Next Page 

జైలు  పేజి 1


                                                                          జైలు
                                                                            - మేర్లపాక మురళి

             ప్రోలోగ్ :

 

    ఆకాశంలో సూర్యుడు నిప్పుల పళ్ళెంలా తన ప్రతాపం చూపిస్తున్నాడు. గాలిని ఎవరో కొలిమిలో కాచి సాగదీసి పంపిస్తున్నట్టు వేడిగా వీస్తోంది. నీడను వెదుక్కోడానికి ఎటూ వెళ్ళలేని కొండలు గింజుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి.

 

    దశరధరామయ్య ఇక అడుగు వేయలేకపోయాడు. చుట్టూ చూశాడు. రోడ్డు పక్కన ఏదో పేరు తెలీని ముళ్ళు చెట్టు ఒంటరిగా తనలో తానే ముడుచుకు పోయినట్టు కాస్తంత నీడను ప్రసరిస్తోంది.

 

    ఆయన అటువేపుకు నడిచాడు. అంతవరకూ తండ్రి చిటికిన వేలు పట్టుకుని నడుస్తున్న ఆయన కొడుకు కూడా కదిలాడు.  

 

    ఆయనకి నలభై అయిదేళ్ళయినా చూడటానికి అరవై ఏళ్లవాడిలా వున్నాడు, ఆయన భుజం మీదున్న ముతక తువ్వాలు ఆయన ఆగర్భ దారిద్ర్యాన్ని తెలియజేస్తుంది. అక్కడక్కడ పరాకుగా చినిగిపోయిన పంచె ఆయన కుటుంబ స్థితిగతుల్ను తెల్లముఖం వేసుకుని చాటుతోంది. పైన వేలాడుతున్న పాత ఖద్దరు చొక్కా ఆయన మెతకతనాన్ని బహిరంగపరుస్తోంది.

 

    "నాన్నా! ఇంకెంత దూరం?" అన్నాడు వాడు తండ్రి ముఖంలోకి చూస్తూ.

 

    "వచ్చేశాం మరో అరఫర్లాంగులో వుంటుంది బాలమందిర్. అదే ఇకనుంచీ నువ్వు చదివే స్కూలు."

 

    పాపం, పుణ్యం, ప్రపంచమార్గం ఏమీ తెలియని పసివయస్సు లాంటిది. మొన్ననే ఐదేళ్ళు నిండాయి. వాడు బాల్యం దండానికి వేలాడుతున్న పూలదండలా వున్నాడు.

 

    అయినా కాసేపు సేదతీరాక మళ్ళీ నడక సాగించాడు. మరో అరగంటకు ఆయన బాలమందిర్ వున్న రోడ్ లోకి మలుపు తిరిగాడు.

 

    దూరం నుంచి "బాలమందిర్" అన్న అక్షరాలను చూస్తూనే ఆయనకు ప్రాణం లేచివచ్చింది.

 

    "అదేరా కన్నా! స్కూలు" అని కొడుకువేపు మురిపెంగా చూశాడు.

 

    వాడు అటూ ఇటూ పరిశీలించాక "బావుంది నాన్నా" అన్నాడు.

 

    పూలతోటలో నడుస్తున్నప్పుడు మచ్చలపాము ఎదురయినట్టు ఉలిక్కిపడ్డాడు దశరధరామయ్య. ఠక్కున వంగి కొడుకు నోరు మూశాడు.

 

    ఆ పిల్లవాడు కంగారు పడ్డాడు. "ఏమయింది నాన్నా?"

 

    ఆయన చివుక్కున వంగి మోకాళ్ళమీద కూర్చుని కొడుకు ముఖాన్ని ప్రేమగా నిమిరాడు.

 

    "కన్నా! ఇకనుంచీ నేను మీ నాన్నను కాదురా. చిన్నాన్నను. నీ తల్లిదండ్రులు చచ్చిపోయారని, నువు అనాధవని మన కరణం ఇచ్చిన సర్టిఫికెట్ తో నిన్ను ఈ స్కూల్లో చేర్పిస్తున్నాను. మీ అమ్మ చచ్చిపోతూ నా కొడుకుని మీలాగా చేయకండి. నాలుగు అక్షరం ముక్కలు నేర్పివ్వండి అని కళ్ళు మూసుకుందిరా. కానీ నాకంత స్తోమత లేదు. ఏవో కూలిపనులు చేసుకుంటూ నిన్నూ, నీ అక్కయ్యనూ పోషిస్తున్నవాడిని. అందుకే నీ అక్కయ్యను నాలుగు అక్షరం ముక్కలు నేర్పివ్వలేకపోయాను. కానీ నిన్ను చదివిస్తాను. నేనూ, నీ అక్కయ్యా ఎవరూ లేరనీ అందుకే కారణాన్ని బ్రతిమిలాడుకుని ఈ సర్టిఫికెట్ సంపాదించాన్రా" ఏదో భావోద్వేగానికి లోనై ఆవేశంతో మాట్లాడుతున్న నాన్నను వాడు అలా గుడ్లప్పగించి చూస్తున్నాడు.

 

    తనకు అక్కయ్యా, నాన్న వున్నా వాళ్ళు లేనట్లు తను నటించాలన్న విషయం మాత్రం వాడికి బోధపడింది.

 

    ఆ పసి హృదయంలో రంధ్రం పడ్డట్లు గిలగిల్లాడిపోయాడు.

 

    "వద్దు నాన్నా, నిన్నూ, అక్కయ్యనూ మింగేసే ఈ స్కూల్లో నేను చేరనునాన్నా. నాకు చదువొద్దు" వాడు ఏడుస్తుంటే పేగులు బయటికొచ్చి పడతాయేమోననిపించింది.

 

    "అలా అనకు కన్నా. నువ్వు బాగా చదువుకోవాలి. మీ అమ్మ చనిపోతూ కోరిన కోరికను తీర్చాలి. అందుకే నేనూ, మీ అక్కయ్య వున్నా నిన్ను అనాధను చేశాం" ఆయన గొంతు జీరపోయింది.

 

    ఆ మాటలకు ఏం జవాబులు చెప్పాలో తెలియలేదు వాడికి. అలా ఏడుస్తూ వుండిపోయాడు.

 

    "ఇంకెప్పుడూ ఏడవకూడదు కన్నా! నువ్వు ఏడిస్తే ఓదార్చడానికి ఇక్కడ నేను వుండను. నీ అక్కయ్యా వుండదు. ఎప్పుడయినా నిన్ను చూడటానికి మేము వచ్చినా నన్ను నీ చిన్నాన్న అని. నీ అక్కయ్యను మనవూరి అమ్మాయనీ చెప్పు. మేమూ అలాగే చెబుతాం. నువ్వు బాగా చదువుకుని గొప్పవాడివి కావాలన్న ఆశతోనే చట్టరీత్యా కన్నపేగును తెంపేసుకుంటున్నాను. బాబూ" అని ఆయన బావురు మన్నాడు.


Next Page