Next Page 
జాగృతి పేజి 1


                                         జాగృతి
                                                                ---డి.కామేశ్వరి


                                     
    
    రాత్రి ఎనిమిదిన్నర! అపుడే రెండిడ్డెన్లు, అరటిపండు తిని - మజ్జిగ తాగుతూ సావకాశంగా టి.వి. ముందు కూర్చున్న లలితమ్మ బాల్కనీలో దబ్బున ఎవరో దూకిన చప్పుడికి వెనుదిరిగి చూసింది. ఎవరో మనిషి గెంతి ఆమెవైపే రావడం చూసి ఎవరూ అంటూ లేవబోయింది.
    ఆమె కుర్చీలోంచి లేచేలోగానే వెనకనించి ఎడంచేత్తో ఆమె నోరుమూసి, కుడిచేత్తో జేబులోంచి కత్తితీసి ఆమె మెడకి ఆన్చి "ఏయ్ బుడ్డీ, అరవకు గడబిడ చేస్తే సఫా చేస్తా జాగ్రత్త. నోర్మూసుకుని గమ్మునుండు" అన్నాడు కరకుగా, లలితమ్మ గింజుకుంది. ఆ యువకుడి కబంధహస్తం పట్టునించి తప్పించుకోవాలని పెనుగులాడింది. ఆమెకి ఊపిరి ఆడడం లేదు భయంతో ప్రాణం పోయినట్టే ఉంది. 'నోటిమీదనించి చెయ్యి తీయి అరవను' అన్నట్లు సైగచేస్తూ నమస్కారం పెట్టింది. "అరవ్వుగదా!" ఆవిడ చప్పున తల ఆడించింది. వాడు ఆమె నోటిమీదనించి చెయ్యి తీసి కత్తిమాత్రం మెడమీదే ఉంచి "చూడు నన్ను పోలీసులు వెతుకుతున్నరు. నీవు అరిచి గడబిడచేస్తే ఖతం చేస్తా. సమజయిందా. నీ ఇంటికి పోలీసులు వచ్చి అడిగితే ఎవరూ రాలేదని చెప్పాలి. అలా చెప్పకపోతే నీ ప్రాణం తీస్తా" కత్తి ఝుళిపిస్తూ బెదిరించాడు. లలితమ్మ బిక్కచచ్చిపోయి అలాగే అంది తల ఊపి. పాతికేళ్ళ కుర్రడు. చామనఛాయ. గడ్డం పెంచాడు. మాసిపోయిన జీనుప్యాంటు, గళ్ళచొక్కా, ముఖంలో కరకుదనం, కళ్ళల్లో క్రౌర్యం, చూడగానే దేనికన్నా తెగించే రకం అని అర్ధం అయిపోయింది. పోలీసులు వెతుకుతున్నరంటే ఏం వెధవపని చేసాడో, దొంగతనమా? హత్యా? బాల్కనీకి గ్రిల్లు పెట్టిద్దామనుకుంటే అశ్రద్ద చేసింది. మూడో అంతస్థు ఎవరొస్తారు. గేటు దగ్గర వాచ్ మన్ ఉంటాడు అనుకుంది. ఇలాంటి సంఘటన ఎదురుచూడని ఆమెకిది ఒకరకం షాక్. అయినా పైకి నిబ్బరంగా కనిపించాలని ప్రయత్నిస్తూ "ఎవరు బాబు నీవు? పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? ఏం చేశావు?" సౌమ్యంగా అడిగింది. "ఏయ్, చుప్, మాట్లాడకు, అదంతా నీకెందుకు. నోరుమూసుకుని ఉండు. ఆఁ.. పోలీసులు వస్తే ఏం చెపుతావు... మల్ల చెప్పు."
    "చెపుతాగాని, పోలీసులు లోపల చూస్తాం అంటే ఏం చెయ్యాలి నేను?" వాడు ఒక్కక్షణం ఆలోచించి "ఇకక్డ దాక్కోడానికి ఏం చోటుంది. జల్దీ చెప్పు."  చుట్టూ చూశాడు. డైనింగ్ టేబిల్ పైన గోడమీద తలుపులవైపు చూపిస్తూ "అదేంది అక్కడ ఏముంది?"
    "అది అక్కరలేని సామాన్లు పదేసుకునే అటక.. పెట్టెలు అవి ఉన్నాయి."
    వాడు డైనింగ్ టేబిల్ దగ్గరకు కుర్చీ జరిపి ఎక్కి తలుపు తీసి లోపలికి చూసి "ఆ ఇక్కడ చోటుంది. ఇదిగో ఎవరన్నా పిలిస్తే నేనిక్కడికి ఎక్కేవరకు తలుపు తీయకూడదు. నేను లోపల ఉండగా పోలీసులకి ఏదన్నా చెప్పాలని ప్రయత్నించావో బతకవు. నేనా తలుపు సందునించి చూస్తూనే ఉంటా. నన్ను పట్టిస్తే నిన్ను మావాళ్ళు వదలరు. తెలిసిందా!" కఠినంగా అన్నాడు.
    "చెప్పనులే బాబూ, ముందు అలా కూర్చో మంచినీళ్ళు తాగుతావా?" చమటలు కక్కుతున్న అతన్ని దయగా చూసి అంది. ఫ్రిజ్ తీసి చల్లని నీరు గ్లాసులో పోసి ఇచ్చింది. రెండు గ్లాసులు గటగట తాగి చెమట తుడుచుకున్నడు. కాస్త స్థిమితపడి కుర్చీలో కూర్చుని "నీ ఇంత ఎవరెవరున్నారు? ఇప్పుడెవరన్నా వస్తారా?" ఆరా తీసాడు.
    "నేను ఒక్కర్తినే ఉంటాను. పనిపిల్ల ఏడుగంటలకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏడుగంటలకి గాని రాదు. నీ పేరేమిటి నాయనా?" ఆప్యాయంగా అడిగింది. ఈ సారి కఠినంగా కసరకుండా లలితమ్మవంక చూసి 'శ్రీను, శ్రీనివాస్' అన్నాడు.
    "నీవు లోపలికి ఎలా వచ్చావు. గేటు దగ్గిర వాచ్ మన్ చూడలేదా? నీవిలా బాల్కనీలోకి ఎక్కడం ఎవరో చూడలేదా?" అనుమానంగా అడిగింది.
    "బయటినుంచి రావడం ఏమిటి? మేం ఉండేది మీపైన ఇంట్లోగదా. అక్కడనించి కిందికి దిగివచ్చా.....పోలీసులు తలుపు కొడుతుంటే..."
    "ఓ పైనిల్లా. అదే నిన్ను ఎక్కడో చూసాననిపించింది. మరి పోలీసులు వెళ్ళిపోయారా?"
    "ఏమో చాలా సేపు తలుపులు కొట్టారు. లోపల లేననుకున్నారో..ఇంకెవరినన్నా అడుగుతున్నారో తెలియదు." అంటూ బాల్కనీదాకా వెళ్ళి తొంగి చూసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇంతలో టకటక తలుపులు చప్పుడవడంతో శ్రీను కుర్చీమీదనించి అటకెక్కి తలుపులు మూసుకున్నాడు. లలితమ్మకుర్చీ సరిగా జరిపి నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పోలీసులు, ఆవిడ ఆశ్చర్యంగా చూసింది.
    "ఏమ్మా! ఇటు ఎవడన్నా వచ్చాడా? బాల్కనీలోంచి ఎవడన్నా దిగాడేమో చూశారా?" అంటూ బాల్కనీదాకా వెళ్ళి చూశాడు.
    "ఎవరూ? నేనేం చూడలేదే. నేను, దొంగా... ఎవరింట్లో నన్నా దూరాడా?"
    "దొంగ అంటే దొంగ కాదులెండి. రౌడీ గుండా. మీ పై అంతస్థులో ఉంటారే ఆ గుంపువాడు. ఒకడు పారిపోయాడు వెనకనించి -మేం తలుపులు తడ్తుంటే ఇలా వెనకనించి దిగి పారిపోయినట్టున్నాడు. గేటు దగ్గర వాచ్ మన్ మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాడు. ఈలోగా అటునించి తప్పించుకుపోయాడు. వెధవ?"
    "ఏం జరిగింది? ఏం చేసాడు?"
    "వీళ్ళంతా గుండాలమ్మా....ఊర్లో అల్లర్లు చెయ్యడమే వీళ్ళపని. వీళ్ళ లీడరు ఓ రాజకీయనాయకుడు. వీళ్ళందరిని పెంచి పోషిస్తూ అవసరం వచ్చినపుడు అల్లర్లు సృష్టిస్తూ అందరిని భయపెట్టి బతుకుతుంటారు. ఆఫీసు పేరుతో ఈ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఈ మూకని ఇక్కడ పెట్టాడు....సరే జాగ్రత్తగా ఉండండమ్మా. వంటరిగా ఉన్నట్లున్నారు. తలుపేసుకోండి" అన్నాడు ఇనస్పెక్టరు.
    "ఇప్పుడేం చేశారు బాబు వీళ్ళు. ఎందుకు వెతుకుతున్నరు?" లలితమ్మ కుతూహలంగా అడిగింది.
    "ఓ పెట్రోల్ బంకులో ఫ్రీగా పెట్రోలు పోయమంటే పోయనన్నందుకు ఈ గుంపు అంతా కలిసి అన్ని విరగొట్టి. మొత్తం ధ్వంసంచేసి పారిపోయారు. పోలీసులురావడంతో అంతా తలోమూలా పారిపోయారు. ఈ శీనుగాడు ఇటు వచ్చాడని కబురు అంది వచ్చాం. పారిపోయాడు రాస్కెల్. ఎక్కడికి పోతాడు. ఇరవైనాల్గుగంటల్లో ఎక్కడున్నా పట్టుకుని మక్కెలిరగదన్ని సెల్లో పడేస్తాం" ధీమాగా అంటూ వెళ్ళిపోయాడు. లలితమ్మ తలుపులు మూసి వచ్చి "దిగు బాబూ పోలీసులు వెళ్ళిపోయారు" అంది. శ్రీనూ కిందకి దిగివచ్చాడు. వళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది. గ్లాసు నీళ్ళు తీసుకుని గటగటతాగాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS