Next Page 

చీకటికి అవతల పేజి 1


                                                     చీకటికి అవతల

                                                -మేర్లపాక  మురళి

 


    సాయంకాలం  ఆరయింది.

 

    కడుపాత్రం కోసం కొరడాలతో అదే పనిగా కొట్టుకుని ఒళ్ళంతా కమిలిపోయిన భిక్షగాడిలా వున్నసూర్యుడు పడమటి కొండల్లోని  తన ఇంట్లోకి చొరబడుతున్నాడు.

 

    సాయంసంధ్య  రాత్రి  డయాస్ మీద ఎక్కి 'షో'ఇవ్వనున్న రికార్డింగ్  డ్యాన్సర్ లా  షోగ్గా వుంది.

 

    పగటి వేషగాళ్ళ వెనుక  జోలె  పట్టుకుని  నెమ్మదిగా  కదులుతున్న  దానిలా  గాలి  సోమరిలా  వీస్తోంది.

 

    అంతవరకు  ఎండ  తీవ్రతకు  భయపడ్డ  జనం అప్పుడే  వీధుల్లోకి వస్తున్నారు.

 

    ఆ  నగరంలోకెల్లా  అతి  ఖరీదైన  ప్రాంతం  అది. దాని  పేరు  లవ్లీ  హిల్స్. నల్లడబ్బుకి అంత  అందం, అంత  హుందాతనం  వుంటుందని అక్కడున్న ఇళ్ళను చూస్తే తెలుస్తుంది. ఒక్కో  ఇల్లు  కోటికి  తక్కువగా  వుండదు. సామాన్యుడు  ఎప్పుడూ చూడలేని  విధంగా, మధ్యతరగతివాడు  ఎప్పుడూ  ఊహించుకోలేనంత ఖరీదుగా  వుంటుంది  ఆ ప్రాంతం.     

 

    లంబాడీ హిల్స్ ని,లవ్లీ హిల్స్ ని  వేరుచేస్తూ అక్కడ ఓ చెక్ పోస్టు వుంటుంది. చెక్ పోస్టు  అంటే  నిత్యావసర  వస్తువుల  రవాణా  తనిఖీ ఆఫీసు  కాదు. ఎవరైనా అనుమానంగా ఆ ఏరియాలో ప్రవేశిస్తారని అప్రమత్తంగా  వ్యవహరించే  చిన్న సైజు  పోలీసుస్టేషన్  అది. మరి దాన్నెందుకు చెక్ పోస్టు అని  పిలుస్తారో తెలియదు.

 

    ఆ చెక్ పోస్టు  దాటగానే  లవ్లీహిల్స్ ప్రారంభమవుతుంది. ఏ అప్సరసో  ఏమరపాటుగా  తన నల్లటి జార్జెట్ ఫైటను అక్కడ వదిలి వెళ్ళిపోయినట్లు  తార్రోడ్లు నిత్యనూతనంగా  మెరుస్తూ  వుంటాయి.

 

    ఒకదానికొకటి  సంబంధం లేకుండా దూరదూరంగా వుండే ఇళ్ళు మల్లెపూలు, మందారాలతో కలిపి కుట్టిన కిరీటాల్లా వుంటాయి. వాటి ముందుండే కార్లు రెక్కలు ముడుచుకుని ముంగిట్లో వాలిన పెద్ద గండు తుమ్మెదల్లా వుంటాయి. ఇక అక్కడే తిరిగే మనుష్యుల గురించి ప్రత్యేకించి చెప్పఖ్కర్లేదు. కుబేరుడికి సైతం అప్పివ్వగల స్థాయిలో వుంటారు.   

        
    ఈ లవ్లీ హిల్స్ ఏరియాలో అక్కడక్కడ వున్న సెంటర్లలో కొన్ని అంగళ్ళు వున్నాయి. అవి కూడా ఇళ్ళకు తగ్గట్టుగా శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దినట్లున్నాయి. అలాంటి ఓ సెంటర్ వైపుకి ఇద్దరమ్మాయిలు మాట్లాడుకుంటూ తాపీగా నడిచొస్తున్నారు.

 

    "రేపు ఉదయానికల్లా నీ పెళ్ళి ఫిక్సయిపోతుంది. మరి నీ ఆనందంలో నాకూ కొంచెం పంచు" అంది అందులో ఓ అమ్మాయి.

 

    దానికి రెండో అమ్మాయి పెద్దగా నవ్వి-

 

    "నా పెళ్ళి ఆనందం నీకు పంచడమేమిటే? రేపు నా శోభనం రోజున వచ్చి నీ సుఖంలో నాకూ కొంచెం పంచమంటావేమిటే ఖర్మ" అని ఆ తరువాత నవ్వును కంటిన్యూ చేసింది.

 

    ఆ నవ్వుకి సాయంసంధ్య కూడా ఆశ్చర్యపడ్డట్టు సంధ్యకాంతి మరికాస్తంత ఎరుపెక్కింది.

 

    ఆ అమ్మాయి పేరు దీపశిఖ.

 

    ఆమె ఒంటిరంగు చూస్తే బాగా పండిన గోధుమ చేలు జ్ఞాపకానికి వస్తాయి. ఆమె జుట్టు చూస్తే ఆకాశం వీపుమీద నల్లగా పరుచుకున్న మబ్బులు మనసులో మెదులుతాయి. ఆమె కళ్ళు చూస్తే ఎక్వేరియంలో ఏ పనీపాటా లేకుండా కదలాడే చేపపిల్లలు మన కళ్ళముందుకి వస్తాయి. ఆమె పెదవులు చూస్తే గోధుమ చేలుమధ్యలో ఎర్రగా పండిన దొండపండ్ల తీగను ఉపమానంలా వాడాలనిపిస్తుంది.

 

    ఇక ఆమె ఎదను చూస్తే మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గుర్తుకొస్తుంది.

 

    కారణం ఆమె ఎద ఒక్కో కోణంలో ఒక్కో అందాన్ని సంతరించుకోవడమే.

 

    ఆమె ఇటీవలే కంప్యూటర్ కోర్సు పూర్తి చేసింది. ఆమె తండ్రికి ఆ నగరంలోని వివిధ సెంటర్లలో పదిదాకా బంగారునగల దుకాణాలున్నాయి. ఆమె ఒక్కత్తే కూతురు. అందుకే అల్లారుముద్దుగా పెంచారు.

 

    అలాంటి దీపశిఖకి మరుసటి రోజు ఉదయం పదిగంటలకి నిశ్చయతాంబూలాలు పుచ్చుకుంటున్నారు. వరుడి పేరు హరీష్. అతను అందంలోనూ, చందంలోనూ ఆమెకే మాత్రం తీసిపోడు.

 

    మగవాళ్ళల్లో గొప్ప అందగాళ్ళు వుండరని ఎవరైనా అంటే వాళ్ళ అభిప్రాయం తప్పని నిరూపిస్తూ అతడ్ని చూపించవచ్చు. అతను ఎక్కడో పరాయి దేశంలో ఎంబిఏ పూర్తి చేశాడు. ప్రస్తుతం స్వంతంగా ఓ ఫ్యాక్టరీని నడుపుతున్నాడు.

 

    "తాంబూలాలు పుచ్చుకోలేదు. అప్పుడే రాణీగారి మనసు శోభనం మీదకి మళ్ళిందే" అంది దీపశిఖ స్నేహితురాలైన వైజయంతి.

 

    ఆమెకూడా దీపశిఖ అంత అందంగా వున్నా ఆస్తిలో మాత్రం ఇద్దరికీ పోలికే లేదు.

 

    వైజయంతి తండ్రి గవర్నమెంటులో రెండో గ్రేడ్ ఆఫీసర్ మాత్రమే. లంబాడీ హిల్స్ లోని ఓ ప్లాట్ లో వాళ్ళు వుంటున్నారు.

 

    "ఇప్పుడు మళ్ళడమేమిటే! వయసొచ్చిన రాత్రి నుంచి శరీరం మగతోడు కోసం ఆరాటపడుతూనే వుంది. మనుషులకి నైతిక విలువలు, మంచీ చెడూ వుంటాయి గానీ శారీరక ధర్మాలకు వుంటాయా?"

 

    "మరీ ఇంత స్ట్రెయిట్ గా మాట్లాడతావే నువ్వు. అందుకే నిన్ను చూస్తే నాకు ఎక్కడో భయం"

 

    "భయమెందుకే పిచ్చి మొద్దూ? నేనేమన్నా దెయ్యాన్నా? భూతాన్నా? కాకపోతే నిజాలను నిర్భయంగా మాట్లాడుతాను- అంతే"

 

    "మగతోడు కావాలని వయసొచ్చిన రాత్రి నుంచే అనిపిస్తుంటే ఇంత కాలం ఊరకే ఎందుకున్నావ్?"

 

    "చెప్పానుగా- నైతిక విలువలు కొన్ని ఏడ్చాయని. కాబోయే వాడికే శరీరాన్ని, మనసునీ ఇవ్వాలని మన డొక్కు సినిమాల నుంచి, ముసలి తొక్కులైన అమ్మమ్మల వరకు చెప్పేది అదే కదా.....

 

    అందులోనూ నాకలాంటి చీకటి సాహసాలు చేసే ధైర్యం లేదు. అందుకే నాకు కాబోయేవాడు బతికిపోయాడు లేకుంటే- అతని మొదటి రాత్రి పెర్ ఫామెన్స్ మీద సర్టిఫికెట్లిచ్చేంత అనుభవం సంపాదించేదాన్ని" అని మళ్ళీ నవ్వుతోంది దీపశిఖ.

 

    అంత నిర్భయంగా, నిజాయితీగా మాట్లాడుతుంది కాబట్టే వైజయంతికి ఆమె అంటే ఇష్టం. హిపోక్రసీ కింద నిజాల పీక నులిమెయ్యదు. 


Next Page