Home » Yandamuri veerendranath » రాధ-కుంతి


    ఇద్దరు పిల్లలు- స్కూలుకి వెళుతున్న వాళ్ళున్న డాక్టరు, "అబ్బాయి" ఎలా అవుతాడో ఆమెకి అర్ధంకాలేదు. అయినా ఆమె దానిగురించి ఆలోచించటానికి ప్రయత్నించలేదుకూడా. ఆలోచించటానికి ఏమీ లేదు. 'ఏ మగవాడి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం! మగజాతి చరిత్ర సమస్తం వ్యామోహ పరాయణత్వం'.
    ఆమె ఆలోచిస్తూంటే డాక్టర్ "చెప్పండి ఏమైనా కబుర్లు- ఎక్కడ పనిచేస్తున్నారు మీరు?" అంటూ కాలు ముందుకు సాచి ఆమె కాలుని తాకేడు. ఆమె చప్పున కాలుని వెనక్కి తీసుకోలేదు. సూటిగా 'నీ విషయం గమనించేనులే' అన్నట్టు చూసింది. దాంతో కొంచెం బెదిరాడు. ఆమె మొహం మీద అదే నవ్వు- పిల్లలు చేసే అల్లరిని చూసి తల్లి నవ్వినట్లు.
    అతడిని నవ్వించడం ఆమె ఉద్దేశ్యం కాదు. మొగవాణ్ణి తన చుట్టూ తిప్పుకునే ఆడవాళ్ళంటే ఆమెకి అసహ్యంకూడా. అతడి మనస్తత్వాన్ని అంచనా వేయటానికి ప్రయత్నం చేస్తోంది అంతే. తనకి శీలంమీద నమ్మకం లేదని అతడికి తెలుసు. అతడి ఎదురుగానే తన ఇద్దరి స్నేహితుల్ని చూశాడు. చిత్రమేమిటంటే అతడు మూడోవాడు అవటానికి సిద్ధమవుతున్నాడు. ఇక్కడ ప్రేమ- అభిమానం- స్నేహం ఏమీలేవు. కేవలం అనుభవం కోసం. అంతే. మరి యిదే అనుభవం బజార్లో ఇరవైకి దొరుకుతుందిగా. మళ్ళీ దానికి ఇష్టపడడు అతడు. ఒక చదువుకున్న అమ్మాయి, అందులోనూ ఉద్యోగం చేస్తున్నది అయితేనే- అతడి ''ఈగో' సంతృప్తి చెందుతుంది. అతడి చదువు- అందం- డబ్బు- ఇవన్నీ చూసి అయిదు నిమిషాల్లో అతడిపట్ల ఓ అమ్మాయి ఆకర్షితురాలు అయిందీ అంటే అతడికో ఆనందం.
    "మీరు నా మాట వినటంలేనట్టుంది."
    ఆమె ఉలిక్కిపడి, "లేదు, లేదు. ఏదో ఆలోచిస్తున్నాను" అని, నేను రేడియో స్టేషన్ లో పనిచేస్తున్నాను" అని జవాబు ఇచ్చింది.
    ఆ తర్వాత నిశ్శబ్దం.
    ఆమె మళ్ళీ ఆలోచన్లలోకి జారిపోతుంటే "ఏదైనా కబుర్లు చెప్పండి" అన్నాడు.
    "రేడియో స్టేషన్ గురించి చెప్పనా?"
    చెప్పండి.
    "చుట్టూ చిన్న అందమైన గార్డెన్- మధ్యలో బిల్డింగు. దాదాపు సగం ఎయిర్ కండిషన్ చేయబడింది- మా రేడియో స్టేషన్.... అయితే పైకి కనబడేంత అందమైన వాతావరణం లోపలికి వెళితే ఉండదు. కులతత్వం- గ్రూపిజము- రాజకీయం అన్నీ అక్కడే నివాస మేర్పర్చుకున్నాయా అన్నట్టు వుంటాయి. అయితే అక్కడ మంచి మనుషులు లేరనికాదు. నిజాయితీగా మంచి ప్రోగ్రామ్ లు తయారు చెయ్యాలనుకునేవాళ్ళు- పనిమీద ఆసక్తి వున్న వాళ్ళూ కొంతమంది వున్నారు. దురదృష్టవశాత్తూ వాళ్ళు 'కీ పొజిషన్'లలో నుంచి త్రోసి వేయబడ్డారు. మా స్టేషన్ డైరెక్టర్ పార్థసారథి నిజంగా స్టేషన్ కి అంకితమైన వ్యక్తి. ఆయన ఎంతో శ్రమతో ఈ స్టేషన్ కి ఓ విలువ సంపాదించాలని ప్రయత్నిస్తూంటే, ఆయన క్రింద వున్న వ్యక్తులు అంతే శ్రమ తీసుకొని దాన్ని పాడుచెయ్యాలని ప్రయత్నిస్తూ వుంటారు. మా కార్యాలయంలోకి మీరెప్పుడైనా ప్రవేశిస్తే మా మొహాలు జాగ్రత్తగా పరిశీలించి చూడండి. ప్రతివాడి మొహంలోనూ నిరాసక్తత, నిర్లిప్తత- పనిపట్ల నిర్లక్ష్యం కనబడతాయి. మారుతున్న మంత్రుల ఉపన్యాసాలు వ్రాసీ వ్రాసీ - గ్రామస్థుల కార్యక్రమం రోజుకొకటి కొత్తగా ఆలోచించీ ఆలోచించీ- మా వాళ్ళంతా జీవచ్చవాల్లా తయారయ్యారు. నిర్ణీతమైన సమయంకన్నా ఎక్కువకాలం కొత్త విషయాలని శోధించటంలో ఉపయోగించటం వల్ల మా వాళ్ళ మెదడులు సారం కోల్పోయిన భూముల్లా తయారయ్యేయి. ఏ క్షణం ఏ తప్పు జరుగుతుందో- పై నుంచి ఎవరికి మెమో వస్తుందో అన్న భయంతో వాళ్ళలో క్రియేటివిటీ తగ్గిపోయింది. మా వ్యవహారాల్లో లంచగొండితనం చాలా గొప్పగా- పైకి లంచం అని తెలియకుండా సాగుతుంది. ఒక గొప్ప వ్యక్తిచేత రికార్డు చేయించి, అతడికి తొందరగా చెక్కు అందచెయ్యాలని ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ తొందరపడతాడు. చెక్కులు వ్రాసే క్లర్కు తన బావమరిది 'పశువుల గడ్డి తినుట' అనే విషయం మీద వ్రాసిన వ్యాసం పది నిముషాల టాక్ గా ఇమ్మంటాడు. లేకపోతే రాజమండ్రి నుంచి వచ్చిన తన బంధువుల పేర్లు ఆ రోజు జనరంజనిలో రావాలంటాడు. ఎవర్నీ కాదనటానికి వీల్లేదు. ప్రోగ్రామ్ రికార్డింగ్ జరుగుతూ వుండగా అసిస్టెంట్ డైరెక్టర్ గారి తాలూకు అని ఓ పదిమంది పిల్లల్తోసహా పట్టుచీరెలు గరగర లాడించుకొంటూ ఏ.సీ. రూమ్ లోకి వస్తారు. తీసుకొచ్చిన వాడు ప్రొఫెసర్ రామన్ లా అంతా వివరిస్తూ వుంటాడు. ప్రోగ్రాం ఇచ్చేవాళ్ళు మాత్రం ఇదేమీ పట్టనట్టు ఏకాగ్రతతో తమ పని చేసుకుంటూ పోవాలి. రమ్మంటే ఎక్కణ్ణుంచి వస్తుంది క్వాలిటీ? ప్రోగ్రాములు తయారుచేసేవాళ్ళు ఇన్ని బాధల్తో వుంటే- వీటిని బ్రాడ్ కాస్ట్ చేసే ఇంజనీర్లు యింకోరకం ఈగోతో బాధపడుతూ వుంటారు. ఆల్ ఇండియా రేడియో తమ భుజాలమీదే వుందని ఇంజనీరింగ్ స్టాఫ్ అనుకొంటూ వుంటారు. స్టేషన్ డైరెక్టర్ కీ, ఇంజనీర్ ఇన్ ఛార్జ్ కీ ఎవరు గొప్ప అన్న విషయమై అంతర్యుద్ధం జరుగుతూనే వుంటుంది. వీళ్ళందరికన్నా గొప్పవాళ్ళు డ్యూటీ ఆఫీసర్లు. అసలు రేడియోనుంచి ఏం ప్రసారమవుతుందీ అన్న విషయమే పట్టించుకోరు. కొంతమందికయితే అసలు తెలుగే రాదు."
    డాక్టర్ ఇబ్బందిగా మొహం పెట్టాడు. నిజానికి అతడు ఆమెతో మాట్లాడదలచుకొన్నది ఇది కాదు. చాలా సులభంగా ఆమెని సినిమాకీ, ఆ తరువాత డిన్నర్ కీ ఆహ్వానించవచ్చు అనుకున్నాడు. ఆమె ఈ 'డ్రై' సబ్జెక్టు గురించి మాట్లాడటం అతనికి కొంచెం చిరాగ్గా వుంది. తనని ఏడిపించడానికే ఆమె అలా మాట్లాడిందని అతడికి తెలీదు. "హెరాల్డ్ రాబిన్స్ ఏవైనా చదివారా?" అని అడిగాడు మాట మార్చడం కోసం.  
    ఆమెకి నవ్వొచ్చింది. ప్రతి పురుషుడి గొడవా అదే. అయితే గమ్యం చేరుకోవడానికి ఎన్నుకొనే దార్లు వేరు. కొంతమంది స్లో, కొంతమంది వేగం, "చదివేను- ఏం?" అంది.
    "బావుంటాయి కదూ?"
    "ఏముంటాయి అందులో?"
    "సెక్స్" అని అదోలా నవ్వి కాలు కొద్దిగా ముందుకు జరిపి - "విజయా! ఐ లవ్యూ" అన్నాడు.
    ఆమె అతడివైపు తలెత్తి చూసింది. ఆమెక్కూడా నవ్వొచ్చింది. లవ్...ల....వ్. ఆ పదం అతడు వాడకపోయివుంటే ఆమె అతన్ని కనికరించి వుండేదేమో. ఆమెని బాగా చిరాకుపెట్టే పదం అదొక్కటే.
    "నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా డాక్టర్ గారూ? కేవలం మీ అనుభవం జాబితాలో ఒక సమాఖ్య చేర్చుకోవటానికి తప్ప! మన పరిచయమై పాతిక నిమిషాలైనా కాలేదు. ఇంతలోనే 'ప్రేమే' అనేది ఉద్భవించిందంటే ఇదేదో చాలా చౌక అయినదై వుండాలి. మీకు నిజంగా నేనే కావల్సి వుంటే- దానికి ప్రేమ అనే ఆత్మవంచన దేనికి?"
    "మీరు చాలా బాగా మాట్లాడ్తారు. నా కళ్ళు యిప్పుడు తెరుచుకున్నాయి. మిమ్మల్ని మామూలుగా భావించినందుకు క్షమించండి. మనం నిజమైన స్నేహితుల్లాగా వుందాం. సాయంత్రం సినిమాకి వెళ్దాం."
    "కానీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో రాత్రి తొమ్మిది దాటితే రానివ్వరే-"
    "మా ఇంట్లో వుండి ప్రొద్దున వెళుదురు గానీ- దానికేముంది."
    "మీ ఆవిడ"
    "పుట్టింటికి వెళ్ళింది."
    "రాత్రి ఇద్దరమే ఒక ఇంట్లో వుంటే....." ఆమె నవ్వింది. "అందులోనూ నాకు మొగవాళ్ళంటే మరీ ఇష్టం."
    ఆమె నవ్వుతో ధైర్యం తెచ్చుకుని- "అంతకన్నా కావల్సింది ఏముంది" అని హుషారుగా అన్నాడు. ఆమె అతడివైపు జాలిగా - సాలోచనగా చూసి "ఈ సాయంత్రం స్నేహం, రాత్రి సెక్స్ తో మిళితమై రేప్రొద్దున్నకల్లా ప్రేమగా మారుతుంది కదూ" అంటూ ఆమె లేచింది. "మూడు విభిన్న పదాల్ని కలగా పులగం చెయ్యటం నా కిష్టంలేదు డాక్టర్ గారూ! దేనికైనా ఫీలింగ్ అనేది వుండాలనేది నా ఉద్దేశ్యం. ఆ ఫీలింగ్ మిమ్మల్ని చూస్తే కనీసం మీ భార్యకైనా కలుగుతుందని నేననుకోను" అని బైటకు వెళ్ళబోయి ఆగి, "మీ ఫీజు" అంది.
    "ముప్పై రూపాయలు" హీనమైన కంఠంతో అన్నాడు. ఆమె పర్సులోంచి డబ్బుతీసి అతడి టేబిల్ మీద పెట్టి "దయచేసి ఇంకెవరితోనూ 'నిజమైన' స్నేహం గురించి మాట్లాడకండి' అని సాగిపోయింది.
    పాలిపోయిన మొహంతో డాక్టర్ ఆ డబ్బువైపు చూస్తూ కూర్చొన్నాడు.
    ఆమె రోడ్డు మీద నడుస్తున్నదన్న మాటేగానీ మనసంతా చికాగ్గా వుంది. స్నేహం, ప్రేమ అన్న పదాలు ఆమెని బాగా చిరాకు పెడుతున్నాయి. ఈ మధ్య కాంట్రడిక్షన్ ఎక్కువైంది. గత పది సంవత్సరాలుగా లేదది. (ఆమె వయస్సు ఇరవై ఎనిమిది) ఆ రోజుల్లో ఇదిలేదు. మొట్టమొదటి స్నేహితుడు చాలా కాజువల్ గా జీవితంలో నుంచి తప్పుకొన్నాక, ఫాస్ట్ నెస్ ఎక్కువైంది. అయితే కథల్లోలాగా- సినిమాల్లోలాగా ఆమె మొదటి సారి 'మోసం' చెయ్యబడలేదు. చాలా మామూలుగానే, ఆమె అంగీకారంతోనే అది జరిగింది. థ్రిల్లుకోసం- చదివినదంతా నిజంగా వుంటుందా అన్నది తెలుసుకోవటం కోసం అది జరగటానికి ఒప్పుకొంది. ఒకసారి జరిగాక కాజువల్ గా మారింది.
    ఆలోచన్లతోనే ఆమె ఆఫీసు చేరుకొంది. తన పెర్సనల్ లాకర్ తెరచి అందులో రిజిష్టర్ లాటిది తీసింది .అక్షర క్రమంలో అందులో పేర్లున్నాయి. 'ఏ' కింద పద్నాలుగు 'బి'లో పదహారు.... ఆమె లెక్కపెట్టింది. మొత్తం మూడువందల ఇరవై ఆరు. మొట్టమొదటి అనుభవపురోజు చూసింది. తొమ్మిది సంవత్సరాల రెండు నెలలు.... ఇంకో ఎనిమిది నెలల్లో నలభై ఒక్క మంది మొగవాళ్ళతో పరిచయం అయితే అప్పుడు సరాసరి పది రోజులకో కొత్త పరిచయం అవుతుంది.
    చాలా పెద్ద యావరేజి.
    ఆమెకి నవ్వొచ్చింది. పారిస్ లో పుట్టవలసింది తను....
    పుస్తకం లాకర్ లోపెట్టి తలుపు మూస్తూంటే గుమ్మం దగ్గిర అలికిడి అయింది. తల తిప్పి చూస్తే రాధ. విప్పారిన మొహంతో, "రావే రాధా! ఈ మధ్య నల్లపూసవైపోయావ్?" అన్నది.
    రాధ పెదవుల మధ్య చిరునవ్వు అదిమిపెట్టి, "నీకో థ్రిల్లింగ్ న్యూస్ చెప్పనా" అన్నది.
    "నువ్వు కూడా థ్రిల్ గురించే మాట్లాడుతున్నావా- చెప్పు" అంది.
    "నాకూ ఇక్కడే ఉద్యోగం వచ్చింది"
    "హాయ్" అని జయ చిన్నగా కేకపెట్టి "అసలు ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది? నీ కెవరు ఇన్ ఫ్లుయన్స్ చేశారు? నాకు తెలియకుండా ఇదంతా ఎలా జరిగింది" అని ప్రశ్నల వర్షం కురిపించింది.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More