Next Page 
చైనా యానం పేజి 1


                                        చైనా యానం

                                                       శ్రీశ్రీ

                               
            
                                          జాబు : జవాబు
    
    నాకు 03-11-1976 వ తేదీన రాయబడిన ఒక ఉత్తరం , నాటికి నాలుగైదురోజుల తర్వాత అందింది. అదో సుదీర్ఘమైన జాబు. నన్ను అభిమానించే ఒక ఇల్లాలు వ్రాసింది. అదంతా ఇక్కడ పూర్తిగా ఉల్లేఖించనక్కరలేదు. నా సాహిత్యానికి, జీవితాశయాలకూ సంబంధించిన కొన్ని ముఖ్యప్రశ్నలను ఆవిడ లేవదీసింది. వాటిని మాత్రం ఉటంకిస్తూ ప్రస్తుతానికి అప్రస్తుతం అని నేననుకుంటున్న వాటిని మినహాయించి ఆమె జాబును ఇక్కడ ఇస్తున్నాను. తర్వాత నా జవాబు ఉంటుంది.

    శ్రీమతి ఈశ్వరి ' రాసిన ఉత్తరం ఇది :
    "మహాకవి శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారికి
    నా హృదయపూర్వక నమస్మ్ర్టతులు.
    "మీరు చాలా గొప్పవారని వినికిడి. మీ గొప్పతనం నాకు తెలిసినది బహు తక్కువ. మీ భావాలు , మీరు వెలిబుచ్చే అభిప్రాయాలు నాకు చాలా నచ్చుతాయి. ఒక విధంగా మీరంటే నాకు అభిమానం...."
    "మీరు నాకు తెలిసిందీ, మీపట్ల గౌరభిమానాలు కనపర్చినదీ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ....(అప్పుడే) నాకు మీ పరోక్ష పరిచయం. అ వెనువెంటనే అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ఒక గేయానికి ఉత్తమ గేయరచయితగా ఎన్నికయిందీ తెలిసినది.."
    "నాకు సినీ ప్రముఖుల మీద అభిమానం. ఆరాధన వంటివి లేవు. వారు వ్రాసే పాటలు బాగుంటే విని వాటిని మెచ్చుకుంటాను. లేకుంటే విమర్శిస్తాను. పిచ్చిగా అరాదించను. మిమ్మల్ని అయినా సరే..."
    "భూమి కోసం" చిత్రంలో "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా" అని రాశారు. ఆ పాట ఏ పదంలోనూ నా విమర్శకు గురి కాలేదు. పైగా ఆ పాటను గుర్తుచేసుకుని నేనే వేసే ప్రతి అడుగూ ఆ పాట అడుగుజాదలోనే వేస్తున్నానంటే హాస్యాస్పదంగా ఉంటుందేమో కాని, అది నిజం...."
    "నేను నాస్తికురాలిని. దేవుడంటే నాకు నమ్మకమూ లేదు. కలగాలని అనుకోవడమూలేదు. కానీ దీనివల్ల ఒక సమస్య వచ్చింది. స్నేహితులకు నమ్మకం వుంది. దేవుడులేడని నేనంటే, ఎందుకు లేడు? లేకపోతే ఈ సృష్టి అంతా ఎలా వచ్చింద? చెట్లు ఎలా చిగిరిస్తున్నాయి? ఎలా పూస్తున్నాయి? అటూ విరివిగా ప్రశ్నలు వేస్తారు. నేను తగినట్లుగా కొన్నిటికి సమాధానాలు చెప్పగలుగుతున్నాను. కొన్నిటికి చెప్పలేకపోతున్నాను. దేవుడున్నాడంటే నమ్మనూ లేక పోతున్నాను. మీరు నాకు ఈ విషయంలో సహకరించి, నాకు చాలా విషయాలు తెలియజేసి, దేవుడున్నాడని వాదించేవారి ముందు ఓటమి అంగీకరించకుండా తగిన సమాధానాలు ఇవ్వగలశక్తి మీద్వారా నేర్చుకుందామన్న ఉద్దేశ్యంతో ఇలా మీకు లేఖ వ్రాస్తున్నాను. నేను మీకిలా వ్రాయడంలో తప్పులేదని తెలుసు..."
    'ఆధునిక వైతాళికుడు శ్రీశ్రీ" అన్న పేరిట మొన్నీ మధ్య ఆకాశవాణి రేడియో కేంద్రం వారు యువజనులకార్యక్రమంలో తెలియని చాలా విషయాలు చెప్పారు. మీరు నాకు గురుతుల్యులుగా తెలియని క్రొత్త క్రొత్త విషయాలు తెలియజేస్తూ నా భావిజీవితానికి ఉపయుక్తంగా ఉండేటట్లు చేస్తారని సర్వదా ఆశిస్తున్నాను...."
    "నాకు కొన్ని చాలా ఇష్టమయిన పనులున్నాయి. అవి : పుస్తకాలు చదివి వాటికీ, రేడియో విని ప్రసారమయిన కార్యక్రమాలకు నా అభిప్రాయాలు వ్రాయడం . నా పేరు పుస్తకాలలోనూ, రేడియోలోనూ, పడితే విని, చదివి, ఆనందించడం వంటివి. ఇవీ నా సంగతులు. నేను స్త్రీనయినా, మీవంటి వారితో పరిచయం చేసుకునేందుకు వీలుగా మావారి పూర్తీ సహకార, ప్రోత్సాహం వున్నందువలన మీకు వ్రాయడానికి ఎటువంటి జంకూ లేకుండా వ్రాస్తున్నాను. "

                                                                                              ఇట్లు శిష్యురాలు :
                                                                                                     ఈశ్వరి

    ఈ శ్రీమతికి నేను చాలా విపులంగా జవాబివ్వాలనుకున్నాను. ఇంతలో చైనా నుండి నా కాహ్వానం వచ్చింది. అదే సమయంలో జిన్నూరు నుంచి 4వ నిరీశ్వరాశ్రమ వార్షికోత్సవానికి అధ్యక్షత వహించవలసినదిగా పిలుపు వచ్చింది. వార్షికోత్సవం 5- 12- 76 సాయంకాలం 5 గం|| లకు, అప్పుడెలాగూ దేశంలో వుండను కాబట్టి నా అధ్యక్షోపన్యాసాన్ని రాసి నిరీశ్వరాశ్రమ నిర్వాహకులకు పోస్టులో పంపించాను. ఈశ్వరిగారికి ఒక చిన్న కార్డు మాత్రం రాశాను.
    శ్రీమతి ఈశ్వరి నిర్వీశ్వరావాది కావడం నాకు అమితానందం కలిగించింది. నా అధ్యక్షోపన్యాసం చాలా మట్టుకు ఆమె ఉత్తరానికి జవాబుగా ఉద్దేశించాను. (అనగా అందులోని నాస్తికతను విశదీకరించడమే నా ఉద్దేశం) సాహితీ విషయాలు ఆవిడకు వేరే ఉత్తరం రాస్తాను.
    ఉపన్యాసం పూర్తి పాఠం ఇది.
    "Knowledge power Ignoranse is god." ఉపన్యాసం ఇంగ్లీషులో ప్రారంభించానని సభ వారు మరోలా అనుకోకండి. నా ఉద్దేశం తెలుగులో కన్నా ఇంగ్లీషులో చెబితే స్పష్టంగా వుంటుందనుకుంటాను. దాన్ని తెలుగులో చెప్పాలంటే, "జ్ఞానమేశక్తి అజ్ఞానమే దేవుడు" అనవలసి వుంటుంది.
    దేవునికి ఆస్తికులు అంటగట్టిన ముఖ్యమైన మూడు లక్షణాలు ఏవిటంటే (ఇదీ ఇంగ్లీషులోనే చెబుతున్నాను) Omnipresence, Omnipotence, Omniscience.అనగా దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు! ఇలాంటి దేవుడు ఎక్కడా లేడనీ, వాడికేమీ చేతకాదనీ ఏమీ తెలియదనీ, నాస్తికులు అంటారు. అస్తికులంటారు కదా, "మీదీ ఒక మతమే, దేవుడున్నాడని చెప్పే మతం మాది. దేవుడు లేడని నమ్మే మతం మీది. రెండూ విశ్వాసంతో కూడు కున్నవే" అని. సరే! ఒప్పుకున్నాం.
    నాస్తికత్వం కూడా ఒక మతవిశ్వాసమే అనుకున్నా తతిమ్మా మతాలన్నీ మానవుణ్ణి ఉత్త వెధవగాను, బానిసగానూ, దేవుణ్ణి సర్వశక్తిమయుడుగా, దయామయుడుగా, అఘటన ఘటనా సమర్ధుడిగాను పరిగణిస్తే ఒక్క నాస్తికులు మాత్రమే దేవుని అస్తిత్వాన్ని నిరాకరించి మానవుని మానసిక స్వాతంత్ర్యానికి శరతుల్లేని ప్రాధాన్యాన్ని సంతరిస్తారు.
    నేను ఎప్పుడూ చెప్పేదే ఇప్పుడు చెబుతున్నాను. దైవభక్తి, దారిద్ర్యం ఒకే నాణానికి బొమ్మా, బొరుసూ . మనదేశంలో ఉన్నంత దైవభక్తి, దారిద్ర్యమూ ఇంకే దేశంలోనూ లేవు. బహుశా దేవుడితో ఆఖరిపోరాటం మన దేశంలోనే జరుగుతుందని నేననుకుంటాను. ఆ సమయంలో విజయం ఎవరిదో నేను వేరుగా చెప్పనక్కరలేదు.
    ఇక్కడ మనం ఆధ్యాత్మిక చింతన నుండి బయటపడి ఆర్ధిక యదార్ధం వైపు మన దృష్టిని మరలించాలి. అప్పుడు మనకు కనిపించేదేమిటి? సర్వత్రా అసమానత్వం. ఈ అసమానత్వాన్ని ఏ దేవుడు తొలగించగలడు? అసలు దేవుడే ఈ అసమానతలను సృష్టించాడని నమ్మేవాళ్ళు వాటిని అంటిపెట్టుకుని కబుర్లు చెబుతూ మాత్రం ఉంటారే తప్ప నిజమయిన సమానత్వం ఎలా సాధించగలరు? దేవుడి సృష్టిలో మనుష్యులంతా సమానులని చెప్పితే చాలదు. మానవుడు తోటి మానవుడి దృష్టిలో సమానుడు కావాలి. సమాజంలో ఆర్ధిక వ్యత్యాసాలు ఉన్నంత కాలం స్వేచ్చా స్వాతంత్ర్యం, సమానత్వం అన్నీ కూడా ఆకాశ కుసుమాలే. అందుకే సమాజవైద్యుడిగా మన ఆర్ధిక రుగ్మత లన్నింటికి మార్మ్రుజాన్ని మందుగా వాడండని నేను సిఫార్సు చేస్తున్నాను. ఈ మందును సరిగా వాడినప్పుడే సమానత్వం , అనగా కమ్యునిజం దిశగా ప్రయాణం చేస్తున్నారేగాని, గమ్యాన్ని ఇంకా చేరుకోలేదు. అలా చేరుకోవాలంటే పెట్టుబడిదారీ విధానపు ఆఖరి అవశేషాలు తుడిచిపెట్టుకుపోవాలి.
    ఇది ఇవాళ రేపట్లో జరిగిపోయే పని కాదని నాకు తెలుసు. నా చిన్నతనంలో ఇండియాకు స్వాతంత్ర్యం వస్తుందనీ, రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం చిన్నాభిన్నమవుతుందని ఎవడైనా అంటే వాడో ఉన్మాది ఇప్పుడేమయింది?
    నాస్తికులు విధిగా కమ్యూనిస్టులు కావలసిందేనా అని కొందరు నన్నడుగుతారు. దానికి జవాబు కమ్యూనిజం అనే మాటకు మనం చెప్పుకునే అర్ధం మీద ఆధారపడి వుంది. ఏ నాస్తికుడూ తోటి మానవుణ్ణి ఒక బానిసగా పరిగణించడు. ఇలా పరిగణించక పోవడమే కమ్యునిజం.
    సమ సమాజ నిర్మాణం ధ్యేయంగా హుటా హుటిని పయనిస్తున్న దేశాలలో చైనాది అగ్రస్థానమని నేను నమ్ముతున్నాను. ఆ దేశాన్ని చూసే అవకాశం నాకిప్పుడు దొరికింది. చైనాకు వెళుతున్న ప్రతినిధి వర్గంలో నేనో సభ్యుణ్ణి. చీనాలో ఎలకలూ, ఈగలూ, దోమలూ, దేవుడూ లేడని చెప్పుకోగా విన్నాను. స్వయంగా చూసి వచ్చిన తరువాత ఆ విషయం అందరితో విశదీకరిస్తాను."
    ఇదీ నా ఉపన్యాసం! ఇప్పుడు చైనాకు వెళ్ళడం, రావడం కూడా జరిగాయి. అక్కడ ఉండడం ఇరవై ఒక్కరోజులే. అయినా ఒక సమగ్ర గ్రంధానికి సరిపోయే సామాగ్రితో వచ్చాను.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS