Next Page 

రారామాఇంటిదాకా పేజి 1


                                          రారా మా ఇంటిదాకా
    

                                                                                      --మేర్లపాక మురళి
    
  

                                   

 
    బెడ్ రూమ్ లో నిద్రను మొక్కగా నాటితే చీకటి తేమకు పెరిగి కలల పూలను పూస్తుంది. కల అంటే జీవితానికున్న కిటికీ- అలాగని ఎవరన్నది?
    
    ఫ్రాయిడ్? లేకుంటే హేవలాక్ ఎల్లీస్.
    
    తనని ఇప్పుడు ఎవరైనా హిప్నటైజ్ చేసి, ట్రాన్స్ లోకి నెట్టేస్తే- ఏమడిగినా తనుచెప్పబోయేది ఒక పేరే- సు...జ....న....మనసులోని మూడు అరల్లోనూ నిండిపోయి, మరో ఆలోచనకు తావు లేకుండా చేస్తున్న జీవి.
    
    జీవితంలో ఇప్పటికే రెండక్షరాలను ఆక్రమించుకున్న ఆ 'జీవి'తో ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతే మొత్తం వామనదేవుడిలా ఆక్రమించేసుకుంటుంది.
    
    వామనదేవుడు పుంలింగం కదా - మరి స్త్రీ లింగం వామనదేవి కాబోలు. ఈ లింగభేదం స్త్రీలను ఎంత హీనస్థితిలోకి నెట్టేసింది - సిమోన్ దిబోవర్లూ, కౌత్ మిల్లెట్ లూ - ఇంకా ఎందరు పుడితే ఈ పురుష ప్రపంచం మారుతుంది? లేకుంటే తన మామ, కూతురిమీద అంత అధికారం చెలాయిస్తాడా? ఆమె ఫస్ట్ నైట్ కి కూడా ఈయనే ముహూర్తం నిర్ణయించాలా!
    
    ఇప్పుడు మంచి ముహూర్తం లేదని ఫస్ట్ నైట్ ని పోస్ట్ పోన్ చేశాడు. భోజనం అంటే వాయిదా వేసే విషయమా? జాస్మిన్లూ, మూన్ లైటూ ఎప్పుడంటే అప్పుడొస్తాయా? గురజాడ కన్యాశుల్కం శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగిపోతున్నాయి. లేకుంటే ఫస్ట్ నైట్ కి కూడా మంచి ముహూర్తాలూ, శాస్త్రాలు, గర్భాదానం మంత్రాలు ఏమిటి? ఖర్చు కాకపోతే.
    
    మామా! నీలాంటి మూర్ఖుడికి అంత తెలివైన, అందమైన అమ్మాయి ఎలా పుట్టింది?" నిజంగా నీకే పుట్టిందా...? పాపం ఉపశమించుగాక - మామ మీద కోపం అత్తమీద చూపించడం ఏమీ బాగాలేదు.
    
    ఇప్పుడు కావాల్సింది ఉపశమనాలు కాదు. అర్జెంటుగా సుజనతో శయనించడం. వాత్సాయనుడి కామసూత్రాలను కళ్ళ భాషలోకి తర్జుమా చేసుకుని శరీరాల మీద రాసుకోవడం శృంగార పారవశ్యం ఎలా వుంటుందో తను పూజాబేడి ముఖం చూసి తెలుసుకున్నాడు. తనకు ఆ విషయంలో అ ఆలుకూడా తెలియవు. తను ఎప్పుడూ ఆడపిల్లతో గడపలేదు. కనీసం బ్లూ ఫిల్మ్ కూడా చూళ్ళేదు. కిన్సీ రిపోర్ట్ గురించి వినడమే తప్ప చదవలేదు.
    
    యూనివర్శిటీలో అప్పుడప్పుడు దొంగచాటుగా బ్లూఫిల్మ్ లు వేసుకుని చూసేవాళ్ళు స్టూడెంట్స్ అరవై రూపాయలు అద్దె కట్టి వీడియో కేసెట్ ప్లేయర్ తెచ్చుకోవడానికి బదులు, ఆ డబ్బుకి ఆడపిల్లనే తెచ్చుకోవడం బెటర్ కదా అని రూమ్మేటు జోక్ చేస్తుండేవాడు. తను ఎప్పుడూ అలాంటి చీకటి సాహసాలు చేయలేదు. సుజనను బట్టల్లేకుండా ఊహించుకోలేక పోవడానికి ఇదే కారణం. ఎదిగిన ఆడపిల్ల అనాటమీ తెలియదు.
    
    మొన్న పెళ్ళి రోజునే ఆడపిల్ల బొడ్డును అంత దగ్గరగా చూడడం. పెళ్లి పీటల మీద సుజన పట్టుచీర పక్కకు తొలగినప్పుడు అక్కడే తన చూపులు అతుక్కుపోయాయి.
    
    మెడలో పూలదండ వున్నప్పుడు గులాబీ రేకుల పొట్లంలా కనిపించిన బొడ్డు, అక్షింతలు పాడినప్పుడు పచ్చగిన్నెపై తలంబ్రాలు చల్లేప్పుడు బొండుమల్లిలా భ్రమ కల్గించి, చివరికి హోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు బంగారు పుష్పంలా విచ్చుకుంది.
    
    అక్కడి నుంచి కిందకి పట్టుచీర జరీ అంచు చూపులను జారనివ్వలేదు. ఈ కేళీ విలాసాలన్నీ ఊహలకే పరిమితమా? ముహూర్తం కుదిరి శోభనం జరుగుతుందా? లేక ఈ జన్మకి ఇలా ఘోటక బ్రహ్మచారిలా-    
    
    "వంశీ... వంశీ...."
    
    తల్లి పిలవడంతో నిద్రకాని, మగతకాని స్థితిలో మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్న అతను లేచి కూర్చున్నాడు.
    
    అప్పుడు టైమ, ఉదయం పదిగంటలైంది. బంగారు రంగు ఎండ కిటికీ నీడను బెడ్ షీట్ మీద అచ్చొత్తుతోంది. ప్రహరీగోడకు ఆనుకుని వున్న కొబ్బరిచెట్టు తల కటింగ్ చేసుకున్నట్లు ముప్పాతిక భాగం కనిపిస్తోంది. దానికి ఇవతల వున్న బోగన్ విల్లా కొమ్మలు కిటికీ మీద పరుచుకుని ఎర్రటి పూల ఎంబ్రాయిడరీ వున్న ఆకుపచ్చటి పరదాలా గాలికి అటూ ఇటూ ఊగుతోంది.
    
    మామూలుగా అయితే అంత పొద్దెక్కేవరకు అతడు పడుకోడు. కాని ఇప్పుడతను కొత్త పెళ్లి కొడుకు. అయిహ్దరురోజుల క్రితమే నెల్లూరు టౌన్ లోని ఓ సత్రంలో సుజనతో అతని పెళ్లి జరిగింది.
    
    ఇద్దరిదీ ఒకే ఊరు. ఆ ఊర్లో మొత్తం అయిదువందల గడపలున్నా రెండే వీధులు ఆ వీధిలో సుజన ఇల్లుంటే, ఈ వీధిలో అతని ఇల్లుంది. ఈ ఇంటి వరండాలో నిలబడితే ఆ ఇంటి కిచెన్ పొగ గొట్టం కన్పిస్తుంది. ఇంత దగ్గరలో భార్యా భర్తలున్నా కలుసుకోలేని విచిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయారు.
    
    పెళ్లి కాగానే శోభనాన్ని ఏర్పాటు చేశారు. తీరా ముహూర్తం దగ్గర పడిందనగా సుజనకు 'ఇబ్బంది' ఎదురైంది. ఇక ఆ మూడు రోజులు వీలుకాదు కనుక దగ్గర్లో ఏదైనా మంచి ముహూర్తం వుందేమో చూడమని పురోహితుడ్ని అడిగాడు సుజన తండ్రి సత్యనారాయణరావు.
    
    ఆయనకి ఈ ముహూర్తాలు, జ్యోతిష్యాలూ అంటే తెగ నమ్మకం పంచె కుచ్చిళ్ళు పోయడానికైనా పంచాంగం చూసే రకం దగ్గర్లో మంచి ముహూర్తాలు లేవనీ, ఖచ్చితంగా నెల తఃరువాత ముహూర్తం వుందనీ, దానినే నిర్ణయించుకోమని పురోహితుడు చెప్పడంతో మరో ఆలోచనకు తావివ్వకుండా, దానినే ఖరారు చేశాడు.
    
    పద్దతి పాటించే రకం గనుక ఆయన అల్లుడ్ని పిలిచి "ఇలా అయినందుకు నాకూ బాధగా వుంది. ఆ ఈశ్వరుని సంకల్పాన్ని కాదనలేము కదా. మీ శోభనం కార్యక్రమాన్ని వచ్చే నెల రెండవ తేదీకి నిర్ణయించాం. శోభనం అయ్యేవరకు భార్యా భర్తలు ఒకే ఇంట్లో వుండడానికీ, కలిసి తిరగడానికీ, మాట్లాడుకోవడానికి శాస్త్రాలు ఒప్పుకోవు. గనుక నీ ఇంట్లో నువ్వూ, మా ఇంట్లో సుజనా వుండండి. అదిగో ఆ ముచ్చట అయిపోయాక ఆ తరువాత మీ ఇష్టం. హనీమూన్ కైనా వెళ్ళండి- లేదూ ఈ పల్లెటూరులో అయినా గడపండి" అని ఖరాఖండిగా చెప్పాడు.


Next Page