Next Page 

చక్రవ్యూహం పేజి 1

                                                                
                         చక్రవ్యూహం
                                                                           -సూరేపల్లి విజయ    అవని రోడ్డు మీదికి వచ్చేసింది.  స్కూళ్ళు,  ఆఫీసులు, షాపులు తెరిచే సమయం కావడం  వల్ల  రోడ్లు వాహనాలతో కిక్కిరిసి వున్నాయి.
    సెప్టెంబర్ నెల కావడంతో ఇంకా సూర్యుడు తన ప్రతాపం చూపించడం లేదు.
    స్వెట్టర్లు వేసుకునే జనం రోడ్డు మీదికి వచ్చారు.  అవని కైనెటిక్  హొండా జనం మధ్య నుంచి దూసుకువెళ్తోంది.  డ్రైవ్ చేస్తూనే రిస్టువచికేసి  చూసుకుంది.  తొమ్మిదియాభై.  మరో పదినిమిషాల్లో తను ఆఫీసులో వుండాలి.  ఈ వేళకి  బాస్ కూడా వస్తాడు.  అతడు దేన్నయినా క్షమిస్తాడు కాని ఆలస్యాన్ని క్షమించడు.
    వెహికల్ ని స్పీడ్ గా  పోనిస్తున్నది.  ఇదే స్పీడ్  మెయింటైన్ చేస్తే తను పదినిమిషాల్లో అక్కడికి  చేరుకోవచ్చు.
    అవని మాస్టర్ అండ్  మాస్టర్ కంపెనిలో స్టెనో కమ్ పి.ఏ. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ బిజినెస్ చేసే  ఆ కంపెనీ బ్రాంచి సికింద్రాబాద్ లో  వుంది.
    మొదటి హాబీగా చేద్దామనుకున్న ఉద్యోగం ఇప్పుడు కాస్త అవసరం కూడా అయింది.  తండ్రి సూర్యనారాయణ పోయిన నెలలోనే రిటైరయ్యాడు. తల్లి  మహాలక్ష్మి భర్త చాటు భార్య.  ఈ ప్రపంచం గురించి, ప్రపంచం పోకడ గురించి ఏ మాత్రం తెలియదు.  తమ్ముడు డుంబు సెవెన్త్ స్టాండర్ట్. చాలా ఆలస్యంగా పుట్టాడు.
    పోస్టల్ డిపార్ట్ మెంట్ లో   పోస్ట్ మాస్టర్ గా  సిన్సియర్ గా  పని చేసి రిటైరయ్యాడు తండ్రి. ఓ మిడిల్ క్లాస్ ఇల్లు కొనగాలిగాడు.  ఓ లక్షరూపాయల వరకు కూతురు అవని పెళ్ళి కోసం బ్యాంకులో వేశాడు. అంతకుమించి ఆస్తిపాస్తులేమీ  లేవు.
    తండ్రికొచ్చే  కొద్దిపాటి పెన్షన్ సరిపోదని అవని నిశ్చితాభిప్రాయం.  కనీసం తమ్ముడు డిగ్రీ చదివే వరైకనా తను వుద్యోగం చేస్తే,  తండ్రికి సాయం చేసినట్టు వుంటుందని మాస్టర్ అండ్ మాస్టర్ కంపెనిలో వుద్యోగం చేస్తోంది.
    అవని చాలా అందంగా వుంటుంది.  ఎంతందంగా అంటే...కాలేజిలో చదివే రోజుల్లోనే కాలేజీ లెక్చరర్  పైసా కట్నం లేకుండా అవనిని చేసుకుంటానన్నాడు.
    అలా చాలామంది అవనిని  చేసుకోవడానికి ముందుకొచ్చినా,  తన అందం చూసి కట్నం లేకుండా పెళ్ళి చేసుకుంటాననే మగవాళ్ళని తిరస్కరించింది.  తన మనసుకు నచ్చినవాడ్నే చేసుకోవాలని నిర్ణయించుకుంది.
    ఆ మనసుకు నచ్చిన  వ్యక్తి పేరు అనిరుద్ర.
                                *    *    *
    "ఏయ్ అమ్మాయి...ఏమిటా డ్రైవింగ్..ఇంట్లో చెప్పి రాలేదా?"  ఎవరో అరిచేసరికి ఉలిక్కిపడింది  అవని.  తను ఒకే స్పీడ్ లో వెళ్తోంది.  ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ పడింది.  తను చూడకుండా వెళ్తోంది.  వెంటనే బ్రేక్ వేసింది.
    ఏదో ఆలోచిస్తూ వుండిపోవడం వల్ల కలిగిన ఇబ్బంది అది.  తండ్రి ఎన్నోసార్లు చెప్పాడు- "అవన్ని! డ్రైవింగ్ చేసేటప్పుడు ఆలోచించొద్దు.  ఆలోచించేటప్పుడు డ్రైవింగ్ చేయొద్దని.."
    టైం చూసుకుంది.  తొమ్మిది యాభై అయిదు దాటింది.
    సరిగ్గా పదిగంటలకు కైనెటిక్ హొండా  ఆఫీసు ముందు పార్క్ చేసి లోపలికి పరుగెత్తినంత వేగంగా నడిచింది. ఆమె అదృష్టం బావుంది.  బాస్ రాలేదు.
    "హాయ్ అవనీ...నిన్ను చూసి టైం  సెట్ చేసుకోవచ్చు.  భలే టైం మెయింటైన్ చేస్తావు.  పది గంటలకు ఒక్కక్షణం  కూడా ముందు రావద్దని ఒట్టేసుకున్నావా?"  అండిగింది వసుధ నవ్వూతూ.
    ప్యాకింగ్  సెక్షన్ ని   సూపర్ వైజ్ చేస్తుంది  వసుధ.  ఎప్పడూ సరదాగా మాట్లాడుతుంది.  పేరుకూ ఆమె మనస్తత్వానికీ  పొంతన వుండదు. గలగలా మాట్లాడేస్తుంది.  ఏ బాదరాబందీ లేదు.  వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో వుంటుంది.
    కామెంట్ విని నవ్వుకుంది అవని.
                   ఈలోగా క్యాషియర్  శేషశాయి తను చేస్తోన్న పనిని ఆపి అవని వంకే చూడసాగాడు.
    "చూడవే అవనీ...నువ్వు రాగానే ఎలా చొంగ కారుస్తూ చూస్తున్నాడో...వాడి  కళ్ళెప్పుడూ నిన్నే వెంటాడుతాయి.  నలభై అయిదేళ్ళొచ్చినా ఇంకా ఆ 'యావ'  తగ్గనట్టుంది"  అంది వసుధ.
    "ఛ...వూర్కోవే"  అంది అవని.
    "నువ్వూర్కుంటే సరే...అయినా వాడికి నువ్వంటే భలే ఇదే"  అంది.
    "ఏది?" అయోమయంగా అడిగింది అవని.
    "అబ్బ..నువ్వు వుత్త పప్పుసుద్ధవి. ఇది అంటే అదేలే.  అయినా వాడికేంటి?  నిన్ను చూస్తే ఎవడు మాత్రం కళ్ళు తిప్పుకోకుండా వుంటాడు.  నేనే గనుక నీలా వుంటేనా?  జంట నగరాలను అదరగొట్టేద్దును"  అంది.
    రెండు చేతులూ జోడించి ఇక ఆపేయమన్నట్టు  అంది అవని.
    "సర్లే...ఇప్పటికి  క్షమించేస్తున్నా...అన్నట్టు మధ్యాహ్నం క్యాంటీన్ లో  చికెన్ పకోడి చేస్తున్నారట.  ఇప్పిస్తావా?"  అంది.
    "అలాగే"  అంది నవ్వూతూ అవని.
    అవని అటెండెన్స్ రిజిష్టర్ లో  సంతకం పెట్టి తన సీట్లో కూర్చుంది.  
                  *        *      *
    ఉదయం పదిన్నర.
    మాస్టర్ అండ్ మాస్టర్ కంపెనీ యం.డి ఫెడ్రిక్ కారు ఆఫీసు  ముందాగింది.  డ్రైవర్ కారు దిగి డోర్ తెరిచి,  వినయంగా వంగి నిలబడ్డాడు.
    నలభయ్యేళ్ళ వయసున్న ఫెడ్రిక్ హుందాగా కారులో నుంచి దిగాడు.  స్కై కలర్ సూట్ లో  వున్నాడు.  కొద్దిగా బట్టతల వచ్చింది.
    ఇంకా అతను బ్రహ్మచారే,  ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు.  అతని బ్యాగ్రౌండ్ కూడా చాలామందికి  తెలియదు.
    దేశంలోని చాలా ప్రధాన  పట్టణాల్లో ఇతనికి ఆఫీసులున్నాయి.
    చాలా స్ట్రిక్ట్.  ఉద్యోగస్దుల్లో డిసిప్లిన్ లేకపోవడాన్ని భరించలేడు.
    వారంలో మూడునాలుగు రోజులు ఇక్కడే వుంటాడు.  మిగతా రోజుల్లో, మిగతా ఆఫీసులను విజిట్ చేస్తాడు.
    ఒకటో తారీఖుకల్లా ఠంచన్ గా జితాలిస్తాడు.        
                     *        *           *
    తన ఛాంబర్ లోకి వెళ్ళగానే బెల్ కొట్టి ప్యూన్ ని పిలిచాడు ఫెడ్రిక్.
    ప్యూన్ హనుమంతు పరుగెత్తుకొచ్చాడు ఛాంబర్ లోకి.
    అతనివైపు పరిశీలనగా చూశాడు.
    గతుక్కుమన్నాడు ప్యూన్.  నీట్ నెస్ లేకపోవడం బాస్ భరించలేడని తెలుసు.
    "షేవ్ చేసుకొని ఎన్నిరోజులైంది?"  తీక్షణంగా అతనివైపు చూస్తూ అడిగాడు ఫెడ్రిక్.
    "మూడు..మూడ్రోజులు సార్!"
    "రోజూ నీట్ గా  షేవ్ చేసుకోవాలని తెలియదా?"
    "అది..అదీ..."
    "అడుగుతున్నది నిన్నే..కమాన్ టెల్ మీ..."
    "తె..తెలుసు సార్."
    "మరెందుకు చేసుకోవు.  మన ఆఫీసుకు వచ్చేవాళ్ళు మాసిన గడ్డంతో  వున్న నిన్ను చూసి ఏమనుకుంటారు?"
    తల వంచుకున్నాడు ప్యూన్.
    రోజూ షేవ్ చేసుకుంటే ఒక్క బ్లేడు వారం కూడా రాదని బాస్ కి   ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.
    "వచ్చే నెల నుంచి ఓచర్ మీద నెలకు యాభై తీసుకో.  నేను క్యాషియర్ కు  చెప్తాను.   ఈ యాభై  దేనికో తెలుసా?  నీ  బ్లేడు ఖర్చులకు. రేపట్నుంచి రోజూ షేవ్ చేసుకోవాలి.  అండర్ స్టాండ్!" అన్నాడు ఫెడ్రిక్
    "ఆ..అలాగే సార్" అన్నాడు.  ఆ లెక్కన తనకే ఓ పాతిక మిగులుతాయి.
    "వెళ్ళు...వెళ్ళి  స్టెనోని  పిలువు.
    "అలాగే సార్"  అంటూ బ్రతుకుజీవుడా  అనుకుంటూ బయటపడ్డాడు ఛాంబర్ లో  నుంచి.
                      *          *            *
    "మేడమ్! మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు"  అవని టేబుల్ దగ్గరకు వచ్చి వినయంగా చెప్పాడు హనుమంతు.
    అందరితో జోకులేస్తూ సరదాగా వుంటాడు ప్యూన్.  అవని దగ్గర మాత్రం కాస్త భయంగానే వుంటాడు.  ఎప్పడూ రిజర్వ్ డ్ గా   వుండి తన పని తను చేసుకునే అవని అంటే హనుమంతుకు భయం, గౌరవం కూడా!
    ఫైల్ తీసుకుని లేచి బాస్ ఛాంబర్ వైపు నడిచింది.
                             *    *    *
    "మే  ఐ  కమిన్ సార్!"
    "యస్..కమిన్"   అన్నాడు ఫైల్లో  నుంచి తలెత్తకుండానే.
    అవని వచ్చి  అతని ఎదురుగా నిలబడింది.
    "ప్లీజ్ బి సీటెడ్"  అన్నాడు గంభీరంగా.
    ఓ పక్కకు ఒదిగి కుర్చీలో  కూర్చుంది.
    ఏ. సి.  చల్లదనం  వల్ల  ముడుచుకుపోయింది.
    ఒక్కక్షణం కళ్లార్పకుండా చూసి వెంటనే తన  దృష్టిని ఫైల్ వైపు సారించి...
    "ఢిల్లీకి  పంపిచాల్సిన పార్శి ల్స్  అన్నీ పంపించేశారా?"
    "పంపించాను సార్!  స్పీడ్  కొరియర్ కు ఇచ్చేసాం.  వాటి తాలూకు రిసీట్స్... నాలుగు రోజుల క్రితం ముంబాయ్ కి పంపించిన పార్శిల్స్ తాలూకు పి.వో.డి.లు (ప్రూఫ్ ఆఫ్ డెలివరి)  ఇవిగో సార్..."అంటూ ఓ ఫైల్ లోని పేపర్లో ఇచ్చింది.
    "దట్స్ గుడ్..నెక్స్ ట్  వీక్ నుంచి సురుచి పికిల్స్ ని మనం ఎక్స్ పోర్ట్ చేస్తున్నాం.  ఆ కంపెనీతో మనకో అగ్రి మెంట్ కుదిరింది. ఎక్స్ పోర్ట్ బాధ్యత మనకు అప్పగించింది.  ఆ కంపెనీకి వున్న గుడ్ రెప్యుటేషన్   మీకు తెలుసనుకుంటాను.  వాటికి సంబంధించిన వివరాలున్న ఫైల్  ఇదిగో" అంటూ తన చేతిలో వున్న ఫైల్ అవనికిచ్చి "ఈ  డిటైల్స్ అన్నీ కంప్యూటర్ లో ఫీడ్ చేయండి.  అన్నట్టు ఈ అగ్రిమెంట్ విషయం ఇప్పడిప్పడే  బయటకు లీక్ కాకూడదు.  బి కేర్ పుల్."
    "అలాగే సార్!"  అని లేచింది అవని.
    అవని వెళ్ళబోతుంటే..."మిస్ అవనీ!"  అని పిలిచాడు ఫెడ్రిక్.
    "యస్సార్" అంది ఆగి వెనక్కి తిరిగి.
    ఏదో మాట్లాడబోయి ఆగిపోయాడు.
    "చెప్పండి సార్!"  అంది పోలయిట్ గా  అవని.
    "యూ ఆర్ వేరి స్మార్ట్"  అన్నాడు లోగొంతుకతో.
    దాన్ని కాంప్లిమెంట్ గా  స్వీకరించి "థేంక్యూ"  అంది అవని.
    "శారీస్ చాలామంది లేడిస్ కు నప్పుతాయి.  కాని ఇంత ఇదిగా మీకే నప్పుతాయి."
    సిగ్గు పడిపోయింది అవని ఆ కాంప్లిమెంట్ కు.  మామూలుగా చాలా హుందాగా,  గంభీరంగా వుండే బాస్ అలా కాంప్లిమెంట్ ఇచ్చినందుకు ఓవైపు ఆనందంగా వున్నా పరాయి పురుషుడు,  తన అందాన్ని పొగడ్డం కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది.
                          *        *           *
    లంచ్ లో  ఆఫిస్ ప్రెమిసెస్ లోనే వున్న క్యాంటిన్ కు  వెళ్ళారు వసుధ,  అవని.
    "ఏంటి అవని...బాస్ ఎందుకు పిలిచారు?"   అడిగింది వసుధ.
    కాంట్రాక్ట్ విషయం చెప్పొద్ధనడం గుర్తొచ్చింది.  "ఏవో రెండుమూడు లెటర్స్ డిక్టేట్ చేశాడు"  చెప్పింది అవని.
    "అంతేనా...ఇంకేమీ చెప్పలేదా?" అంది అవనిని టీజ్ చేస్తూ.
    "ఇంకేం చెప్తాడు"  అడిగింది అమాయకంగా అవని.
    "అబ్బబ్బ.. అన్నీ నీకు డిటెయిల్డ్ గా టీ.వి  సీరియల్ టైపులో జీడిపాకంలా చెప్పాలి.  అయినా ఇంతందంగా వున్న నిన్ను చూస్తూ కూడా ఎలా డిక్టేట్ చేయగలిగాడు?"  అంది వసుధ.
    తనని మెచ్చుకున్నాడని చెప్తే ధాన్ని కొండంతలు చేసి, ఆఫీసంతా టాం టాం చేస్తుందని చెప్పలేదు.
    వేడి వేడి చికెన్ పకోడి తెప్పించుకున్నారు.
    ఈలోగా హనుమంతు వచ్చాడు.
    "వసుధా మేడమ్.. మీరు ఇక్కడున్నారా?  ఈ విషయం ఉదయం నుంచి మీకు చెప్పాలని ఎంత ట్రై చేసానో...నా  కడుపు  ఉబ్బిపోతోంది.  నేనిక వుండలేను"  అన్నాడు హనుమంతు.
    "ఏ  విషయం అయినా బయటకు చెప్పనిదే నీకు నిద్ర పట్టదుగా చెప్ప  చెప్పు" అంది వసుధ.
    ఉదయం తనని బాస్ షేవింగ్ గురించి అడగడం,  యాభై రూపాయలు ఓచర్ మీద తీసుకోవడం చెప్పాడు.
    పడీ పడీ   నవ్వింది వసుధ.
    "ఈ బాస్ ఒక పెక్యూలియర్ క్యారెక్టర్.  నాక్కూడా గడ్డం వుంటే బావుండేది.  ఆ దేవుడు ఆడాళ్ళకు గడ్డం,  మీసాలు ఎందుకు పెట్టాలేదో?   నాకూ ఓ  యాభై నెల నెలా వచ్చేవి"  అంది   వసుధ.
    "ష్..అవేం మాటలు"  అంది అవని.
    ఈలోగా క్యాషియర్ శేషసాయి కూడా వచ్చాడు.  వస్తూనే హనుమంతుని చూసి "ఏంటోయ్..నెల నెలా యాభై రూపాయలు నీకివ్వమన్నారు బాస్, ఏంటి కధ?"  అని అడిగాడు.
    వాళ్ళ మాటలు అలా కొనసాగుతూనే వున్నాయి.  అవని మాత్రం బాస్ మనస్తత్వం గురించే ఆలోచిస్తోంది.
    సరిగ్గా అప్పడే ఆ క్యాంటీన్ లో వున్న నల్లరంగు టెలిఫోన్ మోగింది.  ఓల్డ్ మోడల్ ఫోన్ అది.                                    

Next Page