Next Page 

మగబుద్ధి  పేజి 1


                                                         మగబుద్ధి

 

                                                            -మేర్లపాక మురళి

 

 

    ఉదయం ఆరుగంటలు.

 

    రామాలయంలోని గ్రామ్ ఫోన్ సుప్రభాతాన్ని ఆలపిస్తోంది. నీళ్ళ కొళాయిల దగ్గర ఆడవాళ్ళు. సిగలు పట్టుకోవడానికి తయారవుతున్నారు. పసిపిల్లలు వీధి ప్రక్కనజేరి రకరకాల ఆటల్లో మునిగిపోయారు.   

 

    ఇందిరానగర్ కాలనీ మెల్లగా మేల్కొంటోంది.

 

    సుప్రభాతం చెవులను గెలకడంతో మెలకువ వచ్చింది నరేష్ కు.

 

    మామూలుగా అయితే మరోగంటసేపు తన జీవితాన్ని తిట్టుకుంటూ పడకమీద దొర్లుతుండేవాడు. కానీ ఆ రోజు స్మిత ఎక్స్ పోర్టింగ్ కంపెనీలో ఇంటర్వ్యూ వుందని గుర్తుకు రావడంతో లేచి కూర్చున్నాడు.

 

    చుట్టూ చూశాడు.  

 

    పండు ముదసలి శరీరంలోని ముడతల్లా గోడలు బీటలు తీసి వున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్న టీకాలు తాలూకు మచ్చల్లా అక్కడక్కడా సున్నపు పెళ్ళలు వూడిపోయాయి. బాధల్లోని మనిషి ఆలోచనల్లా అడ్డదిడ్డంగా అల్లుకున్న బూజు. ఓ మూల అస్పృశ్యుడిలాగా ఒంటరిగా వున్న నీళ్ళకుండ. మనిషి కట్టుకున్న తలపాగా లాగా దాని మూతిమీద అల్యూమినియం ప్లేటు.

 

    రణరంగంలో క్షతగాత్రులై పడిపోయిన సైనికుల్లాగా అట్టల్లేని పుస్తకాలు.

 

    "ఈ గదిని చూస్తూనే బతుకుమీద సగం ఇంట్రెస్టుపోతుంది" అనుకుంటూ పైకి లేచాడతను.

 

    గదినుంచి బయటికొచ్చి డాబామీద పచార్లు చేస్తూ ఇటుక రాయి పొడితో పళ్ళు తోమటం మొదలుపెట్టాడు.

 

    "గుడ్ మార్నింగ్" అని వినిపిస్తే అటువైపుకి చూశాడు.

 

    పక్కనున్న ఇంటి పెరట్లో నిలుచున్న స్వప్న నవ్వుతూ చూస్తోంది.

 

    ఆమె సబ్ ఇన్స్ పెక్టర్ రాళ్ళపల్లి సుబ్బరామయ్య కూతురు. కొందరు అసలు పేరుకన్నా ఇంటిపేరుతోనే ప్రసిద్దులవుతారు. ఆయన ఆ కోవకు చెందుతాడు. ఆయన్ను సుబ్బరామయ్యగా గాక రాళ్ళపల్లిగానే చూస్తారందరూ. ఇంటిపేరుతోనే పిలుస్తారు.   

 

    పూర్ణానందం ఇంటిపక్క ఇల్లే రాళ్ళపల్లిది. పూర్ణానందం రెవిన్యూ డిపార్టుమెంట్ లో గుమస్తాగా పనిచేసి రెండేళ్ళ క్రితం రిటైరయ్యాడు. నరేష్ ప్రస్తుతం వుంటున్నది ఆయన ఇంట్లోనే. క్రింద పోర్షన్ లో ఆయన, కొడుకు ప్రసాద్, కోడలు శ్రీలక్ష్మి వుంటారు. డాబా మీదున్న చిన్న గదిలో నరేష్ అద్దెకుంటున్నాడు. దాని అద్దె యాభైరూపాయలు. అదీ ఇవ్వలేక నాలుగునెలలు అద్దె బాకీ వున్నాడు నరేష్.   

 

    "రోజూ అచ్చ తెనుగులో శుభోదయం అనేదానివి మరి ఈ రోజేమిటి ఇంగ్లీషులో గుడ్ మార్నింగ్ అంటున్నావ్?" ఆశ్చర్యపోతూ అడిగాడు నరేష్.

 

    "అది అంతే. మామూలుగా పావడా, ఓణీలో వుంటే శుభోదయం అంటాను. కానీ ఈవేళ ఇంకా నైటీ కుబుసాన్ని వదలలేదు. నైటీ వేసుకున్నప్పుడు ఇంగ్లీషు పదాలనే వాడాలి. ఎందుకంటే ఆ రెంటికీ మ్యాచింగ్ కాబట్టి" చెప్పింది స్వప్న.

 

    "అమ్మ తల్లీ! నీ మ్యాచింగ్ పిచ్చి తెలియక ఆ ప్రశ్న అడిగాను? క్షమించు" అని చేతులెత్తి నమస్కరించాడు.

 

    "ఇప్పుడు నువ్వేమన్నా కోపంరాదు. నల్లడ్రస్సులో వున్నప్పుడే కోపం ప్రదర్శిస్తాను. ఆ రెంటికీ మ్యాచింగ్."

 

    అంతలో తల్లి పిలవడంతో లోపలకెళ్ళింది.

 

    ఆమెకు ఇరవైయేళ్ళుంటాయి. ఇంటర్ చదువుతూ మధ్యలో ఆపేసింది. ఆమె తండ్రి రాళ్ళపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ.గా పనిచేస్తున్నాడు.

 

    స్వప్న ఏ పనీపాటా లేకుండా ఇంట్లో వుండడం వల్ల కాబోలు మ్యాచింగ్ పిచ్చి పట్టుకుంది. కర్చీఫ్ నుంచి చెప్పుల వరకు ఒకే రంగులో వుంటే తప్ప స్థిమితంగా వుండదు. ఎప్పుడైనా బజారుకి బయల్దేరితే చేతిసంచి కూడా వేసుకున్న డ్రస్సుకు మ్యాచ్ కావలసిందే. ఆ కాలనీలో స్వప్నను "మ్యాచింగ్ మహారాణి" అని ముద్దుగా పిలుస్తారు. అలా పిలిపించుకోవడం ఆమెకు కూడా ఇష్టమే.

 

    స్వప్న వెళ్ళిపోవడంతో నరేష్ ఆలోచనలో పడిపోయాడు.

 

    "ఈరోజైనా ఇంటర్వ్యూలో సక్సస్ అయి వుద్యోగం వస్తుందా" అని ముచ్చటగా ముప్ఫైరెండవసారి అనుకున్నాడు.

 

    అతనికి ఎన్నో ఇంటర్వ్యూ నో గుర్తులేదు. గత రెండేళ్ళ నుంచీ ఉద్యోగం వేటలో వున్నాడు. డబ్బు అస్త్రమో, పరపతి బాణమో లేకపోవడంవల్ల ఉద్యోగం అనే దుప్పి పడడం లేదు. వేటలో అలసిపోతున్నాడే తప్ప దుప్పి దొరకడం లేదు.

 

    అతనికిప్పుడు ఇరవై ఆరేళ్ళు, చూడడానికి మాన్లీగా, అందంగా వుంటాడు. దరిద్రం అతని వన్నెచిన్నెలను కప్పిపెట్టేస్తోంది గానీ లేదంటే అతను మీసాలు లేని హిందీ హీరోలా, మీసాలున్న తెలుగు సినీనాయకుడిలా వెలిగిపోయేవాడే.

 

    అంతలో ఇంటి ఓనర్ పూర్ణానందం మెట్లెక్కి అక్కడికి వచ్చాడు. ఆయన్ను చూస్తూనే నరేష్ కంగారుపడి నోట్లోని ఇటుకరాయి పొడిని కాస్త మింగేశాడు. అద్దెబకాయి అడగడానికి వచ్చేడేమోనన్న భయం అతన్ని వణికిస్తోంది.


Next Page