Next Page 
40 వసంతాల తెలుగుదేశం  పేజి 1

                                           40 వసంతాల తెలుగుదేశం

                                  

                                                          అంకితం

    తెలుగు దేశం పార్టీకి అన్ని వేళలా అండగా నిలబడ్డ కార్యకర్తాలకు, నాయకులకు, అభిమానులకు, ఆదరించిన అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళకు


                

          తెలుగు జాతి మనది , తెలుగు వాణి మనది . ఈ భావవేశాన్ని అణువణువునా  నింపుకున్న పార్టీ తెలుగుదేశం. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగు జాతి అభ్యుదయమే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలుగుదేశం ప్రజాసేవలో నలభై వసంతాలను (1982-2022) పూర్తీ చేసుకుంది. ఈ సందర్భంగా మార్చి 29, 2022 నాడు జరుపుకుంటున్న ఆవిర్బావ దినోత్సవానికి నా హృదయపూర్వక ఆహ్వానం.
    తెలుగు వారి అస్తిత్వానికి గుర్తింపు తీసుకొచ్చి, ఆత్మాభిమానాన్ని పునఃప్రతిష్టించి, ఆకాంక్షలకు రూపాన్ని ఇచ్చి, తెలుగు ప్రజా జీవితాన్ని సౌభాగ్యవంతం చేయడానికి మన పార్టీ ఈ నాలుగు దశాబ్దాల్లో చేసిన కృషిని స్మరించుకోవాల్సిన శుభసందర్భం ఇది.
    విభజనానంతర ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టవశాత్తూ ఆనాటి కంటే ఘోరమైన పరిస్థితులు ఈనాడు నెలకొన్నాయి. రౌడీలు రాజ్య మేలుతున్నారు. ప్రజాస్వామ్యం పాతర వేయబడుతోంది. హక్కులు అణచిబెయబడుతున్నాయి. ఆర్ధిక పరిస్థితి అగాధంలో కూరుకుపోతోంది. ప్రజల ధన, మాన ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. అభివృద్ధి ఆగిపోయింది. సన్ రైజ్ ఆంధ్ర ఇవాళ చిమ్మ చీకట్లోలోకి నెట్టవెయబడుతోంది.
    మళ్ళీ ఒక చారిత్రక పోరాటం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ భుజస్కంధాల మీద పడింది. ఆంధ్రప్రదేశ్ ను అక్రమార్కుల కబంధహస్తాల నుంచి కాపాడాల్సిన కర్తవ్యం మన ఎదుట నిలిచింది. ఇందుకోసం తెలుగుదేశం శ్రేణులు ఇప్పటికే ఉద్యమిస్తున్నాయి. అలుపెరుగని పోరు సలుపుతున్నాయి. రాక్షసుల బారి నుంచి రాష్ట్రాన్ని రక్షించేవరకు ఈ పోరాటం ఆగదు.
        ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ అవకాశాల గనిగా , అభివృద్ధి ఆనవాలుగా , పరిశ్రమలకు పట్టుకొమ్మగా, ఉపాధికి ఊతంగా, సంక్షేమానికి మారుపేరుగా నిలబెట్టేందుకు పునరంకితమవుదాం. తెలుగుదేశం పిలుస్తోంది. రా కదలిరా !

                                                                     నారా చంద్రబాబు నాయుడు

                                                                  జాతీయ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ

         

                                   
    
    (నలభై వసంతాలుగా తెలుగు ప్రజల సామాజిక , సాంస్కృతిక , రాజకీయ
     ఆర్ధిక పురోగమనం లో తెలుగుదేశం పార్టీ చెరగని ముద్ర వేసింది. )

                                తెలుగు వెలిగిన వేళ.....

    1982 మార్చి 29 న తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం తెలుగువారి చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం చితికిపోయి, తెలుగు జాతి అవమానభారంతో కుంగిపోతున్న చారిత్రక సమయంలో చీకట్లో చిరుదివ్వెలాగా తెలుగుదేశం ఆవిర్బవించింది. 'సమాజమే దేవళం, ప్రజలే దేవుళ్ళు' అని ఎలుగెత్తి చాటింది. నలబై వసంతాలుగా తెలుగు ప్రజల సామాజిక, సాంస్కృతిక , రాజకీయ, ఆర్ధిక పురోగమనంలో తెలుగుదేశం పార్టీ చెరగని ముద్ర వేసింది.
    తెలుగు సినీ వినీలాకాశంలో మూడు దశాబ్దాల పాటు జేగీయమానంగా వెలిగిన అభిమాన నటుడు, అరవైయేళ్ళ పండు వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేయడమే అపూర్వం. పార్టీ ప్రకటించిన మరుక్షణం నుంచి అయన అన్ని వర్గాల ప్రజలతో మమేకమై స్పూర్తి రగిలించిన తీరు అనితరసాధ్యం. తెలుగువారిలో నెలకొన్న నిస్తేజాన్ని పారదోలడానికి కంకణం కట్టుకున్న నందమూరి తారక రామారావును తెలుగు సమాజం నిండు మనసుతో ఆశీర్వదించింది. తెలుగుదేశం అవతరణను తెలుగు జాతి రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపుగా ఆహ్వానించింది. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా! అని ఆయనిచ్చిన పిలుపునకు ఉవ్వెత్తున స్పందించింది. ఆంధ్రుల భవిష్యత్తును దేదీప్యమానం చేయాలని పరితపించిన ఎన్టీఆర్ కు కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. తెలుగుజాతి యావత్తూ నిండు మనసుతో ఆశీర్వదించింది. 1983 లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన చారిత్రక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి పెట్టింది.
    
    (తెలుగు సమాజంలో సమూల మార్పులు తీసుకురావడానికి, తెలుగు ప్రజల
    జీవన ప్రమాణాలను పెంచడానికి తెలుగుదేశం అవిరళంగా శ్రమించింది.)
        
                                    

    ఆనాటి నుంచి తెలుగువారి కీర్తి పతాకను ప్రాపంచం నలుమూలలా చాటడానికి తెలుగుదేశం పార్టీ నడుం బిగించింది. తెలుగు సమాజంలో సమూల మార్పులు తీసుకురావడానికి, తెలుగు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి తెలుగుదేశం పార్టీ ఆవిరళంగా శ్రమించింది. పార్టీ స్థాపన  నుంచి ఇప్పటివరకు ఇరవై ఒక్క సంవత్సరాలు అధికారంలోను, పంతొమ్మిదేళ్ళు ప్రతిపక్షంగాను నిలబడ్డ తెలుగుదేశం ఏ పాత్ర పోషించినా తెలుగువారి ప్రయోజనాల కోసమే అహరహమూ శ్రమించింది.
    తెలుగు సమాకం మీద ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన ప్రస్థానం పద్నాలుగెళ్ళే (1982-1996). అయినా అయన చూపిన ప్రభావం మహత్తరం . తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి.
    తెలుగు పౌరుషాన్ని తట్టిలేపిన కీర్తి ఎన్టీఆర్ ది అయితే, తెలుగువారి జీవన ప్రమాణాలను పెంచి పోషించిన ఘనత నారాచంద్రబాబు నాయుడిది. విద్యా, ఉద్యోగ, ఆర్ధిక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారి ఎదుగుదల వెనుక అయన చేసిన కృషి అపారం, తెలుగు జాతికి ప్రపంచంలో ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే, తెలుగు ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు రాణింపు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఒక రాజాకీయ శక్తిగా ఎదిగితే, చంద్రబాబు అధ్వర్యంలో ఆర్ధికంగా బలపడింది.
        
    (తెలుగు జాతికి ప్రపంచంలో ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే, తెలుగు ప్రతిభకు
    అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు రాణింపు తీసుకొచ్చారు.)                 
    
    అయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నూతనత్వాన్ని సంతరించుకుంది. తెలుగువారి కీర్తీ ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసింది. ప్రపంచంలో జరుగుతున్నమార్పులను ముందే గ్రహించి, అందుకు అనుగుణంగా తెలుగువారిని, తెలుగు రాష్ట్రాన్ని సంసిద్ధం చేయడంతో అయన పాత్ర ఎనలేనిది. ప్రపంచ నాయకులను ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అయన అందించిన నాయకత్వానికి ఈనాటికి సాటిలేదు. అనాధలా వదిలేసిన విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన నాయకత్వ పటిమతో దశ, దిశ నిర్దేశం చేసి, స్వర్ణాంధ్ర స్వప్నాన్ని సాకారం చేయడానికి రేయింబవళ్ళు శ్రమించిన దార్శనికుడు చంద్రబాబు.
    ఎన్నో ఆటుపోట్లు మధ్య ఈ నలభై వసంతాల్లో తెలుగు వారి జీవితంలో తెలుగుదేశం పార్టీ ఎలా పెనవేసుకుపోయింది , తెలుగుల సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంత తోడ్పడింది ఒక్కసారి మననం చేసుకుందాం.
    
                
    (అంతకు ముందు రాజకీయ నేపధ్యం లేని వర్గాలకు పార్టీ టికెట్లు ఇవ్వడం ద్వారా ఒక కొత్త తరాన్ని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. )
    
    తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చైతన్యం వెల్లివిరిసింది. స్వాతంత్ర్యం వచ్చిన మూడు దశాబ్దాల వరకు కొద్ది మంది చేతుల్లో బందీగా ఉన్న రాజకీయ అధికారాన్ని తొలిసారిగా ప్రజల చేతుల్లో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదే.
    ఇప్పటివరకు రాజకీయం అంటే రాచక్రీడ . సమాజంలో పలుకుబడి ఉన్నవారి ఆటస్థలం. పేరుకు ఐదేళ్ళకొకసారి ఎన్నికలు జరిగినా, అట్టడుగు వర్గాలు ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉండేవి. ఏకపార్టీ స్వామ్యం కొనసాగిన నేపధ్యంలో కొద్ది మంది మాటే నెగ్గేది. ఎన్టీఆర్ రాకతో రాజకీయం ప్రజలకు చేరువైంది. చైతన్య రధంలో రాష్ట్రం నలుమూలలా చుట్టిన ఎన్టీఆర్ , అన్ని వర్గాల్లో రాజకీయ స్పూర్తిని నింపారు. అధికారం ప్రజల చేతుల్లోనే ఉందని, ఓటు అనే అస్త్రంతో తమ ప్రతినిధులను నిర్ణయించే అధికారం పేదలకు ఉందని తెలియజెప్పారు.
    
    (ఎన్టీఆర్ కు ముందు డబ్బు, పలుకుబడి ఉన్నవారికి రాజకీయాలు . ఎన్టీఆర్ వచ్చాక
    రాష్ట్రంలో ప్రజల కోసం , ప్రజలతో ముడిపడిన రాజకీయాలు మొదలయ్యాయి.)

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ లాగా విస్తృతంగా పర్యటించిన రాజకీయ నాయకుడు మరొకరు లేరు. మూడు విడతల్లో దాదాపు 35 వేల కిలోమీటర్లు, వాగులూ, వంకలూ, దాటి, డొంకల్లో ప్రయాణించి, మారుమూల పల్లెల్లోని జనాన్ని కూడా అయన కదిలించారు. ఇందుకోసం పాత షెవర్లె వ్యాన్ నే అయన చైతన్యరధంగా మార్చుకున్నారు. అందులోనే అయన తిండి, నిద్రా. రోడ్డు పక్కనే కాలకృత్యాలు, సూర్యోదయం కాకముందే రధం కదిలేది. అర్ధరాత్రి తర్వాత కూడా జనప్రవాహం ఆగేది కాదు. విసుగూవిరామం లేకుండా ఎక్కడ జనం గుమిగూడితే అక్కడ వ్యాన్ పైకెక్కి ఉపన్యసించేవారు. అయన ఉద్వేగపూరిత ప్రసంగాలు వినడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఎక్కడకెళ్ళినా ఆయనకు అఖండ స్వాగతం లభించింది. ఎర్రటి ఎండలో తిరిగి అయన ముఖ వర్చస్సు నల్లబడింది. సినిమా గ్లామర్ దెబ్బతింది. కాని జనం ఆయన్ని నటుడిగా భావించలేదు. తమ విధి రాతను మార్చడానికి వచ్చిన ప్రజానాయకుడిగా చూశారు.
    అయన రాజకీయ యాత్ర జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. మూడు దశాబ్దాల పాటు ఇందిరాగాంధీ కి పెట్టని కోటగా ఉన్న ఆంధ్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్టీఆర్ ను చూడటానికి దేశ విదేశీ విలేకరులు తొలిసారిగా రాష్ట్రాన్ని సందర్శించారు. ప్రజల్లో పెల్లుబుకుతున్న రాజకీయ భావావేశాన్ని గమనించారు. ఎన్టీఆర్ కు విజయం తధ్యమని నమ్మారు. ఎన్నికల్లో పాల్గొన్న తొలిసారే 46 శాతం ఓట్లు సాధించి తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే 196 సిట్లతో అఖండ విజయాన్ని సాధించడం వెనక ఆంధ్ర ప్రజానీకంలో ఎన్టీఆర్ కలిగించిన చైతన్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంత ఓటమి ఎన్నడూ ఎదురుకాలేదని రామచంద్ర గుహ వంటి చరిత్రకారులు అన్నారు. ఇటువంటి గెలుపు ప్రపంచ చరిత్రలోనే అరుదని ఇండియా టుడే పత్రిక వ్యాఖ్యానించింది. రాజకీయాలను ప్రజలకు చేరువ చేయడం ఇందుకు ముఖ్య కారణమని పరిశీలకులు పేర్కొన్నారు. అంతకుముందు రాజకీయ నేపధ్యం లేని వారికీ, రాజకీయంగా ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గాలకు, ఉన్నత చదువులు కలిగిన వారికి, మేధావులకు, యువకులకు పార్టీ టిక్కెట్లు ఇవ్వడం ద్వారా ఒక కొత్త తరాన్ని , ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను ఎన్టీఆర్ కు ముందు , ఎన్టీఆర్ తర్వాత అని విభజించవచ్చు. ఎన్టీఆర్ కు ముందు డబ్బు, పలుకుబడి ఉన్నవారికే రాజకీయాలు , ఎన్టీఆర్ వచ్చాక రాష్ట్రంలో ప్రజల కోసం, ప్రజలతో ముడిపడిన రాజకీయాలు మొదలయ్యాయి.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS