Next Page 
కొత్తనీరు పేజి 1


                                       కొత్తనీరు
                                                                                    --డి.కామేశ్వరి

                             
    
    "ఎవరి దగ్గిర నించండీ ఉత్తరం?" చదువుతున్న భగవద్గీత పక్కన పెట్టి అప్పుడే పోస్టుమాన్ తెచ్చియిచ్చిన ఉత్తరాన్ని చదువుతున్న జగన్నాథంగారిని అడిగింది పార్వతమ్మ వత్తులు చేసుకుంటూ.
    "పెద్దవాడి దగ్గిరనించి!"
    "ఏం రాశాడు? ....దసరాకి వస్తామన్నారా?...." వత్తులు చేయడం ఆపి కుతూహలంగా అడిగింది పార్వతమ్మ.
    "హుఁ!....ఇలాంటి గొడవలు వస్తాయని నాకు తెలియదూ!....ఎంతయినా వాడికంటే పాతికేళ్ళు ముందు పుట్టిన వాడిని....కాస్తో కూస్తో లోకజ్ఞానం లేకుండా చెప్పానా అప్పుడు! ...చెపితే విన్నాడా? పెద్దవాళ్ళ మాట వినక బాగుపడిందెవడు?....ఎందుకు చెప్పారో అన్న జ్ఞానం వుందా అప్పుడు?" ...
    "ఏమిటయిందండీ!.....ఏం రాశాడు?" ఆత్రుతగా చూసింది పార్వతమ్మ.
    "ప్రేమ, ప్రేమ అని వల్లించాడు! తల్లి దండ్రుల మాట కాదని చేసుకున్నాడు. కాని, ముందు చూపు ఏమన్నా వుండి ఏడిసిందా అప్పుడు?...." ఉత్తరం క్రిందపడేసి కళ్ళజోడు తీసి పంచతో తుడుస్తూ భార్యవైపు చూశారు ఆయన.
    "అబ్బ! .... ఏం జరిగిందో చెప్పకుండా....ఎప్పుడో జరిగి పోయిందానికి బాధపడడం ఎందుకు! ...." విసుక్కుంది పార్వతమ్మ.
    "ఎప్పుడో జరిగిన దాని ఫలితం యిప్పుడు అనుభవానికి వచ్చింది అబ్బాయిగారికి." వెటకారంగా అన్నారు ఆయన. "నీ మనవరాలు పెళ్ళీడు కొచ్చిందా? .... ఇప్పుడు తెలుస్తూంది కష్టం. నిష్ఠూరం!" ....
    "ఏమిటండీ యీగోల....అసలు సంగతి చెపుతారా చెప్పరా?".....విసుగ్గా అడిగింది పార్వతమ్మ.
    "ఏముందే చెప్పడానికి?.....ఇంకా బోధపడలేదూ?.....ఉష పెళ్ళీడు కొచ్చిందా! దాని పెళ్ళి ఓ సమస్య అయిందట వాడికి. వాడు. వాడి భార్య ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నారట. వీడేమో తెలుగు సంబంధాలు చూస్తున్నాడట. మీనాక్షేమో ససేమిరా అరవ సంబంధమే చేయాలంటుందిట! వాళ్ళ దూరపు బంధువు లిద్దరు మంచి ఉద్యోగాలలో వున్నారట. వాళ్ళలో ఒకరి కిచ్చి చేయమంటుందిట. మనవాడు తెలుగు సంబంధమే చేస్తానంటాడట. వాళ్ళిద్దరి తగువు అలా వుండగా యీ మధ్య వచ్చి చూసిన రెండు మూడు సంబంధాలవాళ్ళు తల్లి, తండ్రి వేరువేరు జాతులని తెలియగానే చేసుకోడానికి యిష్టపడలేదట. అరవ వలలు తెలుగువారి క్రింద జమ కడుతున్నారని, తెలుగువాళ్ళు అరవవారి క్రింద జమకట్టి చేసుకోడానికి యిష్టపడడం లేదని రాశాడు. ఈ విషయం అంతా ఓ సమస్యగా తయారయిందిట! ఇంతేకాక నీ మనవరాలు తల్లిదండ్రుల యిద్దరి మాట కాదనలేక ముందు వూరుకున్నా, యిప్పుడు మొండికెత్తి వాళ్ళిద్దరు చెప్పిన సంబంధాలూ తన కక్కరలేదని తన పెళ్ళి తనే యిష్టం వచ్చిన వాడితో చేసుకుంటా నంటూందిట! .... ఇదీ సంగతి! 'అమ్మాయికి మీమీద గౌరవాభిమానాలు వున్నాయి. చెపితే మీమాట కాదనదు. దానికి నచ్చచెప్పి ఒప్పించి, ఏదన్నా మంచి సంబంధం చూసి పెళ్ళి కుదర్చమని రాశాడు రామం" అని జగన్నాథంగారు ఉత్తరం సారాంశం భార్యకి వివరించారు.
    "ఆఁ.....వాడు మనమాట విన్నాడా....వాడి కూతురు వినబోతుందనడానికి?....ఈ కాలపు పిల్లలు యింకో రెండాకులు ఎక్కువే చదువుకున్నారు"....పార్వతమ్మ గొణిగింది.
    "ఉషని నాలుగైదు రోజుల్లో ఏదో వంకతో మీ దగ్గిరకి పంపుతాను. నెమ్మదిగా దానిని దారిలోకి తీసుకువచ్చే బాధ్యత మీదే" అని రాశాడు. అబ్బాయిగారికి యిప్పటికయినా తెలిసిందన్నమాట. ఇలా జాతి మతాలు చూసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే వచ్చే అనర్ధాలేమిటో.....అంతే, తనదాకా వస్తేగాని తెలియదు. తల్లి తండ్రుల బాధ యిప్పటికి తెలిసిఉంటుంది వాడికి." నిష్ఠూరంగా అన్నారు ఆయన. గతం గుర్తుకు తెచ్చుకుంటూ.
    
                                *    *    *
    
    పాతికేళ్ళ క్రితం!
    "నే నా అమ్మాయికి మాటిచ్చాను.....ఇప్పుడు మీకోసం యిచ్చినమాట వెనక్కి తీసుకోడం నావల్ల గాదు!....ఆ అమ్మాయి. నేను పెళ్ళిచేసుకుందామని నిశ్చయించుకున్నాం. ఆ సంగతి చెప్పడానికే వచ్చాను యిప్పుడు!...." ఇంజనీరింగు ప్యాసయి, మద్రాసులో ఏదో కంపెనీలో పనిచేస్తున్న రామం ఓసారి సెలవలకి వచ్చినపుడు తల్లి పెళ్ళిమాట ఎత్తగా తన మనసులో సంగతి బయటపెట్టాడు.
    ఆరోజు మధ్యాహ్నం మూడు గంటలకి సెలవలకి యింటికి వచ్చిన పెద్దకొడుకుని ఆప్యాయంగా పీటమీద కూర్చోపెట్టి వేడివేడి బజ్జీలుచేసి పెడుతూ, పార్వతమ్మ అంది.
    "ఏం రా చదువు అవాలి అన్నావు. అయింది, ఉద్యోగం అవాలన్నావు. అదీ అయింది - ఇంక పెళ్ళికి ఏ అభ్యంతరం లేనట్లేనా? ఇంకెన్నాళ్ళురా పెళ్ళి పెడాకులు లేకుండా కూర్చుంటావు! పాతికేళ్ళు కూడా నిండిపోతున్నాయి. ఆ సంబంధాల వాళ్ళందరూ మీ నాన్నకి రోజుకో ఉత్తరం రాసి ప్రాణాలు తీస్తున్నారు! ఆడపిల్లల వాళ్ళని అలా అన్నాళ్ళు సందిగ్ధంలో పెట్టడం మనకి భావ్యం కాదు."
    "వాళ్ళని అలా కాచుకు కూర్చోమని ఎవరన్నారు?" బజ్జీలో ఉల్లిపాయ కొరుకుతూ ఉన్నాడు రామం.
    "బాగుందిరా. ఏదో వాళ్ళ ఆశ వాళ్ళది! ఆడపిల్లలు గల వాళ్ళ ఆత్రుత నీకు ఎలా తెలుస్తుంది? మన పిల్ల పెళ్ళికి మనం ఆరాటపడలేదూ! నీవేదో తేలిస్తే మీ నాన్న వాళ్ళకి రాస్తారు.....ఎలాగూ వచ్చావు....పోనీ ఓసారి వెళ్ళి ఆ నాలుగు సంబంధాలూ చూసుకువద్దాం...ఏది నచ్చితే అది చేసుకోవచ్చు...." కొడుకు మొహం లోకి ఆశగా చూస్తూ అంది పార్వతమ్మ.
    రామం మౌనంగా ప్లేటు వంక చూస్తూ వూరుకున్నాడు. మౌనం అర్ధాంగీకారం క్రింద తీసుకొని ఉత్సాహంగా అంది పార్వతమ్మ. "అయితే మీ నాన్నని వాళ్ళకి టెలిగ్రాంలు యిమ్మంటాను ఎల్లుండి దశమినాడు వస్తామని."...
    "అమ్మా!" ఏదో చెప్పాలని ఆరాటపడ్డాడు రామం. గొంతు సవరించుకున్నాడు.
    "ఏమిటిరా.....ఏమిటి నీ నాన్పుడు?"
    "అది కాదమ్మా.....యీ సంబంధాలు ఏవీ చూడనక్కరలేదమ్మా. నేను చూడను."
    ఆశ్చర్యంగా చూపింది పార్వతమ్మ.
    "అదేమిటిరా. చూడకపోతే ఎలా! చూడకుండా సంబంధాలు ఎలా కుదురుతాయి? అందులో యిద్దరు పిల్లలు బాగుంటారుట. ముఖ్యంగా ఆ కాకినాడ పిల్ల చాలా బాగుంటుందిట. చూశాక నచ్చక పోతే మానేయవచ్చు. కాని చూడకపోతే ఎలా!....."
    "అదికాదమ్మా .... నేను....నేను..." తడబడ్డాడు రామం.
    "ఏమిటి నీ సందేహం? చెప్పు."
    "సందేహం కాదమ్మా. నేను మెడ్రాసులో ఓ పిల్లనిచూశాను. మా స్నేహితుడి చెల్లెలు.....ఆ అమ్మాయిని చేసుకుందామని"...
    "ఎవరి పిల్ల! పోనీ ఆ అమ్మాయి నీకు నచ్చితే ఆ పిల్లనే చేసుకుందువుగాని.....ఆ అమ్మాయి బాగుంటుందా? మంచి సంప్రదాయమేనా? వాళ్ళింటి పేరు ఏమిటి? ఆ తండ్రి పేరూ అదీ చెప్పు. మీ నాన్నకి చెపుతాను...." ఉత్సాహంగా అంది పార్వతమ్మ. కొడుకు పెళ్ళి కుదిరిపోయిందన్న సంబరంతో.
    "అమ్మా! వాళ్ళు తెలుగు వాళ్ళు కాదమ్మా! తమిళులు. అయ్యర్లు. అరవబ్రహ్మణు లన్నమాట!" బెరుకుగా తల్లి వంక చూస్తూ అన్నాడు రామం.
    "ఆఁ!...." పార్వతమ్మ తెల్లబోయింది. అయోమయంగా చూసింది. ఏం మాట్లాడాలో తెలియక ఒక్కనిమిషం అలా చూస్తూ వుండి పోయింది.       


Next Page 

  • WRITERS
    PUBLICATIONS