గురవాయణం
అప్పు తీసుకొనువాడు వైద్యుడు
చిన్నప్పుడు చదువుకున్న సుమతీ శతకంలో ఓ పద్యంలో, కామా ఎగిరిపోవడంవల్ల 'అప్పిచ్చువాడు వైద్యుడు' అని అందరూ అపార్థం చేసేసుకుని, ఈ రోజుకీ, చాలామంది పేషంట్లు చికిత్సానంతరం, ఫీజు ఇవ్వరు సరికదా-
"ఓ వందుందాదారి ఖర్చులకి" అని అప్పు అడుగుతుంటారు. నన్నడిగితే, అప్పు తీసుకొనువాడు వైద్యుడు అన్నది సబబంటాను. ఆయన మనమధ్యలేరుకానీ, ఉంటే, ముళ్ళపూడిగారు కూడా అవునని అప్పేసుకునేవారు- క్షమించాలి- ఒప్పేసుకునేవారు. తెగ రిచ్ అనుకు (ంటు)న్న అమెరికాలో సైతం- అందరికంటే ఎక్కువ అప్పుల ఊబిలోలోతుగా ఇరుకున్న వాళ్ళెవరంటే వైద్యులే.
మనదేశంలో, చదువు 'కొనకుండా' చదువుకుంటే, వైద్యుడేమీ అప్పుచేయనక్కర్లేదు. అంతా ప్రభుత్వమే భరిస్తుంది. నేను చదువుకున్నప్పుడు నా సంవత్సరం ఫీజు అక్షరాలా మూడువందల రూపాయలు.
కాకపోతే- మెడికల్ కాలేజీ రోజుల్లో 'చదువేతర కార్యక్రమాలకు' (Extra curricular activities) బోల్డంత అప్పుచేయాల్సి వచ్చేది. మెడికో statusని నలుగురికీ చూపించడానికి- శంకర్ విలాస్ (Non AC) ఒన్ బై టు కాఫీనుంచి, ఉదయ శంకర్ (AC)లో Fruit saladకి ఎదగాలంటే- అప్పు తప్పదు కదా! అంతకు ముందే విన్నవించుకున్నట్లు, అ.సి.టి (అమ్మాయిల సినిమా టిక్కెట్లు సంఘం) నడపడానికి, అప్పు అవసరం కదా!!
పదిసార్లలో, ఒక్కసారన్నా, సుధాకర్ గాడి స్కూటర్ లో పెట్రోలు నింపడానికి- అప్పు అనివార్యం కదా!! నాలుగురాళ్ళతో స్నేహితురాళ్ళకు, Sanyo Tape Recordలు బహుమతిగా ఇవ్వాలంటే అప్పు అత్యవసరంకదా!!? చాలామంది మెడికోలకి, "ప్రేమాయణంలో పిడకల వేట'కి ధన సహాయం అవసరం. అలాంటి ప్రేమ పెనుతుఫాను బాధితులకి, ఉడతా భక్తిగా, పిడకలకి అప్పు సర్దేవాడిని.
"నువ్వే అడుక్కుంటున్నావు కదరా- నీకు మళ్ళీ ఈ సంఘసేవ ఏంటిరా" అని అప్పుడప్పుడు అంతరాత్మ ప్రశ్నించినా- "అప్పు మనొక్కరికోసమే కాదు. నల్గురికీ పంచాలి" అనే అప్పులమ్మ దేవి ఆశీస్సులతో అందరికోసం నేనే అప్పు చేసేవాడిని. ఫలితం ఎంతమంది ప్రేమికులు, దంపతులు అయ్యారో.
అలా కలిపినందుకు చాలామంది దీవించారు. అలా బలిచేసినందుకు ఇంకా చాలామంది శపించారనుకోండి- అది వేరే విషయం. నా అదృష్టం ఏమిటంటే-
నా సొంత ప్రేమాభిషేకానికి, పైసా కూడా అప్పు తీసుకోలేదంటే నమ్మండి. నేను ఎంత ఖర్చు పెడదాం అని ప్రయత్నించినా (నటించినా అన్నది సరైనమాట) తనే అంతా భరించి, నా పుట్టినరోజుకి బట్టలకైవెచ్చించి, చివరికి గుంటూరు, విజయవాడ, రానుపోను ఛార్జీలు కూడా తనే చెల్లించి, వడ్డీలేని ప్రేమని అందించిన భవానికి ఏమిచ్చి 'రుణం' తీర్చుకోగలను...
మరిన్ని వివరాలకు 'పైసా ఖర్చులేని ప్రేమకి పన్నెండు సూత్రాలు' అని నేను రాసిన పుస్తకంలో, "జేబులో లేని డబ్బులు తీస్తున్నట్లు నటించడం ఎలా" అనే చాప్టర్ చదవవలసిందిగా మనవి.
నాకు ఈ అప్పులు చేయడం ఎలా వచ్చిందా అనే సింహావలోకనం చేసుకుంటే వెంటనే దొరికింది సమాధానం. వంశపారంపర్యం. నా పితృదేవుడి వరం. మా నాన్న అప్పుచేయడంలో అందెవేసిన చెయ్యి అని అమ్మ చెప్పేది. కాకపోతే ఆయన అవసరాలకి అప్పుచేసేవాడు. మనం కొంచెం ఎదిగి, ఆర్బాటాలకు అప్పుచేయడం జరిగింది.
అసలుకంటే వడ్డీ ముద్దుఫక్కీలో నాకైతే మా నాన్నకంటే, బాబాయి ఎక్కువ Inspiration. బాబాయి, హైస్కూల్ వయస్సులోనే బజ్జీల బండీ బ్రహ్మయ్యకి ఐదొందలు అప్పుపెట్టి, మా వంశ మర్యాదని పదిరెట్లు పెంచాడు. రోజుకి ఇరవైమంది స్నేహితులకి బజ్జీల భోజనం పెట్టి, వాళ్ళ ఆకలి ఆర్తిని తీర్చిన బాబాయి, తర్వాత పెట్టుబడిలేక పట్టుబడి, రుణం తీర్చలేక దారుణంగా నాన్నతో దెబ్బలు తిన్నాడు. బెల్ట్ దెబ్బలు తింటూ "ఒరేయ్ నువ్వుకూడా తిన్నావు కదరా బజ్జీలు-నాకే ఎందుకీదెబ్బలు" అంటూ నావైపు సారించిన జాలి చూపులు- నాకింకా గుర్తొచ్చి, గుండె బరువెక్కుతుంది.
పెద్దయి, పెళ్ళయి, సంపాదన మొదలెట్టినాక అప్పులు చేయడం తగ్గిపోతుందిలే అన్న నా ఆశ అడియాస అవ్వడానికి ఆరునెలలు కూడా పట్టలేదు. పూనాలో పి.జి. చేసేటప్పుడు-నా జీతం 800 రూపాయలు. ఇంటద్దె 1000 రూపాయలు.
అప్పు చేయడానికి, అగంతకుడైనా, అపరిచితుడు అయినా ఓకే. అయినవాళ్ళ దగ్గరమాత్రం, అణాకూడా అర్ధించకూడదు అని గట్టిగా నమ్మి, నాన్న వాళ్ళదగ్గర, మామవాళ్ళ దగ్గర రూపాయికూడా తీసుకోకుండా, సంసారాన్ని ఈదిన నా ఆదర్శవాదానికి మీరంతా ఇన్స్ పైర్ అవుతారని నాకు తెలుసు.
ఆ రోజుల్లో సుమేర్ సింగ్ అని ఓ స్నేహితుడుండేవాడు. వాడికో సిద్దాంతం, వెయ్యి రూపాయలకంటే ఎక్కువ అప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదని.
ఉదయమే వాడి దగ్గర వెయ్యికొట్టించి, స్కూటర్ కి పెట్రోలు పట్టించి, పెట్రోలు అయిపోయేసరికి, మరిన్ని అప్పులు దట్టించి 'అప్పాలజీ'లో అనతికాలంలో డాక్టరేట్ సంపాదించేశాను. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో, ఏ తెల్లవాడి దగ్గరా అప్పుచేయలేదు. ఒట్టు. కాకపోతే, క్రెడిట్ కార్డ్ అనే ఓ ప్లాస్టిక్ అప్పు సదుపాయం బాగా అక్కరకొచ్చింది ఆ పదేళ్ళు.
సన్ షైన్ ఆసుపత్రి పెట్టినాక, డబ్బులే డబ్బులు అనుకున్న నాకు- "తపు నాయనా- అప్పులే అప్పులు అన్నది సరైన విషయం" అని అన్ని బ్యాంకులు అర్థమయ్యేలా చెప్పేశాయి. "ఎంతమందికి అప్పు ఉంటే, అంతమంది నీ ఆరోగ్యంకోసం ప్రార్థిస్తారు తమ్ముడూ" అని జ్ఞానోపదేశం చేసిన బ్రదర్ బాబా భాస్కర్ సలహాను మనసా వాచా నమ్మి, మరిన్ని బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నాను.
అన్నట్లు మీకెవరికైనా గుండె ద్రవించి, మెదడు ఘనించి, నాకు అప్పు ఇద్దామనే మంచి ఆలోచన వస్తే- నా ఇ-మెయిల్ ద్వారా కనెక్ట్ అవ్వండి.
'అప్పు'డప్పుడు నాక్కూడా రుణవిముక్తుడనవుదామని పిచ్చి కోరికలు వస్తుంటాయి.
'అప్పు'డు మీ 'అప్పు' తీర్చేస్తా. *