Previous Page Next Page 

శ్రీ మహాభారతము పేజి 3

 

     అట్టి అయోమయము సర్వకాలములందును జరుగుచుండును. ఆంగ్లేయులు భారతదేశమున స్థిరపడినారు. వారు హిందువులకు వర్తించు శాసనము కొఱకు వెదికినారు. అనేక స్మృతులు అనేక సంహితలు, అనేక వ్యాఖ్యానములు వారిని గజిబిజి చేసినవి. అందుకు సంబంధించిన శాసనములు లేవు. వ్యాజ్యములే శాసనములు అయినవి. మనకు స్వాతంత్ర్యమువచ్చి హిందూ కోడ్ బిల్లు వచ్చునంతవరకు ఈ గజిబిజి కొనసాగింది. ఇంత ఆధినిక సమాజమున హిందూ కోడ్ బిల్లు కొఱకు ఎందరో మేధావులు నిరంతర కృషి , సాంఘిక కార్యకర్తల నిరంతర ఉద్యమము అవసరము అయినవి.
    ఇంత మహాత్కార్యమును వ్యాస మహర్షి ఒక్కడు, అకాలమున సాధించినాడు.
    వ్యాసమహర్షి వేదములను క్రోడీకరించినాడు. కాని వారికి ఫలితము కనిపించలేదు. మానవుడు అప్పటికే వేదమును నిర్లక్ష్యము చేయసాగినాడు. అతనికి వేదమునందున్నవిశ్వాసము సన్నగిల్లినది. వేదము వెనుక ఉన్న భగవద్భక్తి అంత బలీయము కాదని తెలుసుకున్నాడు. అందువల్ల అతడు ప్రభు సంహితకు లొంగలేదు. అచ్చము భయపెట్టి మానవుని లొంగదీయుట దుస్సాధ్యము , మనము చూచుచుండగానే నిరంకుశ రాజ్యములు ప్రభుత్వములు కూలుట ఈ చిన్న సూత్రమునకు లోబడియే.
    మానవుని మంచి మార్గమునకు మలచవచ్చునని వ్యాస మహర్షి వేదమును క్రోడీకరించినాడు. ఆ ప్రయత్నము అంతగా ఫలించినట్లు కనిపించలేదు. అతని మనసు విలవిల లాడినది. మనిషిని మంచి మార్గమున నడిపించుటను గురించి తపించినాడు. తపస్సు చేసినాడు. మహాత్ములు తమ యత్నములు మానరు. ఫలసిద్ది వరకు ప్రయత్నింతురు. వ్యాస మహర్షికి ఒక అద్భుతమయిన ఆలోచన వచ్చినది. మానవుడు పశుబలమునకు లొంగడు. రాజునకు బలము ఉన్నది శక్తి ఉన్నది. అయినాను మనిషి అతని మాట వినుటలేదు. మానవుని ప్రకృతిలోనే శాసనధిక్కారమున్నది. రాజుగా చెప్పిన విననివాడు మిత్రునిగా చెప్పిన వినును అను సూత్రమును వ్యాస మహర్షి ఆవిష్కరించినాడు. ఇంత మహా సూత్రమును అవిష్కరించుట ఎంత కష్టమో సాంఘిక శాస్త్రవేత్తలు పరిశోధించవలె. వారు పరిశోధించరు. ఎందుకనగా వారి వ్రేళ్ళు పాశ్చాత్య దేశములందున్నవి.
    వ్యాస మహర్షి మహాభారతమును పంచమ వేదముగా కల్పించినాడు. వేదములందును , ఉపనిషత్తులందును ఉన్నదంతయు అందు చేర్చినాడు. కాని ప్రక్రియను మార్చినాడు. వేదము - లందువలె, ఉపనిషత్తులందువలె చెప్పలేదు. మిత్ర సంహితను సృష్టించినాడు. మనిషికి ఆసక్తి కలిగించు కధలల్లినాడు. ఆ కధలందు నీతులను ధర్మములను ప్రతిష్టించినాడు. ఇది ఒక మహత్కార్యము. ఒక బృహదావిష్కరణ.
    సత్యము చెప్పుము అనునది వేదవాక్యము. హరిశ్చంద్రుని కధ ద్వారమున సత్యము చెప్పుము అను ధర్మమును నిర్వచించినాడు. సత్యము చెప్పుట సమయ సందర్భములను బట్టి యుండును. అని వ్యాఖ్యానించినాడు. భారతమున వ్యాసుడు చెప్పని ధర్మమూగాని, వ్యాఖ్యగాని లేదనిన అతిశయోక్తి మాత్రముకాదు.
    భారతము భారతీయులకు మాత్రము వర్తించునది కాదు. అది సకల మానవాళికి ఉపకరించు మహాద్గ్రంధము.
    ఇంత మహోపకారము చేసిన వ్యాసుడు తన కొఱకు ఏమియు అర్ధించలేదు. ఆర్జించలేదు. అట్టి అభిలాష సహితము అతనికి లేదు.
    రచయుతలు ఎట్లుండవలెనో, ఏమి రచించవలెనో ఆచరించి చూపినాడు వ్యాస భగవానుడు. భోగ భాగ్యముల జోలికిపోక, జటావల్కలములు ధరించి ,రాజశ్రయము కోరక, స్వతంత్రముగా, నిర్వికారముగా మానవశ్రేయస్సు సాధించుటకు కవులు, రచయితలు కృషి చేయవలెనని నడిచి చూపినాడు.

        వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
        పరాశరాత్మజం వన్దే శకుతాతాం తపోనిదిం
    
                                     పరీక్షిత్తు శాపము.


    పరీక్షిత్తు అర్జునుడు మనమడు. అభిమన్యు ఉత్తరాల పుత్రుడు. పాండవుల తరువాత పరీక్షిత్తు రాజయినాడు. అతడు ధర్మముగా రాజ్యము పాలించినాడు. అతనికి వేటయనిన మక్కువ.
    పరీక్షిత్తు ఒకనాడు వేటకు వెళ్ళినాడు. అడవిలో దూరినాడు. అతనికి వేట ఒక ఆట. ఆట ఆడినాడు ఆడినాడు అలసినాడు. అలసినాడు ఒక మృగమును కొట్టినాడు. ఆ మృగము బాణపు దెబ్బతిన్నది. పడిపోలేదు. పారిపోయినది. పరీక్షిత్తు దానిని వెంటాడినాడు. అది ఉరికినది . అతడు ఉరికినాడు. అట్లు చాలా దూరము ఉరికినాడు. మృగము ఒక ఆశ్రమమున దూరినది. పారిపోయినది. మృగము పోయినది.
    మృగము దూరిన ఆశ్రమము శమీకునిది. శమీకుడు శాంతుడు. తపశ్శాలి అతడు ఒక చెట్టు కింద మౌనముగా ఉన్నాడు. తపము చేయుచున్నాడు. మృగము కొఱకు పరీక్షిత్తు అచటికి వచ్చినాడు. మునిని చూచినాడు. మృగమును గురించి అడిగినాడు. ముని మౌనమున ఉన్నాడు. మాట్లాడలేదు. అది చూచి పరీక్షిత్తుకు కోపము వచ్చినది. పక్కన ఒక చచ్చిన పాము పడి ఉన్నది. పరీక్షిత్తు దానిని చూచినాడు. తీసినాడు. శమీక మహర్షి మెడలో వేసినాడు. వెళ్ళిపొయినాడు. రాజధాని చేరుకున్నాడు.
    శృంగ శమీకుని కుమారుడు, యోగి. అతడు బ్రహ్మను గూర్చి తపము చేయుచున్నాడు. క్రుశుడు అను ముని శృంగి వద్దకు వచ్చినాడు. రాజు శమీకుని మెడలో చచ్చిన పామును వేసినాడని చెప్పినాడు. అది విన్నాడు శృంగి, కోపమున కాలిపోయినాడు. దోసిట నీరు తీసుకున్నాడు. శపించినాడు.
    "నా తండ్రి ముని. జన శూన్యమయిన అడవిలో ఉన్నాడు. ఇంద్రియములను నిగ్రహించినాడు. తపము చేయుచున్నాడు. పాల నురుగు మాత్రమే ఆహారముగా గ్రహించుచున్నాడు. ముసలివాడు అయినాడు అట్టి తపోధనుని పరీక్షిత్తు అవమానిమ్చినాడు. కాన నేటికి ఏడవనాడు తక్షక సర్పదష్టుడయి పరీక్షిత్తు మరణించును." అని దోసిటిలోని నీరు నేల మీద విడిచినాడు.
    తరువాత శృంగి శమీకును వద్దకు వెళ్ళినాడు. శమీకుడు తపోనిష్ఠలో ఉన్నాడు. అతనికి జరిగినది ఏమియు తెలియదు. చచ్చిన పాము తన మెడన ఉన్నది. అది కూడ అతనికి తెలియదు. శృంగి వచ్చినాడు. పామును మెడ నుంచి తీసినాడు. అప్పుడు శమీకుడు కనులు తెరచినాడు. శృంగి జరిగినదంతయు చెప్పినాడు. శమీకుడు విన్నాడు. కాని సంతసించలేదు. అతడు కొడుకును మందలించినాడు . అన్నాడు :-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS