Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 1


                                తిరిగి దొరికిన జీవితం
                                                                          --డి.కామేశ్వరి

                                    
    
    సరోజ నాలుగోసారి గుమ్మం బయటికి వచ్చి తొంగి చూసింది రోడ్డు మీదికి. సావిట్లో కూర్చున్న జానకమ్మ సరోజని చూసి చిన్నగా నవ్వుకుంది. "ఎందుకే అలా కాలు గాలిన పిల్లిలా తిరుగుతావు. వాడొస్తే యింటికి రాడుటే, నీ ఆరాటం బంగారంకానూ!" అంటూ మేనకోడలిని మురిపెంగా చూస్తూ ముసి ముసి నవ్వుతో అంది. సరోజ పట్టుబడ్డ దొంగలా తడబడింది. ఎర్రబడిన మొహం తిప్పుకుంటూ "నేనేం అందుకోసం చూడడంలేదు. పోస్టు మాన్ వస్తున్నా డేమోనని చూశాను గాని, నీ కొడుకు కోసం చూడ్డమేనా ఏమిటి నా పని?" బింకంగా అంది.
    "నీ కుత్తరాలు రాసేవాడే వస్తుంటే మరెక్కడనించే నీకు ఉత్తరం వస్తుంది?" జవాబు చెప్పలేక తడబడి "ఆ...మరే నాకేం పనిలేదా ఏమిటి, బావ కోసంచూడడం తప్ప...వూరికే తోచక అలా చూశానంతే" అంటూ దబాయించింది. జానకమ్మ మేనకోడలిని చూసి నవ్వింది. "పిచ్చిదానా....ఎందుకే అలా కంగారు పడ్తావు-వస్తాడు లే, రాక ఎక్కడికి పోతాడు..." అంది.
    "అది కాదత్తయ్యా, ట్రైను వచ్చి గంట అయి వుండాలి. ఇంకా రాలేదేమిటి?"
    "బాగుంది రైలొచ్చిందో లేదో, ఈ రైళ్ళు సరిగా ఎప్పుడు వస్తున్నాయి కనుక..."
    సరోజ ఓ పదినిమిషాలు ఏదో పత్రిక తిరగేస్తూ కూర్చుని తరువాత విసుగ్గా లేచి గదిలోకి వెళ్ళింది. ఉదయం అంతా ఓపిగ్గా, శ్రద్దగా బావకోసం సర్దిన గదిని చూస్తూ సంతృప్తిపడింది. అలమరలో పుస్తకాలన్నీ నీట్ గా సర్దింది. టేబిల్ క్లాత్ క్రొత్తదివేసి బావ వస్తువులన్నీ సరిగా సర్దింది. ప్రక్కమీది తెల్లదుప్పటి పరిచింది. రేడియోమీద బావ ఫోటో ముందు నిలబడి తదేకంగా చూస్తూంటే ఆమె పెదాలమీద చిన్న నవ్వు మెదలింది. ఫోటో చేతిలోకి తీసుకుంది. బావ!...బావ యిప్పుడు మామూలు బావకాదు! ఉద్యోగస్తుడయ్యాడు - ఇంజనీర్ అయ్యాడు. మంచి కంపెనీలో ఆరంభంలో ఆరొందలు తెచ్చుకునేటంత ఉద్యోగి అయ్యాడు. ఉద్యోగస్తుడయ్యాక, ఆరు నెలల తర్వాత వస్తున్న బావకోసం ఎదురు తెన్నులు చూడడం విసుగుతో పాటు ఎంత ఆనందం వుంది!
    ఆరునెలలు....యిదే మొదటిసారి తామిద్దరూ ఇన్నాళ్ళు ఒకరిని ఒకరు చూడకుండా వుండడం....ఆర్నెల్లు ఎంత భారంగా గడిచాయి!....'వస్తున్నాను. మరెప్పుడూ దేవిగారు విరహం అనుభవించ నక్కర లేకుండా అనుక్షణం కళ్ళముందుండే ప్రయత్నంలో వస్తున్నాను." ఉత్తరంలో వాక్యాలు గుర్తువచ్చి సరోజ బుగ్గల్లో వెచ్చని ఆవిరి వచ్చింది. అవును, బావని మరెప్పుడూ విడిచి వుండలేకుండా పెద్దలు పెళ్ళి బంధంతో కట్టేస్తున్నారు....మరో పదిరోజులలో తామిద్దరు ఒకటవుతారు! తిరుపతిలో పెళ్ళి! అత్తయ్య మొక్కుకుందిట! కొడుక్కి ఉద్యోగం దొరికితే తమ పెళ్ళి కొండమీద చేస్తానని! కాదనడానికి, పెళ్ళి మా ఇంటిలోనే జరగాలని అనడానికి తన కెవరున్నారు గనక! తనకి ఎవరూ లేరని తనెప్పుడన్నా అనుకుందా యీనాడు అనుకోడానికి, అమ్మ నాన్న లేకపోతే నేం అత్తయ్య, మామయ్య ఆ లోటు ఎన్నడన్నా కనపరిచారా! పన్నెండేళ్ళ నించి యిక్కడే పెరిగిన తనని యీ యింట్లో కోడలు, కూతురు అన్ని స్థానాలు ఎప్పుడో వచ్చే శాయి - యీ పెళ్ళి కేవలం తనకోసం మాత్రమే!.....అత్తయ్య మావయ్యలకి మాత్రం ఎవరున్నారు. బావ ఒక్కగా నొక్క కొడుకాయె - అందుకే గుమస్తాగిరీ చేసిన మామయ్య తాహతు మించినా ఇంజనీరింగు చెప్పించాడు. ఇంటిలో సిద్దంగా వున్న మేనకోడలకిచ్చి పెళ్ళిచేసి తను బాధ్యత నెరవేర్చుకుని పెద్దతనంలో హాయిగా తమ నీడన సేద తీరుదామనుకున్నారు- కాని అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే మనిషిమనుగడ! అర్ధం ఏమిటి? మామయ్యకి నలభైయ్యో పడిలో బావ పుట్టాడు. మామయ్య రిటైరయ్యే నాటికి అప్పుడే బావ ఇంజనీరింగు పూర్తిచేశాడు. బావ ఇంజనీరింగులోచేరే నాటికీ ఇంజనీరింగ్ పూర్తిచేసే నాటికి మధ్యకాలంలో ఇంజనీర్లకి ఉద్యోగాలు దొరకని దుస్థితి ఏర్పడింది. అప్పుచేసి కొడుక్కి పెద్ద చదువు చెప్పించి, కొడుకు పెద్ద ఉద్యోగస్తుడై తనని ఆదుకుంటాడన్న మామయ్య నమ్మకం, ఆశలు అన్నీ బావకి ఉద్యోగం దొరకపోవడంచె హతాశుడై పోయాడు. మావయ్య రిటైరవ్వడం, బావకి రెండేళ్ళు ఉద్యోగం లేకపోవడం ఆ రెండేళ్ళు తమ జీవితాలకి పీడకల! ఇల్లు గడపడానికి, అప్పు చెల్లగొట్టడానికి మామయ్యపడిన పాట్లు దేవుడి కెరిక! బావ దిగులుతో కృంగిపోయాడు. నిరాశతో అధైర్యపడి పోయిన బావకి ధైర్యం చెప్పడం ఓదార్చడం తన వంతు అయింది. ఎంత చిన్న ఉద్యోగం అన్నా చేస్తానని తయారయిన బావకి ఆ మాత్రం అవకాశమూ దొరకలేదని ఎంత బెంగపెట్టుకున్నాడు. ప్రయత్నించిన బావకి ఉద్యోగం దొరకలేదుకాని, తనకి ఓ చిన్న అవకాశం లభ్యమవుతుంది. మామయ్య అవస్థ గమనించిన పొరుగింటి హెడ్మాస్టరుగారు తమస్కూల్ లో లీవు వేకెన్సీల్ టీచరుగా చెరమన్నారు. ఆ సమయంలో ఆయన దేముడిలా కనబడ్డాడు. బావ అభిమానపడి వద్దన్నాడు. నే నుండీ నీ చేత ఉద్యోగం చేయించ మన్నావా, ఆడదానిని నీవు, ముసలాయన నాన్న సంపాదిస్తుంటే నేను తిని కూర్చోనా...నేను కూలిపని అయినా చేస్తాగాని నీ చేత ఉద్యోగం చేయించనని మొండిపట్టు పట్టాడు. బావని అందరూ కలిసి వప్పించేసరికి తాతలు దిగి వచ్చారు. ఆ రెండేళ్ళు బావ మొహంలో నవ్వే కనపడలేదు. గడ్డమన్నా గీసుకునేవాడు కాదు. కాఫీ ఒకసారి కంటే త్రాగేవాడుకాడు. చాకలికి బట్టలు వేయకుండా మాసినవి కట్టుకుతిరిగేవాడు. ఏదన్నా అంటే దమ్మిడి సంపాదించ లేనివాడికి వేషా లెందుకు అనేవాడు అదోలానవ్వి. బావ అవతారం చూస్తే గుండెలు తరుక్కుపోయేవి. ఆ నిరాశలో ఏ అఘాయిత్యం అన్నా చేస్తాడేమోనని బెంగపడేవారు తాము. అంతలా బాధపడవద్దని, నిరాశపడవద్దని, భవిష్యత్తుమీద నమ్మకం వుంచమని యింటిలో అందరు ఎన్ని విధాలుగానో చెప్పేవాళ్ళు. అత్తయ్య పూజలు మొక్కులకో బావ ప్రయత్నాల ఫలితమోగాని ఆఖరికి రెండేళ్ళకి బావకి హైదరాబాద్ లో ఓ కంపెనీలో మంచి ఉద్యోగం దొరికింది. కష్టాలు గట్టెక్కాయని అందరూ సంతోషించి-ఉద్యోగంలో చేరిన తర్వాత యిదే రావడం బావ?...ఉద్యోగం వస్తే తప్పక పెళ్ళిమాట ఎత్తడానికి వీలులేదన్నాడు బావ. యింక ఆ ఆటంకం లేదు గనక ఏకంగా ముహూర్తం పెట్టేసి రాశారు మామయ్య....మరీ పదిరోజులలో పెళ్ళి-ఆ తరువాత హైదరాబాదులో మకాం-


Next Page 

  • WRITERS
    PUBLICATIONS