Next Page 

కలగంటినే చెలీ పేజి 1

                 

             కలగంటినే చెలీ!
                                                               - మేర్లపాక మురళి
           
    సాయంకాలమైంది.

    కృష్ణుడి అనుభవం దృష్ట్యా గయుడు భూమిమీద కాకుండా ఆకాశంలో తన తాంబూలవు ఎంగిలి ఊసినట్లు పడమటి ఆకాశం ఎర్రగా వుంది.

    లోకంమీద రాత్రి వాలడానికి వీలుగా మొత్తం ప్రపంచాన్నంతా శుభ్రం చేస్తున్నట్టు గాలి వీస్తోంది.

    రామాపురం ఆ సాయం సంధ్యలో దేవతలు వేసిన సెట్టింగ్ లా వుంది.

    రామాపురం అని సింపుల్ పేరున్న ఆ ఊరు కాస్త పెద్దదే. వేయి గడపలుంటాయి. కోడిచుట్టూ దానిపిల్లలు చేరినట్టు దానికి చుట్టూ చిన్న గ్రామాలు నాలుగుదాకా వున్నాయి.

    ఉమ్మడి కుటుంబంలా అవి కూడా రామాపురం పంచాయితీలోనే వుంటాయి.

    ఆ సాయంకాలంపూట ఆ ఊర్లోని కుంకారంతా రావిచెట్టు దిమ్మ మీద చేరి ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తోంది.

    అంతలో అక్కడికి సుబ్బారావు వచ్చాడు.

    "ఏం ఆకాశవాణి సుబ్బూ! ఏమిటి వార్తలు?" అని అడిగాడు సుబ్బారావు రాగానే ఓ యువకుడు.

    "నేటి వార్తల్లోని ముఖ్యాంశం -ఎట్టకేలకు రాత్రి మంగళను రామూ పట్టేశాడు" సుబ్బారావు వార్తలు చదువుతున్న ఫక్కీలో అంటూ కుర్రకారు మధ్యలో చోటు చూసుకుని కూర్చున్నాడు.

    "అవునా?" ఒకరిద్దరు ఆశ్చర్యాన్ని ప్రకటించారు.

    "ఈ ఆకాశవాణి సుబ్బారావు ఎప్పుడూ అబద్దాల వార్తలు చదవడు రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతాన గంగమ్మగుడి వెనకాల వాళ్ళిద్దరూ ఒక టయ్యారని అభిజ్ఞవర్గాల భోగట్టా" అన్నాడు.

    "మంగళ వాడిని చూస్తేనే ఎగిరిపడేదికదా. ఎలా లొంగింది?" అప్పటికి ఆశ్చర్యంలోంచి తేరుకున్న ఓ యువకుడు అడిగాడు.

    "మధ్యవర్తి మహిమ. ఆ పిల్లచేత ఊ అనిపిస్తే రెండు బస్తాల వడ్లు ఇస్తానని రాము కాంతమ్మపిన్నికి చెప్పాడు. తిండికి అవస్తపడుతున్న కాంతమ్మ పిన్ని ఆ పిల్ల నీడ అయిపోయి, చెవిలో జోరీగలాగ రాము ఎంత గాఢంగా మోహిస్తున్నాడో చెప్పుకొచ్చేది.

    తినగ తినగ వేము తీయనగును అన్నట్లు రాము గురించి వినీ వినీ చివరికి ఆ పిల్లకీ మొహం పుట్టుకొచ్చింది. ఏది ఏమైతేనేం చివరికి రాత్రి క్లియరెన్స్ ఇచ్చింది మంగళ. ఇద్దరూ తొమ్మిది గంటలకు గంగమ్మ గుడి వెనకాలకి చేరుకున్నారు.

    అప్పుడు కలుసుకున్న వాళ్ళిద్దరూ ఏం చేసుకున్నారో, ఏం మాట్లాడుకున్నారో తెలియదుగానీ సెకెండ్ షో వదిలే టైమ్ కి తిరిగి ఇంటికి చేరుకున్నారు. మరింత సేపు వాళ్ళిద్దరూ ఏం చేశారో మీ ఊహకే వదిలేస్తున్నాను" అన్నాడు సుబ్బారావు.

    "మొత్తానికి రామూ అదృష్టవంతుడు. మంగళ ఏం ఫిగరని -వినాయకచవితి రోజున నట్టింట పెట్టిన కుడుములాగా వుంటుంది" చంద్ర శేఖర్ అనే యువకుడు గుటకలు మింగాడు.

    అక్కడ చేరిన యువకుల్లో ఎవరికీ పెళ్ళికాలేదు. పెళ్ళయిన వాళ్ళెవరూ ఆ గ్రూప్ లో చేరరు.

    కేవలం పెళ్ళికాని యువకులే ఆ టైమ్ లో అక్కడ చేరి వెన్నెలకు సైతం ఉడుకెక్కించే విషయాలు ముచ్చటించుకుంటూ వుంటారు.
   
    "అవున్రా ఆకాశవాణీ - కాత్యాయని పిన్ని ఇంట్లో కొత్తగా వాలిన చిలక ఎవర్రా?" రంగడు అడిగాడు.

    "ఆ చిలక వీడిఓకు చెందింది. కొత్తగా వచ్చారు. ఆ పిల్ల చాలా స్ట్రిక్ట్. ఆమె జోలికి వెళ్ళకు. చెప్పుచ్చుకు కొట్టేరకం. చింతనిప్పుకు చీర కట్టినట్టు ప్రవర్తిస్తుంటుంది" సుబ్బారావు హెచ్చరించాడు.

    "నేనేమీ సైట్ కొట్టడం లేదులేరా. ఏదో తెలుసుకుందామని అడిగాను అంతే"

    "అలా అయితే ఫర్లేదు."

    "రేయ్ సుబ్రమణీ! నీ హీరోయిన్ అంగట్లోకి దూరుతోందిరా" అని వున్నట్లుండి బిగ్గరగా అరిచాడు యోగీంద్ర అనే కుర్రాడు.

    సుబ్రహ్మణ్యం చివాలున కిందకి దిగాడు.

    మాధురి అప్పుడే అంగట్లోకి వెళుతోంది.


Next Page