Previous Page Next Page 

అమృతం కురిసిన రాత్రి పేజి 3

శైలిలోనూ, ఉక్తి విధానంలోనూ, కొన్నిచోట్ల కావ్యవస్తువులోనూ కూడా బావకవితాచ్ఛాయల బంధం నుండి బయటపడలేని స్థితి తిలక్ లో స్పష్టంగా కనిపిస్తుంది. "ఆర్తగీతం"లో "నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రిచెట్టు కింద మరణించిన ముసలివాణ్ణి" అనే పంక్తితో ప్రారంభమై, కవి తన హృదయాన్ని ముక్కలుగా కోసి బైటికి విసిరివేస్తున్నట్టు శరపరంపరగా దూసుకు వచ్చిన కరుణామయ దృశ్యాలను వర్ణించిన తీరుకూ, అదే గీతంలో "కొత్త సింగారమ్ము వలదు, ఉదాత్త సురభిళాత్తశయ్యా సజ్జితము వలదు రసప్లావితం వలదు" వంటి పంక్తులలోని గ్రాంధిక వాసనకూ వున్న తేడాను గమనిస్తే నేను చెప్పదలచిన భావం స్పష్టమవుతుంది. ఈ లోపం ఒక్క తిలక్ లోనే కాదు; వ్యావహారిక భాషకూ, వచన కవితా ప్రక్రియకూ గల చారిత్రక పరిణామ సంబంధం సరిగా అంతుపట్టని అనేకమంది ఆధునిక కవుల్లో కూడా కనిపిస్తుంది. "నీవు" అనే ఖండికలో వాడిన శైలి ఏ సరళమైనా గీతపద్యమో రాసేటప్పుడు రాయవలసింది. సుమారుగా వెంకట పార్వతీశ్వర కవులనాటి సరళ వచనాల శైలి. సగం గ్రాంధికం, సగం వ్యావహారికం గల యీ శైలి సాంకర్యదశ వచనా కవితా రంగంనుండి తప్పుకోడానికి మరికొంత కాలం పడుతుంది. తిలక్ ఒక రమణీయమైన శైలిని సమకూర్చుకున్నవాడు కనుక అతని శైలి గురించి, దాని బాగోగులను గురించి యింతగా రాయవలసి వచ్చింది.

తిలక్ తాను ప్రధానంగా అనుభూతి వాదినని బల్ల గుద్ది చెప్పుకున్నాడు. ఈ అనుభూతివాదము యిటీవలి కాలంలో భావకవితాయుగ సంబంధి. ఇది వ్యక్తివాదానికి మరొక పేరు. "నా అనుభూతి నాది; దానిని నేను ఆవిష్కరిస్తాను" అనే తత్త్వం కవి పొందిన ప్రధాన అనుభూతుల ఆకృతిలో కవిత్వం దర్శనమిచ్చే ఏర్పాటు. ఇంతవరకైతే ఎవ్వరికీ ప్రమాదం వుండదు. ఎందుకంటే వస్తాశ్రయ కవితలో కూడా పాత్రల స్వభావ, స్వరూప చిత్రణ, వివిధ రసముల నిర్వహణ మొదలగు వాటిలో కవి యొక్క అనుభూతి ప్రధానపాత్ర వహిస్తూనే వుంటుంది. కాని యీ అనుభూతివాదం యీ వ్యక్తివాద ప్రాబల్యం సమాజాన్ని మింగేదిగా వున్నప్పుడే చిక్కువస్తుంది. కవి భావనలో సామాజిక ప్రయోజన చైతన్యం మృగ్యమయ్యేటంతవరకు వ్యక్తిత్వం విస్తృతమైతే ఆ కవి ప్రజలకు పూర్తిగా దూరమైపోక తప్పదు. దీనిని తిలక్ కు అన్వయించి చూసినప్పుడు తిలక్ తన కవితను గురించి తానేవిధంగా నిర్వచించుకొన్నప్పటికీ అతని ఊహలో అడుగడుగునా అభ్యుదయ భావావేశం తొంగిచూస్తూనే వుంటుంది. "ప్రార్ధన", "ఆర్తగీతం" వంటి మహోత్తమ గేయకావ్యాలను తిలక్ మాత్రమే రాయగలడు. అభ్యుదయ కవితాయుగం బాగా ప్రవర్తిల్లిన రోజుల్లో అనేకమంది కవులు శైలికీ, అక్షర రమ్యతకూ ప్రాధాన్యం యివ్వనందువల్ల అదొక లోపంగా పరిణమించింది. ఈ దోషాన్ని తిలక్ అభ్యుదయ భావాలకు రమ్యమైన శైలిని సమకూర్చడంలో కృతకృత్యుడయ్యాడు. మొత్తంమీద చూస్తే అభ్యుదయ భావనా, కాల్పనికోద్యమకాలం నాటి శబ్ద సౌందర్యమూ - యీ రెంటి మేళవింపు తిలక్ కవిత్వమని చెప్పవచ్చు.

అభ్యుదయ కవితాయుగంలో కావ్యవస్తువు కొన్ని పరిధులకు లోబడి, కొన్ని నిర్ధిష్టాంశాలకు మాత్రమే పరిమితమైపోయినట్లు కనిపించింది. ఆరంభదశల్లోని ఆవేశం అలాగే వుంటుంది. దాని పరిధిని విస్తృతపరిచి దానిని జీవితంలోని సర్వరంగాలకూ వ్యాపింపజేయాలనే ప్రయత్నం వచన కవితా యుగంలో వచ్చిన కొత్తమార్పు. అన్ని రసాలను వచన కవిత్వంలో నిర్వహించి ఒప్పించాలనే అస్మదాదుల ఆకాంక్షకు ఉదాహరణప్రాయమైన కవిత్వం తిలక్ రాసి చూపించాడు. "నువ్వులేవు నీ పాట వుంది" వంటి గేయాలు వచన కవితా ప్రక్రియలో ప్రేమ భావనలు కూడా ఎంత సుందరంగా చెప్పడానికి వీలుందో నిరూపిస్తాయి. "వాన కురిసిన రాత్రి"లో చెప్పినట్లు నిజంగా మనందరం చూడని సమయంలో ఒంటరిగా వెళ్ళి వెన్నెల మైదానంలో కురిసిన అమృతపు వానలో తడిసి దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చిన వాడివలె మధురాతి మధురంగా కవిత్వం చెప్తాడు తిలక్. శృంగారాది యితర రసాలకు కూడా వర్తించగల విధంగా వచన కవిత ప్రక్రియలో యిప్పుడు వచ్చిన ఈ మార్పును మొత్తం మీద కవిత్వంలో సామాజిక ప్రయోజన చైతన్యమనే పరమ లక్ష్యానికి భంగం లేనంతవరకు నేను -- హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను.

తిలక్ ఖచ్చితమైన మానవతావాది. కేవలం వ్యక్తిగతమైన అనుభూతికి సంబంధించి మానవతా భావనకు సమాజపరమైన మానవ కారుణ్య భావనకూ చాలా తేడా వుంటుంది. తిలక్ నిశ్చయంగా యీ రెండవ పద్ధతికి చెందినవాడే. అభ్యుదయ కవితా యుగపు ప్రధానలక్షణమైన అంతర్జాతీయ భావనా, "సంకుచితమైన జాతిమతాల సరిహద్దుల్ని చెరిపివేసి" "అకుంఠిత మానవీయ పతాకను ఎగురవేసే" తత్వమూగల అభ్యుదయ కవి కంఠమతనిది.

తిలక్ కవిత అభ్యుదయ కవిత్వం కొన్ని పాళ్ళు, భావకవిత్వం కొన్ని పాళ్ళు కలసిన మిశ్రమరూపం. "నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు; నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమయిన ఆడపిల్లలు" అని తిలక్ చెప్పుకున్నాడు. ఇందులో అతని భావమేదైనా, మొదటిది తన వస్తువును గురించీ, రెండవది తన శైలిని గురించీ చెప్పుకున్నట్లుగా నేనర్ధం చేసుకున్నాను. తిలక్ అభ్యుదయ భావనకు అందమైన శైలిని సమకూర్చి అభ్యుదయ కవితా కాలంలో ఉన్న దోషాన్ని తొలగించడానికి ప్రయత్నించాడని చెప్పుకోవచ్చు. భావకవులు శబ్దసౌందర్యానికి శైలి రమ్యతకూ ప్రాధాన్యం యిచ్చారు, అభ్యుదయ కవులు. ప్రగతి కారకమయిన వస్తువుకు ఈ రెంటిలో మంచిని ఒకచోట చేర్చుకునే ప్రయత్నంలో తప్పేమీలేదు. భావన ఎంత అభ్యుదయకరమైనదైనా సుందరంగా వ్యంగ్య విలసితంగా చెప్పలేకపోతే రాణించదు. అభ్యుదయ కవిత్వాన్ని కూడా పేలవంగా కాకుండా అందంగా చెప్పుదాం అన్నదే తిలక్ ఆచరణ ద్వారా చేసిన సూచన.

తిలక్ మంచి కవి కాబట్టి అతని భావాల ప్రభావం యువతరం మీద తప్పకుండా వుంటుంది. అభినవ కాల్పనిక వాదమని చెప్పుకోదగిన అతని అనుభూతి వాదము కవితకు తుది తీర్పు కాజాలదు. తిలక్ భావకవితా మార్గం నుండి వచ్చిన వాడు కావడం చేత దానిలోని మంచితోపాటు దానిలోని దోషాలు కూడా అతనిలో వుంటాయి. వాటిని పరిహరించుకోవాలి. ఇటీవల యువతరం కవుల్లో వ్యక్తివాదమూ తత్ఫలితమైన అరాచకవాద తీవ్రవాదమూ ధోరణులూ పొడచూపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కవితలో సామాజిక ప్రయోజన లక్ష్యం కొరవడుతున్నదేమో అనిపిస్తుంది. ఇందువల్ల కవిత్వం ప్రజలకు మరింత దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. యువతరం కవులు దీనిని గురించి చక్కగా ఆలోచించుకోవాలనీ, సరియైన మార్గాన్ని అనుసరించాలని నా ఆకాంక్ష.

తిలక్ నాకు చిరకాల మిత్రుడు. మా పరిచయం దాదాపు పాతికేండ్ల నాటిది. ఆరోజుల్లో మేము నర్సారావుపేటలో స్థాపించిన "నవ్యకళా పరిషత్"లో అతను ప్రముఖ సభ్యుడు. అతని అనారోగ్యంవల్ల మధ్యలో చాలా కాలం మా పరిచయ బంధం దాదాపు తెగిపోయినంత పని అయింది. చివరి దశలో మళ్ళీ కలిశాం. అతనికి అనారోగ్యం లేకపోతే యింకా ఎంతగా రాసేవాడో అనేది, కేవలం ఊహకు మాత్రమే మిగిలింది. మరి అకాల మరణానికి గురికాకుండా వుంటేనో? అదీ అంతే.... ఇంతకూ అతను మనకు మిగిల్చి వెళ్ళిన ఆస్తి యీ కావ్యం. అమూల్యమయిన యీ నిధికి విలువకట్టే బాధ్యత విశాలాంధ్రవారు నామీద పెట్టారు. ఇది నిజంగా నా అదృష్టమనుకుంటాను.

తిలక్ శారీరకంగా మంచి రూపసి. అలాగే మానసికంగా కూడా మంచి వాడు. మెత్తనివాడు, స్నేహశీలి, కవి, రసజ్ఞుడు.... ఇన్ని మాటలెందుకు, అతనే ఒకచోట అన్నట్లు "మావాడే - మహా గట్టివాడు."

ఫ్రీవర్స్ ఫ్రంట్
హైదరాబాద్                          
3, జూన్ 68

ఇదీ వరస
1. నా కవిత్వం
2. దృశ్య భావాలు
3. ప్రాతఃకాలం
4. సంధ్య
5. ఈ రాత్రి
6. పాడువోయిన ఊరు


 Previous Page Next Page