Previous Page Next Page 

కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 3


    అర్థరాత్రి మంచి నిద్రలో ఉన్న కల్యాణికి తనని ఎవరో కుదిపి లేపుతుంటూ చటుక్కున మెలకువ వచ్చింది. కళ్ళిప్పేసరికి చిత్ర ఏడుపు గొంతుతో, "మమ్మీ. మమ్మీ" అంటూ రహస్యంగా పిలుస్తోంది. చటుక్కున లేచి కూర్చుంది కల్యాణి. చిత్ర మొహం బెడ్ లైట్ వెలుగులో పాలిపోయి ఉంది. భయంతో ఏడుస్తున్న కూతుర్ని చూసేసరికి దిగ్గున లేచి గదిలోంచి బయటికి వచ్చి చిత్ర గదిలోకి నడిచింది. చిత్ర మంచంమీద లుంగ చుట్టుకుపోతూ, "మమ్మీ నొప్పి. మమ్మీ బ్లీడింగ్ అయిపోతోంది. డూ సమ్ థింగ్" కడుపు పట్టుకు ఏడవసాగింది. ఆమె పక్కమీద, నైట్ గౌను నిండా రక్తం మరకలు.
    కల్యాణి గుండె ఝల్లుమంది. "ఏం అయింది? ఏం చేశావు?" గాబరాగా కడుపు పట్టుకుని బాధతో మెలికలు తిరుగుతున్న చిత్రని అడిగింది. "ఏం చేశావే? ఏదన్నా మందు మింగావా?" భయంగా చూస్తూ అడిగింది.
    "మొన్న ఓ లేడీ డాక్టర్ అబార్షన్ చేసింది. ఇవాళ సాయంత్రం నుంచి బ్లీడింగ్, ఇందాకటి నుంచి కడుపులో ఒకటే పోటు. బ్లీడింగ్ అలా అయిపోతోంది. మమ్మీ ఈ నొప్పి... చచ్చిపోతున్నాను.. డూ సమ్ థింగ్.." ఏడవసాగింది బేలగా.
    "ఏ డాక్టరు చేసింది? ఒక్కర్తివీ ఎందుకు వెళ్ళావు?" గాబరాగా అంది.
    "నీవు ఏం చెప్పలేదు నాకు. నా ఫ్రెండ్ రవి పాపం తాను హజ్బెండ్ నని చెప్పి వచ్చి నాకు హెల్ప్ చేశాడు, ఎక్కడో ఎవరో ఓ డాక్టరు ఉందంటే.."
    "ముక్కు మొహం తెలియని ఎవరి దగ్గరికో వెళ్ళావన్నమాట." కోపంగా అంది కల్యాణి. అబార్షన్ సరిగా చేయలేదన్నది కల్యాణికి అర్ధమైంది. ఇది ఇంక వాదులాడవలసిన టైముకాదని అర్ధం అయి గబగబా రామకృష్ణని లేపడానికి వెళ్ళింది.

                                                         *  *  *

    "ఇన్ కంప్లీట్ అబార్షన్. ఈ బ్లీడింగ్, ఇంత జ్వరం, కడుపులో పోట్లు - ఇవన్నీ ఇన్ ఫెక్షన్ కి సూచనలు. ఎక్కడపడితే అక్కడ ఊరూపేరూలేని ఏదో చిన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చేయించుకున్న ఫలం. ఈ కాలం పిల్లలు చదువుకునీ, తప్పు ఒప్పులు తెలుసుకోరు. తప్పుచేశాక కనీసం చేసినదాన్ని సరిగా అయినా సరిదిద్దుకోరు." తల వాచేట్లు చీవాట్లు పెట్టి అప్పటికప్పుడు డి అండ్ సి చేసి అబార్షన్ పూర్తిచేసి, పెయిన్స్ కి, ఇన్ ఫెక్షన్ కి ఇంజక్షన్లు ఇచ్చింది డాక్టరు.
    'మీరు తల్లి అయివుండి పంతానికి పోయి అలా రెండు మూడురోజులు వదిలేయాల్సింది కాదు. పిల్లలు తప్పు చేసినప్పుడు మనం కాకపోతే ఎవరాదుకుంటారు' అంటూ కల్యాణికి మెత్తగా మందలించింది. ఆవిడ తన కొలీగ్ ఆడపడుచు. ఇదివరకు పరిచయంతో కల్యాణి అక్కడికి వచ్చింది. ఆవిడ ముందు తానే తప్పు చేసినట్లు తల దించుకుంది.
    ఆ రాత్రి సంగతి విని నిశ్చేష్టుడయ్యాడు రామకృష్ణ. అప్పుడు ఒక్కమాట కూడా మాట్లాడకుండా కారు తీసి నర్సింగ్ హోమ్ కు తీసుకెళ్ళాడు. ఆ తర్వాతైనా కూతుర్ని పలకరించలేదు. మందలించలేదు. కల్యాణి ఏదో చెప్పబోయినా వినలేదు. ఆ రోజు నర్సింగ్ హోమ్ లో ఉంచి మర్నాడు కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళింది కల్యాణి.
    "మీ డాడీ నిన్ను ఒకమాటా అనలేదు అంటే, ఆయన నీవు చేసిన పనికి ఎంత హర్ట్ అయ్యారో తెలుసుకో. ఆయన బాధ, అవమానం మనసులో దాచుకున్నారు. అంటే, మనల్ని క్షమించలేదన్నమాట. ఇంతకంటే ఆయన నిన్ను, నన్ను తిట్టినా బాగుండేది. ఆయనకు మొహం చూపించలేకపోతున్నాను" కల్యాణి కూతురికి పళ్ళరసం తెచ్చి ఇస్తూ అంది.
    "సారీ మమ్మీ" చిత్ర తల వాల్చుకుని అంది. ఈ ఒక్కరోజులో ఆమె పొగరు, వగరు అన్నీ దిగి పోయినట్లు సౌమ్యంగా అంది. పాలిపోయి, కళ్ళకింద నల్లచారలతో, మొహం పీక్కుపోయిన కూతురు మొహం చూస్తే శారీరకంగా, మానసికంగా ఎంత బాదపడిందీ అర్ధం అవుతోంది.
    "చిత్రా నీ ఈ తప్పటడుగుతో నీవు స్వేచ్చను పోగొట్టుకున్నావు. నీపై అందరికి నమ్మకం పోయేట్లు చేసుకున్నావు. ఇంక నీపై ఎన్ని ఆంక్షలు పెడతారో మీ డాడీ చూద్దువుగాని. నీవు ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, కాలేజీ నుంచి రావడం ఒక గంట ఆలస్యం అయినా అనుమానంగానే చూస్తాం. నిన్ను వెనకేసుకు వచ్చే అవకాశం నాకు లేదు ఇప్పుడు.'
    చిత్ర ఏడవడం ఆరంభించింది. ఏడుపు మధ్య "మమ్మీ నేను కావాలని చెయ్యలేదు. ఆ సందీప్ ఇంటికెడదాం అంటే సరదాగా వెళ్ళా. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అంతా తిరుపతి వెళ్ళారని వెళ్ళాక తెలిసింది. ఏవో కబుర్లు చెప్పాడు. మ్యూజిక్ పెట్టాడు. డాన్సు అన్నాడు. జస్ట్ ఫర్ ఫన్ అన్నాడు. ఇదంతా కాలేజీ అబ్బాయిలు, అమ్మాయిలు అంతా చేస్తారన్నాడు. ఎవరెవరివో పేర్లు చెప్పాడు. ఒక్కసారిగా ఏం అవదు. తప్పేమిటి... ఏదేదో అంటూ నన్ను మాటల్లో వశపరచుకున్నాడు. నాకూ ఏ మూలో ఎలా ఉంటుందో అన్న జస్ట్ ఇంక్విజిటివ్ నెస్. ఇలా అవుతుందని అనుకోలేదు. మమ్మీ, సేఫ్ పీరియడ్ ఫరవాలేదన్నాడు." ఏడుస్తూ అంది.
    "హుఁ. చిత్రా, ఈ మగపిల్లలకి, ఈ వయసులో దృష్టి ఎంతసేపూ సెక్స్ పైనే ఉంటుంది. బైహుక్ ఆర్ క్రూక్ ఆ అనుభవం పొందాలని ఆరాటపడే వయసు ఇది. ఆ యౌవన ఆరంభంలో దీనికోసం ఉచితానుచితాలు మర్చిపోతారు. అబ్బాయిలతో స్నేహం చేసేటప్పుడు హద్దులు గీసుకోవాల్సింది అమ్మాయిలే. స్నేహాన్ని ఆకర్షణకి లోబడకుండా ఉంచుకోవడానికి అబ్బాయిలని గిరిగీసి దూరం ఉంచాలి. నిప్పు కాలడం దాని సహజ లక్షణం. దానికి దూరంగా ఉండాల్సింది మనం. మన పూర్వులు ఆడదానికిన్ని ఆంక్షలు ఎందుకు పెట్టారంటావు. నిప్పు దగ్గరకి వెడితే కాలేది ఆడదానికే బాధ. హింస, అవమానం భరించాల్సిందే ఆడదే కాబట్టి నీతో ఎంజాయ్ చేసిన సందీప్ హాయిగా ఉన్నాడు. కొన్ని క్షణాల తొందరపాటు వల్ల నీకు ఎంత కష్టం, నష్టం జరిగింది. నిన్ను ఎంత బాధ, అవమానాలకి లోను చేసింది ఆ సంఘటన. మనం మోడర్న్ గా స్త్రీ, పురుష సమానత్వం అని ఎన్ని మాటలు వల్లించినా ఈ ఒక్క విషయంలో మాత్రం మనం పురుషుల ముందు తల ఒగ్గాల్సిందే. ప్రకృతే పురుషుని పట్ల పక్షపాతం వహించి మనకు అన్యాయం చేసింది. ఇద్దరూ పాలుపంచుకున్న ఆనందంలో స్త్రీ మాత్రమే శిక్షకు గురిఅవడం దేవుడు మనకిచ్చిన శాపం. ఈ బాధ, ఈ అవమానం మనం తప్పించుకోలేనిది.'
    చిత్ర గిల్టీగా చూసింది.
    "చిత్రా నీకు నేను ఎప్పుడూ మగపిల్లాడితో సమంగా "స్వేచ్చ" ఇచ్చాను. స్వేచ్చ అంటే విచ్చలవిడితనం కాదు. నీవు చదువుకోవాలి. మంచి ఉద్యోగం చేసుకోవాలి. ఆర్ధిక స్వాతంత్ర్యం ఉండాలి. ఏదైనా నిబ్బరంగా ఎదుర్కొనే మనస్థయిర్యం ఉండాలి. ఓ వ్యక్తిత్వం అలవరుచుకోవాలి. మగాడి కంటే మనం దేన్లోనూ తక్కువ కాదు అని నిరూపించాలి అన్నది నా ఉద్దేశం. స్వేచ్చకి నీవు విపరీతార్ధం తీశావు. స్వేచ్చ, స్వాతంత్ర్యం అంటే ఇష్టం వచ్చిన మగాడితో విచ్చలవిడిగా తిరగడం కాదు. అలా తిరిగితే ఏ సభ్య సమాజం ఊరుకోదు. సమాజానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. ఆ కట్టుబాట్లు దాటితే ఎంత నవీన సమాజమైనా వేలెత్తి చూపి పరిహసిస్తుంది. ఆ యుగం నాటి కుంతి మొదలు నీవరకు ఇలాంటి అక్రమ సంబంధాలని ఏ సమాజమూ ఆమోదించదు. ఇప్పుడే కాదు ఇంకో యాభై గడిచినా ఏ తల్లీ తన కూతుర్ని అబార్షన్ కి తీసుకొచ్చానని అందరి ఎదుటా చెప్పగలదా! ఏ ఆడపిల్లా నేను అబార్షన్ చేయించుకున్నాను అని ఓపెన్ గా చెప్పగలదా అంటే అనుమానమే! నిన్ను నర్సింగ్ హోమ్ లో చూసి ఆ ప్రసాదరావు భార్య ఆశ్చర్యంగా అడిగితే ఏదో గైనిక్ ప్రాబ్లమ్ అని అబద్ధం చెప్పాను. అది అబద్ధం అని నా మొహమే చెప్తుంది. రేపు ఈ వార్త మా ఆఫీసులో, నీ కాలేజీలో అందరికీ ఎలాగో తెలుస్తుంది. వారి అనుమానపు దృక్కులు, సానుభూతి వాక్యాల చాటున హేళన ఉంటుంది. ఇంతేకాదు. ఇది రేపు నీ పెళ్ళికి అవరోధం అవచ్చు. నీ అంతట నీవు ఎవరినన్నా చేసుకున్నా సమయం వచ్చినప్పుడల్లా దెప్పడానికి ఆయుధంగా వాడుకుంటాడు ఆ మొగుడనేవాడు."
    చిత్ర మొహం కళ తప్పి నల్లబడింది. "మమ్మీ, నీవిన్ని అంటున్నావు. మా కాలేజీలో కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా తిరుగుతారో తెలుసా హోటళ్ళు, పిక్నిక్ లు అంటూ? అయామ్ ష్యూర్ దే ఆర్ హేవింగ్ సెక్స్."
    "ఎవరో ఏదో చేశారని నీవూ చెయ్యక్కరలేదు. పట్టుబడేవరకూ అందరూ పవిత్రులే. ఈ ఫామిలీ ప్లానింగ్ మెథడ్స్ వచ్చాక ఎందరు పవిత్రంగా ఉన్నారన్నది ప్రశ్నార్ధకమే. ఆపాటి తెలివి కూడా లేకుండా నీవు రొంపిలో దిగబడ్డావు. ఈ మాట నేను ఇంతవరకు ఎందుకు అనలేదో తెలుసా? ఫ్యామిలీ ప్లానింగ్ యూస్ చేస్తూ బాయ్ ఫ్రెండ్స్ తో తిరగచ్చు అని నేను సజేషన్ ఇచ్చినట్లవుతుందని. చిత్రా! ప్లీజ్ నీలాంటి అమ్మాయిలు విచ్చలవిడిగా తిరిగి మళ్ళీ 'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి' అని పెద్దలు భావించి, చరిత్ర పునరావృతం అయి ఆడదాన్ని మళ్ళీ నూరేళ్లు వెనక్కి పంపేయకుండా చూడాల్సిన బాధ్యత ఈ తరం, ముందు తరాల అమ్మాయిల మీద ఉంది. 'ఫరవాలేదు, స్త్రీకి స్వేచ్చ, స్వాతంత్ర్యాలు ఇచ్చినా దుర్వినియోగం చెయ్యదు' అన్న నమ్మకం సమాజానికి మీ యువతరం కలిగించాల్సిన బాధ్యత ఉంది"
    కల్యాణి మాటలకి చిత్ర కళ్లు వాల్చుకుంది. చిత్ర మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యదని, చేసేముందు పదిసార్లు ఆలోచిస్తుందన్న నమ్మకం కల్యాణికి కలిగింది.

                                                    *ఇండియా టుడే, జనవరి 25, 2000

                                                        *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS