Next Page 

ఇట్లు.... నీ చిలక  పేజి 1

       
                   ఇట్లు.... నీ చిలక

                                       __ మేర్లపాక మురళి

    ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆకాశంలో చంద్రుడు బాగా పేరిన గడ్డపెరుగు గిన్నెలా వున్నాడు. నవంబరు నెల కావడంతో అప్పుడప్పుడే చలి లోకప్రవేశం చేసినట్టుంది. తనతోపాటు చల్లదనం వచ్చి చేరడంతో గాలి బరువుగా వీస్తోంది.

    అక్కడక్కడ వున్న నక్షత్రాలు కాశీమజిలీ కథలు చెప్పుకుంటున్నట్టు పక్కపక్కన జేరి మెరుస్తున్నాయి వెన్నెలను గంధంలా ఒంటికి రాసుకోవడానికి చెట్లు మరింత విప్పారినట్టు కనిపిస్తున్నాయి.

    రాత్రి పదిగంటలవుతూ వుండడం వల్ల గోపాలపురం అనబడే ఆ ఊర్లో జనం పడుకోవడానికి దుప్పట్లు, చాపలు సర్దుకుంటున్నారు. అప్పటి వరకు శృంగార కథలకు నిలయాలైన వీధి అరుగులు ఖాళీ అవుతున్నాయి. కబుర్లు అటకెక్కి అలుపు తీర్చుకుంటున్నాయి.

    అంతవరకు నిద్ర నటించిన ఇందుమతి మెల్లగా కళ్ళు విప్పింది.

    పెద్ద అడ్డాపిల్లు అది. దానికి ముందు కొబ్బరికాయకు పీచు వదిలేసినట్టు వసారా వుంది. అందులో ఆమె పడుకుని వుంది.

    ఆమె పక్కన ఆమెతల్లి శతరూప ఉంది. ఉదయం నుంచి కష్టపడిన ఆమె శరీరం నిద్రలో సుఖాన్ని వెదుక్కుంటూ వుంది.

    మరోపక్కన శతరూప తల్లి- అంటే ఇందుమతి అమ్మమ్మ అనసూయమ్మ నిద్రను రా రమ్మని ఆహ్వానిస్తున్నట్టు అటూ ఇటూ కదులుతూ ఉంది. ఏమీ శబ్దం రాకుండా ఇందుమతి పైకి లేచింది.

    బాగా పండిపోయిన వరికంకుల్ని కోసి పైకి లేపితే ధాన్యం గింజలు జలజలమని రాలినట్టు ఆమె పైకి లేవగానే యవ్వనం బొట్లుబొట్లుగా జారుతున్నట్టు అనిపించింది.

    ఇరవై రెండేళ్ళ వయసులో ఆమె యవ్వనం అనే రథానికి పూన్చిన తెల్లటి గుర్రంలా వుంది.

    వయసేకాదు ఆమెలో అందంకూడా అంతే మోతాదులో మరీ చెప్పాలంటే కాస్త ఎక్కువే వుంది. ముఖానికి చారడేసి కళ్ళు అందం అనుకుంటే ఆమె కళ్ళు అంతే సైజులో వున్నాయి. విల్లులా వంగిన ముక్కు చూపరులను ఇట్టే ఆకర్షిస్తుందని అనుకుంటే ఆమె ముక్కుకూడా కొనదేలి అచ్చు అలాగే ఉంటుంది.

    ముద్దుల కోసమే పుట్టినట్టు ఎర్రగా దొండపండులా మెరిసే పెదవులు ఆడపిల్లకు అందం అనుకుంటే ఆమె పెదవులు కూడా అంతే రంగులో, అంతే మృదుత్వంతో మెత్త మెత్తగా తగులుతున్నట్టే ఉంటాయి.

    ముఖాన్నీ, వక్షస్థలాన్నీ కలుపుతూ వేసిన కనకాంబరాల పూల వంతెనలా కంఠం ఉండడం అందమైన ఆడపిల్ల లక్షణం అనుకుంటే ఆమె అంతే పొడవుతో ఉంటుంది.

    ఆరోగ్యం మరెక్కడికీ పోకుండా ఎదభాగంలో పెట్టి కుట్టేసినట్టు ఎత్తుగా, బలంగా వక్షస్థలం వుండడం సెక్సీతనం ముఖ్య సుగుణమని ఎవరయినా అంటే ఆమె ఎదకూడా అచ్చు అలాగే మగాడి చూపుల్ని ఇట్టే ఆకర్షించగల మహేంద్రజాలంలా ఉంటుంది.

    అటూ ఇటూ పెద్ద బరువుల్ని మోసే కావడి దబ్బలాగా నడుం ఉండడం నాజూకుతనం అనంటే ఆమె నడుం కూడా అద్వైతులు చెప్పే సర్పరజ్జు బ్రాంతిలా గోచరిస్తుంది.

    బొడ్డు నడుం మధ్యలో చుక్కలా అన్పించడం గొప్ప సెక్సీగా ఉంటుందని అంటే ఆమె బొడ్డు కూడా అలాగే ఉంటుంది ఇక అంతకంటే ఎవరూ ఏమీ చెప్పలేరు గనుక ఆమె కట్టుకునే పావడా అంచు సీతాకోకచిలుకలు వాలిన పూలతోట బోర్డర్ లా ఉంటుందే తప్ప అందాల గురించి నోరు విప్పదు.

    అలాంటి ఇందుమతి ఇప్పుడు మెల్లగా అడుగులేస్తూ, ఎవరూ తనను గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ బయటికి నడిచింది.

    వెన్నెల ఒక్కసారిగా మీదపడ్డట్టు ఆమె చలిచలిగా ఫీలయ్యింది. తలపైకెత్తి చూస్తే ఆకాశం బల్లమీదవున్న ఫ్లవర్ వేజ్ లోని పువ్వులా ఉన్నాడు చంద్రుడు.

    'ఇంతవరకు భరణి తనకోసం వెయిట్ చేస్తూ వుంటాడా?' అన్న అనుమానం మొదలయింది. తనకోసం కొన్ని గంటలుకాదు కదా యుగాలు సైతం అతను నిరీక్షిస్తూ ఉంటాడన్న నమ్మకం అనుమానాన్ని పటాపంచలు చేయడంతో నడకవేగాన్ని పెంచింది.

    తను ప్రేమిస్తున్నవాడ్ని అంత అద్భుతమైన సమయంలో కలుసుకోవడానికి ఏ ఆడపిల్ల తొందర పడదు? ఇందుమతి, భరణి నిన్న చూసుకుని, ఈరోజు ప్రేమించేసుకుని ప్రేమికులు అయిపోయిన వాళ్ళు కాదు. దాదాపు ఆరునెలల క్రితం వాళ్ళ ప్రేమ మొదలైంది.

    ఆ ఘట్టాలన్నింటినీ అప్పుడప్పుడూ మనసులో రంగురంగులనేతలా వడకడం ఇందుమతికి యిష్టం. ఇప్పుడు కూడా ఆమె అదే పని చేస్తోంది.


Next Page