Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు - 2 పేజి 1


                                  ప్రసన్నకుమార్ సర్రాజు కథలు - 2
                    
                                                                                ---ప్రసన్నకుమార్   
                                     

                                

 

                           

    ముఖ్యమంత్రి కాన్ వాయ్ పెద్దిభొట్లవారి సందులోకి తిరుగుతోంది. ఆయన కూర్చుని వున్న ఎంబాసిడర్ ముందు రెండు మోటారు సైకిళ్ళ మీద ఫైలట్స్ వెడుతున్నారు. వాళ్ళిద్దరి నోళ్ళల్లో బూరాలు వున్నాయి. అదేపనిగా వాళ్ళు వూదుతున్న శబ్దానికి మనుషులు కొంచెం వంగుతున్నట్లు నటించి పక్కకి తొలగుతున్నారు. అంబాసిడర్ వెనకాల నాలుగు ఆటోల్లో సీయమ్ పర్సనల్ సెక్యూరిటీ, ఆ వెనకాల ఎనిమిది సైకిళ్ళ మీద అటెండర్లూ ఫాలో అవుతున్నారు.
    పెద్ధిభొట్లవారి సందులో వున్న గవర్నర్ 'బంగళా'దగ్గర కారు ఆగింది. బక్కపల్చగా వున్న సెక్యూరిటీ గార్డు గేటుతెరిచి సెల్యూట్ కొట్టాడు. కాన్వాయ్ లోపలికెళ్ళి పెద్దగా పార్కింగ్ సౌకర్యం లేని పోర్టికోలో అక్కడక్కడా సర్దుకుని ఆగింది.
    లోపల్నుంఛీ గవర్నర్ పీయే వచ్చి, వినయంగా ఆహ్వానిస్తూ సీయమ్ ని గవర్నర్ దగ్గరకు తీసుకెళ్ళాడు.
    సీయమ్ ని వాత్సల్యంగా కౌగలించుకుని, "వాట్ వుడ్ యు లైక్ టు హావ్? పిజ్జా, హాట్ డాగ్స్, బర్గర్స్!" అడిగాడు గవర్నరు.
    సియమ్- "అవేం వద్దు- ఇఫ్ యుకెన్- జస్ట్ ఎ గ్లాస్ ఆఫ్ ఫ్యూర్ వాటర్" అన్నాడు.
    గవర్నర్ ఇబ్బందిగా పిఏ వైపు చూశాడు. పీఏ ముఖంలో రంగులు మారినా చిరునవ్వు నవ్వుతూ "వైనాట్ సర్?" అని బట్టర్ కి ఏవో ఆదేశాలిచ్చాడు ఇంటర్ కామ్ లో.
    ట్రే నిండా రకరకాల ప్లాస్టిక్ పూల అలంకరణ మధ్య ఒక పొడుగాటి గాజు గ్లాసులో మంచినీళ్ళు వచ్చాయి. ఆవురావురుమంటూ ఆ నీళ్ళు తాగాడు సీయమ్.
    "చెప్పండి. ఆరోగ్యం ఎలావుంది? ఆ మధ్య మీకు హార్ట్ ట్రబుల్ ఏదో వచ్చిందని విన్నాను..." అన్నాడు గవర్నర్.
    "అవును ఆపరేషన్ చెయ్యాలని మన స్టేట్ డాక్టర్స్ చెప్పారు. మన గవర్నమెంటు రూల్సు ప్రకారం ప్రభుత్వ వీఐపీలు గవర్నమెంటు హాస్పటల్లోనే సర్జరీ చేయించుకోవాలి. కానీ గాంధీనగర్ స్టేట్ లో వుంది గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడి కెళ్ళా;లంటే రైవస్ కాల్వమీదుగా వంతెన దాటి వెళ్ళాలి. అనుమతి పత్రాలూ అవీ అవసరమౌతాయి. పోనీ ఇక్కడే చేయించు కుందామంటే కార్పొరేట్ హాస్పటల్స్ లో మీ దగ్గర ప్రత్యేక అనుమతి తీసుకుని చేరొచ్చు. కానీ ఆర్దికంగా చాలా క్షీణదశలో వున్నాం. అందుకనీ....మీరొకసారి గాంధీ నగరం గవర్నర్ కి ఫోన్ చేసి చెప్తే రైవస్ కాల్వ బోర్డర్ ను దాటాలి కాబట్టి పడవద్వారానో లేక వంతెనమీదుగానో వెళతాను" అన్నాడు సీయమ్.
    "వెళ్తాను కాదు.. వెళ్ళివస్తాను అనాలి" అని గవర్నర్ వెంటనే ఫోన్ తీసి హాట్ లైట్ మీద గాంధీనగరం గవర్నర్ కి ఫోన్ చేశాడు.
    ఫోన్ పెట్టేసి "అన్ని విషయాలూ వాళ్ళు చూసుకుంటారట యూడోంట్ వర్రీ...గో ఎహెడ్" అన్నాడాయన.
    సీయమ్ లేచి, "థాంక్యూ... గాంధీనగర్ స్టేట్ కీ మన స్టేట్ కీ సత్సంబంధాలు అంతగా లేకపోవడంతో మీదగ్గరకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇక శెలవ్. వస్తాను" అని తన కాన్వాయ్ తో వెనక్కు తిరిగాడు.
    
                                                             * * *
    
    చోడవరపు వారి వీధిలో గవర్నర్ పేట సీయమ్ అధికార నివాసంలో ఫోను మోగింది. ఆయన పీయే ఫోనెత్తి వినయంగా రిసీవరు సీయమ్ కిచ్చి చెప్పాడు మెల్లగా...
    "కృష్ణలంక సీయమ్ లైన్లో వున్నారు సార్"...    
    "హల్లో సార్! ఎలా వున్నారు? ఆపరేషన్ కి గాంధీనగర్ వెడుతున్నారట గదా!" పలకరించాడు కృష్ణలంక సీయమ్.
    "అవునండీ... అసలే బీపీ... పైగా ఈ రాజకీయాలతో అసలు విశ్రాంతి అన్నదేలేదు. ఓ నెల క్రితంనించీ ఇటు లబ్బీ పేట నించీ పెనమలూరు వరకూ రింగురోడ్డు నుంచి రామవరప్పాడు వరకూ సెపరేట్ స్టేట్ కావాలని ఒహటే రాస్తారోకోలూ నిరాహారదీక్షలూ... అధిష్టానం ఏమీ తేల్చి చెప్పదు. ఏదో మీరు, మేమూ, వన్ టౌన్ లూ అయితే మూడు కాలవలున్నాయి గాబట్టి, కాస్తోకూస్తో వ్యవసాయం చేసుకుని, ఇంత తిండి తింటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోస్టేటంటే వర్షాలమీద ఆధారపడాల్సిందే గదా!నీళ్ళడిగితే మీరొప్పుకుంటారా మేమొప్పుకుంటామా!"
    "మీరేం వర్రీ అవకండి. అంతా త్వరలోనే సర్దుకుంటుంది... ప్రస్తుతం... మీరున్నకండిషన్లో అడగటం బాగోదుకానీ.... మా అబ్బాయి సిద్దార్ధలో చేరతానని ఒకటే గొడవపెడుతున్నాడు.. ఈ లబ్బీపేట గొడవలు తేలేలోపలే మీరోమాట చెప్తే... లేకపోతే మళ్ళీ ముల్కీ సర్టిఫికేట్లనీ, అవనీ ఇవనీ చిరాకులు"
    "దాన్దేముంది! నేను మా పీఏతో ఫోన్ చేయిస్తాలెండి...." అని మాటిచ్చాడు సి.ఎమ్. కృష్ణలంక సీయమ్ ఆనందంతో "థాంక్యూ వెరీమచ్..విష్ యూ ఏ హాపీ జర్నీ టు గాంధీనగర్" అని ఫోన్ పెట్టేశాడు.


Next Page 

WRITERS
PUBLICATIONS