Previous Page Next Page 

కాంతి కిరణాలు పేజి 4


    "సురేంద్రా!" తల వంచుకొని పిలిచాడు సృజన్. అంత చక్కటి వాతావరణంలోనూ అతనికి ఉక్కపోస్తున్నట్లని పించసాగింది. గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి.
    "ఏమిట్రా?" అడిగాడు సురేంద్ర.
    సృజన్ బాబుకి గొంతు పెగలటం లేదు. అతని కళ్ళముందు స్వరూప పెళ్ళిదుస్తుల్లో కనిపిస్తోంది. ఆమె తల్లీ చెల్లెలూ, అన్నా అందరూ తనవంక దీనంగా చూస్తున్నట్లనిపించసాగింది. ఉహుఁ! అంత ఘోరం తను చెయ్యలేడు. వంద అబద్దాలాడి ఒక పెళ్ళిచెయ్యమన్నారు. ఒక్క నిజం చెప్పి ఈ వివాహం చెడగొట్టాలనుకుంటున్నాడు తను.
    "మాట్లాడవేంరా?" సృజన్ బాబు వీపు మీద చరుస్తూ అడిగాడు సురేంద్ర.
    "ఏదో చెప్పాలనుకొని....మర్చిపోయాను!" తడబడుతూ సమాధానం చెప్పాడతను.
    "ఓరి నీ-అంత మతిమరుపా?" నవ్వాపుకొంటూ అన్నాడు సురేంద్ర.
    సృజన్ ఏమీ మాట్లాడలేదు. లోపల పెద్ద ఎత్తు చెలరేగిన సంఘర్షణకి తట్టుకోలేక పోతున్నాడు.
    కొద్ది నిముషాలు నిశ్శబ్దంగా గడిచినయ్.
    ఓ వ్యక్తి సైకిల్ మీద సినిమా పాట పాడుకొంటూ వాళ్ళ ముందు నుంచీ వెళ్ళాడు.
    "పోదామా, ఇంటికి?" అడిగాడు సురేంద్ర.
    "ఇంకొంచెంసేపు కూర్చుందాం!"
    "బాగుంది. నువ్వు మాట్లాడవు - ఇంటికి బయల్దేరావు! హైద్రాబాద్ కబుర్లేమీ లేవుట్రా! మన క్లాసు మేట్ చంద్రం అక్కడే ఏదో కాలేజీలో లెక్చరర్ ఉన్నట్టుగా?"
    "అవును! ఒకటి రెండుసార్లు బస్ లో కనపడ్డాడు!" క్లుప్తంగా అని ఊరుకున్నాడు సృజన్ బాబు.
    మరికొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా గడచినయ్.
    "సురేంద్రా!" మళ్ళీ పిలిచాడు సృజన్.
    "ఏమిటి? ఇందాక మర్చిపోయిందేమిటో గుర్తు కొచ్చిందా?" నవ్వుతూ అన్నాడు సురేంద్ర.
    "నీకు ఒక విషయం చెప్పాల్రా" గంభీరంగా పలికిందతని గొంతు.
    "ఏమిటది?" ఆశ్చర్యంగా అడిగాడు సురేంద్ర.
    "స్వరూప గురించి!"
    "స్వరూప గురించా?"
    "అవును, ఆ అమ్మాయి గురించి అన్ని విషయాలూ తెలుసుకొన్నావా?" నివ్వెరపోయాడు సురేంద్ర.
    "ఏమిటి తెలుసు కోవాలి?"
    సృజన్ బాబు వెంటనే మాట్లాడలేకపోయాడు.
    "స్వరూప నీకు తెలుసా?" కొద్ది క్షణాల నిశ్శబ్దం తరువాత అడిగాడు సురేంద్ర.
    "తెలుసు!"
    ఈ జవాబు మరీ ఆశ్చర్యం కలిగించింది సురేంద్రకి.
    "ఎలా?"
    "గ్రాడ్యుయేషన్ ఈఊరి కాలేజిలోనే చూశానుగా! స్వరూప మా కాలేజ్ మేట్!"
    "మరింకేం! అలాగయితే ఆ అమ్మాయి గురించి అన్ని విషయాలూ తెలిసుండాలి!" బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు సురేంద్ర. అప్పటికే అతనిలో ఏవేవో సందేహాలు తల ఎత్తినయ్.
    "తెలుసురా! అందుకే నీకు చెప్పాలా, వద్దా అని ఇందాకటి నుంచీ సతమతమవుతున్నాను." ఆవేదన నిండిన కంఠంతో అన్నాడు సృజన్ బాబు.
    సురేంద్ర గుండెలు ఝల్లుమన్నయ్! స్వరూప గురించి సృజన్  బాబుకేమీ తెలుసు? మంచా? చెడా? మంచయితే ఫరవాలేదు? కాని ఈ సమయంలో చెడు వినేంత ధైర్యం తనకుందా?
    సురేంద్ర తెచ్చి పెట్టుకున్న నవ్వుతో సృజన్ బాబు భుజంమీద చెయ్యి వేశాడు.
    "ఫరవాలేదు! చెప్పరా! ఏమిటది?"
    కొద్ది క్షణాలు తటపటాయించి అన్నాడు సృజన్ బాబు____
    "స్వరూప ప్రవర్తన మంచిది కాదురా!"
    ఆ మాటలు గుండెలమీద సమ్మిటపోట్లలా తగిలాయి సురేంద్రకి. మనసంతా అల్లకల్లోలంగా తయారయింది. కొద్ది క్షణాలపాటు తనెక్కడున్నాడో తనకే తెలీని పరిస్థితి ఏర్పడి పోయింది.
    ఊహుఁ! తన నమ్మలేడు! సృజన్ ఎక్కడో పొరబాటు పడిఉంటాడు.
    "సృజన్! నువ్వనేదేమిటో నాకు బోధపడటం లేదు." ఉద్వేగంతో అన్నాడు తను.
    తను కావాలని, కోరి చేసుకొంటోన్న అమ్మాయి గురించి ఈ విధమయిన చర్చలోకి దిగడం సహించలేక పోతున్నాడతను. శరీరమంతా ఉద్రేకంతో వణికిపోతోంది.
    సృజన్ అతనివంక బాధగా చూశాడు.
    "క్షమించరా! నువ్వెంతగా 'హర్ట్' అవుతావో నాకు తెలుసు! కానీ నీకు ఈ విషయం చెప్పకుండా దాచటం నావల్ల కావడంలేదు స్వరూప గురించి నాకు బాగా తెలుసు నేను ఫైనలియర్లో ఉన్నప్పుడే ఆమె గురించి అల్లరల్లరయింది కాలేజంతా! వాళ్ళింట్లో అద్దెకుండే వాళ్ళబ్బాయి మిలటరీలో సెకండ్ లెఫ్ట్ నెంట్. అతను రెండు నెలలు. శెలవులో మా ఊరు వచ్చాడు. అతనికీ, స్వరూపకీ పరిచయమయి పోయింది. నిజానికి అతను చాలా అందంగా, ఠీవిగా ఉండేవాడు. ఆ పరిచయం ప్రేమలోకి దిగింది. ఇద్దరూ చాలాసార్లు సినిమాల్లోనూ, షికార్లకు వెళ్తూనూ మా కాలేజీ కుర్రాళ్ళకు కనిపించారు. అంతే! ఇద్దరి పేర్లూ గోడల మీద కెక్కినయ్. వాళ్ళిద్దరినీ చూస్తూనే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ గుసగుసలాడుకునేవాళ్ళు. అయితే వాళ్ళిద్దరూ కూడా ఇవేమీ లెక్కచేయలేదు. ఎంచేతంటే అప్పటికే వాళ్ళు వివాహం చేసుకుందామన్న నిర్ణయానికొచ్చేశారు. ఈ విషయాలన్నీ మాకు స్వరూప క్లాస్ మేట్స్ కొంతమంది మా స్నేహితుల చెల్లెళ్ళవడంమూలాన తెలుస్తూండే...అంతవరకూ చెప్పి ఆగాడు సృజన్.
    సురేంద్రకి అతని మాటలు శూలాల్లా గుచ్చుకొంటున్నయ్. నమ్మకూడని విషయాలేమీ కనిపించటం లేదు. అయినా తన అపోహేగాని సృజన్ కి అబద్దం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? తనని మించిన ఆప్తమిత్రుడు మరొకడు లేడతనికి. ఆ విషయం తనకి బాగా తెలుసు. అదే మరొకరయినట్లయితే-పెళ్ళి చెడగొట్టడమవుతుందని ఆ విషయం దాచేసేవారు. ఎంత నమ్మకం కుదిరినా, ఒకవేళ అతను చెప్పిన విషయం అబద్దమయే ఆస్కారం ఉందేమోనన్న ఆశ మెదుల్తూనే ఉందతన్లో.
    "కలిసి తిరిగినంతమాత్రాన ఆమెది చెడుప్రవర్తన అయిపోతుందా?" అడిగాడు సురేంద్ర.
    "ఒక ఆడపిల్ల మీద- అందులోనూ ఇలాంటి సమయంలో - అభాండాలు వేయడానికి నేనూ ఇష్టపడణు సురేంద్రా. ఆ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్న నా ప్రాణస్నేహితుడవటం మూలాన ఆ విషయాలన్నీ చెప్ప తప్పలేదు. స్వరూప కాలుజారిందనడానికి ఆధారం ఉండబట్టే నేను రూఢీగా చెప్పగలుగుతున్నాను...."
    సురేంద్ర మాట్లాడలేదు.
    పెద్ద బస్సొకటి నెమ్మదిగా వారి ముందునుంచి వెళ్ళిపోయింది. ఉండుండి గాలికి కొబ్బరిచెట్లన్నీ ఊగి సవ్వడి చేస్తున్నాయ్.


 Previous Page Next Page