Next Page 

అగ్నిశ్వాస పేజి 1


                                                     అగ్నిశ్వాస

                                                              కొమ్మనాపల్లి గణపతిరావు

 

                         
    ప్రొలోగ్ :


    తుది చూడని అభేద్యాభి సంపాతంలా దట్టంగా ఆవరించిన చీకటి...


    ఫలించని అగ్నివర్షపు నిప్పురవ్వల్లా జ్వలిస్తూ ఆరిపోతున్న మిణుగురుల అపరిపక్వ కలధాతపు వింతలు...


    మంచీ చెడుల నడుమ కంచుగోడలా వ్యాపించిన తార్రోడ్డుపై ఓ రిక్షా చిరుగంటల సవ్వడితో పల్లెవేపు సాగిపోతూంది.


    బాట కిరువైపులా వ్యాపించిన ఎత్తయిన మర్రిచెట్ల తలల్ని ఉరికొయ్యలుగా తలపింపచేస్తూ ఓ తీతువు ఉత్తరంవైపు దూసుకుపోయింది.


    దూరంగా ఏడుకొండల గుండెల్ని తాకి మరలిన ఓ గాలి అల శారదానది చెక్కిల్ని స్పృశించి ఇసుక తిన్నెలపై అరక్షణం ఆగి, రేగి చెట్లవేపు మత్తుగా తూలింది.


    శ్మశానంలో సగం కాలిన చితి పక్కన ఆర్తిగా కూర్చున్న ఓ నక్క ఊళపెడుతూ ఏటిగట్టుకు పరుగుతీసింది.


    సరిగ్గా ఆ సమయంలో...


    మర్రి చెట్ల వెనుక మాటేసిన నాలుగు ఆకారాలు మారణహోమానికి సమయ మాసన్నమైనట్టు సౌంజ్ఞలతో ముందుకు జరిగాయి.


    అక్కడికి సుమారు రెండు ఫర్లాంగుల దూరంలో నెమ్మదిగా వస్తున్న రిక్షాలోని రాఘవ "శశీ నిద్రపోయాడా" అంటూ భార్యవేపు తలతిప్పి చూసేడు.


    మేఘాలను దాటిన చంద్రుడి కాంతులు చెట్ల కొమ్మల్లో నుంచి పొడల్లా మీద పడుతుంటే తనను కావలించుకుని భుజంపై తలపెట్టి పడుకున్న కొడుకు తల నిమురుతూ "మీ పోలికే. కళ్ళు మూసుకున్నాడంటే నిద్రపోతున్నాడో లేకపోతే ఏదో ఆలోచనలో మునిగిపోయాడో చెప్పలేం." అంది పదేళ్ళ శశాంకని మరింత గట్టిగా హత్తుకుంటూ.


    "నిజంగా అన్నాడా లక్ష్మీ" తలతిప్పి చీకటిలోకి చూస్తూ వందోసారి రెట్టిస్తుంటే నవ్వాపుకోలేకపోయింది. "నిజమే లక్ష్మీ! ఫాక్టరీ గొడవలో పడి వాణ్ణి చాలా మిస్సైపోయాను. వాడన్నదాంట్లో తప్పులేదు."


    వీధిలోని తక్కిన పిల్లలు సాయంకాలాలు తల్లిదండ్రుల్తో గడుపుతుంటే ఎప్పుడూ అపరాత్రిగాని ఇంటికి రాని తండ్రి గురించి ఆ ముందురోజే అమాయకంగా అన్నాడు శశాంక "నాన్నకి నేనంటే ఇష్టమేనా అమ్మా" అని...


    "లేదని ఎవరన్నారు?" కొడుకును దగ్గరకు తీసుకుంటూ అడిగింది.


    "జగ్గారావు. మరేమో వాళ్ళ నాన్నకి వాడంటే చాలా ఇష్టమట. అందుకే సినిమాలకు తీసుకెళ్తాడట. ఇంకా సంక్రాంతి తీర్థాలకీ తోడొస్తాడట."


    "పిచ్చి నాన్న... నాన్నకి నువ్వంటే బోలెడంత ఇష్టం. షుగర్ ఫాక్టరీలో ఉద్యోగమంటే ఎక్కువ పనుంటుందిగా. అందుకే వేళకి ఇంటికి రావడం కష్టమన్నమాట. అసలు ఇంటికి రాగానే నాన్న ఏం చేస్తుంటారో తెలుసా? నిద్రపోతున్న నీ పక్కన పడుకుని నిన్ను బాగా ముద్దుపెట్టుకుంటారు." నచ్చచెప్పింది.


    అంతా విన్న శశి చూపుల్లో నమ్మకం కనిపించలేదు.


    సప్త సముద్రాలూ దాటిన రాకుమారుడు అక్కడ రాక్షసుల్తో పోరాడి మాంత్రికుడి ప్రాణాలున్న చిలకను పట్టుకొచ్చిన కథ వినేటప్పటి విస్మయం తప్ప.


    "నిజం నాన్నా" మరేదో చెప్పబోతుంటే చిన్నగా నవ్వాడు అమ్మని బాధపెట్టడం ఇష్టం లేనట్టు.


    తూనీగల తోకలకు దారం చుట్టి ఆడుకునే తోటి పిల్లల్లో కలియలేక 'పాపం కదా' అంటూ భిన్నంగా ప్రవర్తించే శశాంక గరికపచ్చ మైదానాల్లో తిరగడాన్నీ, మామిడితోపులో పూసే గొబ్బిపూలనీ ఇష్టపడే తన కొడుకు లేత మనసులో అస్పష్టంగానైనా రూపుదిద్దుకుంటున్న ఆభద్రతని అర్ధం చేసుకుంది.


    ఆమె పెద్దగా చదువుకోలేదు. కాని తన బిడ్డ మనసు బాగానే చదివింది. పరిపక్వత చెందని ఓ పసి మనసులో ఎలాంటి భావాలు చోటుచేసుకుంటే అవి క్రమంగా ఎలాంటి పరిమాణాలకు దారితీసేదీ గుర్తించటానికి ఆమెకు మానసిక శాస్త్రంలో పరిజ్ఞానం అక్కర్లేదు. ఆత్మీయత చాలు.


    ఆ రాత్రి భర్తతో చెప్పింది...


    మధ్య తరగతి కుటుంబంలో పుట్టిపెరిగి మామూలు ఉద్యోగిగా షుగర్ ఫాక్టరీలో అడుగుపెట్టి అతి స్వల్పకాలంలో 'పోర్ మన్' స్థాయికి ఎదిగిన రాఘవ ఎంత నిజాయితీ పరుడంటే ప్రతిఫలాన్ని మించి శ్రమపడడానికి ఇష్టపడతాడు.


    నిజానికి అతడి ప్రతి ఆలోచన మాటునా భార్యా బిడ్డల సుఖ సంతోషాలే చోటు చేసుకునివున్నా ఆ రాత్రి తొలిసారిగా జ్ఞానోదయమైనట్టు కలవరపడ్డాడు.


Next Page 

WRITERS
PUBLICATIONS