Next Page 

నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 1


                                   న వ్వితే నవ్ రత్నాలు -1

                                                        మల్లిక్ 

                                                               

                                   మైకు పిచ్చోళ్ళు అను గ్రాండ్ ఫంక్షన్ కథ

 సర్వకళా సమితి సంస్థని స్థాపించి సంవత్సరం కావొస్తుంది. అందుచేత ఆ సంస్థ సభ్యులు సంస్థ  వార్షికోత్సవాన్నిజరపాలని నిశ్చయించుకున్నారు. వార్షికోత్సవానికి ఇంకా రెండు వారాల టైముంది . ఫంక్షన్ ఎలా చెయ్యాలన్న విషయం గురించి మీటింగ్ పెట్టుకున్నారు  సంస్థ సభ్యులు.
     "మన సంస్థ  వార్షికోత్సవాన్ని ఇంత వరకూ ఏసంస్థా జరపనంత  గ్రాండ్ గా జరపాలి !..."అన్నాడు సెక్రటరీ చిదానందం.
  "అవును ....ఫంక్షన్ కి వచ్చినోళ్ళు అద్దిరిపడాలి !" అన్నాడు ప్రెసిడెంట్ అప్పారావు .
  "అట్టాగైతే'సౌండ్ అండ్ డబల్ సౌండ్ 'అనే మైకుల కంపెనీ వాడు నాకు తెల్సు . వాడికి చెప్తే మాంచి మైకులు, స్పీకర్లు ఓ డజనేసి తెస్తాడు..ఆ సౌండ్ కి జనాలు అడిరిపడ్తారు....ఏం?అట్టా  చేద్దామా?"అన్నాడు ఒక మెంబెరు.
  "నీ మొహం మంటెట్టా....జనాల్ని అదరగొట్టడం అంటే సౌండుతో కాదు... మనం మంచి ప్రోగ్రాం ఇచ్చి అదరగొట్టాలన్నమాట ...తెల్సిందా? అన్నాడు చిదానందం.
    "అట్టాగైతే నేను మద్రాసెళ్ళి సినీస్టార్... సూపర్ హిరోయిన్ స్టెప్పుమాలిన్ని ఎట్టాగోలా బ్రతిమాలాడి ఒప్పించి మన ఫంక్షన్ కి తీస్కొస్తా.... ఆ బాధ్యత నాది...." అన్నాడు ఇంకో మెంబరు.
    అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు.
    "కార్యక్రమంలో ఒక మంచి నాటకాన్ని ఎన్నుకుని దాన్ని మన మెంబర్లచేత వేయిస్తే బాగుంటుంది" మరో మెంబరు సజెస్ట్ చేశాడు.
    దానికి అందరూ అంగీకరించారు.
    "జంబలకిడి పంబారే...
    నీ అమ్మ అత్తారే
    లపకజిం జిపక జిం పిల్లాదానా
    నిన్ను ప్రేమిస్తే ఏమవుతావ్ బుల్లీదానా" అంటూ హాఠాత్తుగా లేచి గంతులేస్తూ ఒకమెంబరు సినిమాపాట పాడ్డం మొదలుబెట్టాడు.
    చిదానందం, అప్పారావూ, మిగతా మెంబర్లూ కంగారుపదిపోయారు.
    "ఏంటయ్యా ఇది ?... హఠాత్తుగా నీకేమైంది?" అన్నాడు చిదానందం గంతులేస్తున్న మెంబర్ని పట్టి ఆపి.
    ఆ మెంబరు సిగ్గుపడ్తూ చెప్పాడు "కార్యక్రమంలో నా పాటల ప్రోగ్రాం కూడా పెట్టిస్తారనీ...' అంటూ గొణిగాడు.
    "హోర్నీ... దానికింతగా గింజుకు నచ్చిపోవాలటయ్యా?...అలాగే...అలాగే" అభయం ఇచ్చాడు సెక్రట్రీ చిదానందం.
    "ఇంకా ఫంక్షనులో ఏఏ కార్యక్రమాలు ఉండాలంటే ..." ఆలోచిస్తూ అప్పారావు అంటుండగా వెనుకనుండి ఎవరో "మ్యా...వ్ "అన్నారు. మిగతా మెంబర్లంతా ఘొల్లున నవ్వారు.
    "మీటింగ్ ఇలా డిసిప్లిన్ లేకుండా ప్రవర్తిస్తే నేనూర్కొనంతే... ఇంతకీ పిల్లకూతలు అరిచిందెవారు?" మండిపడ్తూ అన్నాడు అప్పారావు.
    "అది కాద్సార్... మరేమో నేను మిమిక్రీ చేస్తాను... ఆ రోజు కార్యక్రమంలో మీరు నాక్కూడా ఛాన్సిస్తారనీ...." బుర్ర గోక్కుంటూ మెల్లగా అన్నాడు వెనుకనుండి లేచి నిలబడ్తూ ఒక మెంబరు.
    "అలాగే... అలాగే... మన మెంబర్లని మనమే ఎంకరేజ్ చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు!... నీ మిమిక్రీ ప్రోగ్రాం కూడా మన సంస్థ వార్షికోత్సవ కార్యక్రమంలో పెడ్డాం" అన్నాడు సెక్రట్రీ!
    ఆ మెంబరు సంతోషంతో భౌభౌ అని మొరిగి కూర్చున్నాడు. అందరూ ఘొల్లున నవ్వారు.
    ఇంకా ఆ కార్యక్రమంలో ఒక భరతనాట్యం ప్రోగ్రాం, ఓ కోయడన్స్ కూడా పెట్టాలని నిర్ణయించారు.
    మరి చీఫ్ గెస్టుగా ఎవరిని పిలవాలి అనే ఆలోచన వచ్చింది.
    "మా బావగారు యమ్మెల్లే...ఆయన ద్వారా కల్చరల్ అఫెయిర్స్ మినిస్టర్ని మన ఫంక్షనుకి చీఫ్ గెస్టుగా రప్పిస్తాను" అన్నాడు ఒక మెంబరు .
    అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు.
    "మంచి మంచి స్పీకర్స్ ని కొంతమందిని పిలిస్తే బాగుంటుంది" ఒక మెంబరు సూచన చేశాడు.
    ప్రెసిడెంటూ,సెక్రట్రీ మిగతా మెంబర్లూ కలిసి స్పీకర్ల లిస్టు తయారుచేశారు. వాళ్ళలో ప్రసిద్ద రచయిత రాకెట్ రాముడు, నవలా రచయిత్రి సిద్దమ్మ, ప్రఖ్యాత కూచిపూడి నర్తకి కుంటి మీనాక్షి, రంగస్థల నటుడు వీరావేశం తదితరులు ఉన్నారు.
    తమ సంస్థ సర్వకళాసమితి ప్రధమ వార్షికోత్సవంలో ప్రసంగించడానికి పైన అనుకున్న స్పీకర్లనందర్నీ కలిస్తే ప్రసంగించడానికి అందరూ ఒప్పుకున్నారు ఒక్క రచయిత రాకెట్ రాముడు తప్ప.
    "మీరు కవయిత్రి హింసశ్రీని కూడా పిలిస్తేనే నేనూ వస్తాను..." అని కండిషను పెట్టాడు రాకెట్ రాముడు.
    "అలాగే... మా సభలకి ప్రముఖ రచయిత్రి హింసశ్రీకూడా వస్తున్నారంటే అది మాకు ఆనందమే కదా?.." సంబరంగా అన్నారు చిదానందం, అప్పారావులు.
    ఆ తర్వాత అక్కడి నుండి కవయిత్రి హింసశ్రీ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే ఆమె మెలికలు తిరుగుతూ సరేనంది.
    సంస్థ కార్యకర్తలందరూ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు.
    మొత్తానికి తమది గ్రాండ్ ఫంక్షను కావడంలో సందేహంలేదు.
    ఫంక్షను వీనులవిందుగా కనులవిందుగా ఉండడం కోసం వారు స్టేజిమీద ప్రదర్శించబోయే కార్యక్రమాల్ని రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మాని రిహార్సల్సు చేశారు ఆ రెండు వారాలు. మొత్తానికి ఒక చక్కని కార్యక్రమం రూపొందించారు చెదనందం, అప్పారావులు.
    అన్ని రోజుల నుండీ ఎదురుచూస్తున్న దినం రానే వచ్చింది.
    హాలంతా జనంతో కిటకిటలాడ్తుంది.అవును మరి... సినీ నటి స్టెప్పుమాలిని కూడా వచ్చింది కదా!!...
    చీఫ్ గెస్ట్ కల్చరల్ అఫెయిర్స్ మినిస్టర్ మారయ్యతో సహా స్పికర్లందరూ వచ్చేశారు.
    మొదట మీటింగ్, ఆ తర్వత  కల్చరల్ ప్రోగ్రాం!!
    ఆరుగంటలకు మీటింగ్ మొదలయింది.
    మొదట మినిస్టర్ మారయ్య మాట్లాడాడు.
    "అయ్యా...అమ్మా... పిల్లలూ,పీచులూ నమస్కారం... మీరు నన్నీ సభకి చీఫ్ గెస్టుగా ఆహ్వానించడం నాకెంతో సంతోషంగా ఉంది... మీక్కూడా సంతోషంగా ఉంటుందని నేను భావిస్తా ఉండాను... నేనీవేళ ఈ పదవిలో ఉన్నానంటే కారణం మీరే... మీరు లేకుండా నేను లేనే లేను..."
    హాలంతా చప్పట్లతో మారుమోగి పోయింది.
    "కానీ నేను బాగుండడం చూడలేక ప్రతిపక్షం పార్టీవాళ్ళు చాలా కూస్తున్నారు... అలా కూసేవాళ్లని తంతే ఒకడు నెల్లూరులో, ఒకడు అనంతపూర్లో,ఒకడు రాజమండ్రిలో పడ్తారు..." అలా ఆవేశంగా ఒక అరగంట మాట్లాడి "కాబట్టి నా ప్రజలారా... నేను చెప్పేదేమిటంటే చిన్నప్పుడు నేను వినాయక చవితి పందిళ్ళలో నాటకాలు వేస్తుంటే నేను తెరలాగేపని చేసేవాడిని... కల్చరల్ ప్రోగ్రాంలంటే అంత ఇంటరెస్టు ఉంది కనుకనే నేనీ సభకి వచ్చాను. ఇలాంటి కల్చరల్ అసోసియేషన్ లు ఇంకా చాలా రావాలని, ప్రముఖుల్ని సన్మానించడం వారి కార్యక్రమాల్లో ఒక భాగంగా పెట్టుకోవాలనీ నేను కోరుతూ ఇంతటితో నా ప్రసంగం ముగిస్తున్నా..."        

Next Page