Next Page 
తీరం చేరిన నావ పేజి 1


                                    తీరం చేరిన నావ
                                                                             ---డి. కామేశ్వరి

                              

    వాణి సంగీత పాఠం పూర్తిచేసి వీణ కిందపెట్టి లేవబోతూంటే ఆదిశేషయ్యగారు గదిలోకి వచ్చారు- సాధారణంగా ఆ గదిలోకి రాని ఆయన్ని చూసి వాణి కాస్త తొట్రు పడిలేచి నుంచుని నమస్కారం చేసింది "చూడమ్మాయీ రేపు కాస్త నాల్గుగంటలకల్లా వస్తావా-మా శుభకి పెళ్ళివారు వస్తున్నారు-దానిచేత వీణ పాడించాలి నీవు మరి" అన్నారాయన.
    "నేనా.....నేనెందుకండి-శుభ పాడగలదుగా బిడియంగా అంది.
    "ఆ....దాని మొహం- అదొకర్తే సరిగా పాడలేదు నీవుంటే దానికి ధైర్యం-"
    వాణి యింకేం అనలేక అంగీకారంగా తల ఆడించింది ఆ మాట నిజమే- శుభ మూడేళ్ళుగా సంగీతం నేర్చుకుందన్నమాటే గాని ఆ పిల్ల కసలు సంగీతంపట్ల కుతూహలం లేదు- శ్రద్దాలేదు- ఏదో తప్పదన్నట్టు తనున్నంతసేపూ టింగు టింగు లాడించి అయిందనిపిస్తుంది. శుభ ఒక్కర్తే అయితే లాభంలేదని తను వుంటే తనతో ఆమె పాట కలిసిపోతుందన్నది ఆయన ఉద్దేశం అన్నది వాణికి అర్ధమైంది.    
    "సంగీతం అన్నది నేర్చుకున్నంత మాత్రాన వచ్చేస్తుందా తల్లీ- ఆ వాణీ కటాక్షం అందరికీ వుంటుందా మనసు-ఏకాగ్రత-సాధన- ఎన్ని సమకూడాలమ్మా ఆ సరస్వతీ దేవిని గొంతులోనే నిల్పుకోవాలి"- అనే తండ్రి మాటలు గుర్తువచ్చాయి వాణికి.
    "నేను చేసిన మంచి పనుల్లో నీకు సంగీతం నేర్పడం తల్లీ ఆనాడు ఆ సరస్వతీ దేవే నాచేత వాణి అన్న పేరు పెట్టించి వుంటుంది-నీ పేరుకి సార్ధకత చేకూరింది"- వాణి పాడుతూంటే పరవశిస్తూ కళ్ళనీరు తుడుచుకునేవారు శాస్త్రిగారు- తన పాండిత్యం అంతా ఉగ్గుపాలతోనే రంగరించి పోసినట్టు వాణికి ఏదో ఏటనించే సంగీత పాఠాలు ఆరంభించారు ఆయన-పట్టుమని ఐదేళ్ళు లేని వాణి గొంతు సాఫా-అని ఖంగున మోగుతూంటే ఆయన ఆశ్చర్యచకితులై చూసేవారు.
    సంగీత పాఠాలు చెప్పించుకునే పిల్లలతోపాటు వాణినీ కూర్చోపెట్టేవారు. ఆయన కొచ్చిన విద్య అంతా కూతురికి నేర్పారు- వాణికి పదహారో ఏడు వచ్చేసరికి మెట్రిక్ తో పాటు సంగీత పాఠం పూర్తయింది.
    "నా తల్లిచేత కచేరీలు చేయిస్తాను- రేడియోలో పాడిస్తాను సంగీత పరీక్షలు కట్టిస్తాను. కళాశాలలో ఉద్యోగం ఇప్పిస్తాను-చూస్తూండమ్మా- ఒకనాడు తెలుగుపాట నిన్ను మించిన పాటగత్తె లేదని అనిపిస్తాను" ఆయన ఆశలకి, కోరికలకి ఊహాసౌధాలు కట్టుకుంటూ మురిసిపోయేవారు.
    తండ్రి ఆలోచన వచ్చినప్పుడల్లా తన గురించి ఆయన కలలు గుర్తువచ్చి ఆమె మనసు గిలగిలలాడేది.
    పట్టుమని పదహారేళ్ళేనా లేని వాణి మీద యింటిబాధ్యత అంతా పడేసి హఠాత్తుగా వచ్చిన గుండె నొప్పితో కన్నుమూశారు శాస్త్రిగారు-మెట్రిక్ పరీక్ష వచ్చిన వాణి తొమ్మిదో క్లాసు చదివే తమ్ముడు, ఆరోక్లాసు చదివే చెల్లెలు- దిక్కుతోచక విలపించే తల్లీ-చేతిలో దమ్మిడి లేని నిస్సహాయత. ఆ పరిస్థితిలో దిక్కుతోచని వాణికి సంగీతమే తోడునీడ అయి నిల్చింది-తండ్రి చెప్పే పాఠాలు తను తీసుకుని కుటుంబాన్ని గట్టెక్కించడం మినహా మరే దారి కనపడ లేదు ఆమెకి. మొత్తంమీద ఓ రెండొందలు సంపాదిస్తూ భుక్తికి లోటులేకుండా గుట్టుగా గౌరవంగా సంసారం లాగుతూంది వాణి.
    
                                           *    *    *    *
    
    "మూడన్నా కాలేదు అప్పుడే ఎటే బయలుదేరావు సత్యవతమ్మ ముస్తాబవుతున్న కూతురిని చూసి అడిగింది.
    "వాళ్ళ శుభకి పెళ్ళివారు వస్తారటమ్మా ఆ పిల్లచేత పాడించడానికి రమ్మన్నారు" చీర కట్టుకుంటూ అంది.
    "ఆ పిల్లకి పెళ్ళి వారు వస్తే నీకెందుకే?"
    వాణి నవ్వింది. "నా పాటలో ఆ అమ్మాయి పాట కల్సిపోతుందని-వాళ్ళమ్మాయి సత్తా వాళ్ళకి తెలియదు.
    చీరకట్టుకుని పౌడరు రాసుకుని బొట్టుపెట్టుకుంటున్న వాణిని చూసి సత్యవతమ్మ నిట్టూర్చింది-ఎవరి పెళ్ళి మాట కబురన్నా వింటే ఆవిడకి ఏదోలా వుంటుంది. ఇరవై రెండేళ్ళున్న తన కూతురిపెళ్ళి గురించిన ఆలోచన వచ్చి ఆవిడగుండె కొట్టుకుంటుంది. ఈ జన్మలో తను వాణి పెళ్ళిచెయ్యగలదా అనిపిస్తుంది. ఏం పెట్టి పెళ్ళిచేస్తుంది- నిత్యావసరాలకే కటకట లాడే తను పెళ్ళేం చేస్తుంది-పోనీ వాణి పాటచూసి ఎవరన్నా చేసుకోరా అన్న ఆశ వుండేది కొన్నాళ్ళు ఆవిడకి- రెండు మూడు సంబంధాలు వాణి వద్దంటున్నా చూసిందావిడ- పాట చూసి పరవశించిన వాళ్ళుకూడా పిల్ల సామాన్యంగా వుండడం- పెళ్ళి ఖర్చులుకూడా తామే పెట్టుకోవల్సిన దుస్థితి గమనించి జారుకున్నారు- దాంతో ఆవిడ ఆశ అడుగంటింది చేతికి అందివస్తాడనుకున్న కొడుకు ఒక్కొక్క క్లాసు రెండేసిసార్లు తప్పుతూ మెట్రిక్ మూడుసార్లు తప్పి మరి పరీక్షకి వెళ్ళుకుండా కూర్చున్నాడు-ఆదుకోవాల్సిన కొడుకు అసమర్ధుడిలా జులాయిగా తిరుగుతూంటే ఆడపిల్ల కష్టంమీద బతకాల్సివచ్చిన దౌర్భాగ్యస్థితికి కుమిలిపోవడం తప్ప ఏం చెయ్యలేని స్థితి చూసుకుని బాధపడ్తుంది సత్యవతమ్మ.
    
                                  *    *    *    *


Next Page 

  • WRITERS
    PUBLICATIONS