Previous Page Next Page 

చీకటికి అవతల పేజి 2


    "మొత్తానికి ఇంత డేరింగ్ గా వ్యవహరించే నీలాంటి అమ్మాయి గుట్టుగా పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకుంటున్నదంటే గ్రేట్"

 

    "గ్రేటూ కాదు- పాడూ కాదు. చేతకానితనం. గట్స్ లేని ప్రికితనం. చిన్నప్పుడు ఐస్ క్రీమ్ కొనిమ్మని అమ్మానాన్నలను అడిగినట్టు, వయసొచ్చాక మొగుడు కావాలని తల్లిదండ్రులవైపు చూడడం సిగ్గుచేటు. అంతే తప్ప అదేదో గొప్ప విషయమన్నట్టు మాట్లాడడం ఎందుకో తెలియదుగానీ నాకు నేనై ఓ అబ్బాయిని సెలెక్ట్ చేసుకోలేకపోయాను.

 

    ఖచ్చితంగా ఇది నా ఫెయిల్యూర్ అని మాత్రం చెప్పగలను. ఇంతలో అమ్మా నాన్న ఈ సంబంధాన్ని ఖాయం చేశారు. నాకూ ఏమీ అభ్యంతరం కనపడలేదు. అందుకే ఒప్పేసుకున్నాను."

 

    "ఎనీహౌ బెస్టాఫ్ లక్"

 

    "దేనికి? నా వయసుకా? నా మనసుకా?"

 

    "రెంటికి"

 

    "థాంక్యూ"

 

    అలా వాళ్ళిద్దరూ వాళ్ళలోకంలో వుండగా వాళ్ళకి అభిముఖంగా ఓ కుక్క వస్తోంది. అది సాదా సీదా వీధికుక్క కాదు. నక్కకీ, తోడేలుకీ పుట్టినట్టు క్రూరంగా వుందది. దాని కళ్ళు నీలం గాజుగోళీల్లా మెరుస్తున్నాయి. బయటికి పొడవుగా సాగిన నాలుక ఎర్రగా రక్తంలో ముంచిన స్పాంజ్ ముక్కలా వుంది.

 

    మూతి దగ్గరున్న నల్లటి వెంట్రుకలు గుచ్చిన ఇనుపతీగల్లా కనిపిస్తున్నాయి. మూతిలో పొడుచుకొచ్చిన కోరలు మొనదేలి పాతకాలం నాటి రాతి ఆయుధాల్లా వున్నాయి. నల్లటి బొచ్చుమీద అక్కడక్కడ తెల్లటి చారికలున్న ఆ కుక్క బలంగా, నిలువెత్తు మనిషిని నిలువునా చీల్చేసేలా భయంకరంగా వుంది.

 

    అది వాళ్ళని సమీపించినా వాళ్ళు గమనించలేదు.

 

    అది ఏమీ తెలియని నంగనాచిలా నడుస్తూ, దీపశిఖ పక్కనుంచి వెళుతూ చటుక్కున ఆమె ముంజేతిని నాలుకతో రాసింది.

 

    అప్పుడు చూసింది ఆమె దాన్ని. ఒక్కక్షణం ఉలిక్కిపడి అప్రయత్నంగా దూరంగా జరిగింది.

 

    "ఏమైందే- కరిచిందా?"

 

    అప్పటికే ముందుకి పదడుగుల దూరం వెళ్ళిపోయిన దానిని చూస్తూ-

 

    "లేదు. నాలుకతో రాసింది. ఛీఛీ" అంది ఆమె అసహ్యాన్నంతా ముఖంలోకి తెచ్చుకుని.

 

    "ఇంటికెళ్ళి నీళ్ళతో కడిగేసుకో"

 

    దీపశిఖ తన కుడిచేయి మణికట్టువైపు చూసుకుంది. అక్కడ చెమ్మగా వుండడంతో అటూ ఇటూ చూసి విధిలేని పరిస్థితుల్లో తను వేసుకున్న జీన్ ప్యాంట్ కు తుడిచేసుకుంది. వెనక్కి తిరిగి చూస్తే మరింత దూరానికి వెళ్ళిపోయిన కుక్క కనిపించింది.

 

    అంతటితో దానిమాట మరిచిపోయి మళ్ళీ ఇద్దరూ కబుర్లలో పడ్డారు. మరో రెండు నిముషాల నడకతో సెంటర్ చేరుకున్నారు. దీపశిఖ ఆ రోజే వచ్చిన ఓ మాగజైన్ కొన్నది. ఏదో ఒకటి చదువుతూ నిద్రపోవడం ఆమెకి అలవాటు. అంతలో లంబాడీ హిల్స్ కి వెళ్ళే బస్సు వచ్చింది.

 

    "మరి నే వస్తానే" అని స్నేహితురాలి దగ్గర సెలవు తీసుకుని బస్సెక్కింది వైజయంతి.

 

    "ఓ.కే. రేపు పదిగంటలకల్లా వచ్చేసెయ్" దీపశిఖ చేయి ఊపుతూ చివరిసారి చెప్పింది.

 

    "తప్పక వస్తాను"

 

    బస్సు బయలుదేరడంతో తిరిగి ఇంటికి బయలుదేరింది దీపశిఖ. ఇంటికి వెళ్లగానే చేతులు శుభ్రం చేసుకోవాలనుకున్నా ఆమె తీరా ఇంటికి చేరుకోగానే ఆ మాట మరిచిపోయింది. కారణం ఇంటినిండా బంధువులే. వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళకి ఏం కావాలో అమరుస్తూ వుండిపోయింది.

 

    భోజనాలు పూర్తయ్యేప్పటికి పదైంది.

 

    "ఇవేళయినా తొందరగా పడుకో. రేపు అయిదుగంటలకల్లా లేవాలి. స్నానం చేసి మన కులదేవతకి పూజ చేయాలి" తల్లి శాంతిమతి హెచ్చరిస్తున్నట్లు చెప్పింది కూతురితో.

 

    "తెల్లవారి నిశ్చయ తాంబూలాలు పెట్టుకుని ఈ రాత్రి తొందరగా నిద్రపడుతుందా ఏ ఆడపిల్లకైనా" వదిన వరసయ్యే సుజాత దీపశిఖవైపు చూసి కన్నుగీటుతూ పరిహాసంగా అంది.

 

    "పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఎలాగూ నిద్రపోరని తెలిసే పెళ్ళి ముహూర్తాలన్నీ తెల్లవారుజామునే పెడతారు కాబోలు" ఎదురుగా ఎవరున్నా ఫ్రీగా మాట్లాడటం దీపశిఖ నైజం.

 

    "నీకు నిద్రరాదని ముందే చెబితే నిశ్చయ తాంబూలాలు కూడా తెల్లవారుజామున ఏ మూడింటికో, నాలుగింటికో పెట్టమని చెప్పుండేదాన్ని" సుజాత సాగదీస్తూ అంది.

 

    "సరేలేగాని నువ్వెళ్ళి పడుకో" అంతటితో ఆపు చేయమన్నట్టు కూతుర్ని లోనికి వెళ్ళమని పురమాయించింది శాంతిమతి.

 

    దీపశిఖ తన బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.

 

    ఆ గది చాలా పెద్దది. గోడలే తెల్లటి వెలుగులు విరజిమ్ముతున్నట్టు దీపాలను గోడల్లోపలే తాపడం చేశారు. పాలకడలిలో నిశ్చలంగా నిలబడి వున్నట్లు పూలపడవలా డబుల్ కాట్ వుంది.   

 

    తను వేసుకున్న జీన్ ప్యాంటూ, షర్టూ తీసివేసి సిమెంట్ రంగు నైటీ వేసుకుంది దీపశిఖ.

 

    ఓ మూలనున్న నిలువెత్తు మిర్రర్ లో చూసుకుంటూ నైటీ వెనక నున్న జిప్ వేసుకుంది.

 

    మరో నెలరోజులకి పెళ్ళి. ఇన్ని సంవత్సరాలు తన అందాలకు కాపలా కాసిన ఈ నైటీలు పెళ్ళయ్యాక అప్పుడప్పుడు గుడ్ నైట్ చెప్పేస్తుంటాయి కాబోలు. ఆ సమయంలో తన అందం హరీష్ కళ్లల్లో ఆవేశమై పరుచుకుంటుంది. మనిషంతా కోరిక అయిపోయి తనను కౌగిలించుకుంటాడు.

 

    మొదటిసారి తనను పెళ్ళిచూపుల్లో చూసినప్పుడే అతని కళ్ళల్లోని కొంటెదనం తన శరీరానికి చక్కిలిగింతలు పెట్టింది. అప్పుడప్పుడు అతని చూపులు తన ఎదమీద పారిజాతాలతో కొట్టినట్టు తాకాయి. ఠక్కున తను ఎద కనపడకుండా రెండు చేతులనీ నొక్కుకుంది. అలా చేసినప్పుడు తనకు ఆముక్తమాల్యదలో ఒక సన్నివేశం గుర్తుకొచ్చింది.

 

    వాళ్ళ పేర్లు మరిచిపోయిందిగానీ అందులో నాయకుడికీ, నాయికకీ, పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ ఒక పద్యముంది.  

 

    పెళ్ళికూతురు అక్కడే చూస్తున్నాడని గ్రహించిన ఆమె చేతులు పైకెత్తకుండానే దోసిట్లో వున్న తలంబ్రాలను అతనిపైకి విసురుతుంది. ఇదంతా గుర్తొచ్చి సిగ్గుతో బుగ్గలు మరింత ఎరుపెక్కాయి.

 

    ఈ ఊహలతో దీపశిఖకి హరీష్ గుర్తుకొచ్చాడు. వెంటనే అతన్ని చూడాలనిపించింది కానీ అతను రాలేదు. నిశ్చయ తాంబూలాలు పుచ్చుకొనేప్పుడు పెళ్ళికొడుకు రాకూడదన్నది వాళ్ళ ఆచారం. అలాంటి చెత్త ఆచారాన్ని పెట్టిన పెద్దలను తిట్టుకుంది. అలా అసహనంగానే వెళ్ళి బెడ్ మీద పడుకుంది. శరీరానికి మరేదో సుఖం కావాలనిపిస్తుండడంవల్ల బెడ్ మీద పడుకున్న హాయి మొదటిసారి మనసుకి తగలడంలేదు. అటూ ఇటూ దొర్లిందిగానీ నిద్ర రావడం లేదు.

 

    పెళ్ళి చూపులయ్యాక హరీష్, తనూ విడిపోయిన సంఘటన గుర్తొచ్చింది ఆమెకి.

 

    అంతా బయల్దేరుతుంటే దీపశిఖ మాత్రం తన గదిలోనే వుండిపోయింది. అంతకు ముందు జరిగినదంతా నెమరేసుకుంటూ కూర్చొనుంది.

 

    ఎవరో వస్తున్న అలికిడైతే లేచి నిలుచుంది.

 

    డోర్ కర్టెన్ ని పక్కకు నెత్తి హరీష్ ద్వారం దగ్గర నిలబడిపోయాడు.

 

    ఆమెకి ఏం చేయాలో పాలుపోలేదు.

 

    తల వంచుకుని నిలబడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS