Previous Page Next Page 

బస్తీమే సవాల్ పేజి 3


    "అబ్బే-కాడులే."

    "నీకెలా తెలుసు?"

    "ఫేస్ చూస్తే తెలీడంలా!" జనం వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

    పరుశురామ్ చేతికి ఐదువందలు వచ్చాయి. సవాల్ రాణీ నవ్వలేక నవ్వుని తెచ్చిపెట్టుకుంటూ....

    "అదృష్టవంతుల్ని చెరిపే వాళ్ళుండరు. చూశారా బాబూ! ఇక ఆపేద్దామా ఆట" అంది మెల్లగా పరుశురామ్ తో.

    "ఓపిక అయిపోయిందా?"

    "ఉహ్హూ."

    "ఇంకాస్త ప్రయత్నం చేస్తాను" అన్నాడు పరుశురామ్.

    సవాల్ రాణీ తన గ్యాంగ్ మనుషులకేసి చూసింది. అందులో ఒకడు కన్ను గీటాడు. అయితే ఆ రౌడీషీటర్ రాణీకి సైగచేయటం పరుశురామ్ కళ్ళ చివరనుంచే పసిగట్టారు.

    "నీ పేరేమిటి?" వెక్కిరిస్తూ అడిగాడు.

    "నీకెందుకు?" గుసగుసలాడింది.

    "పేరు తెలీకుండా ఇంతసేపు ఆడుకున్నాం! నా పేరు పరుశురాం... నీపేరు డైమన్ రాణీనా?"

    ఆమె చురచుర చూసింది.

    "ఒట్టి రాణీ" అంది కోపంగా.

    "రాణీ! బ్యూటిఫుల్. ముక్కలు కలుపమ్మా!" అన్నాడు పరుశురామ్.

    గ్యాంగ్ మనుషులు సైగ చేశారు.

    రాణీ నవ్వింది. కనురెప్పలు రెపరెపలాడాయి, బుగ్గ సొట్టబడింది.

    ఆమె పెదవులు పువ్వుల్లా విచ్చుకున్నాయి.

    "ఎంత?" అడిగింది.

    "ఆఖరి పందెం. నువ్వు పోగొట్టుకున్న సొమ్ము గెలుచుకోడానికి నీకు ఛాన్స్ ఇస్తున్నాను. అయిదొందలు!" అన్నాడతను.

    రాణీ అతనివంక చూస్తూ మునిపంటితో పెదవిని కొరుకుతూ పవిటని కాస్త జారవిడిచింది. అతని దృష్టిని మళ్ళించడానికి నగ్నంగా కనిపిస్తున్న ఆమె గుండెలకేసి చూస్తూ.

    "ఈ పప్పులేం నా దగ్గర ఉడకవమ్మా! ముక్కలు పరువు" అన్నాడు.

    "ఉహు!" అంటూ గొణుగుతూ ముక్కలు వేసింది రాణీ.

    ఈసారి కూడా అతను పందెం గెలిచే బొమ్మమీద కాస్త ముక్కని మార్చేయడానికి రంగం సిద్ధం చేసుకో రాణీ. కానీ ఆమె ఆటని కట్టించి పరుశురామ్ గెలిచాడు. రాణీ మొహం వెలవెలబోయింది.

    "సొమ్ము ఇవ్వు!" అన్నాడు.

    "సొమ్ము!" సరంజామా సర్దేసి అక్కడ్నించి జారుకోవడానికి ప్రయత్నించింది రాణీ.

    గబాల్న రాణీ చేతిని పట్టుకున్నాడు పరుశురామ్.

    "ఏయ్! చేయి వదులు" గింజుకుంది.

    "డబ్బు ఇవ్వు!"

    "ఏ డబ్బు?"

    "నేను పందెం వేసింది. పందెంలో గెలుచుకొందీ వెరసి వెయ్యి రూపాయలు."

    "ముందు చెయ్యి వదులు! ఆడపిల్ల చేతిని ఇలా పబ్లిగ్గా పట్టుకుంటే చూస్తూ వూరుకుంటారేమయ్యా!"
 అరిచింది జనాన్ని ఉద్దేశించి.

    "మోసం చేసి మమ్మల్ని గెలిచినట్టుకాదు. అతను గెలిచిన డబ్బులిచ్చేయి" అన్నాడో మనిషి.

    "అతను నన్ను మోసం చేశాడు!" అరిచింది రాణీ.

    "పిచ్చి వేషాలు వేయకుండా డబ్బులిచ్చేయి రాణీ! నేనింతసేపు నీతో జూదం ఆడింది నీ డబ్బుకోసం కాదు. నీ మోసంలోపడి డబ్బులు పోగొట్టుకున్నవాళ్ళకు తిరిగి డబ్బులివ్వడానికి."

    "నేనివ్వను" అంది రాణీ మొండిగా.

    "ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ జాకెట్ విప్పి ఆ పైసల్ని బయటికి లాగి వీళ్ళకి పంచిపెడతాను" అంటూ రాణీ జాకెట్లో చెయ్యి పెట్టబోయాడు పరుశురామ్.

    "వస్తాన్!" అని అరిచింది రాణీ కంగారుగా.

    "అయ్!" అంటూ ఓ రౌడీషీటర్ ముందుకొచ్చాడు.

    గళ్ళలుంగీ, బనీను, మెడలో స్కార్స్, కోరమీసం, జిబిరిజుట్టు.... నడుంకి చుట్ట.

    వాడి వెనకే మరో ముగ్గురు.... అండగా వచ్చి నిలబెడ్డారు.

    పరుశురామ్ వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూశాడు.

    "అడుగు ముందుకేస్తే పళ్ళూడగొడతాను!" అన్నాడు పరుశురామ్ వాళ్ళతో.

    ఊరు కాని ఊరు. అది కొత్త ప్రదేశం అన్న సంగతి అతను మర్చిపోయాడు.

    "అయ్!" అని అరుస్తూనే--

    ఫట్ మంటూ పిడికిలి బిగించి పరుశురామ్ గెడ్డంమీద కొట్టాడు మస్తాన్.

    ఆ దెబ్బకి ఎగిరి అయిదడుగుల దూరంలో పడ్డాడు పరుశురామ్.

    ఆ రౌడీల చేతిలో అతనికి మూడిందని గ్రహించి చుట్టూవున్న మూక దూరంగా పరిగెత్తారు.

    నేలమీదనుంచి లేవకుండానే చేత్తో గెడ్డాన్ని సవర చేసుకున్నాడు పరుశురామ్. పెదిమినించి రక్తం కారుతోంది.

    తన చుట్టూ నించున్న నలుగురు రౌడీలకేసి చూశాడతను.

    వాళ్ళు ఎలాంటి దారుణానికైనా సిద్ధపడే గూండాలని అతనికి అర్ధమౌతూనే వుంది.

    కారులోంచి దిగి అప్పటివరకూ జరిగిన జూద క్రీడని కళ్ళారా చూసిన ఆ స్త్రీ కారు దగ్గరకెళ్ళి నించుంది.

    పరుశురామ్ మెల్లగా లేచి నుంచున్నాడు. బొబ్బలు పెడుతూ జబ్బలు చరుచుకొంటున్న రౌడీలకేసి చూస్తూనే శరీరంలోని శక్తిని, బలాన్ని కాళ్ళలోకి, చేతుల్లోకి తీసుకుని "బస్తీమే సవాల్" అంటూ గాలిలోకి ఎగిరాడు.  


 Previous Page Next Page