Next Page 

వివాహబంధాలు పేజి 1


                                          వివాహబంధాలు
                                                                                                --డి.కామేశ్వరి

 

                                  

    "డాక్టర్ , కిల్ మీ డాక్టర్ - లెట్ మీ డై - నన్ను చచ్చిపోనీండి. నన్నెందుకు బతికించారు డాక్టర్!"
    హృదయవిదారకంగా ఏడుస్తున్న శారద వంక జాలిగా చూసింది డాక్టర్ విజయ. ఆ మాటలను లెక్క చెయ్యనట్టు ఇంజక్షన్ యివ్వడానికి ప్రయత్నిస్తున్నాడు డాక్టర్ శ్రీనాధ్.
    "డాక్టరుగారూ నన్నెందుకండీ బతికించారు. చచ్చిపోయి అయిన నన్ను సుఖపడనీయరా. ప్లీజ్ మీకు పుణ్యం వుంటుంది. నా కింత విషం యీయండి. నన్ను చచ్చిపోయి సుఖపడనీయండి? నేనింక యీ బతుకు బతకలేను డాక్టర్ గారు."
    దీనాతిదీనంగా ఏడుస్తున్న శారదని చూస్తుంటే విజయ కళ్ళు అప్రయత్నంగా చమర్చాయి. ఓదార్పుగా ఆమె భుజం తట్టి, "ముందు నీవు కాస్త విశ్రాంతి తీసుకోమ్మా తరువాత మాట్లాడుదాం..." ఏదో నచ్చచెప్పబోయింది.
    శారద ఆ మాటలు వినకుండా తల అడ్డంగా ఆడిస్తూ "ఈ విశ్రాంతి నాకొద్దు డాక్టర్ శాశ్వత విశ్రాంతి కావాలి నాకు. బతుకు పోరాటంలో పోరాడి పోరాడి అలిసిపోయిన నాకు ఈ చిన్న విశ్రాంతి వద్దు శాశ్వత విశ్రాంతి కావాలి నాకు. ఆ విశ్రాంతి నాకు దక్కేట్లు చేయండి." రెండు చేతులు జోడించి ప్రార్ధించింది.
    కన్నీటి చారికలతో, ఎర్రబడ్డ మొహంతో, మృత్యువుతో పోరాడి అలిసిపోయిన ఆ మొహంలో నైరాశ్యం. ఆవేదన చూస్తూంటే ఆ అమ్మాయికి వచ్చిన అంత కష్టమేమిటో. పట్టుమని పాతికేళ్ళుకూడా కాకుండానే బతుకు పట్ల అంత విరక్తి ఎందుకు కల్గిందో, ఆమె బాధ ఏమిటో అడిగి ఆరాతీసి ఓదార్చి ధైర్యం చెప్పాలనిపించింది డాక్టర్ విజయకి. కాని ప్రస్తుత స్థితిలో ఆ అమ్మాయి అంతసేపు మాట్లాడడం మంచిదికాదు. గండం గడిచిపోయింది. ఆ అమ్మాయి కాస్త కోలుకున్నాక నెమ్మదిగా అడగవలసిన ప్రశ్నలు అవి.
    విజయమొహంలో భావం అర్ధంచేసికున్నట్టు శ్రీధర్ "మిగతా విషయాలు తరువాత. ముందు ఆ అమ్మాయికి యింజక్షన్ యివ్వాలి." కళ్ళతోనే సౌజ్ఞచేస్తూ ఒక విధంగా బలవంతంగానే గింజుకొంటున్న శారదకి యింజక్షన్ యిచ్చేశాడు శ్రీధర్.
    "చూడమ్మా. నీకొచ్చిన కష్టం ఏమిటో మాకు తెలియదు. కాని ప్రతి సమస్యకి ఏదో పరిష్కారమార్గం ఉండకపోదు. ఆ మాత్రం దానికోసం నిండుప్రాణం తీసుకోడం అవివేకం...." విజయ మృదువుగా ఆమె చెయ్యి విడిచి ఏదో చెప్పబోయింది.
    "అవును డాక్టర్, అందరూ అలాగే కబుర్లు చెపుతారు. నీతులు బోధిస్తారు. పిల్లికి చెలగాటం. ఎలకకి ప్రాణ సంకటం. ఆ బాధ మీ కర్ధంకాదు." ఉక్రోషం కసి నిరాశ పెనవేసుకోగా నిస్సహాయంతో కోపం ముంచుకొచ్చి కటువుగా అంది శారద.
    "బాధ - బాధలు అన్న మాటకి అర్ధం నాకు తెల్సినంతగా మరొకరికి తెలియదమ్మా. ప్రతీమనిషి తనొక్కరే ప్రపంచంలో బాధలన్నీ పడుతున్నామనుకుంటారు. "అదోలా నవ్వింది విజయ.
    "వద్దుడాక్టరుగారూ, ఈ మాటలన్నీ నాకు చెప్పకండి. ఓర్పు, శాంతం ఈ మాటలన్నీ వినివిని విసిగి పోయాను. నన్నెలాగో చావనీయకుండా బతికించారు. నా ఖర్మానికి నన్ను వదిలి వెళ్ళండి. నా ఏడుపు నన్నేడవనీయండి." విరక్తిగా అని శారద కళ్ళు మూసుకుంది.
    విజయ శ్రీధర్ వంకచూసింది.
    "విజయా ఆ అమ్మాయిని పడుకోనియ్యి. మనం తరువాత మాట్లాడుదాం. ఇంజక్షనిచ్చాను. పడుకుంటుంది. లేచాక మాట్లాడవచ్చు" అన్నాడు.
    విజయ శ్రీధర్ యిద్దరూ అక్కడనించి నెమ్మదిగా లేచి వెళ్ళారు.
    "ఆ అమ్మాయి పాపం చాలా విరక్తితో, బాధతో ఆత్మహత్యకి పాలుపడిందనిపిస్తూంది. పాపం ఏం జరిగిందో జాలిగా అంది విజయ కన్సల్టింగ్ రూములోకి రాగానే.


Next Page 

WRITERS
PUBLICATIONS