Next Page 

నిర్భయ్ నగర్ కాలనీ పేజి 1


                                   నిర్భయ్ నగర్ కాలనీ

                                                                          యర్రంశెట్టి శాయి

                                       

                                        ఫ్రీ డెలివరీ

    మా కాలనీ నగరం బయట అఘోరించిందన్న విషయం మీకు తెలుసుకదా! మాదేకాదు. మాలాంటి మిడిల్ క్లాస్ పక్షులందరూ నగరానికి చాలాదూరంగా నెట్టివేయబడడం వల్ల వెలసిన కాలనీలు చాలా వున్నాయ్ మా చుట్టుపక్కల. ఈ కాలనీల్లో వాళ్ళెవరూ సాధారణంగా ఓట్లు వేయరు, వేసినా ప్రతిపక్షానికే వేస్తారు. గనుక ఈ కాలనీల గురించి పట్టించుకునే వారెవరూ ఉండరు.
    ముఖ్యంగా మా నిర్భయ్ నగర్ కాలనీ పరిస్థితి మరీ దారుణం. మంచినీళ్ళ సప్లయ్ ఉండదు. రోడ్ల సంగతి మీకు తెలుసుకదా! లైట్లు సరేసరి! దోపిడీలకు వచ్చే దొంగలు  టార్చ్ లైట్స్ వేస్తేనేగాని రాత్రిళ్ళు కాంతి ఎలా ఉంటుందో తెలీదు. (రోడ్డులాంటి చోట) రాత్రి తొమ్మిది దాటితే బస్ లు కనిపించవ్. ఒకటే ఒక్క బ్యాంక్ వుందిగానీ అది నేషనలైజ్ అయిన దగ్గర్నుంచీ వీలయినంతవరకు కస్టమర్స్ ని చిత్రహింసలు పెట్టి ఎకౌంట్స్ ఎత్తేసుకుని పారిపోయేలా చేస్తోంది. ఎందుకంటే వర్క్ లోడ్ తగ్గించడానికని ఉద్యోగులు అనధికార పూర్వకంగా చెప్పారు.
    ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోజు తెల్లారుజామున నాలుగ్గంటలకు మా ఇంటి తలుపు గట్టిగా కొట్టడం వినిపించి మెలకువ వచ్చింది నాకు. ఛటుక్కున లేచి కూర్చున్నాను. ఒకవేళ దొంగలేమో అని అనుమానం వచ్చింది. కాలండర్ వేపు చూశాను. అవి నెలాఖరు రోజులు గనుక దొంగలయి వుండరని అర్ధమయిపోయింది. (వాళ్ళు సాధారణంగా జీతాలు వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే వచ్చేస్తారు) మా ఆవిడ నిద్రలో "విశ్వామిత్ర విశ్వామిత్ర" అంటూ కలవరిస్తోంది.
    "ఏయ్ లేలే! ఎవరో తలుపు కొడుతున్నారు చూడు!" అంటూ గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడి లేచి గాబరాగా నావేపు చూసింది.
    "ఏవండీ! అన్నగారి విశ్వామిత్రను నిజంగా సుప్రీంకోర్టువాళ్ళు ఆపేశారా?" అంది ఖంగారుగా.
    "నీ మొఖం! అదంతా నీకలగానీ వెళ్ళి తలుపు తియ్ ఎవరో వచ్చారు" అన్నాను సర్దిచెపుతూ. ఆమె అది కల అయినందుకు సంతోషిస్తూ వెళ్ళి తలుపు తెరిచింది. శాయిరామ్ ఆదుర్దాగా లోపలికొచ్చాడు. నాకు వళ్ళు మండిపోయిందతన్ని చూసేసరికి.
    "ఏం బ్రదర్! నీకు రాత్రీ, పగలూ, తెల్లారుజామూ అంటూ తేడా లేమీలేవా?" అన్నాను కోపంగా.
    కానీ శాయిరామ్ మామూలుగానే నన్ను పట్టించుకోలేదు.
    "అర్జంటుగా పద గురూ! మన కాలనీ రైటర్ చంద్రకాంత్ ఛటోపాధ్యాయ భార్యకు నొప్పులొస్తున్నాయట! అర్జంటుగా డెలివరీకి హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి!" అన్నాడు హడావుడిగా.
    నాకు నిద్రమత్తంతా ఎగిరిపోయింది.
    అడపాదడపా ఇలాంటి సంఘటనలు జరగడం మామూలే మా కాలనీలో! అలాంటి సమయాల్లో ఎంత చిత్రవధ అనుభవించాలో కూడా మా అందరికీ అనుభవపూర్వకంగా తెలుసు. ఇంక లాభంలేదని మా ఆవిడతోపాటు చంద్రకాంత్ ఇంటికి చేరుకున్నాను. బయటే రంగారెడ్డి, గోపాల్రావ్, యాదగిరి, జనార్ధన్, డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరి, పార్వతీదేవి అంతా నిలబడి వున్నారు. చంద్రకాంత్ వాళ్ళందరి మధ్యా తప్పుచేసిన వాడిలా తలవంచుకుని నిలబడి వున్నాడు.
    "అది కాదోయ్! మీ ఆవిడ ఏ రోజయినా డెలివరీ అవచ్చని తెలుసుకదా! తెలిసి కూడా ఊరిబయట కాలనీలో వుంచితే ఎలా అనుకున్నావ్? రెండ్రోజులు ముందే ఏదయినా ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఎందుకు చేర్పించలేదు?" కసురుకుంటున్నాడు రంగారెడ్డి.
    "చేర్పిద్దామనుకున్నాను గానీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో అయితే సిజేరియన్ ఆపరేషన్ చేస్తారు కదా! దానికి బోలెడు డబ్బు కట్టాల్సివస్తుందని- ఇంట్లోనే వుంచేశాను" అన్నాడు భయంగా.
    మాకు అతని మాటలు సరిగ్గా అర్థం కాలేదు.
    "ఏమిటి? సిజేరియన్ ఆపరేషన్ చేస్తారా? నీకేం మతిపోలేదు కదా! సిజేరియన్ ఆపరేషన్ ఎందుకు చేస్తారు? ఎవరికయినా డెలివరీ కష్టం అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తారు" అన్నాడు గోపాల్రావ్.
    "అవి పాతరోజులు గురూ! ఇప్పుడు కావాలని ప్రతివాళ్ళకీ సిజేరియన్ చేసేస్తున్నారు"
    "ఎందుకలా?"
    "ఫీజు ఎక్కువ వస్తుందని! మామూలు డెలివరీ అయితే బిల్ ఎక్కువ అవడం లేదని ఈ కొత్తపద్ధతి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పద్ధతి కనిపెట్టాక యిప్పుడు నర్సింగ్ హోంల లాభం తెగపెరిగిపోయిందట."
    మాకేం చేయాలో తెలీలేదు.
    "ఇప్పుడామెని గవర్నమెంట్ హాస్పిటల్ కెలా తీసుకెళ్ళడం?" అడిగాడు గోపాల్రావ్.
    "ఎవర్నయినా ఆటోకి పంపించండి"
    మరుక్షణం జనార్ధన్ ఓ మోపెడ్ మీద ఆటో వేటకు వెళ్ళిపోయాడు. అతను తిరిగివచ్చేసరికి తెల్లారిపోయిందిగానీ ఆటో రాలేదు.
    "ఆటో ఏమయింది?" అడిగాడు రంగారెడ్డి ఆదుర్దాగా.
    "ఆటోలు ఎక్కడా లేవు! ఒకే ఒక్కటి ఎన్.టి.ఆర్.నగర్ దగ్గర వుంది. కానీ డ్రైవర్ ఉదయం ఎనిమిదిగంటలగ్గాని నిద్రలేవడట."
    "మీటర్ మీద అయిదు రూపాయలు ఎక్కువ ఇస్తాననకపోయారా?"
    "వందరూపాయలెక్కువిచ్చినా నిద్ర డిస్టర్బ్ అవనీడట "నేనేం గవర్నమెంట్ సర్వెంట్ ననుకున్నారా?- ఒక టైమూ పాడూ లేకుండా పనిచేయడానికి" అంటూ కసురుకున్నాడు.
    అందరం మొఖాలు చూసుకున్నాం.
    "ఏం చేద్దాం?" అడిగాడు శాయిరామ్.
    నేను టైమ్ చూసుకున్నాను.
    ఏడవుతోంది.
    "ఎనిమిదయితేగానీ ఆటోలు మన కాలనీ వరకూ రావు" అన్నాడు గోపాల్రావ్.
    "అయితే అప్పటివరకూ ఆగుదాం! మనందరం కూడా అప్పటికి మొఖాలు కడుక్కుని రడీ అయిపోవచ్చు" అన్నాడు జనార్ధన్.


Next Page 

WRITERS
PUBLICATIONS