Next Page 

నయనతార పేజి 1

 

                                       నయనతార

                                                                  డి. కామేశ్వరి

 

                                             

 

    ఇంటర్వెల్లో లైట్లు గప్పున వెలిగాయి. అంతవరకూ సినిమాలో లీనమయిన సారధి కళ్ళు చికిలించి ప్రక్కకి తిరిగాడు. సినిమా మొదలు పెట్టిన పదిహేను నిమిషాలకి ఎవరో స్త్రీ వచ్చి తన ప్రక్కన కూర్చోడం గమనించి సారధి మరో వైపు వదిగి వదిగి కూర్చున్నాడు అంతసేపూ. కళ్ళు కాంతికి అలవాటు పడ్డాక ఆ స్త్రీ తననే పట్టి పట్టి చూస్తుండడం గమనించి కాస్త తత్తరపడ్డాడు. చూపులు మరల్చుకున్నాడు బిడియంగా. దుమాలుతో మొహం తుడుచుకుంటూ రుమాలు చాటుగా మరోసారి అటు చూసాడు. ఆమె ఇంకా అలాగే చూస్తుంది. ఛా........ ఏమిటలా అసహ్యంగా తనని చూస్తుంది! .......ఆ కళ్ళు నవ్వుతున్నాయి.... ఆ కళ్ళు - ఆ నవ్వు ... పరిచితమైనవిగా కనిపించాయు ఓ క్షణం ! ..... మరోసారి తల తిప్పేసరికి ఈసారి ఆమె పెదాల మీద సన్నని నవ్వు మెదలింది. ఎందుకలా తనని చూస్తుంది! ఎందుకలా నవ్వుతుంది ! .... కొంపదీసి ..... '        
    ఆలోచన తెగకముందే తన ముందు వరసలో కూర్చున్న స్టూడెంట్లు కొందరు వెనక్కి తిరిగి చూసి "తారా ....... నయనతార! హుర్రే నయనతారా!' అంటూ నిల్చుని కేకలు పెట్టారు. అందరూ చటుక్కున తలలు తిప్పి చూశారు .... ఈలలు వేశారు కొందరు.... బాల్కనిలో గలభాకి క్రింది తరగతుల వారందరూ లేచి నిలబడి ఆరాటంగా చూశారు .... 'నయనతారా!' .... అంటూ ఉత్సాహంగా కేకలు వేశారు. చప్పట్లు కొట్టారు. బెంచీల మీద దరువులు చరిచారు. "నయనతార నిలబడాలి మాకు కనిపించాలి. మా అభిమాన తారని మేం చూడాలి" అంటూ కేకలు పెట్టారు. ఈలలు , చప్పట్లు, కేకలతో హాలంతా దద్దరిల్లింది. మేనేజరు పరిగెత్తుకు వచ్చాడు. గేటు కీపర్లు జనాన్ని కూర్చోమంతున్నారు. మేనేజరు సారధి ప్రక్కన కూర్చున్న ఆమె దగ్గరికి వచ్చి వినయంగా నమస్కారం చేశాడు.  "తమరోక్కసారి నిలబడి అందరికీ కనపడండి.... లేకపోతే వూరుకునే టట్టు లేరు జనం.... బెంచీలు , కుర్చీలు విరగోట్టేస్తున్నారు...." అన్నాడు. ఆమె అంతవరకూ చిరునవ్వుతో అదంతా గమనిస్తుంది. మేనేజరు చెప్పాక అలాగే నన్నట్ట్టు తలాడించింది. నవ్వి లేచి నిలబడి ప్రేక్షకులందరినీ ఉద్దేశిస్తూ నమస్కారం చేసింది, నాలుగు వైపులా తిరిగి,  అందరూ మరోసారి యీలలు వేశారు. చప్పట్లు కొట్టారు. అప్పటికి తృప్తి అయినట్లు కూర్చోడం ఆరంభించారు. మేనేజరు ఇంక ఆలస్యం చేయకుండా లైట్;లైట్లర్పించి పిక్చరు ఆరంభం చేశాడు. అంతా సద్దుమణిగింది.   
    నయనతార ....! అంటే తన అభిమాన హీరోయిన్.... ఇప్పుడు చూస్తున్న సినిమాలో అద్భుతంగా నటిస్తున్న నాయిక .... తన ప్రక్కన కూర్చున్న ఆమె సినీతార. ప్రఖ్యాత తార అందులో తన అభిమాన నటి, అబ్బ, యీమె నయనతార. ఇలా వుందేమిటి? ఇంత నలుపా, సినిమాలో అంత అందంగా కనిపించే నయనతార. ఈమె?! ఆమె శరీరంలో కళ్ళు, పళ్ళు మాత్రమే తెల్లగా వున్న భాగం! గ్లామరస్ తారగా , అభిమాన నటిగా ప్రేక్షకులు ఆరాధించే నయనతార ఈవిడా.....
    అనందం, ఆశ్చర్యం, గాభరా ఏవేవో భావాలు ముప్పిరిగొంటుంటే తలతిప్పి ఆమె వైపు చూశాడు సారధి. ఆ చీకట్లో కూడా ఆమె కళ్ళు తననే చూస్తున్నట్లు గుర్తించాడు సారధి.
    ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. ఆ కళ్ళు నవ్వుతున్నాయి..... ఆ కళ్ళు ఎక్కడ చూశానా అన్న అతని సందేహానికి యిప్పటికీ సమాధానం దొరికింది సారధికి. ఎన్ని సినిమాలలో ఆ కళ్ళని చూశాడు. ఆ నవ్వే కళ్ళు అతని అభిమాన నటి ఆ కళ్ళు అతనికి చాలా యిష్టం. ఆ కళ్ళు - కళ్ళ నీళ్ళు కార్చకుండానే హాలు లంతటిని కన్నీళ్ళు కార్పించడం తనకి తెలుసు. అందుకే ఆ కళ్ళంటే అతనికి యిష్టం. ఆమె అందం అంతా కళ్ళే. అన్న సంగతి మనిషిని చూశాక మరింత స్పష్టంగా బోధపడింది. కాని....కాని తనని చూసి ఎందుకలా నవ్వుతుంది.
    కళ్ళు తెరవైపు చూస్తున్న సినిమా మీద మనసు లగ్నం చెయ్యలేకపోతున్నాడు సారధి. తన ప్రక్కనే ప్రఖ్యాత నటీమణి కూర్చుందన్న ఆలోచనతో అతను స్థిరంగా కూర్చోలేకపోతున్నాడు . అన్నిటి కంటే ఆమె తనని పట్టి పట్టి ఎందుకలా చూస్తుందో నని గాభరా పడుతున్నాడు. చెమటలు పడ్తున్నాయి. పెద్ద సినీతార, తన అభిమాన నటి ప్రక్కనుంది --- ఈ సదవకాశాన్ని వినియోగించుకుని  రెండు మాటలు -----ఆమె అంటే అతని కెంత అభిమానమో తన అభిమాన నటి అమేనని చెప్పలనిపించినా నోరు సహకరించలేదు. అతని అవస్థ గమనిస్తూ నయనతార నవ్వుకుంది. ఇంకా అతన్ని ఇబ్బంది పెట్టకూడదన్నట్టు...... అతని ముంజేతిని అంటీ అంటనట్టు తాకి " నన్నింకా గుర్తుపట్టలేదా ?" అంది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS