Next Page 

పిపాసి పేజి 1


                                                           పిపాసి

                                                  -శారదా అశోకవర్ధన్

 

                                           


    గుంటూరు జిల్లాలోని, సత్తెనపల్లి నివాసులు, సాంబశివరావు గారినీ, శ్రీహరిగారినీ కొత్త వాళ్ళెవరైనా చూస్తే అన్నదమ్ములనుకుంటారు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళనుకోరు. సాంబశివరావుగారు భార్య రాజేశ్వరి, శ్రీహరి భార్య సరోజినీ కూడా వొదినా' అంటే వొదినా అని ఎంతో ఆప్యాయంగా వుంటారు.'   


    సాంబశివరావుగారు, ఆవూరి హైస్కూల్లో తెలుగు మాష్టారు. వారి ఏకైక సంతానం మదన్ మోహన్ లేకలేక పుట్టాడు. రాజేశ్వరమ్మకి ముద్దులతో మురిపించే మువ్వగోపాలుడంటే బలే యిష్టం. 'అందుకే తన కొడుక్కి మదన మోహన్' అని పేరు పెట్టుకుంది.


    శ్రీహరి తాలూకా ఆఫీసులో గుమస్తా ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి, పెద్దది రాధిక రెండోది రేణుక బాబు పేరు సుబ్రహ్మణ్యం. రాధికకి ఏడేళ్లు, రేణుకకి అయిదూ. సుబ్రహ్మణ్యానికి మూడేళ్ళు సరోజినికి మళ్ళీ ప్రసవించే రోజులు.     


    మదన్ కి పదేళ్ళు. ఆరో క్లాసు చదువుతున్నాడు. రాధిక మూడో క్లాసు. రేణుకఒకటో తరగతి సుబ్రహ్మణ్యం ఇంకా స్కూలు కెళ్ళడం లేదు.   


    రోజూ పిల్లలందరూ కలిసి సాంబశివరావుగారితోటే వెళతారు స్కూలుకి. స్కూలు నుంచి వచ్చినప్పుటినుంచీ, రాత్రి నిద్దరపోయేదాకా పిల్లలందరూ రాజేశ్వరమ్మ దగ్గరే వుంటారు. ఒక్కొక్కరోజు అక్కడే భోం చేస్తారు.     


    "ఏమిటొదినా ఇదీ" సరోజని అంటే ఏముందీ..... "ఏదో పిల్లలంతా సరదాగా తిన్నారులే. అయినా నువ్వు వట్టి మనిషివి కావు. ఆ చంటిపిల్లాడు సుబ్బుతోటే సతమతమవుతున్నావ్. వీళ్ళందరికీ ఏం చాకిరి చెయ్యగలవు. అందుకని వీళ్ళిద్దరికీ అక్కడ అన్నాలు పెట్టి పంపించేశా." అనేది రాజేశ్వరమ్మ.


    "బాగుందిలే వొదినా ఏనాటిదో ఈ బుణానుబంధం లేకపోతే ఏమిటి?" అనేది సరోజినీ.


    "ఇంతమాత్రానికే బుణానుబంధం ఏమిటొదినా" అయినా ఇద్దరూ గలగలా నవ్వుకునేవారు నిర్మలంగా ప్రవహించేనదిలా.


    "ఏయ్...... రాధీ..... ఈ పిల్లబొమ్మ చూడు ఎంతబాగా గీశానో అనేవాడు మదన్ బొమ్మని రాధికకి చూపిస్తూ.    


    "మీసాలింకా పెద్దగా వుండాలి. నువ్వు చిన్నగా గీశావ్" అంటూ తటపట అడుగులు వేస్తూ కూనిరాగం తీసేది రాధిక. 'ఇంకా అడుగులు స్పీడ్ గా వెయ్యాలి" అనేవాడు మదన్, రాధికని చూసి రాధిక పౌరుషంతో స్పీడుగా అడుగులు వేసేది.


    "ఇంకా"..... "ఇంకా"..... "ఇంకా"..... అనేవాడు మదన్ వుంటే మరింత స్పీడుగా అడుగువెయ్యబోతూ, పరికిణీ అడ్డుపడి గబుక్కున పడిపోయింది. అక్కడున్న ఓరాయి మొన మొకాటి తగిలి, రక్తం వచ్చింది. రాధిక బోరుమని ఏడవటం విని, సరోజనమ్మ రాజేశ్వరమ్మ కూడా పరుగెత్తుకు వచ్చారు బయటికి.


    రక్తాన్ని చూసి గాభరాపడింది సరోజమ్మ. "తిన్నగా ఆడుకోలేదు కదా" అంటూ కేకలేసింది రాజేశ్వరమ్మ, అక్కడ దగ్గర్లోనే వున్న డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళి కట్టు కట్టించింది. మదన్ రేణుక బిక్కుబిక్కుమంటూ చూస్తూ నుంచున్నారు. ఆరాత్రి రాధికకి జ్వరం వొచ్చింది. తెల్లారేటప్పటికి మోకాలు అంతలావు వాచింది. రాధిక నడవలేకపోయింది.  


    "రాదీ...... నామీద కోపమా?" అన్నాడు మదన్ రాధిక దగ్గరికెళ్ళి మంచం దగ్గరగా నుంచుని.


    "ఛీ..... ఎందుకూ?" అంది గలగలా నవ్వుతూ రాధిక.


    "నేనేగా నిన్ను స్పీడుగా అడుగువెయ్యమన్నది."


    "కానీ, తప్పటడుగు వేసింది నేను. అందుకే పడ్డాను. నువ్వేం చేస్తావ్"


    "అయితే నామీద కోపం లేదా!"


    "లేదు ఒట్టు."


    "హమ్మయ్య..... కానీ, నువ్వు స్కూలుకి రావు కదూ?"


    "తగ్గేదాకా ఎలా వొస్తాను?"


    "అబ్బ..... తొందరగా తగ్గిపోతే ఎంచక్కా ఆడుకోవచ్చు."


    "మొత్తానికి రాధిక గాయం మాని మామూలుగా తిరగడానికి పదిహేను రోజులు పట్టింది. పుండు మాని నా మోకాలు మీద రూపాయి కాసంత మచ్చ మిగిలింది. అప్పటినుంచి రాధిక ఎప్పుడు "డ్రస్సు చేస్తున్నాను చూడు" అన్నాడు మదన్'చాలా బాగుంది" అనేవాడు. రాధిక ఎంతో సంతోషించేది. "మదన్..... నీ బొమ్మలు కూడా బాగున్నాయి." అనేది రాధిక. ఆ చిన్నారులు ఒకరిగనతని చూసి ఒకరు మురిసిపోయేవారు.   


    ఆరోజు శివరాత్రి ఈ రెండు కుటుంబాలవారూ మంగళగిరికి బయలుదేరారు తిరణాలకి కొండ మీద కెక్కి పానకాలస్వామి దర్శనం చేసుకున్నారు. ఆ రాత్రి అక్కడే వుండి మర్నాడు బయలుదేరటానికి నిశ్చయించుకున్నారు. రాత్రి అక్కడ మార్కండేయ భాగవతార్ చేత శివపురాణం హరికథా కాలక్షేపం పెద్దపందిరి కింద ఏర్పాటు చేశారు. తొమ్మిదిన్నరకల్లా పందిరి నిండిపోయింది. భాగవతార్ గారు, శివలీలలు సహివునిమహత్యం, గొంతెత్తి శ్రవ్యంగా పాడుతూ, వినిపిస్తూ వుంటే ఒళ్ళు మరచి తన్మయత్వంతో వినసాగారు జనం అంతా పిల్లల్ని ఓ మూలగా పడుకోబెట్టి సరోజినీ శ్రీహరి రాజేశ్వరమ్మ సాంబశివరావుగారూ వారి పక్కనే కూర్చున్నారు. తెల్లవారుఝామున మూడు నాలుగు గంటల మధ్యన కాస్త కునుకు పట్టింది. అందరికీ తమకి తెలియకుండానే ఓ అరగంట అందరూ చిన్న కునుకు తీశాడు. సూర్యోదయపు అరుణకాంతులు మొహానపడడంతో, అందరికీ మెలకువ వొచ్చింది. కాలకృత్యాలు తీర్చుకుని తిరుగు ప్రయాణం కావడానికి మెల్లగా ఒక్కొక్కరు లేచి వెళ్లుతున్నారు. సుబ్రహ్మణ్యాన్ని శ్రీహరి ఎత్తుకున్నాడు. మదన్ నీ రేణుకనీ సాంబశివరావుగారు రెండుచేతులతో ఇటొకర్నీ, అటొకర్నీ నడిపిస్తున్నారు.

Next Page