Next Page 
ప్రేమ జ్వాల పేజి 1

                                                                  ప్రేమ జ్వాల
                                                                                              -చందు సోంబాబు

  చలిగాలి  వీస్తోంది. చలిగా వుంది. జైల్లో సెంట్రిలు తిరుగుతున్నారు.

    ఖైదీలు నిద్రలో వున్నారు.

    రాబర్ట్ కి మాత్రం  నిద్ర రావడంలేదు. అతని కళ్ళెర్రబడ్డాయి.

    చిన్నగది. పడుకోడానికి పనికిరాదు కాళ్ళు గూడుకడితే తిరిగేందుకుకూడా  పనికిరాదు. చిన్నకిటికీ, దానికి ఇనుప సువ్వలు. పెద్ద ఇనుపతలుపు. దానికో  పెద్ద తాళం వేసివుంది.

    రాబర్ట్ లో  ఆలోచనలు  కాలిపోతున్నాయి. ఆ ఆలోచనల తీవ్రతకి  తలలోని నరాలు  తెగిపోయెలా  వున్నాయి.

    అతని మనసులో తీవ్రమ్తెన అ వేదన  చోటు చేసుకొంది.

    కళ్ళు ఎర్రని జ్యోతుల్లా వెలుగుతున్నాయి.

    ఆర్నెల్లు జైలు శిక్ష.

    ఎందుకనుభవించాలి?

    అసలు తన నేరమేమిటి?

    తను దొంగా?

    అవును పోలీసులు అన్నారు. తన దగ్గర సాక్ష్యదారాలు  లేవు  దొంగనికాదని  నిరూపించుకోడానికి.

    అదికాక-లొంగిపోవడం  కంటే మార్గం లేదు. తను దొంగ  కానని నిరూపించుకోడానికి ప్రయత్నం చేస్తే అసలుకే  ప్రమాదం. ఉరి కంబ మెక్కవలసి వస్తూంది!

    ఉరి!

    అవును లోకం దృష్టిలో తను హంతుకుడు తను హంతకుడ్ని కాదు అని లోకానికి ఎలుగెత్తి  చెప్పాలన్న ఆరాటం  అతనిలో  ఉంది.

    చెపితే?

    పోలీసులు, న్యాయస్ధానం అతని నిరపరాదిగా  విడుదలచేసినా ఓ ఆడపిల్లని చెరచడానికి  చేసిన ప్రయత్నం పైన మళ్ళి శిక్ష తప్పుదు.

    రాబర్ట్ పెదవులపైన  ఓ చిరునవ్వు క్షణకాలం  పాటు వుండి పోయింది.

    రాబర్ట్ చేతికేసి చూసుకొన్నాడు. చేతిపైన  పచ్చబొట్టు....

    శిలువబొమ్మ, రాబర్ట్ అని రాసివున్న అక్షరాలు.

    రాబర్ట్  చేతిపైన ముద్దు పెట్టుకున్నాడు.

    ఉరికంబం  ఎక్కవలసిన   వాడ్ని నువ్వు కాపాడేవు. ధాంక్యూ! అన్నాడు రాబర్ట్.

    కాని అతనికి తను అసమర్ధుడినన్న  కసి పెరిగిపోతోంది.

     చేతకాని  తనానికి ఒంట్లో  రక్తం సలసల  మరుగుతోంది.

    జైలు  ఇనుప  సువ్వల్ని  వంచి, గోడదూకి  బయటపడి ప్రపంచం  పైన  తిరగబడాలని, తనకి శిక్ష పడ్డానికి  కారణం  అయిన వాళ్ళని  చీల్చి  చెండాడాలని  వుంది. గొడ్డళ్ళతో నరకాలని వుంది.

    ఒక్క క్షణం  కళ్ళు మూసుకున్నాడు రాబర్ట్ కళ్ళల్లో  నీరు గిర్రున  తిరిగింది.

    భారంగా నిట్టూర్చాడు  రాబర్ట్. ఆ నిట్టూర్పూ  వెనక నిరాశ  కొట్టొచ్చినట్టుగా   కనబడిపోతోంది. నీరసం  ఆవహించిందతనికి.

    ఆర్నెల్లు జైలులో  మగ్గిపోవాల్సిందేనా? రాబర్ట్ కి నవ్వొచ్చింది.
   
    హత్యానేరం  పైన పోలీసులు  తనకోసం  వెతుకుతున్నారు. కాని తానో పక్క జైలులో  జేబు దొంగతనం  నేరంపైన  శిక్ష  ననుభవిస్తున్నాడు.

    పోలీసులు  విజయ్ కోసం వెదుకుతున్నారు. రాబర్ట్ గా ఇప్పుడు తను జైలులో  వున్నాడు.

    పోలిసుల్ని చూస్తుంటే  జాలి వేసిందతనికి. తనంత  తను బయట పడితే తప్ప పోలీసులకి  తన ఆచూకి తెలిదు. ఇది ఒకందుకు మంచిదే అనిపించిందతనికి.

    జైల్లోంచి తప్పించుకొని  పోవాలని  చాలాసార్లు అనిపించిందతనికి. అలా అనుకోవటంలోనూ  అలాంటి ఆలోచనల్లోనే  అయిదు నెలలు గడిచిపొయినాయి.

    ఆరోజు సాయంత్రం బస్సులో పర్స్ దొరికింది. అదేవరిదో అని తిసి చూడబోయాడు.

    అంతే!

    "దొంగ"న్నారు.

    "తన్నండి వెధవని"

    తను చెప్పేది ఎవరూ వినిపించుకోలేదు.

    తిట్టారు.

    కొట్టారు.

   పోలీసుల కప్పగించారు. పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

    కోర్టు ఆర్నెల్లు శిక్ష వేసింది.

    రాబర్ట్ పళ్ళు పటపటమని  కొరికాడు.

    జీవితం అతి విలువైంది. ఆ విలువైన జీవితాన్ని ఘనంగా కాపాడుకోవాలంటే జాగరూకతతో వ్యవహరించాలి. ఎంత తెలివిగా  వున్నా స్పీడ్ బ్రేకర్లు అడ్డుపడుతూనే  వుంటాయి.

    అనుభవాల కబంధ హస్తాలలో  నలిగిపోయి. అనుభవాన్ని  గడించిన వృద్దుడిలా  వున్నాడు రాబర్ట్.  


Next Page 

  • WRITERS
    PUBLICATIONS