Previous Page Next Page 

బస్తీమే సవాల్ పేజి 2


    "ఏమిటీ? అన్నీ నేను గెలవడమేనా? నన్ను గెలిచే వాళ్ళే లేరా?"

    "ఈ సవాల్ రాణీని సవాల్ చేసి గెలిచేవాడే లేడా? బస్తీమే సవాల్!" అప్పటికే అక్కడ చేరిన వాళ్ళ సొమ్ముని సొంతం చేసుకుంది. ఆడేవాళ్ళు ముందుకు రాకపోవడంతో మళ్ళీ సవాల్ ను విసిరింది.

    పరుశురామ్ పెదవులపైన చిన్న నవ్వు కదిలింది. జేబులోంచి పేకని తీసి గుప్పిట నాలుగువేళ్ళ మధ్య బిగించి బొటనవేలితో వాటిని విరిచాడోసారి. వాటికేసి చూశాడోసారి. ఆ పేక ముక్కలపైన నెత్తుటి మరకలు. అతని ముక్కుపుటాలు ఎగిరిపడినాయి.

    ఆ అమ్మాయి ఆట కట్టించాలి అన్న నిర్ణయానికొచ్చాడతను. కానీ ఆమె వెనక కొందరు రౌడీషీటర్స్ వుంటారని, అతడికి తెలుసు. అది జూదం అనకుండా 'సవాల్' పేరిట జనాన్ని దోచుకునే యత్నం అని పరుశురామ్ కి తెలుసు. సిగరెట్ పాకెట్ లోంచి సిగరెట్ ని తీసి పెదాలమధ్య పెట్టి వెలిగించాడు.

    చేత్తో గడ్డాన్ని సవరదీసుకున్నాడు పరుశురామ్.

    గరుకుగా తగిలింది గెడ్డం. షేవ్ చేసుకొని మూడురోజులైంది.

    జేబులో డబ్బు పాతికో ముప్పయ్యో వుంది.

    ఆ డబ్బుతోనే దాని దగ్గర సొమ్ముని మాత్రం గెలుచుకుని బుద్ధి చెప్పాలన్న నిర్ణయానికి వచ్చాడు పరుశురామ్.

    అదే సమయంలో సవాల్ రాణీ వెనుకవున్న పెద్ద చెట్టు పక్కగా ఓ కారు వచ్చి ఆగింది. కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఓ స్త్రీ కళ్ళమీంచి కూలింగ్ గ్లాసెస్ ని ముక్కు మీదకి జరిపి పరుశురామ్ ని, సవాల్ రాణీని ఆసక్తిగా చూస్తోంది.

    ఆమెకి అక్కడ జరుగుతోంది స్పష్టంగా కనిపిస్తోంది. సంభాషణలు కూడా చక్కాగా వినిపిస్తున్నాయి.

    పరుశురామ్ సిగరెట్ పొగ పీలుస్తూ ముందుకు వచ్చి.

    "నిన్ను నేను గెలుచుకుంటాను!" అన్నాడు.

    ముక్కలు కలుపుతూ ఎగాదిగా చూసిందతనికేసి.

    "ఓయ్ ఓయ్.... ఒళ్ళు ఎలా వుంది. నన్ను గెలుచుకోవడం నీ అబ్బతరం కూడా కాదు తెలుసా" అంది.

    "నా అబ్బవరకు అవసరం లేదు. నీతోపాటు నీ అబ్బని కూడా అబ్బా! అనిపిస్తాను సరేనా!" అన్నాడతను.

    "అంత పోటుగాడివా!" ఎగతాళిగా అతని మొహంలోకి చూస్తూ పేకముక్కల్ని కలుపుతోంది సవాల్ రాణీ.

    "ఆటగాడిని"

    "అయితే ఆలేవా?" ఒయ్యారాలు పోతూ పెదాలని సున్నాలా చుట్టి నాలుకతో తడిచేస్తూ కళ్ళని చక్రాల్లా తిప్పుతూ అంది.

    "ఆడిస్తాను" మెల్లగా అన్నాడు పరుశురామ్.

    "ఏమిటి?" కళ్ళు పెద్దవి చేసి అడిగింది.

    "ఆట.... నీ తిక్కకుదిరే వరకూ, నీ నడుం విరిగేవరకూ ఆడిస్తాను.... ఆట...." వత్తిపలికాడు పరుశురామ్.

    సవాల్ రాణీ నవ్వింది. ఆ నవ్వు ఎలాంటి మగడినైనా చిత్తు చేసేలా వుంది.

    "పాపం వూరికి కొత్తవాడిలా వున్నావు" అంది.

    "ఏం ఫర్వాలేదు. కొత్తవాడినైనా బాగానే ఆడించగలను" అన్నాడు పరుశురామ్. వాళ్ళ మాటలకి జనం నవ్వుతున్నారు.

    "ఏయ్! మాట్లాడితే ఆడించగలను, ఆడించగలను" అంటున్నావు. నన్ను ఆడించడం అంత తేలికనుకొన్నావా? దమ్ముంటే రా! బస్తీ మే సవాల్! రోషంతో సవాల్ చేసింది రాణీ.

    "సవాల్ అంటే తొడ కొట్టడం నాకు అలవాటు" అన్నాడతను.

    "ఒళ్ళు మరిచి తొడకొడితే గురి తప్పి తగలరాని చోట తగిలి నక్షత్రాలు కనిపిస్తాయి.
కట్టు పందెం!" అంది హేళనగా.

    "కలుపు పేక!"

    ఆమె వేళ్ళమధ్య ముక్కలు చకచకా కదులుతున్నాయి.

    ఆ మూడు ముక్కల్లో ఒకటి రాణీ బొమ్మ వుంటుంది. దాన్ని గుర్తించి పందెం వేయాలి.

    చుట్టూ చేరిన గుంపు ఆసక్తిగా చూస్తున్నారు. కబుర్లు, బడాయి మాటలేగానీ ఆ రాణీని గెలవడం అతని తరం కాదని వాళ్ళకి తెలుసు. అందుకే జాలిగా చూస్తున్నారతనికేసి.

    కారులో కూర్చుని చూస్తున్న స్త్రీ మొహంలో చిరునవ్వు.... ఉత్సాహం.... ఆమె కారు దిగి కొంచెం ముందుకొచ్చి నిలబడింది.

    జేబులోంచి పది రూపాయలు తీసి ఓ ముక్క పైన వేసి "ఇదే రాణి అన్నాడు పరుశురామ్.

    సవాల్ రాణీ ఉలిక్కిపడ్ తన ఉలికిపాటుని కప్పిపుచ్చుకొంటూ అతని మొహంలోకి చూస్తూ "బోడి పది రూపాయలా!" అంది క్రింద ముక్కల్ని మార్చేయడానికి ప్రయత్నిస్తూ.

    "పిచ్చి వేషాలు వేయకు. నాకు ఇంద్రుడిలా ఒళ్ళంతా కళ్ళే! ముక్క తిప్పు!" అన్నాడు పరుశురామ్.

    సవాలు రాణీ బిక్క మొహం పెట్టి ముక్కని తిప్పింది.

    అది రాణీ బొమ్మ.

    అతను గెలవడం చూసి జనానాకి తాము గెలుచుకున్న అనుభూతి కలిగింది.

    తన గ్యాంగ్ మనుషులకేసి ఓసారి చూసి పదికి పది ఇరవై రూపాయలు పరుశురామ్ చేతిలో పెడుతూ.

    "ఏ ఊరు మనది?" అంది.

    "బందరు!" చెప్పాడు.

    "మొహం చూసినప్పుడే అనుకున్నాను. సోడాబుడ్డి మొహం నువ్వూను" ఈసడింపుగా అంది.

    "కబుర్లొద్దు. ఆడించమన్నావు కదా! నీ ఓపిక ఎంతుందో చూడనీ- రా.... పరువూ."

    రాణీ ముక్కల్ని కలిపింది. పరిచింది. పరుశురామ్ గెలిచాడు మళ్ళీ.

    ప్రతిసారీ పరుశురామ్ గెలుస్తుండడంతో జనం ఉత్సాహంగా ఈలలు వేస్తున్నారు. ఎవరో అన్నాడు.

    "వీడు కూడా దాని ముఠాలోని మనిషేనేమో!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS