంది - వంటి వజ్రపు పొడి ముక్కుపుడక!!
    తరువాత ఎంత భాగోతం జరగాలో అంతా జరిగింది. అమ్మగారు - 'గుండెలు తీసిన బంటని ' గుండెలు బాదుకుంది. ఎంత అడిగినా తెలీదని భోరుమన్న రత్తి చేత నిజం చెప్పించలేని ఆశక్తతకి కోపం వచ్చి రత్తిని బాదింది. రత్తి తల్లికి కబురెళ్ళీ అది వచ్చి, మరి రెండు బాదులు బాదింది కూతుర్ని. ఎందరడిగినా - సబ్బు తీసానని వప్పుకుంది కాని, ముక్కుపుడక సంగతి తెలీదు , మహాప్రభో అంటూ ఏడ్చింది - దాని మాటలు ఎవరూ నమ్మలేదు - ఓపికున్నంత వరకు తిట్టి, మళ్ళీ గడప తోక్కద్దంటూ తరిమేసింది అమ్మగారు.
    'రత్తి ముక్కుపుడక తీయలేదని చెప్పగలిగిన భగవంతుడూ నోరుమూసుకున్నాడు - అమ్మగారు స్నానం చేస్తూ సబ్బంటించుకుని ? కళ్ళు మూసుకుని సబ్బు బిళ్ళ పెట్టెలో బదులు- గూట్లో పెట్టిందని, గూట్లో వున్న ముక్కుపుడక తడి సబ్బు బిళ్ళని అంటుకుందని, కళ్ళు తెరిచి మళ్ళీ సబ్బుబిళ్ళ పెట్టెలో పెట్టేసిందని , ముక్కుపుడక సబ్బుబిళ్ళ కి అంటుకోడం - పెట్టిన అమ్మగారికీ, తీసిన రత్తికీ తెలీదని చెప్పలేని ఆ సబ్బుబిళ్ళని దుమ్మూ ధూళి కడుక్కుందుకు కక్కూర్తి పడి తీస్తే - మరింత దుమ్ము ధూళి (కళంకం) మాత్రం కొట్టగలిగింది ఆ సబ్బు బిళ్ళ!

                                                                                          (స్నేహ సౌజన్యంతో )  *** 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS